సాక్షి, వరంగల్: ఆసియాలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతర ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ మహా జాతరకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. 50 కేంద్రాల నుంచి 4200 లకు పైగా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. ఈ సందర్బంగా భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు తెలిపారు. రెండేళ్ల క్రితం జాతర సందర్భంగా ఆర్టీసీ 3700 ప్రత్యేక బస్సులను నడపగా.. సుమారు 8 లక్షల మందికి పైగా భక్తులు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి జాతరకు అదనంగా మరో 500 బస్సులను నడపునున్నట్టు తెలిపారు.
ఈసారి సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల మంది భక్తులు ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మంచిర్యాల, గోదావరి ఖని, పెద్దపల్లి వంటి 50 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. జాతరకు 12 వేల మంది ఆర్టీసీ సిబ్బందిని మేడారం స్పెషల్ ఆపరేషన్స్ విధుల్లో నియమించారని ఆయన వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బస్సుల ఏర్పాట్లు చేయడంతో పాటు, మేడారం వద్ద ఆర్టీసీ తాత్కాలిక బస్ టర్మినల్ కూడా ఏర్పాటుచేశామన్నారు.
కాగా మేడారంలో ఏర్పాటు చేసిన వసతులను ఇప్పటికే రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు, సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించారు. వరంగల్‌లో అధికారులతో ఎండీ సమీక్ష నిర్వహించారు. జాతరలో బస్సుల నిర్వహణ, ప్రయాణికుల కోసం ఏర్పాట్లు, బస్ టర్మినల్, భక్తుల డిమాండ్ మేరకు ఆయా రూట్లలో బస్సుల నిర్వహణపై ఆర్‌ఎంలు, డిపో మేనేజర్లు, అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment