
జయశంకర్ జిల్లా గట్టమ్మ వద్ద నుండి పస్రా వరకు ట్రాఫిక్ జామ్
సాక్షి, వరంగల్ : అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క– సారక్క జాతరకు తొలిరోజే భక్తులు పోటెత్తడంతో మేడారంలో గందరగోళం నెలకొంది. పోలీసుల మధ్య సమన్వయం లోపించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. జాతర కోసం ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్ వాహనాల్లో గతరాత్రి బయల్దేరిన ప్రయాణికులు ఇప్పటివరకూ కూడా మేడారం చేరుకోలేని పరిస్థితి నెలకొంది. పోలీస్ క్యాంప్‌లో పోలీస్ సిబ్బందికి, అధికారుల మధ్య కూడా వసతి సౌకర్యాల విషయంలో వివాదం ఏర్పడింది.
అలాగే జయశంకర్ జిల్లా ములుగు మండలం గట్టమ్మ వద్ద నుండి పస్రా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో మేడారం వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు తెల్లవారుజాము మూడు గంటల నుంచి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులతో పాటు అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారానికి డీజీపీ
మేడారంలో ట్రాఫిక్ అదుపు తప్పడంతో డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగారు. హుటాహుటీన ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు సమన్వయ లోపం ఏర్పడటంతో డీజీపీ ...పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖుల రాక నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. మరోవైపు మహబూబ్‌నగర్‌కు చెందిన కానిస్టేబుల్‌పై రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) చేయి చేసుకోవడంతో, అధికారుల తీరుపై సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సెక్టోరియల్ అధికారులతో సమీక్ష
నేటి నుంచి మేడారం మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో సెక్టోరియల్ అధికారులతో జిల్లా కలెక్టర్, మహా జాతర ప్రత్యేక అధికారి బుధవారం సమీక్ష నిర్వహించారు. సెక్టోరల్ అధికారులు తమకు కేటాయించిన సెక్టార్లలో అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని, ఎవ‍్వరూ తమకు కేటాయించిన సెక్టార్‌ను విడిచి వెళ్లకూడదని సూచించారు. క్యూ లైన్‌ల వద్ద భక్తులు తాగునీటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పారిశుద్ద్య పర్యవేక్షణ నిరంతరం సాగాలని, సెక్టోరియల్ అధికారులు సమాచార లోపం లేకుండా సమన్వయంతో పని చేయాలని సూచనలు చేశారు.
కాగా ఈ నెల రెండున (ఫిబ్రవరి 2)న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖమంత్రి పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి ముందస్తుగా మేడారంలోనే బస చేసి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment