srsc canal
-
‘గాలేరు–నగరి’ బరిలో నాలుగు సంస్థలు
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లాలో గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ నుంచి శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), గాలేరు–నగరి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు అభివృద్ధి చేయడం, అవుకు వద్ద అదనంగా పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరో టన్నెల్ తవ్వే పనులకు ప్రభుత్వం నిర్వహించిన టెండర్లో నాలుగు సంస్థలు పోటీపడుతూ బిడ్లు దాఖలు చేశాయి. ఈ పనులకు రూ.1269.49 కోట్ల అంచనా వ్యయంతో 36 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో నిర్వహించిన టెండర్లో టెక్నికల్ బిడ్‌ను బుధవారం కర్నూలు ప్రాజెక్ట్ సీఈ మురళీనాథ్‌రెడ్డి తెరిచారు. ఎన్సీసీ (నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ), వైఆర్కే (ఎర్రం రామకృష్ణారెడ్డి కన్స్ట్రక్షన్స్), డీఎస్సార్(జాయింట్ వెంచర్), ఎమ్మార్కేఆర్(మేడా రామకృష్ణారెడ్డి కన్స్ట్రక్షన్ కంపెనీ)లు బిడ్లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ► ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్‌ను తెరుస్తారు. ఈ బిడ్‌లో తక్కువ ధర(ఎల్–1)కు కాంట్రాక్టు సంస్థ కోట్ చేసిన మొత్తాన్నే కాంట్రాక్టు విలువగా పరిగణించి.. అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఈ–ఆక్షన్(రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. ఇందులో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించాలని ఎస్‌ఎల్‌టీసీ(రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ)కి ప్రతిపాదనలు పంపుతారు. ► ఈనెల 29న ఎస్‌ఎల్‌టీసీ సమావేశమవుతుంది. టెండర్ ప్రక్రియను పరిశీలించి.. ఆమోదిస్తుంది. ఆ తర్వాత పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు ఆర్డర్ జారీ చేస్తారు. -
'నీళ్ల కోసం ఆకాశం వైపు చూడనవసరం లేదు'
సాక్షి, జాగిత్యాల : జిల్లాలోని ఎస్సారెస్పీ కాలువలో పూడిక తీత పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మపురి మండలం గాదెపెల్లిలో సీఎం కేసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో రైతులు సన్నం రకం వడ్లను సాగు చేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వేసవిలోనూ మత్తడి దుంకడం కేసీఆర్ గొప్పతనానికి మారుపేరన్నారు. రైతులు ఇకపై నీళ్ల కోసం ఆకాశం వైపు చూడాల్సిన అవసరం లేదన్నారు. పుష్కలంగా నీళ్లు.. భూమి నిండా పంట ఉంటుదన్నారు. కాగా పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. -
హోలీ వేడుకల్లో విషాదం
తిరుమలాయపాలెం: హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. అంతసేపు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకుని ఆనందంగా గడిపిన ఓ యువకుడు, అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని మేడిదపల్లిలో ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... మేడిదపల్లి గ్రామస్తుడు ఆమెడ మురళి(21), తన స్నేహితులైన షేక్ నజీర్, తురక నవీన్, షేక్ వహీద్‌తో కలిసి గురువారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. ఈత కొట్టేందుకని మోటార్ సైకిళ్లపై మేడిదపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు చేరుకున్నారు. అప్పటికే వీరు మద్యం మత్తులో ఉన్నారు. భక్త రామదాసు ప్రాజెక్ట్ కాలువలో ఎత్తిపోస్తున్న నీటి ప్రవాహం వద్దకు వెళ్లారు. అక్కడ ఈత కొడుతున్నారు. ఇంతలోనే... అక్కడి సుడిగుండంలో వహిద్, నజీర్ మునిగిపోతుండడాన్ని ఆమెడ మురళి, తురక నవీన్ గమనించి అప్రమత్తమయ్యారు. వారిని గట్టిగా పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అక్కడకు దగ్గరలోనే ఉన్న కొందరు రైతులు కూడా సాయపడ్డారు. ఈ ప్రయత్నంలో, అదే సుడి గుండంలో ఆమెడ మురళి చిక్కుకున్నాడు. ఊపిరాడక మృతిచెందాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే పెళ్లి... మేడిదపల్లి గ్రామానికి చెందిన మురళి, రెండేళ్ల క్రితమే సుబ్లేడుకు చెందిన కళ్యాణిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కొద్ది నెలలపాటు పెట్రోల్ బంకులో పనిచేశారు. వీరికి ఆరునెలల కుమారుడు ఉన్నాడు. మురళి భార్య కళ్యాణి, తల్లిదండ్రులు వెంకన్న, వెంకటమ్మ రోదన... చూపరులకు కంట తడి పెట్టించింది. -
మురికి కాలువను తలపిస్తున్న ఎస్సారెస్పీ ఎల్ 6 కాలువ
సాక్షి,రామగిరి: మండలంలోని రాజాపూర్ వద్ద ఉన్న ఎస్సారెస్పీ ఎల్ 6 కాలువ మురికి కాలువను తలపిస్తుంది. గ్రామం పరిధిలో సుమారు 400 మీటర్ల పొడవున ఎస్సారెస్పీ కాలువ ప్రవహిస్తుంది. గ్రామం పరిధిలో కాలువ ప్రారంభం నుంచి చివరి వరకు నివాస గృహాల్లోని వృథానీరు కాలువలోకి వదిలేస్తుండంతో ఈదుస్థితి నెలకొంది. కాలువ పొడవునా ఆనుకుని నిర్మించిన సుమారు 200 ఇళ్లలోని మరుగుదొడ్లు, వృథా నీరుకూడా ఇందులోకి పైపులైన్ల ద్వారా వదిలివేయడంతో కాలువ పొడవునా దుర్గంధం వెలువడుతుంది. కాలువ నుంచి సాగునీరు విడుదల అయ్యే సమయంలో మినహా మిగతా సమయంలో ఎస్సారెస్పీ కాలువ మురికి కాలువను తలపిస్తోంది. కాలువలో మురికినీరు నిలిచిపోవడం వల్ల కాలువ పొడవునా తుంగ, చెత్తా చెదారం పేరుకు పోయి పందులకు స్థావరంగా మారి దోమలు వృద్ధి చెందుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెలువడుతున్నాయి. ఇటీవల సింగరేణి స్థంస్థ ఓసీసీ2 విస్తరణ కోసం ఎల్6 కాలువను మళ్లీస్తున్నారు. దీంతో దీన్ని గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. కాలువ గురించి ఎవరు పట్టించుకోపోవడం వల్ల మురికి కాలువను తలపిస్తున్న ఎస్సారెస్పీ కాలువ వల్ల స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు రూపకల్పన చేయడంతో రాజాపూర్ గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ పాలనలోనైన మురికి కాలువను తలపిస్తున్న ఎస్సారెస్పీ కాలువ వల్ల పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు మురికి కాలుగా మారిన ఎస్సారెస్పీ కాలువ పట్ల తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భరించలేకపోతున్నాం.. కాలువలోకి ఇండ్లల్లోని నీరు వదిలేయడం వల్ల వస్తున్న గలీజు వాసన భరించలేకపోతున్నాం. కాలువ నుంచి వచ్చే వాసన వల్ల కడుపులో వికారం ఏర్పడి వాంతులు చేసుకుంటున్నాం. కాలువ నిండి తుంగ మొలిచి పందులు తిరుగుతున్నాయి. దీన్ని పట్టించుకునేటోళ్లే లేకుండా పోయారు. –రొడడ బాపు, రాజాపూర్ కాలువ శుభ్రం చేయాలి కాలువలో చెత్తాచెదారం నిండిపోవడం వల్ల దోమలు పెరిగి రోగాల భారిన పడుతున్నాం. నీళ్లు వచ్చినప్పుడు ఎలాంటి వాసన రావడం లేదు, నీళ్లు బంద్ అయిన తరువాత వచ్చే వాసన వల్ల మాగోస చెప్పుకోలేము. అధికారులు కాలువను శుభ్రం చేయించాలి. –బర్ల కుమార్, రాజాపూర్ -
నీళ్ల కోసం జగడం
తొర్రూరు రూరల్: వరి చేలు పాలు పోసుకుంటున్నాయి.. ఆరుగాలం చెమట తీసిన రైతన్న గట్టెక్కే రోజుల దగ్గరపడ్డాయి. ఎదుగుతున్న పంట చేనును చూసి రైతన్న మురిసిపోతున్నాడు.. ఇంకో రెండు తడులు పెడితే చాలు పంట చేతికి అందుతుంది. ఎరువుల బస్తాల అప్పులు, షావుకారు మందు డబ్బాల బాకీలు, పోరగాండ్ల బడి ఫీజులు అన్నీపోనూ ఇంకో రూ.పది, పదిహేను వేలు మిగులుతాయని అన్నదాతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ లోగా అనుకోని ఆప ద.. దిగువకు నీళ్లు ఇవ్వొద్దని జగిత్యాల రైతుల ఆందోళన మొదలైంది. రైతు ఐక్య వేదిక పేరుతో కాల్వ నీళ్లకు అడ్డం పడ్డరు. రైతాంగానికి అక్కడి రాజకీయ పార్టీ నేతలు మద్దతు పలికారు. కాల్వల నీళ్లు ఆగిపోతాయేమోనని ఇక్కడి రైతన్న గుండె పగులుతున్నాడు. దక్షిణ వరంగల్ ప్రాంతంలో కరువు తాండవిస్తోంది. వరుసగా వర్షాలు లేక పాలకుర్తి, వర్ధన్నపేట, మహబూబాబాద్ ప్రాంతా ల్లో పంట భూములు బీడువడ్డాయి. అప్పట్లో రబీ పంటలకు ఎస్సారెస్పీ జలాలు తీసుకొస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే హోదాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు రైతులకు మాట ఇవ్వటంతో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద ఉన్న రైతులంతా పంటలు సాగు చేశారు. ఎర్రబెల్లి మాట ఇచ్చినట్లుగానే ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను విడుదల చేసింది. అధికారులు ఒక్కో చెరువు నింపు తూ వస్తున్నారు. దీంతో రైతుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అందరూ పొలం పనుల్లో బిజీ అయ్యారు. జిల్లాలో 40 వేల ఎకరాల ఆయకట్టు మేర రైతాంగం సాగు చేసుకుంది. చెరువులకు జల కళ.. డీబీఎం–60ప్రధాన కాల్వ ద్వారా రోజుకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక టీఎంసీ నీటిని కాల్వల్లోకి వదిలారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ మండలాల్లోని 49 చెరువులను నింపేలా 1 టీఎంసీ నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 45 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాల్వ ద్వారా నీటిని వివిధ గ్రామాల చెరువులకు సరఫరా చేస్తున్నారు. డీబీఎం–57 పరిధిలో రాయపర్తి మండలంలోని 6, తొర్రూరు మండలంలోని 3 చెరువులకు 100 ఎంసీఎఫ్‌టీ, బయ్యన్న వాగు రిజర్వాయర్‌కు నీటి మళ్లింపు ద్వారా డీబీఎం 61 పరిధిలోని 6 చెరువులు, డీబీఎం 63 పరిధిలోని 4 చెరువులు, డీబీఎం–61, డీబీఎం–67 పరిధిలోని కొడకండ్ల, పెద్దవంగర మండలాల్లోని ఒక్కో చెరువుకు 200 ఎంసీఎఫ్‌టీ నీటిని సరఫరా చేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రధాన కాల్వలకు అనుబంధంగా ఉన్న ఉప కాల్వల ద్వారా రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ జలాలు వెళ్తున్నాయి. ఇల్లంద సమీపంలోని డీబీఎం గేటు తీయడంతో ఉప కాల్వ నుంచి వర్ధన్నపేట, పర్వతగిరి చెరువులు సైతం నిండుతున్నాయి. రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్‌కు భారీగా నీరు చేరుతుండడంతో ఈ మండలానికి సాగునీరు సమృద్ధిగా లభిస్తోంది. ఇక్కడ నుంచి బయ్యన్నవాగు రిజర్వాయర్ ద్వారా సూర్యపేట జిల్లాకు సైతం నీటిని విడుదల చేస్తున్నారు. 145 చెరువులకు జీవం.. వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న 11 మండలాలకుగాను సుమారు 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో గోదావరి జలాలను వదిలారు. భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితి ఉండటంతో దాని నుంచి బయటపడేందుకు నీటిని కాల్వల్లోకి వదులుతున్నారు. దాదాపు 145 చెరువులు నీటితో నిండుతున్నాయి. రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 1,18,174 ఎకరాల ఆయకట్టు, వరంగల్ రూరల్ జిల్లాలో 32,636 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఉత్తర తెలంగాణకు సాగు నీరందించే ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్‌తోపాటు ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలకు ప్రయోజనం కలుగుతోంది. 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు ద్వారా ఐదు పాత జిల్లాలకు 18 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. జగిత్యాల రైతుల ఆందోళన నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు దిగువకు వచ్చే నీళ్లను నిలిపివేసి అక్కడి రైతాంగానికి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పాలు పోసుకునే దశలో ఉన్న వరి చేలు ఎండిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ దక్షిణ ప్రాంత రైతాంగం జల పోరాటానికి సిద్ధం కావాలనే ఆలోచనతో ఉంది. గతంలో దేవాదుల ఎత్తిపోతల ద్వారా చలివాగు రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించి మోటార్ల ద్వారా పాలకుర్తి, జనగామ ప్రాంతాలను నీళ్లందిస్తుండగా అక్కడి రైతులు ఓ రాజకీయ పార్టీ అండతో అప్పట్లో మోటార్లను బలవంతంగా బంద్ చేయించడంతో ఇక్కడి రైతుల పంట పొలాలు ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టాలు చూసే.. మాది కరువు ప్రాంతం. వానలు సరిగా కురవవు. పంటను కాపాడుకోలేక రైతన్న పడుతున్న కష్టాన్ని స్వయంగా చూసిన. నేరుగా సీఎంను కలిసి రైతుల కన్నీటి గాథను వివరించిన. ఎస్సారెస్పీ నీళ్లు ఇచ్చి ఆదుకోండని ప్రాథేయపడిన. ఆయన తక్షణమే స్పందించి రోజుకు 900 క్యుసెక్కుల నీళ్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. చెరువులు నిండాయి. వరి చేలకు నీరందుతోంది. ఒక్క నా నియోజకవర్గంలోనే 45 వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందుతోంది. రైతులు సంతోషంగా ఉన్నారు. పైన రాజకీయపరమైన ఆందోళనలు ఏవో జరుగుతున్నాయని తెలుస్తోంది. రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే నీళ్లాపితే సావే దిక్కు.. ఇప్పుడైతే ఎస్సారెస్పీ నీళ్లు అందుతున్నాయి. వరి చేను పాలువోసుకుంటోంది. చెరువులకు నీళ్లు వచ్చి పంటకు పారుతోంది. కానీ ఎగువన రాజకీయం జరుగుతుందట. నీళ్లు ఆపుతారనే పుకార్లు అస్తున్నాయి. గీ టైంలో నీళ్లు ఆపితే సచ్చిపోవుడు తప్ప ఇంకోటి లేదు. – వెంకటసాయిలు, వెలికట్ట, తొర్రూరు బోరు బాగా పోస్తుంది.. గతంలో బోరు సన్నగా పోసేది. ఎకరాకు కూడా నీరు సరిపోయేది కాదు. ఎస్సారెస్పీ జలాలతో భూమిలో నీరు పెరిగి బోరు బాగా పోస్తుంది. మూడెకరాల మేర సాగు చేసిన పంటలకు నీరు సరఫరా అవుతున్నాయి. ప్రతి సీజన్లో గోదావరి నీరు సరఫరా చేస్తే బాగుంటుంది. – వెంకన్న, రైతు, మైలారం, రాయపర్తి నా పంట బయటపడ్డట్టే.. గోదావరి నీళ్లతో చెరువు నిండింది. నా వరి పంట చేతికి అందుతోంది. ఎప్పుడో వర్షాలు పడితే చెరువులోకి నీళ్లు వచ్చేవి. లేకుంటే చెరువు ఎండిపోయేది. ఇక నా పంట చేతికి అందినట్టే. –జక్కుల ఐలయ్య, రైతు, ఈరవెన్ను -
జాడలేని జోజి మృతదేహం
సంగెం(పరకాల): చూస్తుండగానే ఎస్సారెస్పీ కెనాల్లో గల్లంతైన జోజి మృతదేహం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన కట్టవరపు జోజి(30) ఈనెల 23న కూలి పనికి వెళ్లి ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ ఒడ్డున మోటార్ ఏర్పాటు చేసి అవతల ఉన్న ట్రాన్స్ఫార్మర్కు కరెంట్ వైరు కలిపేందుకు ఈదుకుంటూ వెళ్లి తిరిగి వస్తుండగా నీటి ఉధృతికి కొట్టుకుపోయిన విషయం విధితమే. అక్కడే ఉన్న పలువురు అతడిని రక్షించేందుకు యత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఆతర్వాత గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కెనాల్లో ఎంత వెతికినా వారం రోజులుగా మృతదేహం లభించలేదు. జోజి గల్లంతైన గాంధీనగర్ నుంచి తీగరాజుపల్లి, ఇటు వర్ధన్నపేట, రాయపర్తి, మైలారం రిజర్వాయర్, అటు మహబూబాబాద్ జిల్లా కురవి వరకు కెనాల్ వెంట రాత్రీ పగలు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు తేజస్విని, కీర్తనతోపాటు బంధువులు రోదిస్తున్నారు. మృతదేహం జాడ లేక కర్మకాండ నిర్వహించలేక, మరణ ధ్రువీకరణ పత్రం లభించని పరిస్థితి ఉందని బంధువులు వాపోతున్నారు. -
ఖరీఫ్‌కు ఎస్సారెస్పీ నీరు
ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు నిజంగా ఇది శుభవార్త. ఎగువ నుంచి భారీగా వరద నీరు ఎస్సారెస్పీలోకి చేరుతుండటంతో ఈ ఖరీఫ్‌కు పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జలసౌధలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాఠిల్లతో కలిసి ఈఎన్సీ మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఇరిగేషన్ ప్రత్యేకాధికారి కే.ప్రసాద్, అడినిస్ట్రేటీవ్, కమ్ చీఫ్ ఇంజినీరు బి.శంకర్‌లతో సమీక్ష నిర్వహించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్ఎండీ)కు నీటి విడుదల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ ప్రాజెక్టు కింది ఆయకట్టు 4.60 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. నీటి విడుదల ప్రణాళికలను సిద్ధం చేయాలని ఎస్సారెస్పీ అధికారులను మంత్రి హరీశ్ ఆదేశించారు. దీంతో ఆయకట్టుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఇటీవలి వర్షాలతో ఎల్ఎండీ ఎగువ, దిగువన ఉన్న, ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి విడుదలకు అవకాశం కలిగింది. ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి పెరిగింది. రెండు రోజులుగా రోజుకు 2.66 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వారం రోజుల కిందటి వరకు ఎస్సారెస్పీ 19 టీఎంసీల కు పరిమితం కాగా సోమవారం రాత్రి నాటికి 56 టీఎంసీలకు చేరినట్లు అధికారులు తెలి పారు. మొత్తం 90 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు ఇదే రకంగా వరద ఉధృతి కొనసాగితే బుధవారం నాటికి ఎస్సారెస్పీ పూర్తిగా నిండుతుందని అధికారవర్గాలు ‘సాక్షి’కి వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్ జలసౌధలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సాగునీటి విడుదలకు ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దీంతో ఎల్ఎండీ ఎగువన నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, నిర్మల్ జిల్లాల పరిధిలోని 4 లక్షల 62 వేల 920 ఎకరాల ఆయకట్టుకు 32 టీఎంసీల సాగునీరు అందనుం ది. ఎల్ఎండీ దిగువన ఉన్న కరీంనగర్, వరంగల్‌రూరల్, వరంగల్ అర్బన్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 2,05,720 ఎకరా ల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. గత రబీలోనూ ఇదే ప్రణాళికను రూపొందించిన ఎస్సారెస్పీ అధికారులు ఆ¯న్, ఆఫ్ పద్ధతిలో 8 రోజుల ఆన్, 7 రోజుల ఆఫ్ విధానం ద్వారా నీటి విడుదల చేశారు. తిరిగి ఈ ఖరీఫ్‌లోనూ ఎస్సారెస్పీ పూర్తి ఆయకట్టుకు నీరిందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెల్ టూ హెడ్, ఆన్ అండ్ ఆఫ్.. నీటి వృథాను అరికట్టేందుకు టెల్ టూ హెడ్, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన నీటి విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు సి ద్ధం చేస్తున్నారు. గత రబీలో ఈ పద్ధతి అమలు చేయ డం ద్వారా ఒక్క టీఎంసీ నీటితో 13 వేల నుంచి 14 వేల ఎకరాలకు నీరు ఇవ్వగలిగామన్న అంచనాలో వా రున్నారు. ఇదే అంశంపై సమావేశం మంత్రి హరీశ్‌రావు నీటి విడుదలకు ఇవే మార్గదర్శకాలను సూచించి నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు రైతులు సై తం ఈ పద్ధతితో ఎక్కువ దిగుబడి సాధించామని ఆనందం వ్యక్తం చేశారని కూడా అంటున్నారు. దీంతో ఈ ఖరీఫ్‌లో నీటిని టెల్ టూ హెడ్, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో వినియోగించేలా పకడ్బందీ చర్యలకు అధి కార యంత్రాంగం సిద్ధమవుతోంది. క్షేత్ర స్థాయిలో ఇంజినీర్లు రైతులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి.. నీటి విడుదల ప్ర ణాళికలు వివరించేందుకు కసరత్తు చేస్తున్నారు. కాలు వ పరిధిలో రైతులకు నీటి విడుదల సమాచారం అం దించేలా ఇంజినీర్లు, రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో టాం టాంలు వేయించే ఆలోచనలో ఉన్నారు.గతేడాది వర్షాలతో ప్రాజెక్టులు నిండగా, వర్షపు నీరు సముద్రం పాలుకాకుండా చెరువులు, కుంటల్లో నీరు నింపిన వి షయం తెలిసిందే. ఎల్ఎండీకి ఎగువ, దిగువన ఉన్న కాలువల ద్వారా జీవీసీ 1 పరిధిలోని 258, జీవీసీ4 పరిధిలోని 439, వరంగల్ (సీసీహెచ్) 154, స్టేజీ2 పరధిలో 270 చెరువు కుంటలను నింపారు. ఈ ఏడా ది కూడా చివరి ఆయకట్టు నీరివ్వడంతోపాటు ఎక్కడైనా నీరు చేరకుండా ఉంటే.. భవిష్యత్‌లో ఆ చెరువులు, కుంటలనూ నింపే యోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. రెండు రోజుల్లో ఫుల్.. నాలుగైదు రోజులుగా ఎస్సారెస్సీలోకి భారీగా వరద చేరుతోంది. ఎగువ నుంచి రోజుకు 2.66 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. 90 టీఎంసీల సా మర్థ్యం గల ఈ ప్రాజెక్టులోకి సో మవారం రాత్రి 7 గంటల వరకు 56 టీఎంసీలు వచ్చాయి. ఈ లెక్కన రెండు రో జుల్లో ప్రాజెక్టు నిండుతుంది. ఖరీఫ్, రబీ పంట లకు ఈసారి కూడా ఢోకాలేదు. నీటి విడుదల కోసం ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు నీటి విడుదల ప్రణాళికల తయారీకి ఆదేశాలు ఇచ్చారు. – బి.శంకర్, ఏసీఈ, ఎస్సారెస్పీ -
ఏ తల్లి కన్నబిడ్డో... పాపం !
హుజూరాబాద్‌రూరల్ : ‘ఇంకా కళ్లు తెరవని ఆ పసికందు లోకా న్ని చూడకుండా నే పరలోకాలకు వెళ్లాడు. ఏ తల్లి కన్నబిడ్డో కెనా ల్కాలువలో విగతజీవిగా పడిఉన్నాడు. ఇంకా నెలలు కూడా నిండని ఆ పసికందు మృతదేహం కెనాల్కాలువలో కనబడిన తీరు స్థానికులను కలచివేసింది. మండలంలోని బోర్నపల్లి గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువలో ఆదివారం అప్పుడే పుట్టిన ఓ పసికందు మృతదేహం లభ్యమైంది. గ్రామానికి చెందిన కొందరు యువకులు కాలువలో చేపలు పట్టడానికి వెళ్లేసరికి వారికి మగశిశువు మృతదేహం కనిపించింది. వెంటనే వారు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని శిశువు మృతదేహం గురించి ఆరా తీస్తున్నారు. -
పరిహారం చెల్లించకుండానే నిర్మాణాలు
ముత్తారం(మంథని): సింగరేణి సంస్థ ఓసీపీ2 విస్తరణకు చేపట్టిన భూసేకరణలో నష్టపరిహారం చెల్లించకుండానే ఎస్సారెస్పీ ఎల్6 కాలువ మళ్లింపు పనుల్లో భాగంగా తమ భూముల్లో దౌర్జన్యంగా అధికారులు వంతెన నిర్మాణం చేపడుతున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం లద్నాపూర్ పంచాయతీ పరిధి రాజాపూర్‌లో బాధిత రైతులు మాట్లాడుతూ.. గ్రామశివారులోని 193, 200లో ప్రభుత్వం సుమారు 60 ఏళ్ల క్రితం భూపంపిణీలో భాగంగా గ్రామంలోని నిరుపేదలకు 25.18 ఎకరాల భూమిని పంపిణీచేసి పట్టాలు జారీచేసిందన్నారు. తమకు పంపిణీ చేసిన భూములకు నష్టపరిహారం చెల్లించకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు ఫిర్యాదుచేస్తే నష్టపరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. -
శ్రీసమ్మక్క–సారలమ్మ జాతరకు..సర్వం సిద్ధం
వన దేవతల జన జాతరకు కొత్తపల్లి మండలం రేకుర్తి, చింతకుంటల్లోని గద్దెలు సిద్ధమయ్యాయి. మినీ మేడారంగా ప్రాచుర్యం పొంది భక్తుల కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న రేకుర్తి శ్రీ సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భారీగా భక్తులు తరలిరానున్నారు. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులకు అసౌకర్యాలు కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తపల్లి(కరీంనగర్) : ఈనెల 31వ నుంచి వచ్చేనెల 3 వరకు జరిగే జాతరపై వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. దేవాదాయ, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, పంచాయతీరాజ్, పోలీస్ తదితర శాఖలను సమన్వయం చేస్తూ పంచాయతీ ఆధ్వర్యంలో జాతర పనులు ఊపందుకున్నాయి. సుమారు నాలుగున్నర లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారన్న అంచనా మేరకు నాలుగు లైన్ల బారీకేడ్లతోపాటు గద్దెల చుట్టు రక్షణ కర్రలు ఏర్పాటు చేశారు. సర్వ, ప్రత్యేక, వీఐపీల దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. అమ్మవార్ల దర్శన అనంతరం భక్తుల విడిది కోసం గద్దెల సమీపంలోని స్థలంతోపాటు దేవుళ్ల గుట్ట, పంచాయతీ పరిసరాలు, ఎస్సారెస్పీ కెనాల్కిరువైపులా, పెంటకమ్మ చెరువు ప్రాంతాలను చదును చేశారు. బంగారం(బెల్లం), కొబ్బరికాయలు, ప్రసాదాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. జాతర జరిగే ప్రదేశంతోపాటు పరిసర ప్రాంతాల్లో లైటింగ్, మైకులు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు ఉచితంగా నీటి ప్యాకెట్లను సరఫరా చేసేందుకు రెవెన్యూ, విద్యుత్ శాఖ ముందుకొచ్చింది. ట్యాంకర్ల ద్వారా కరీంనగర్ మున్సిపల్, నల్లాల ద్వారా పంచాయతీ నీటిని సరఫరా చేయనుంది. ఉచితంగా మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు వార్డు సభ్యుడు రహీం ముందుకొచ్చారు. ఎస్సారెస్పీ కాలువే.. జంపన్న వాగు..! ప్రతి రెండేళ్లకోసారి వైభవోపేతంగా జరిగే జాతరకు భక్తుల తాకిడి పెరుగుతోంది. వారి కోసం ప్రత్యేక స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. జంపన్న వాగును తలపించేలా ఎస్సారెస్పీ కెనాల్లో స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. ఈనెల 30 నుంచి నీటిని అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే గంగుల ఆదేశాలిచ్చారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు 4ప్రదేశాల్లో తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. పురుషులకు 15, మహిళలకు 15 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. జాతరలో శానిటేషన్ సమస్య తలెత్తకుండా 50 మందితో షిఫ్టులవారీగా పనులు చేపట్టనున్నారు. భారీ బందోబస్తు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, 139 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 30 సీసీ, డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచనున్నారు. పార్కింగే ప్రధాన సమస్య రేకుర్తి జాతరలో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారనుంది. కరీంనగర్–జగిత్యాల, రేకుర్తి–యూనివర్సిటీల ప్రధాన రహదారుల గుండా వెళ్లే వాహనాల తాకిడి అధికంగా ఉండి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడనుంది. ప్రధాన రహదారులను ఆనుకొని ఉన్న కోళ్లు, బెల్లం దుకాణాల్లో భక్తులు నిలిచే అవకాశముంది. గతంతో పోల్చితే ఈ ఏడాది జాతర పరిసర ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు అధికమయ్యాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పార్కింగ్‌ను నియంత్రించాల్సి ఉంటుంది. కాళోజీనగర్, పంచాయతీ పరిసరాలు, పెంటకమ్మ ప్రాంతాలను గుర్తించారు. కమిటీ నియామకం ఎమ్మెల్యే కమలాకర్ సూచన మేరకు 13 మందితో రేకుర్తి జాతర ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏర్పాటు చేశారు. రాజశేఖర్(ఎంపీటీసీ), నరేష్, తిరుపతి, నర్సయ్య, లక్ష్మణ్, కనుకయ్య, కత్తరపాక ఆంజనేయులు, మహంకాళి ఎల్లయ్య, పొన్నం అనిల్‌గౌడ్, నేరెళ్ల అజయ్, సుదగోని నారాయణ, గుర్రం శ్రీనివాస్, సొన్నాయిల రాకేశ్ ఎన్నికయ్యారు. 30 ఏళ్లుగా జాతర జాతరను 30 ఏళ్లుగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. తన తండ్రి పిట్ల రాజమల్లయ్య ఆధ్వర్యంలో 1990లో జాతర ప్రారంభమైంది. అప్పటినుంచి ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరకు జనం పెద్దసంఖ్యలో వస్తున్నారు. – పిట్టల శ్రీనివాస్, జాతర వ్యవస్థాపక చైర్మన్ భక్తులు సహకరించాలి రేకుర్తి, చింతకుంటల్లో జాతరకు భద్రత ఏర్పాటు చేస్తున్నాం. రేకుర్తిలో భక్తుల తాకిడి అధికంగా ఉండనున్న నేపథ్యంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి పర్యవేక్షణలో సుమారు 150 మంది బందోబస్తు నిర్వహిస్తారు. జాతర ప్రదేశానికి వాహనాలకు అనుమతివ్వం. భక్తులు సహకరించాలి. – పింగిలి నాగరాజు, ఎస్సై, కొత్తపల్లి(హవేలి) -
ఎస్ఆర్ఎస్సీ కాలువకు గండి
జగిత్యాల: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామం వద్ద ఎస్ఆర్ఎస్సీ కాలువకు ఆదివారం ఉదయం గండి పడింది. ఫలితంగా నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి. గమనించిన స్థానికులు గండి పూడ్చేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. దీంతో స్థానికులు సమాచారాన్ని నీటిపారుదల అధికారులకు తెలియజేశారు.