మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఆడబిడ్డల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. తూర్పు ప్రాంతంలో బుధవారం నుంచి మంచిర్యాల గోదారి వద్ద, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, రెబ్బెన, బెజ్జూర్ ప్రాంతాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. బుధవారం బిడ్డ సారలమ్మ, గురువారం తల్లి సమ్మక్క గద్దెలపై కొలువుదీరగా.. శుక్రవారం భక్తులు బంగారం(బెల్లం) పెట్టి, కొబ్బరికాయలు కొట్టి, తలనీలాలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మూడు రోజులపాటు కన్నుల పండువగా సాగిన గిరిబిడ్డల జాతర శనివారం సాయంత్రం వనాలకు చేరుకోవడంతో అపూర్వ ఘట్టం ముగియనుంది. మళ్లీ రెండేళ్లకు అంటే 2016లో జాతర వస్తుంది.
నేడు వనానికి ఆరాధ్యదైవాలు
మంచిర్యాల గోదావరి తీరంలో వెలసిన సమ్మక్క-సారలమ్మలు శనివారం తిరిగి వనానికి చేరుకోనున్నారు. స్నానాల ఘట్టం సమీపం నుంచి బుధవారం సారలమ్మను, శ్రీ సరస్వతి శిశుమందిర్ సమీపం నుంచి గురువారం సమ్మక్కను మేళతాళాల మధ్య ఆర్భాటంగా తీసుకొచ్చారు. భక్తులకు దర్శనం ఇచ్చిన వనదేవతలు తిరిగి శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిరాడంబరంగా ఆదివాసీ పూజారులు వనాలకు తోడ్కొని పోతారు. బుధవారం మళ్లీ తిరుగువారం నిర్వహించనున్నారు. సల్లంగా సూడు తల్లి, మళ్లీ జాతరకు వస్తాం అంటూ భక్తులు తిరుగుపయనం అయ్యారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి తూర్పు ప్రాంతంలోని జాతరకు తరలి వచ్చారు. పిల్లాపాపలు, చేతిలో వంట, పూజా సామగ్రితో చేరుకున్నారు. గుడారాలు వేసుకుని రాత్రంతా చీకటిలోనే గడిపారు.
మూడు లక్షల జనం
మంచిర్యాలలోని గోదావరి వద్ద వెలిసిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడానికి దాదాపు మూడు లక్షల మంది వచ్చారు. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న కరీంనగర్ జిల్లా గోలివాడలో కూడా సమ్మక్క-సారలమ్మ జాతర జరిగింది. అయినా మంచిర్యాల జాతరకు భక్తులు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంత జనంతో గోదారి తీరం జనప్రవాహాన్ని తలపించింది. జాతర ముగింపు దగ్గర పడుతుండడంతో భక్తుల తాకిడి పెరిగింది.
మంచిర్యాల ఆర్డీవో చక్రధర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇతర ప్రముఖులు వన దేవతలను దర్శనం చేసుకున్న వారిలో ఉన్నారు. కాగా, దుకాణాల వద్ద భక్తుల సందడి కనిపించింది. జాతరకు వచ్చిన భక్తులు తిరుగు పయనంలో దుకాణాల్లో షాపింగ్ చేశారు. ప్రసాదం కొనుగోలు చేశారు. చిన్న పిల్లలకు బొమ్మలు, మహిళలు గాజులు, గిల్టు నగలు కొనుగోలు చేశారు. శుక్రవారం అకస్మాత్తుగా పది నిమిషాలు చిరుజల్లులు పడటంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. తడవకుండా గుడారాల్లో తలదాచుకున్నారు.
పోలీసు, పురపాలక శాఖల సహకారం
సమ్మక్క-సారలమ్మ జాతర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగగా పురపాలక శాఖ తన వంతు సహకారం అందించింది. దేవాదాయ శాఖ గద్దెల నిర్వహణ, విద్యుత్ దీపాలు, షామియానాలు ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ భక్తులకు మౌలిక సదుపాయా లు క ల్పించింది. ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేసింది.
పారిశుధ్యం లోపం లేకుండా చర్యలు తీసుకుంది. 40 మంది సిబ్బంది జాతరలో విధులు నిర్వహించారు. శాంతి భద్రతలు పర్యవేక్షణలో పోలీసులు కీలకంగా వ్యవహరించారు. సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, నలుగురు ఏఎస్సైలు, 20 మంది హెడ్ కానిస్టేబుళ్లు మొత్తం 50 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అన్ని పార్టీల వారితో కమిటీలు వేయగా జాతరకు తమ వంతు సహకారం అందించారు.
అపూర్వం అమ్మల దర్శనం
Published Sat, Feb 15 2014 2:58 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement