
సాక్షి, వరంగల్: సమ్మక్క , సారలమ్మ మేడారం మహా జాతర - 2022 దేవతల దర్శనార్థం వెళ్లే భక్తుల సౌకర్యార్థం బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ వరంగల్ -2 డిపో మేనేజర్ బి.మహేష్ కుమార్ తెలిపారు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు మహ జాతర జరుగనుందని, జాతర సమయం లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే నేపథ్యంలో కొంత మంది భక్తులు ముందుగానే దర్శనానికి వెళ్లి వస్తుంటారని వారి కోసం ఈ నెల 5 నుంచి ప్రతీ రోజు మేడారానికి బస్సు నడుపనున్నట్లు మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
భక్తుల రద్దీని బట్టి అదనంగా బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి రోజు.. హన్మకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి ఉదయం 7 గంటలకు, 8 గంటలకు, మధ్యాహ్నం 01.15 , 02.15 గంటలకు బస్సు బయలు దేరుతుందన్నారు. మేడారం నుంచి హనుమకొండకు ఉదయం 10 గంటలకు, 11 గంటలకు, మధ్యాహ్నం 02.30 గంటలకు, 03.30 గంటలకు బయలు దేరుతుందని వివరించారు.
ములుగు నుంచి మేడారానికి ఉదయం 08.15 , 09.15 , మధ్యాహ్నం 2.30, 3.30 గంటలకు, మేడారం నుంచి ములుగుకు ఉదయం 10, 11 గంటలకు , సాయంత్రం 04.15, 05.15 గంటలకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. హనుమకొండ నుంచి మేడారానికి పెద్దలకు చార్జీ రూ .120 , పిల్లలకు రూ. 60 గా ఉంటుదని తెలిపారు. ములుగు నుంచి మేడారానికి పెద్దలకు రూ. 65, పిల్లలకు రూ. 35 గా నిర్ణయించినట్లు వివరించారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు .