
మేడారం జాతరకు మొబైల్ యాప్
ఆవిష్కరించిన డీజీపీ అనురాగ్‌శర్మ
సాక్షి, హైదరాబాద్: మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు దర్శనం మరింత సులభతరం కానుంది. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరిగే జాతరకు రూట్ మ్యాప్, పార్కింగ్ స్థలాలు, స్నాన ఘట్టాలు, ట్రాఫిక్ జామ్ తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు వరంగల్ పోలీసులు మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
వరంగల్ నిట్ విద్యార్థుల సహకారంతో రూపొం దించిన ఈ యాప్‌ను శుక్రవారం డీజీపీ అనురాగ్‌శర్మ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఎస్.రవీందర్, విద్యార్థులు సాయితేజ, రాహుల్, దేవేంద్ర, శివం యాప్ పనిచేసే విధానాన్ని వివరించారు. జాతరపై వరంగల్ జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన వీడియోను డీజీపీ పరిశీలించారు. తెలంగాణ నార్త్‌జోన్ ఐజీ నవీన్ చంద్, వరంగల్ ఎస్పీ అంబార కిశోరే ఝా పాల్గొన్నారు.