అడవి తల్లి అందరి మాత | sammakka and sarakka jatara start todaty | Sakshi
Sakshi News home page

అడవి తల్లి అందరి మాత

Published Wed, Jan 31 2018 12:48 AM | Last Updated on Wed, Jan 31 2018 12:48 AM

sammakka and sarakka jatara start  todaty - Sakshi

నేటి నుంచి  సమ్మక్క సారలమ్మ జాతర , సిద్ధబోయిన మునీందర్, పూజారి

ఆదివాసీలు పవిత్రంగా భావించే చిలకలగుట్ట మీద  సమ్మక్క కొలువై ఉండే చోటు తెలిసిన అతికొద్ది మందిలో ఒకరు సిద్ధబోయిన మునీందర్‌. చిలకలగుట్టపైకి  పూజారులంతా కలిసి వెళ్లినా మార్గమధ్యం నుంచి  రహస్య ప్రాంతానికి చేరుకునే ఐదుగురిలో ప్రధానమైన వ్యక్తి ఇతనే. గడిచిన ఇరవై ఏళ్లుగా చిలకలగుట్టపై ఉన్న సమ్మక్కను కిందకు తీసుకువచ్చే బాధ్యతను  నిర్వరిస్తున్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప మునీందర్‌ నుంచి వివరాలు వెల్లడి కావు. ప్రచార  ఆర్భాటాలకు దూరంగా ఉంటూ సమ్మక్క పూజారిగా నియమ నిష్టలతో కూడిన జీవితాన్ని గడిపే  మునీందర్‌ ‘నేను నా దైవం’ కోసం సాక్షితో మాట్లాడారు.

సమ్మక్క, సారలమ్మలను పోరాట యోధులు అంటారు. మరి వాళ్లెప్పుడు దేవుళ్లయ్యారు?
 మాకు వాళ్లు పోరాట యోధులు కాదు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు – సమ్మక్క యుద్ధం అనే ప్రచారంతో ఈ దేవతలతో సంబంధం లేదు. తరతరాలుగా సమ్మక్క సారలమ్మలు మా ఇలవేల్పులు. 

జాతర మూడు రోజుల్లోనే కాకుండా మిగతా ఏడాది అంతా సమ్మక్క సారలమ్మలకు నిత్య పూజలు ఉంటాయా? 
మా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మిగిలిన రోజుల్లోనూ పూజలు చేస్తాం. అయితే బు«దవారం నాడు మాత్రం సమ్మక్క వారంగా భావించి పూజలు చేస్తాం. బుధ, గురువారాలు, పౌర్ణమీ రోజుల్లోనూ పూజలు ఎక్కువగా ఉంటాయి. దసరా పండగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తాం. 

ఈ మాఘపౌర్ణమి పూజల్లో నియమాలు ఏ విధంగా ఉంటాయి? వాటిని ఉల్లంఘిస్తే కీడు జరిగిన సందర్భాలున్నాయా?
వన దేవతలను తీసుకొచ్చే బాధ్యత ఉన్నందున మాకు కట్టుబాట్లు ఉన్నాయి. గ్రామాల్లో ఇండ్లæనుంచి వచ్చే కాలువ నీళ్లు తొక్కం. బయట ఇళ్లలో భోజనాలు చేయం. సాధ్యమైనంత వరకు ఉదయం బయటకు వెళితే సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి చేరుకుంటాం. వనం తీసుకొచ్చేప్పుడు దిష్టి తగలకుండా కోడిగుడ్డు తిప్పి పడేస్తారు. ఇలా చేయకపోతే వనం తెచ్చేవారు ముందుకు కదలకుండా ఆగిపోతారు. గద్దెలకు బయల్దేరిన సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ప్రయాణం విషయంలో ఈ విధానం కొనసాగుతుంది. ఎదురిళ్లు (ఎదుర్కోలు)దగ్గర శాంతిపూజ చేస్తాం. లేని పక్షంలో సమ్మక్క ముందుకు కదలదు. ఎదురిళ్లు దగ్గర ఏదైనా లోపం జరిగితే ప్రాణనష్టం ఉంటుంది. అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి, ఇప్పటివరకు అలాంటి ప్రమాదాలు చూడలేదు. ఇక ఏడాది పొడవునా కూడా నియమాలను ఉల్లంఘించం. నేనైతే బుధ, గురువారాల్లో ఉపవాసం ఉంటాను. ఊరు విడిచి బయటకు వెళ్లను. ఊరంతా చేసే భోజనాల దగ్గర తినను. ఒకవేళ తినాలన్నా ముందుగా భోజనాన్ని తీసి ఉంచుతారు. ఇంట్లో కూడా ఎంగిలికాని అన్నమే తింటాను. 

జాతర సందర్భంగా పూజారులు మద్యం సేవిస్తారని విన్నాం?
జాతర సందర్భంగా పూజారులు మద్యం సేవించడం తప్పనిసరి అని బయట ప్రచారం ఉంది. కానీ, గుడిమెలిగే పండగ నుంచి మా పూజారులందరూ ఉపవాసాలు ఉంటాం. మద్యం జోలికి అస్సలు వెళ్లం. నియమ నిష్టలు పాటించకుండా ఉంటే సమ్మక్క సహించదు. జాతర సందర్భంగా ముఖ్యమైన రోజుల్లో చిలకలగుట్ట పైకి చేరుకుని సమ్మక్కకు మా ఆదీవాసీల పద్ధతిలో పూజలు చేస్తాం. ఈ సందర్భంగా నియమ నిష్టలు పాటించకుండా చిలకలగుట్ట ఎక్కడం ప్రారంభించామే అనుకోండి దాని ప్రభావం పలు రకాలుగా ఉంటుంది. గుట్ట ఎక్కలేం. ఎవరో చేత్తో వెనక్కి నెట్టేసినట్లుగా అవుతుంది. అడుగులు ముందుకు పడవు. కొన్నిసార్లు కనిపించని శక్తి (సమ్మక్క) కొరాడాతో కొడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మధ్యలోనే మా పూజారులు ఆగిపోతారు. చేసిన తప్పులు మన్నించమని అమ్మతల్లిని వేడుకుంటాం. పరిహారం చెల్లిస్తామని మొక్కుకుంటాం. ఆ తర్వాతే ముందుకు కదులుతాం. సమ్మక్క తల్లికి ఎరుపు వర్ణం అంటే ఇష్టం. అందువల్ల చిలకలగుట్టపైకి చేరుకునే సందర్భంలో ఎరుపు రంగు గుడ్డను తలకు చుట్టుకుంటాం. అమ్మకు ఎరుపు రంగు వస్తువులనే ఇచ్చుకుంటాం.

మీరు సమ్మక్క, సారలమ్మను కాకుండా ఇంకెవరినైనా పూజిస్తారా?
ప్రత్యేకంగా ఇతర దేవతలను పూజించం. పండగ రోజులు, ప్రత్యేక రోజుల్లో మాత్రం వనదేవతలకు దండం పెట్టుకుంటాం.

జాతర సందర్భంగా కోటి పాతిక లక్షల మంది వస్తుంటారు. ఇంతమంది ఉన్నప్పుడు భక్తిభావన ఉంటుందా?
ఉంటుంది. ఆ భావన కోసమే అందరూ వస్తారు.  ధనవంతులు సైతం వచ్చి అడవుల్లో, పొలాల్లో, వాగుల వెంట రెండు మూడు రోజులు బస చేస్తారు. ఎవ్వరికీ ఎటువంటి హానీ జరగదు. అడవిలో జరిగే జాతర అయినా సరే కనీసం పాము భయం కూడా లేకుండా భక్తులు ఇక్కడే ఉంటారు. భక్తుల రద్దీ ఎంత ఉన్నా అవాంఛనీయ సంఘటనలు జరగడం చాలా అరుదు. అంటే ఇక్కడ ఆ అమ్మతల్లుల దయ ఉండటం వల్లే ఇది సాధ్యమౌతుంది కదా! 

మీ కుటుంబాల్లో సమ్మక్క, సారలమ్మలు చూపిన మహిమలు ఉన్నాయా?
జాతర సమయంలో, రాత్రి సమయంలో గుడి దగ్గరికి వెళ్లినప్పుడు గజ్జెల చప్పుడు వినిపిస్తుంది. పౌర్ణమి రోజున గద్దెల దగ్గరకు ఓ పెద్ద నాగుపాము వస్తుంది. నాకు చాలాసార్లు కనిపించింది. దేవాదాయశాఖ సిబ్బంది కూడా ఈ విషయం నాకు చెప్పారు. సమ్మక్క దగ్గరికి పాము రూపంలో పగిడిద్దరాజు వస్తాడు. అదే మాకు గుర్తు. 

బెల్లం బంగారం అంటారు కదా! దీనికి కారణం ఏమైనా ఉందా?  
మా ఆదివాసీలకు బెల్లం ఇష్టమైన వస్తువు, విలువైన వస్తువు కూడా. నిల్వ ఉంటుంది. తీపి కోసం తేనె మీదనే ఆధారపడేటోల్లు. ఇప్పుడంటే ఆ పరిస్థితులు లేవు కానీ, మరీ వెనుకటి రోజుల్లో బెల్లం తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. కష్టమైనదాన్ని సంపాదించి, దేవతలకు మొక్కు చెల్లిస్తే మంచి జరుగుతుందని మా నమ్మకం. అలా అందరి మొక్కు అయ్యింది.  

పూజారులైన మీకు మిగతా రోజుల్లో ఎలాంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి?
సమ్మక్క సారలమ్మ పూజారులం అని మేమెక్కడా బయట ఎవ్వరికీ చెప్పుకోం. దాంతో మా గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. మా ఊళ్లో వాళ్లకు తెలిసినప్పటికీ ఎవ్వరూ దాని గురించి ప్రస్తావించరు. అందరిలాగే మేము సాధారణ జీవితమే గడుపుతాం. జాతర ముగిస్తే వ్యవసాయం చేసుకుంటాం. లేదా అడవికి వెళ్తాం. ఇప్పుడు పేపరొళ్లు వచ్చి మమ్మల్ని పట్టుకుని ఫోటోలు తీసుకుని మాట్లాడుతున్నారు. ఆ పేపర్లు కూడా మేం చూడం. గత ఐదారేళ్ల నుంచి జాతర నిర్వాహణలో ప్రభుత్వ అధికారులు మా అభిప్రాయాలను కొంత మేరకు పరిగణలోకి తీసుకుంటున్నారు.  మమ్మల్ని గుర్తుపట్టే భక్తులు.... మేము బొట్టు పెట్టాలని, బంగారం ప్రసాదం ఇవ్వాలని ఆరాటపడతారు. అంతవరకే మాకు తెలిసింది. 

సమ్మక్క సారలమ్మ మిమ్మల్ని పూనడం, కల్లోకి వచ్చిన సందర్భాలున్నాయా?
జాతర ముందు రోజుల్లో కలలో ముసలమ్మ రూపంలో సమ్మక్క ఎక్కువగా కనిపిస్తది. ఆ సమయంలో ఉలిక్కిపడి లేవడం జరుగుతుంది. ఆ విషయాలు బయటకు చెప్పేవి కావు. 

ఎక్కడైనా ఉపద్రవాలు, ప్రకృతి వైపరీత్యాలు రావడానికి ముందే మీకు సూచనలు ఏమైనా కన్పించాయా?
అలంటివేవీ లేవు. వనదేవతలైన ఈ అమ్మవార్లను కొలుచుకోవడం, మా పనులు మేం చేసుకోవడం అంతే తప్ప వేరే విషయాలు అంతగా తెలియవు.

ఎన్ని తరాలుగా ఈ పూజారి విధానాన్ని మీరు అవలంభిస్తున్నారు. మీ తదనంతరం ఎవరికి ఈ విధానాన్ని, ఎలా పరిచయం చేస్తారు?
కచ్చితంగా చెప్పలేం. ఎప్పటి నుంచో వస్తుంది. మా తాతల హయాంలో మాత్రం మా పూర్వీకులు చత్తీస్‌గడ్‌ నుంచి గోదావరి దాటి ఇటు వచ్చారని తెలిసింది. అప్పటి నుంచి సమ్మక్క మా ఇలవేల్పు. వంశపార్యంపరంగా పూజలు చేస్తున్నాం. మా ఇండ్లలో మగపిల్లలకు ఒకరి నుంచి మరొకరికి పూజా బాధ్యతలు అప్పగిస్తాం. తొలుత జాతర సందర్భంగా ఇతర బాధ్యతలు అప్పగిస్తాం. ఒక్కో జాతర గడుస్తున్న కొద్ది బాధ్యతలు పెంచుతాం. సరైన సమయం వచ్చినట్లు ఆ దేవతల నుంచి పిలుపు వస్తే అప్పుడు ప్రధాన పూజారి బాధ్యతలు అప్పగిస్తాం. 


అందరూ శిగమూగుతారు
జాతర ప్రారంభానికి ముందురోజు రాత్రి సారలమ్మ పూజారులంతా కన్నెపల్లిలో గుడికి చేరుకుంటాం. ఆవునెయ్యి, ఆవుపాలతో సారలమ్మ ఆలయంలో ఉన్న పూజా వస్తువులను శుభ్రం చేస్తాం. అనంతరం రెండు గంటల పాటు పూజలు చేసి తెల్లవారుజామున ఇంటికి వెళ్తాం. మరుసటి రోజున అమ్మవారిని తీసుకువచ్చాక మా ఆదీవాసీ పద్ధతిలో పూజలు జరుగుతాయి. ఈ సమయంలోనే నాకు సారలమ్మ పూనుతుంది. సారలమ్మ ఆవహించిన తర్వాత నాకు తెలియకుండానే పరుగుల పెడతాను. దీంతో నన్ను(సారలమ్మ తల్లిని) శాంతిప జేసేందుకు నీళ్లు జల్లుతారు. మేడారం వెళ్లే దారిలో సారలమ్మకు కొమ్ము పడతారు. దూపం వేస్తారు. మేడారం బయల్దేరి సారలమ్మకు దారిపొడవునా భక్తులు జయజయ ధ్వానాలు చేస్తారు. శివాలతో ఊగిపోతుంటారు. సంతానం లేని వారు సంతాన ప్రాప్తికి, వరాల కోసం సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. వారిపై నుండి పూజారులం దాటి వెళితే వారికి ఆ తల్లి ఆశీస్సులు వచ్చినట్లు నమ్ముతారు. 
– కాకసారయ్య, పూజారి

అందరిలానే నేను
ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని, తమ కష్టాలు తొలగిపోవాలని అమ్మ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పనిని ఆ తల్లి చేసిపెడుతుంది. అందుకే ఏ ఏడుకి ఆ ఏడు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఆ తల్లిని స్వయంగా తీసుకువచ్చే మాకు మరింత మేలు జరుగుతుంది అందరూ అనుకుంటారు. కానీ, అందరిలానే నేను. అమ్మను తీసుకురావడం అనేది నా బాధ్యత అంతే. అందరికీ మేలు చేసే తల్లి నా కుటుంబానికీ మేలు చేస్తుంది. 
 – కొక్కెర కృష్ణయ్య, పూజారి

మాఘ పౌర్ణమినాడు మనువు
ఆదీవాసీల విశ్వాసం ప్రకారం సమ్మక్క భర్త పగిడిద్ద రాజు. వీరి సంతానం సారలమ్మ. పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. ఆదివాసీల ఇలవేల్పులైన వీరు నాలుగు వేర్వేరు  ప్రాంతాల్లో కొలువై ఉంటారు. పూర్వం రోజుల్లో ప్రతి రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమిరోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపించడం ఆదివాసీ సంప్రదాయం. దీనికోసం సమ్మక్క పూజారులు గ్రామాల్లో తిరిగేవారు. వీరికి ఇచ్చేందుకు అప్పటి ఆదివాసీలు తమ పంటలో కొంత భాగాన్ని పక్కకు పెట్టేవారు. పంటలేని వారు కోళ్లు, మేకలు వంటి వస్తువులు సమర్పించుకునే వారు. ఇలా సేకరించిన వస్తువులతో మాఘశుద్ధ పౌర్ణమి లేదా ఆ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం రోజు సమ్మక్క, సారలమ్మలకు వివాహం జరిపిస్తారు. ఆ వివాహ వేడుక కాలక్రమేణా  మేడారం జాతరగా మారింది.  
– తాండ్ర కృష్ణగోవింద్, వరంగల్, సాక్షిప్రతినిధి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement