సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ 4,233 ప్రత్యేక బస్సులను నడుపుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. జేబీఎస్ నుంచి 1184, ఎల్బీనగర్ నుంచి 1133, అరాంఘర్ నుంచి 814, ఉప్పల్ నుంచి 683, కేపీహెచ్‌బీ/బీహెచ్‌ఈఎల్ నుంచి 419 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని తెలిపారు. పండగ రద్దీ దష్ట్యా నడిపే ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే ఉంటాయని, స్పెషల్ చార్జీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఈ నెల 10 నుంచి 14 వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా రోజుల్లో పోలీస్, రవాణా శాఖ అధికారులు ఆర్టీసీకి సహకరించాలని కోరారు. సొంత వాహనాల్లో ఇతర ప్రయాణికులను తరలించే వారిపై నిఘా పెట్టాలని సూచించారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. బస్ భవన్‌లో పోలీసు, రవాణా శాఖ అధికారులతో శుక్రవారం సజ్జనార్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
సంక్రాంతి ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి టీఎస్‌ఆర్టీసీ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి, ఖమ్మం, నల్లగొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబూబ్‌నగర్, కర్నూలు వైపు వెళ్లే బస్సులు అరాంఘర్ నుంచి, వరంగల్, హనుమకొండ, తొర్రూర్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి, సత్తుపల్లి, భద్రాచలం, విజయవాడ వైపు వెళ్లే బస్సులు కేపీహెచ్‌బీ/బీహెచ్‌ఈఎల్ నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు.
585 బస్సులకు ముందస్తు రిజర్వేషన్
ఈ సంక్రాంతికి 585 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించామని సజ్జనార్ తెలిపారు. www.tsrtconline.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ముందస్తు రిజర్వేష¯Œన్ చేసుకోవాలని కోరారు. పండగకు సొంతూళ్లకు వెళ్లే జనం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించటం ద్వారా భద్రంగా గమ్యం చేరేందుకు వీలుంటుందన్నారు. రోడ్లపై రద్దీ అధికంగా ఉండే సమయం అయినందున, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదన్నారు.
ఈ విషయాన్ని అధికారులు, సిబ్బంది ప్రజలకు తెలపాలని కోరారు. సమావేశానికి హాజరైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీలు ప్రకాశ్‌రెడ్డి, కరుణాకర్, టి.శ్రీనివాస రావు, డి.శ్రీనివాస్‌లతో పాటు రవాణా శాఖ రంగారెడ్డి డీటీసీ ప్రవీణ్ రావు, ఆర్టీవోలు శ్రీనివాస్‌రెడ్డి, రామచందర్‌లను ఆయన సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment