
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లాలో గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ నుంచి శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), గాలేరు–నగరి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు అభివృద్ధి చేయడం, అవుకు వద్ద అదనంగా పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరో టన్నెల్ తవ్వే పనులకు ప్రభుత్వం నిర్వహించిన టెండర్‌లో నాలుగు సంస్థలు పోటీపడుతూ బిడ్‌లు దాఖలు చేశాయి. ఈ పనులకు రూ.1269.49 కోట్ల అంచనా వ్యయంతో 36 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో నిర్వహించిన టెండర్‌లో టెక్నికల్ బిడ్‌ను బుధవారం కర్నూలు ప్రాజెక్ట్ సీఈ మురళీనాథ్‌రెడ్డి తెరిచారు. ఎన్‌సీసీ (నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ), వైఆర్కే (ఎర్రం రామకృష్ణారెడ్డి కన్‌స్ట్రక్షన్స్), డీఎస్సార్(జాయింట్ వెంచర్), ఎమ్మార్కేఆర్(మేడా రామకృష్ణారెడ్డి కన్‌స్ట్రక్షన్ కంపెనీ)లు బిడ్‌లు దాఖలు చేసినట్లు వెల్లడైంది.
► ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్‌ను తెరుస్తారు. ఈ బిడ్‌లో తక్కువ ధర(ఎల్–1)కు కాంట్రాక్టు సంస్థ కోట్ చేసిన మొత్తాన్నే కాంట్రాక్టు విలువగా పరిగణించి.. అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఈ–ఆక్షన్(రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. ఇందులో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించాలని ఎస్‌ఎల్‌టీసీ(రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ)కి ప్రతిపాదనలు పంపుతారు.
► ఈనెల 29న ఎస్‌ఎల్‌టీసీ సమావేశమవుతుంది. టెండర్ ప్రక్రియను పరిశీలించి.. ఆమోదిస్తుంది. ఆ తర్వాత పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు ఆర్డర్ జారీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment