మేడారం అడవిలో 500కుపైగా ఎకరాల్లో నేలకూలిన చెట్లు
వాతావరణ మార్పుల ప్రభావమేనంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, ఏటూరునాగారం/తాడ్వాయి: రాష్ట్రంలో.. ఆ మాటకొస్తే దేశంలోనే అరుదుగా జరిగే బీభత్సం ములుగు అడవుల్లో చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు.. దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలో 200 హెక్టార్ల (దాదాపు 500 ఎకరాల) విస్తీర్ణంలో 50వేలకుపైగా చెట్లు నేలకూలాయి. ఇది ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. 4,5 రోజులు ఆగకుండా కురిసిన వర్షాలకు తోడు భారీ సుడిగాలుల (టోర్నడోల)తోనే ఈ ఘటన జరిగినట్టు అంచనా వేస్తున్నారు.
లోతుగా అధ్యయనం అవసరం: టోర్నడోలు చాలా వరకు బహిరంగ ప్రదేశాల్లోనే వస్తాయని.. ఇంత పెద్ద ఎత్తున చెట్లతో నిండి ఉన్న అటవీప్రాంతంలో వచ్చే వీలు లేదని వాతావరణ, నీటి వనరుల నిపుణుడు బీవీ సుబ్బారావు తెలిపారు. ములుగు ప్రాంతంలో ఈ పరిణామం చాలా విచిత్రంగా ఉందని.. అయితే మూడేళ్ల క్రితం నల్లగొండ జిల్లాలో ఇలాంటి స్వల్పస్థాయిలో చోటుచేసుకుందని చెప్పారు. వాతావరణ మార్పులతోనే ఇలా జరిగిందని భావిస్తున్నామని.. అడవుల్లో ఇలా జరగడంపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అతివేగమైన గాలి.. తడిసిన నేలతో..: అత్యంత వేగంగా, బలంగా వీచిన గాలులతోనే ములుగు అడవిలో విధ్వంసం జరిగి ఉంటుందని రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి (మాజీ పీసీసీఎఫ్ ర్యాంక్ అధికారి) రఘువీర్ అంచనా వేస్తున్నారు. నాలుగైదు రోజులు ఆగకుండా కురిసిన వానతో నేల తడిసి, డొల్లగా అవుతుందని.. దీనికితోడు ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కొమ్మలు కొట్టేయడంతో చెట్లు బలహీనమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఇలాంటప్పుడు అతివేగంగా వీచే గాలులతో చెట్లు కూలిపోయే చాన్స్ ఉంటుందని వివరించారు.
1996లో మధ్యప్రదేశ్‌లోని ఓ అభయారణ్యంలో ఇలాంటి ఘటన జరిగిందని.. ములుగులో జరిగిన దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో చెట్లు పడిపోయాయని నిపుణులు చెప్తున్నారని రఘువీర్ వెల్లడించారు. ములుగులో పెద్ద సంఖ్యలో చెట్లు కూలినా.. చాలా వరకు వేళ్లతో సహా పెకిలింతకు గురికాలేదన్నారు. మధ్యకు విరిగిన, కొమ్మలన్నీ పోయి కాండం మిగిలిన చెట్లు త్వరలోనే కోలుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక టోర్నడో వృత్తాకారంలోఒకేచోట తిరుగుతుందని.. కానీ ములుగు అడవిలో అలాకాకుండా ఒకేవైపు నుంచి ప్రభావం పడిందని తెలిపారు.
అందరిలోనూ విస్మయం
ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో 50వేల చెట్లు నేలకూలడం అటవీశాఖ అధికార యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది. దీనికి కారణమేంటన్న దానిపై పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రియల్, జిల్లా అధికారులు రాహుల్‌కిషన్ జాదవ్, ఇతర అధికారులు పరిశీలన జరుపుతున్నారు. డ్రోన్ కెమెరా ద్వారా కూలిన చెట్లను పరిశీలించారు. మరోవైపు పెనుగాలులతో నేలకూలిన చెట్లపై కలప స్మగ్లర్ల కన్నుపడిందని స్థానికులు అంటున్నారు. చెట్ల దుంగలను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు.
తల్లుల దీవెనలతోనే బయటపడ్డాం: మంత్రి సీతక్క
సుడిగాలి గ్రామాలపైకి మళ్లితే పెను విధ్వంసం జరిగేదని రెండు రోజుల క్రితమే చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సందర్శించినా.. ఇలా వేలాది చెట్లు కూలిపోయాయని ఊహించలేదని మంత్రి సీతక్క చెప్పారు. డ్రోన్ కెమెరాల సాయంతో పరిశీలించినప్పుడు విధ్వంసం బయటపడిందన్నారు. బుధవారం సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్‌ఓ, స్థానిక అధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మళ్లలేదని.. అలా మళ్లి ఉంటే పెను విధ్వంసం జరిగి ఉండేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక బృందాలను పంపి చెట్లు కూలిన ఘటనపై పరిశోధన జరిపించాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను కోరారు.
సుడిగాలితో నేలకొరిగి ఉంటాయి!
సుడిగాలి, మేఘాలు రెండూ కలిసినపుడు ఇటువంటి వర్షాలు కురుస్తాయి. సాధారణంగా చెట్ల వేళ్లు భూమిలో ఎక్కువ లోతుకు వెళితే గట్టి పట్టు ఉంటుంది. కానీ ఇక్కడి ఆకులు రాలుతూ అక్కడే చెట్టుకు అవసరమై ఎరువు తయారవుతూ ఉంటుంది. దీనితో వేర్లు లోతుగా కాకుండా పక్కలకు విస్తరించి పట్టులేకుండా ఉంటాయి. ఇలాంటి చెట్లు సుడిగాలితో పట్టుకోల్పోయి నేలకొరిగి ఉంటాయి. ఇలాంటి ఘటనను నా 35 ఏళ్ల సర్వీస్‌లో ఎప్పుడూ చూడలేదు.
– ఆర్‌ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్
Comments
Please login to add a commentAdd a comment