వన దేవతల జన జాతరకు కొత్తపల్లి మండలం రేకుర్తి, చింతకుంటల్లోని గద్దెలు సిద్ధమయ్యాయి. మినీ మేడారంగా ప్రాచుర్యం పొంది భక్తుల కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న రేకుర్తి శ్రీ సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భారీగా భక్తులు తరలిరానున్నారు. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులకు అసౌకర్యాలు కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్తపల్లి(కరీంనగర్) : ఈనెల 31వ నుంచి వచ్చేనెల 3 వరకు జరిగే జాతరపై వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. దేవాదాయ, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, పంచాయతీరాజ్, పోలీస్ తదితర శాఖలను సమన్వయం చేస్తూ పంచాయతీ ఆధ్వర్యంలో జాతర పనులు ఊపందుకున్నాయి. సుమారు నాలుగున్నర లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారన్న అంచనా మేరకు నాలుగు లైన్ల బారీకేడ్లతోపాటు గద్దెల చుట్టు రక్షణ కర్రలు ఏర్పాటు చేశారు. సర్వ, ప్రత్యేక, వీఐపీల దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. అమ్మవార్ల దర్శన అనంతరం భక్తుల విడిది కోసం గద్దెల సమీపంలోని స్థలంతోపాటు దేవుళ్ల గుట్ట, పంచాయతీ పరిసరాలు, ఎస్సారెస్పీ కెనాల్‌కిరువైపులా, పెంటకమ్మ చెరువు ప్రాంతాలను చదును చేశారు. బంగారం(బెల్లం), కొబ్బరికాయలు, ప్రసాదాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. జాతర జరిగే ప్రదేశంతోపాటు పరిసర ప్రాంతాల్లో లైటింగ్, మైకులు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు ఉచితంగా నీటి ప్యాకెట్లను సరఫరా చేసేందుకు రెవెన్యూ, విద్యుత్ శాఖ ముందుకొచ్చింది. ట్యాంకర్ల ద్వారా కరీంనగర్ మున్సిపల్, నల్లాల ద్వారా పంచాయతీ నీటిని సరఫరా చేయనుంది. ఉచితంగా మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు వార్డు సభ్యుడు రహీం ముందుకొచ్చారు.
ఎస్సారెస్పీ కాలువే.. జంపన్న వాగు..!
ప్రతి రెండేళ్లకోసారి వైభవోపేతంగా జరిగే జాతరకు భక్తుల తాకిడి పెరుగుతోంది. వారి కోసం ప్రత్యేక స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. జంపన్న వాగును తలపించేలా ఎస్సారెస్పీ కెనాల్‌లో స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. ఈనెల 30 నుంచి నీటిని అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే గంగుల ఆదేశాలిచ్చారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు 4ప్రదేశాల్లో తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. పురుషులకు 15, మహిళలకు 15 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. జాతరలో శానిటేషన్ సమస్య తలెత్తకుండా 50 మందితో షిఫ్టులవారీగా పనులు చేపట్టనున్నారు.
భారీ బందోబస్తు
పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, 139 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 30 సీసీ, డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచనున్నారు.
పార్కింగే ప్రధాన సమస్య
రేకుర్తి జాతరలో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారనుంది. కరీంనగర్–జగిత్యాల, రేకుర్తి–యూనివర్సిటీల ప్రధాన రహదారుల గుండా వెళ్లే వాహనాల తాకిడి అధికంగా ఉండి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడనుంది. ప్రధాన రహదారులను ఆనుకొని ఉన్న కోళ్లు, బెల్లం దుకాణాల్లో భక్తులు నిలిచే అవకాశముంది. గతంతో పోల్చితే ఈ ఏడాది జాతర పరిసర ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు అధికమయ్యాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పార్కింగ్‌ను నియంత్రించాల్సి ఉంటుంది. కాళోజీనగర్, పంచాయతీ పరిసరాలు, పెంటకమ్మ ప్రాంతాలను గుర్తించారు.
కమిటీ నియామకం
ఎమ్మెల్యే కమలాకర్ సూచన మేరకు 13 మందితో రేకుర్తి జాతర ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏర్పాటు చేశారు. రాజశేఖర్(ఎంపీటీసీ), నరేష్, తిరుపతి, నర్సయ్య, లక్ష్మణ్, కనుకయ్య, కత్తరపాక ఆంజనేయులు, మహంకాళి ఎల్లయ్య, పొన్నం అనిల్‌గౌడ్, నేరెళ్ల అజయ్, సుదగోని నారాయణ, గుర్రం శ్రీనివాస్, సొన్నాయిల రాకేశ్ ఎన్నికయ్యారు.
30 ఏళ్లుగా జాతర
జాతరను 30 ఏళ్లుగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. తన తండ్రి పిట్ల రాజమల్లయ్య ఆధ్వర్యంలో 1990లో జాతర ప్రారంభమైంది. అప్పటినుంచి ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరకు జనం పెద్దసంఖ్యలో వస్తున్నారు.
– పిట్టల శ్రీనివాస్, జాతర వ్యవస్థాపక చైర్మన్
భక్తులు సహకరించాలి
రేకుర్తి, చింతకుంటల్లో జాతరకు భద్రత ఏర్పాటు చేస్తున్నాం. రేకుర్తిలో భక్తుల తాకిడి అధికంగా ఉండనున్న నేపథ్యంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి పర్యవేక్షణలో సుమారు 150 మంది బందోబస్తు నిర్వహిస్తారు. జాతర ప్రదేశానికి వాహనాలకు అనుమతివ్వం. భక్తులు సహకరించాలి.
– పింగిలి నాగరాజు, ఎస్సై, కొత్తపల్లి(హవేలి)
Comments
Please login to add a commentAdd a comment