ఆర్టీసీకి కలిసొచ్చిన జాతర | RTC Income Has Increased in medaram jatara | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి కలిసొచ్చిన జాతర

Published Tue, Feb 6 2018 12:49 PM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM

RTC Income Has Increased in medaram jatara - Sakshi

మంచిర్యాలఅర్బన్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఆర్టీసీకి మేడారం జాతర కలిసొచ్చింది. ప్రయాణికుల చేరవేత ద్వారా అదనంగా ఆదాయం గడించింది. గత జాతరతో పోలిస్తే ఈసారి ఆదాయం మరింత మెరుగుపడింది. రీజినల్‌లో అన్ని డిపోలకు చెందిన అధికారులు నష్టాలను పూడ్చుకునేందుకు అందివచ్చిన జాతరపై ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి బస్సులు నడిపించారు. మంచిర్యాల జిల్లా నుంచి మేడారం జాతరకు అత్యధికంగా భక్తులు వెళ్లడాన్ని గ్రహించిన యాజమాన్యం ఈ దఫా అక్కడి నుంచే బస్సులు నడిపించే ఏర్పాటు చేసుకుంది. రీజినల్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌ ఆయా డిపోల మేనేజర్లతో సమన్వయం చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, మందమర్రి, శ్రీరాంపూర్‌లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా డిపోల డీఎంలు పర్యవేక్షిస్తూ బస్సులు నడిపించారు. మొత్తం 294 బస్సులు నడిపి 68,975 వేల మంది ప్రయాణికులను ఆర్టీసీ చేరవేసింది. బస్సుల నడపడం ద్వారా రూ.2.08 కోట్ల ఆర్జించింది. సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయంతో పొల్చితే రూ.78 లక్షలు అదనంగా సాధించారు.

డిపోల వారీగా..
మంచిర్యాల డిపోకు చెందిన 94 బస్సులను జిల్లా కేంద్రం మంచిర్యాల నుంచి నడిపించారు. లక్షా 61 వేల కిలోమీటర్లు బస్సులు నడిపి రూ.60.16 లక్షల ఆదాయాన్ని సాధించారు. భైంసా డిపోకు చెందిన బస్సులను శ్రీరాంపూర్‌ నుంచి నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. 83 వేలు కిలోమీటర్ల బస్సులు తిప్పి రూ.28,37,373 సంపాదించారు. ఆసిఫాబాద్‌ డిపో 60 బస్సులను బెల్లంపల్లి కేంద్రంగా నడిపి రూ.41,69,608 ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. ఆదిలాబాద్‌ డిపోకు చెందిన 53 బస్సులను చెన్నూరు కేంద్రంగా 33 వేల కిలోమీటర్లు నడిపి ప్రయాణికులను చేరవేయడం ద్వారా రూ.41.03 లక్షల ఆదాయం సాధించారు. నిర్మల్‌ డిపోకు చెందిన 52 బస్సులను మందమర్రి కేంద్రంగా నడిపారు. ప్రయాణికులను మందమర్రి నుంచి మేడారం చేరవేయడం ద్వారా రూ.36.18 లక్షల ఆదాయం సమకూరింది. మంచిర్యాల డిపో నుంచి 2016లో 127 బస్సులు నడిచాయి. 844 ట్రిప్పులతో 32,743 మంది భక్తులను చేరవేశారు. ఈసారి 94 బస్సులు 672 ట్రిప్పులతో 18,492 మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. 
 

గత జాతర కంటే అధికం..
గత మేడారం జాతరతో పోల్చితే ఈసారి అదనపు ఆదాయం సమకూరింది. 2016లో అత్యధికంగా 364 బస్సులు కేటాయించారు. రూ.2.33 కోట్లు ఆదాయం ఆర్టీసీకి సమకూరింది. మహదేవ్‌పూర్, కాళేశ్వరం, మంథని కేంద్రాలు రీజినల్‌ బస్సులు నడిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బస్సులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా లేకపోవడం వల్ల హైదరాబాద్, రంగారెడ్డిలకు చెందిన ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకువచ్చి నడిపారు. బస్సు నడిచినా లేకపోయినా రోజుకు రూ.11.500 చెల్లించారు. ఈదఫా జాతర కంటే గతంలో 70 బస్సులను అదనంగా తిప్పారు. ఈ జాతర సందర్భంగా అద్దె బస్సులు, ఇతర జిల్లాల నుంచి బస్సులు నడపకపోవడం వల్ల అదనపు ఖర్చు తగ్గింది. ఈసారి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాలు నుంచి 294 బస్సులు నడిపి రూ.2.08 కోట్లు సాధించారు.
 

మహా శివరాత్రి ఉత్సవాలపై దృష్టి 
మహా శివరాత్రి నేపథ్యంలో జిల్లా కేంద్రం మంచిర్యాల నుంచి వేలాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకు మూడు రోజులపాటు బస్సులు నడపాలని యోచిస్తున్నారు. 25 బస్సులు నడిపి ప్రయాణికులను చేరేవేసేలా చర్యలు చేపట్టారు. కరీంనగర్‌కు బస్సులు నడపడంతోపాటు రద్దీ ఉంటే ఒకటి, రెండు బస్సులను వేములవాడకు తిప్పాలని చూస్తున్నట్లు డీఎం రజనికృష్ణ తెలిపారు. ఆసిఫాబాద్‌ డిపో నుంచి బుగ్గరాజరాజేశ్వరస్వామి దేవాలయానికి బస్సులు నడపనున్నట్లు తెలుస్తోంది. 

సమన్వయంతో లక్ష్యాన్ని సాధించాం..
మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, అధికారులంతా సమన్వయంతో పనిచేశారు. జాతర వెళ్లే భక్తులకు ఎక్కడ ఇక్కట్లు ఎదురుకాకుండా చూశాం. రీజియన్‌ నుంచి 294 బస్సులు నడిపి రూ.2.06 కోట్లు ఆదాయం సాధించాం. మంచిర్యాల–మేడారం–మంచిర్యాలకు 68,975 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాం. సాధారణ రోజుల కంటే రూ.78 లక్షల అదనపు ఆదాయం ఆర్టీసీకి సమకూరడం సంతోషాన్ని కలిగిస్తోంది. 
– రాజేంద్రప్రసాద్, రీజినల్‌ మేనేజర్‌ ఆదిలాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement