♦ ‘స్పెషల్’ రూపంలో 2 వేల బస్సుల మళ్లింపు
♦ హైదరాబాద్ నుంచే వెయ్యి సిటీ బస్సుల తరలింపు
♦ ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం
♦ విభజనతో ఆంధ్ర నుంచి బస్సులు రాకపోవటమే కారణం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతికెక్కిన మేడారం జాతరకు కోట్లలో భక్తులు తరలి వెళ్తారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వరంగల్ జిల్లా మేడారానికి భక్తజనం చేరుకుంటుంది. జాతర జరిగే రోజుల్లో ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారు. అక్కడి జంపన్నవాగులో నీళ్లు కనిపించకుండా భక్తులు నిండిపోతారు. ఇంత రద్దీ ఉండే సమయంలో వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఇది పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు.
కానీ ఈసారి అదనపు బస్సులు నడపటం ఇబ్బందిగా మారబోతోంది. జాతర మొదలు కాకముందు నుంచే శని, ఆదివారాల్లో లక్షల్లో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. ఈనెల 14 నుంచి ఆ సంఖ్య ఎక్కువ కానుంది. ఇక 17, 18 తేదీల్లో అది మరింతగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ దాదాపు రెండు వేల అదనపు బస్సులను మేడారం వైపు నడుపుతోంది. ఒక్క హైదరాబాద్ నుంచే వెయ్యి వరకు సిటీ బస్సులను నడపనున్నట్లు సమాచారం. తొలుత సిటీ బస్సుల్ని వివిధ జిల్లాలకు పంపి.. ఆయా ప్రాంతాల నుంచి మేడారం వరకు నడపనున్నారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు.
ఇదే విషయాన్ని ఆర్టీసీ అధికారులను ప్రశ్నిస్తే.. అదనపు బస్సులు నడపాలంటే ఇలాంటి ఇబ్బందులను ఇక ఎదుర్కొనక తప్పదని బదులిస్తున్నారు. ప్రతి జాతర సమయంలో ఆంధ్ర నుంచి బస్సులను తెప్పించి స్పెషల్ సర్వీసులుగా నడిపేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోవటంతో అక్కడి నుంచి ఒక్క బస్సు కూడా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వాటిని తెప్పిస్తే ఏపీఎస్ ఆర్టీసీకి భారీగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అది టీఎస్ ఆర్టీసీ ఖజానాకు భారంగా మారుతుంది. దీంతో ఇక్కడి పది జిల్లాల నుంచే కొన్ని కొన్ని చొప్పున బస్సులను మళ్లించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జాతర జరిగే మూడు, నాలుగు రోజుల్లో అన్ని జిల్లాల్లోనూ ఒక్కసారిగా బస్సుల కొరత ఏర్పడబోతోంది.
మేడారం జాతర సమయంలో బస్సులెలా?
Published Wed, Feb 10 2016 5:44 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM
Advertisement
Advertisement