సాక్షి, హైదరాబాద్: నాలుగు వేల బస్సులు.. 11 వేల మంది సిబ్బంది.. 20 లక్షల మంది ప్రయాణికుల తరలింపు లక్ష్యం.. సీసీ కెమెరాలు, ఉపగ్రహం ద్వారా ట్రాకింగ్‌తో పర్యవేక్షణ.. గిరిజన కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు ఆర్టీసీ ప్రణాళిక ఇది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అప్పటికప్పుడు సిద్ధంగా ఉన్న ప్రయాణికులెందరు, వారికి ఎన్ని బస్సులు అవసరమన్నది క్షణాల మీద గుర్తించి.. అంతేవేగంగా బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తుండటం ఈసారి ప్రత్యేకత. కనీసం 20 లక్షల మంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చటం లక్ష్యంగా పెట్టుకున్నందున 4 వేల బస్సులను సిద్ధం చేసింది. మరో ఐదారు వందల బస్సులను స్పేర్‌లో పెట్టుకుంది. హైదరాబాద్ నుంచి మేడారం వద్దకు బస్సును తరలించే వరకు మొత్తం 11 వేల మంది సిబ్బందిని ఇందుకోసం వినియోగిస్తున్నారు. మేడారంలో పెద్ద పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
రద్దీని తెలుసుకునేందుకు.. సీసీ కెమెరాలు
జాతర జరిగే ప్రాంతంలో ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు 20 సీసీ కెమెరాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆర్టీసీ ప్రాంగణంవైపు వస్తున్న భక్తులు, బస్సుల కోసం క్యూ లైన్లలో వేచి ఉండే ప్రయాణికుల సంఖ్యను క్షణక్షణం పర్యవేక్షిస్తూ బస్సులను సమాయత్తం చేయనుంది. ఏ బస్సు ఎక్కడుందో ట్రాక్ చేసేందుకు వీలుగా జాతరకు ఏర్పాటు చేసిన బస్సులన్నింటినీ ఉపగ్రహం ద్వారా ట్రాక్ చేసే విధానంతో అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల బస్సులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తారు. సిబ్బంది వద్ద వాకీటాకీలు ఉంటాయి.
జంపన్నవాగు నుంచి ఉచిత బస్సులు
జాతరకు వచ్చే వారు తమ వాహనాలను సమీపంలో ఉండే నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ యార్డులో నిలపాలి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో జాతర వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ బస్సుల్లో ఉచితంగా తరలించనున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్నవాగుకు కూడా మినీ బస్సులను ఏర్పాటు చేశారు. వీటిలోనూ ప్రయాణికులను ఉచితంగా తరలించనున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం: ఆర్టీసీ ఎండీ రమణారావు
‘ఈ సారి జాతరలో ఆర్టీసీ కీలక సేవలందించనుంది. దాదాపు 20 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు తరలించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశాం. మేడారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతికతను వాడుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. నేను జాతర పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తాను’.
Comments
Please login to add a commentAdd a comment