శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి!
‘తలాపునే పారుతోంది గోదారీ, నీ చేనూ, నీ చెలకా ఎడారీ’ అనే పాట మలిదశ తెలంగాణ ఉద్యమంలో బాగా వినిపించేది. భౌగోళికంగా తెలంగాణకు పైభాగాన తలపాగ చుట్టినట్టు గోదావరి ప్రవహిస్తున్నది. అయినా సరే తమకు గోదావరి నీళ్లు అందడం లేదని ఉద్యమకారులు సెంటిమెంట్‌ను పండించారు. కృష్ణా నదితో రాయలసీమకు అటువంటి సెంటిమెంటే ఉన్నది.
‘సీమ’కు తలాపునే కృష్ణమ్మ పారుతున్నది. సెంటిమెంటును పక్కకు పెట్టినా కృష్ణా జలాలే రాయలసీమకు ప్రాణాధారం. ఈ సీమకు ఇంకో ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి ప్రసాదించలేదు. దూరచరిత్రలో ఒకప్పుడు పెన్నా నది కూడా జలరాశులతో తులతూగేదని చెపుతారు. నది అంటూ ఏర్పడిందంటేనే నీటి ఆదరవు ఉండేదని అర్థం కదా!
పెన్నానది ఎందుకు ఇలా పేదరాలయిందోనన్న ఆవేదనను విద్వాన్ విశ్వం కూడా వ్యక్తం చేశారు. పెన్నా తీరంలోని రైతుల వ్యధాభరిత గాధలపై ఆయన ‘పెన్నేటి పాట’ పేరుతో రాసిన కావ్యం గురించి తెలిసిందే. ‘ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్ల మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో?’ అరవయ్యేళ్ల కింద ఆయన వేసిన ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. రుతుపవనాల శీతకన్ను కారణమంటారు శాస్త్రవేత్తలు. నైరుతి రుతుపవనాలు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతూ పడమటి కనుమల అడ్డగింత కారణంగా తేమను కోల్పోయి పొడిగాలులుగా ప్రవేశిస్తాయని అంటున్నారు.
శేషాచలం, నల్లమల శ్రేణుల ఫలితంగా ఈశాన్య రుతుపనాలు కూడా ఈ ప్రాంతంపై పూర్తి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. ఫలితంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొంతప్రాంతంలో వర్షఛాయా ప్రాంతం ఏర్పడింది. నది పుట్టిన చిక్‌బళ్లాపూర్ జిల్లా, నుంచి ప్రవహించే ఉమ్మడి అనంతపురం జిల్లా కడప జిల్లాలు కూడా ఈ వర్షఛాయ ప్రాంతంలో ఉన్న కారణంగా పెన్నా తిన్నెలపై నీటికి బదులు నిట్టూర్పులు ప్రవహించసాగాయి.
పెన్నానది దైన్యాన్ని, రాయలసీమ అవసరాలను 150 ఏళ్ల క్రితమే బ్రిటీష్ అధికారి సర్ ఆర్థర్ కాటన్ గుర్తించారు. అప్పటికే బ్రిటీష్ వాళ్లు ఈ ప్రాంతంలో కేసీ కెనాల్ (కర్నూలు–కడప కాలువ)ను తవ్వించారు. కృష్ణ ప్రధాన ఉపనది తుంగభద్ర నుంచి పెన్నాలో కలిసే విధంగా జలరవాణా మార్గంగా ఈ కాలువను వాళ్లు తవ్వించారు. రాయలసీమ రైతులకు సాగునీటి వనరుగా కూడా ఈ కాలువను ఉపయోగించాలని కాటన్ దొర అధికారులకు సూచించారు.
ఆయన సూచన అమల్లోకి రావడానికి మరికొంత కాలం పట్టింది. కాటన్ దొర ఇంకొంత కాలం భారత్‌లో ఉండి ఉంటే రాయలసీమ అవసరాల కోసం కృష్ణాజలాల తరలింపుపై ఆలోచన చేసి ఉండే వారేమో. ఆ తరువాత ఒక శతాబ్ద కాలం గడిచిన తర్వాత కూడా మన స్వతంత్ర భారత పాలకులకు అటువంటి ఆలోచన రాకపోవడం ఒక విషాదం. 1960లో శ్రీశైలం ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ నాటి ప్రధాన ఉద్దేశ్యం జలవిద్యుత్ ఉత్పత్తి మాత్రమే!
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షమందికిపైగా రైతులు తమ ఇళ్లను, వాకిళ్లను, చేనూ చెలకనూ వదిలేసుకొని చెట్టుకొకరూ పుట్టకొకరూ వలస పోయారు. అసలు సిసలైన త్యాగధనులు వారు. కానీ మనం వాళ్లకు ఆ బిరుదుల్ని ఇవ్వలేదు. వారు ఆశించలేదు. కానీ రాజధాని భూ సమీకరణ కోసం భాగస్వామ్య వ్యాపార ఒప్పందం చేసుకున్న రైతుల ‘త్యాగాలను’ మాత్రం నిత్యపారాయణం చేసుకుంటున్నాము. నాటి నిజమైన త్యాగధనుల్లో అత్యధికులు కర్నూలు జిల్లావారు. మిగిలిన వారు పాలమూరు జిల్లా వారు.
రాయలసీమకు కృష్ణా నీటిని తరలించే చిరకాల స్వప్నావిష్కరణలో తొలి కదలిక శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్ఆర్బీసీ)తో మొదలైంది. బచావత్ ట్రిబ్యునల్ పునరుత్పత్తి కింద కేటాయించిన 11 టీఎంసీలకు, కేసీ కెనాల్ ఆధునికీకరణ వల్ల మిగిలే 8 టీఎంసీలను జత చేసి. 19 టీఎంసీలతో ఉమ్మడి కర్నూల్, వైఎస్సార్ జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ఆ ప్రాజెక్టును 1981లో చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో 5,150 క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి.. కుడి కాలువ ద్వారా నీటిని తరలించి.. గోరకల్లు రిజర్వాయర్(12.44 టీఎంసీలు), అవుకు రిజర్వాయర్(4.15 టీఎంసీలు)లలో నిల్వ చేసి, ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు చేపట్టారు.
మద్రాసు నగరానికి మంచి నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను తరలించే అంశంపై పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లతో తమిళనాడు ప్రభుత్వం 1976లోనే చర్చలు ప్రారంభించింది. ఇందుకు కేంద్ర సర్కారు మధ్యవర్తిత్వం వహించింది. 1983 నాటికి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. సరిగ్గా అదే సమయానికి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు వచ్చారు. అప్పటికే డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో రాయలసీమ సాగునీటి ఉద్యమం సాగుతున్నది. ఈ ప్రభావంతో మద్రాసుకు మంచినీటి కాలువ కాస్త తెలుగుగంగగా రూపాంతరం చెందింది.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 5,150 నుంచి 11,150 క్యూసెక్కులకు పెంచి.. ఆ మేరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచి.. బనకచర్లకు తరలించే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వెలుగోడు రిజర్వాయర్ (16.95 టీఎంసీల సామర్థ్యం)కు, ఆ తరువాత తెలుగుగంగ ప్రధాన కాలువ ప్రారంభమవుతుంది. దీనిద్వారా బ్రహ్మంసాగర్ (17.74 టీఎంసీల సామర్థ్యం)కు తీసుకొని పోవాలి. అందులోంచి మళ్లీ తెలుగుగంగ ప్రధాన కాలువ నీళ్లను తీసుకొని పెన్నా నదిపై నిర్మించిన సోమశిలలో పోస్తుంది. అక్కడ నుండి మళ్లీ ప్రధాన కాలువ ద్వారా కండలేరు రిజర్వాయర్‌కు, అక్కడ నుంచి మద్రాస్‌లోని పూండి రిజర్వాయర్ వరకు తెలుగుగంగ కాలువ ప్రయాణం సాగుతుంది. ఇదీ డిజైన్.
ఒకపక్క రాయలసీమ సాగునీటి ఉద్యమ ప్రభావం, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ ప్రారంభ సంబరం, సాగునీటి శాఖలోని కొందరి ఇంజనీర్ల చొరవ, మేధావుల సూచనలతో కృష్ణాజలాలను సీమకు తరలించడం కోసం మరికొన్ని పథకాలు పురుడుపోసుకున్నాయి. అవే గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా. ఈ రెండు ప్రాజెక్టులను కూడా ఎన్టీ రామారావు ప్రకటించారు. ఎస్ఆర్బీసీ, తెలుగుగంగతో కలిపి ఈ నాలుగు ప్రాజెక్టులు కృష్ణా జలాలతో నిండితేనే రాయలసీమ సాగునీటి కష్టాలకు ఉపశమనం కలుగుతుంది. అందుకోసమే ప్రాజెక్టులను ప్రకటించారు. మూడున్నర దశాబ్దాలుగా అవి సాగుతూనే ఉన్నాయి.
ఈ కాలంలో ఏ ప్రభుత్వ హాయంలో ఎంత పని జరిగిందనే అంశంపై సత్యశోధన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు కారణం చంద్రబాబునాయుడు. ప్రతి ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి ఇది నాదే, అది నాదే అంటూ ఆయన సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. ‘మా వూరి మిరియాలు గుమ్మడికాయంత’ అని కోసేవాడికి చంద్రబాబుకు పెద్ద తేడా ఉండదని చాలా మందికి తెలుసు. తెలియని వాళ్లు కూడా ఎక్కడైనా ఉండవచ్చు. అందువల్ల సర్కారు రికార్డుల్లో ఉన్న య«థార్థాలను, క్షేత్రస్థాయి పరిశీలనను మదింపు చేసి, మరోసారి సత్యాన్ని పునః ప్రకాశింపజేయాల్సి వస్తున్నది.
సీమ నీటి కోసం జరిగిన ఉద్యమాల దగ్గర్నుంచి లెక్కవేసి, జరిగిన ప్రాజెక్టు పనులను కూడా కలిపితే దాని పరిమాణం ఒక గున్న ఏనుగంత అనుకుందాం. అప్పుడు చంద్రబాబు చేసిన పనుల వాటాను చిన్న చీమతో పోల్చవచ్చు. పెట్టిన ఖర్చులు మాత్రం చీమ సైజుకంటే అనేక రెట్లు ఎక్కువుంటాయి. ఇందుకు కారణం కాంట్రాక్టర్లకు పాత బిల్లుల చెల్లింపుల్లో ఆయన చూపే ఔదార్యం. పెరిగిన ధరవరలకు అనుగుణంగా బిల్లులను పెంచే పేరుతో ఒక జీవోనే (22) ఆయన తీసుకొచ్చారు. సదరు కాంట్రాక్టరు అధినేతకు ఇచ్చే కమీషన్‌ను బట్టి ఆ బిల్లు ‘సర్దుబాటు’ ఉంటుంది.
గట్టిగా చెప్పాలంటే రాయలసీమ నీటిపారుదలకు సంబంధించి చంద్రబాబులో ఏనాడూ ఎటువంటి తపనా లేదు. ఆయన ఆలోచించి డిజైన్ చేయించిన ఒక్క ప్రాజెక్టుగానీ, ఒక్క రిజర్వాయర్గానీ లేదు. ఉన్న కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని, ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయర్లు నింపుకోవాలన్న స్పృహ ఎప్పుడూ లేదు. రెయిన్ గన్స్‌తో కరువును జయించిన పద్ధతే ఇక్కడ కూడా! 27 టీఎంసీల సామర్థ్యం ఉన్న గండికోటలో అయిదు టీఎంసీలు చల్లి, పండుగ చేసుకోమని చెప్పడం చూశాం.
చంద్రబాబు వ్యవసాయ రంగ వ్యతిరేకి. తెలుగునాట వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారకుడు. వ్యవసాయం దండుగ అనేది ఆయన మనసులోని మాట. అందుకే ఉచిత విద్యుత్‌ను వ్యతిరేకించారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన సాగునీటిపై నిర్లక్ష్యం వహించారు. 1981లోనే ఎస్ఆర్బీసీ పనులు.. రామారావు హయాంలోనే తెలుగుగంగ కాలువ పనులు ప్రారంభమయ్యాయి.
గాలేరు–నగరి, హంద్రీ–నీవాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ తొమ్మిదేళ్లు(ఉమ్మడి రాష్ట్రంలో) ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి ఎత్తలేదు. పొలాలకు బిందెడు సాగునీరు ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతాల్లో పునాదిరాళ్లు వేయడం ఎప్పుడూ మర్చిపోలేదు.
ఈ నాలుగు సీమ ప్రాజెక్టుల పురోగతిపై ఒక్క చిన్న ఆడిట్ చాలు, చంద్రబాబు బండారం బట్టబయలు కావడానికి! నాలుగు ప్రాజెక్టుల్లో మొదటిది ఎస్ఆర్బీసీ... రెండోది తెలుగుగంగ. మూడోది గాలేరు–నగరి సుజల స్రవంతి. నాలుగోది హంద్రీ–నీవా. తుంగభద్ర–పెన్నాలను కలిపే కేసీ కెనాల్ బ్రిటీష్ కాలం నాటిది. మనకున్న సమాచారం మేరకు చంద్రబాబు ఇంకా దీన్ని తన ఖాతాలో వేసుకోలేదు. పోతిరెడ్డిపాడు దిగువ నుంచి వరద నీటిని తీసుకువెళ్లి వెలిగొండ ప్రాజెక్టును రాజశేఖర్ రెడ్డి చేపట్టారు. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని రైతులకు మేలు జరుగుతుంది.
నిజానికి ఇంత పరిశీలన కూడా అవసరం లేదు. రెండు మూడు మౌలిక విషయాలను గమనిస్తే చాలు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీదనే తెలుగుగంగ, కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. వరద ఉండే 35 రోజుల్లో ఈ ప్రాజెక్టులను నింపుకోవాలి. 11,150 క్యూసెక్కుల సామర్థ్యం ఏ మూలకూ సరిపోదు. తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుపై ఆయన ఎందుకు దృష్టి పెట్టలేదు? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచినప్పుడు తెలంగాణ, కోస్తాంధ్రలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నించారు?
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తక్కువ ఎత్తులోనే నీళ్లను గ్రహించే విధంగా పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రారంభిస్తుంటే ఇది మా రాష్ట్రానికి నష్టమని ఎందుకు చెప్పలేదు? ఎందుకు కిమ్మనలేదు? తెలంగాణ ఎత్తులకు ధీటుగా రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసిన జగన్ మోహన్ రెడ్డిని రాయలసీమ ద్రోహిగా ఎలా చిత్రించారు? ఓటుకు నోటు కేసుకు భయపడి సీమకు ద్రోహం చేసిన మీకు అలా విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది? అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలంటారు. ఇక్కడ నాలుగు మెతుకులున్నాయి. చూసి చెప్పండి. ద్రోహం చేసిందెవరో! ఇంకా వివరంగా కావాలంటే ఇక్కడ బాక్సుల్లో ప్రాజెక్టుల వారీగా ఎవరి పద్దు ఏమిటో వివరంగా ఉన్నది. పరిశీలించండి.
శ్రీశైలం పుణ్యక్షేత్రం సమీపంలో సున్నిపెంట దగ్గర కృష్ణా నదిపై డ్యామ్‌ను నిర్మించారు. ఇక్కడ నదీ గర్భం సముద్ర మట్టం కంటే 535 అడుగుల ఎత్తున ఉన్నది. అక్కడి నుంచి డ్యామ్‌ను కట్టుకొచ్చి గేట్లు బిగించారు. 885 అడుగుల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఈ రిజర్వాయర్‌కు ఉన్నది. ఇక్కడే చాలా మంది పొరబడుతుంటారు. అన్ని అడుగుల లోతు వరకు నీళ్లున్నాయని అనుకుంటారు. అడుగుల లెక్కల్లో చెప్పినా, మీటర్ల లెక్కల్లో చెప్పినా ఆ నీటి మట్టం సముద్ర మట్టం నుంచి లెక్కేసి చెప్పేదిగా భావించాలి.
ప్రాజెక్టు స్పిల్ వేకు 830 అడుగుల స్థాయి నుంచి 890 అడుగుల వరకు అంటే అరవై అడుగుల ఎత్తున అమర్చిన 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి నీటిని విడుదల చేయడానికి 854 అడుగులు కనీసం ఎత్తుగా నిర్ణయించారు. నైసర్గిక స్వరూపం వల్ల శ్రీశైలం రిజర్వాయర్ మిగిలిన వాటికి భిన్నంగా కనిపిస్తుంది. శ్రీశైలం దగ్గరి నుంచి ఎగువన తుంగభద్ర–కృష్ణల సంగమం వరకు కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ వ్యాపించి ఉన్నది. సంగమం నుంచి మైదాన ప్రాంతంలో చెరువులను తలపిస్తూ కొండల నడుమకు చేరి నిండుగా కనిపిస్తుంది.
డ్యామ్ కనిష్ట మట్టం కంటే దిగువ నుంచి 796 అడుగుల ఎత్తు నుంచే ఎడమ గట్టు జలవిద్యుత్కేంద్రం రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించే సదుపాయం తెలంగాణాకు ఉన్నది. దానికి దిగువన కుడివైపున నందికొట్కూరు ప్రాంతంలో 840 అడుగుల ఎత్తు నుంచి నీటిని తరలించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్బీసీ) కోసం మొదట ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని తరలించి బనకచర్ల క్రాస్‌కు తరలిస్తారు. ఇదో జల జంక్షన్ వంటిది.
అక్కడ్నుంచి ఎడమవైపు నుంచి తెలుగుగంగ కాలువ, కుడివైపు నుంచి ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు సంబంధించిన నీటిని, మధ్య నుంచి కేసీ కెనాల్ స్థిరీకరణ కోసం తరలిస్తారు. తెలంగాణ వైపున 802 అడుగుల నుంచి కల్వకుర్తి, 800 అడుగుల నుంచి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభించడంతో వాటా జలాలను దక్కించుకోవడం కోసం జగన్ ప్రభుత్వం 800 అడుగుల నుంచే తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్లాన్ చేసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతికి అంతకంటే దిగువ నుంచి నీటిని డ్రా చేస్తున్నారు.
సత్య శోధన
శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సారీ్బసీ)
► ఎన్టీఆర్ హయాంలో: 1981లో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులను కొనసాగించారు.
► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌తోపాటు ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు
ప్రారంభమయ్యాయి.
► చంద్రబాబు హయాంలో(1995–2004): గతంలో చేసిన పనులకే ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనంగా బిల్లు ఇచ్చి కమీషన్లు వసూలు చేసుకున్నారు. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు నత్తనడకన సాగాయి.
► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఆ మేరకు పెంచి... శ్రీశైలం కుడి గట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టారు. అవుకు రిజర్వాయర్, గోరకల్లు రిజర్వాయర్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు.
► చంద్రబాబు హయాం(2014–19)లో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. ఆ రెండు రిజర్వాయర్లలోనూ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేకపోయారు. ఒక్క ఎకరాకూ అదనంగా నీళ్లందించలేదు.
► వైఎస్ జగన్ హయాంలో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేశారు. 2019 నుంచి ఏటా రెండు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ.. పూర్తి ఆయకట్టు అంటే 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు.
గాలేరు–నగరి సుజల స్రవంతి
► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం.
► కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో: సర్వే పనులు పూర్తి.
► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం గండికోట వద్ద శంకుస్థాపన చేశారు. 1999 ఎన్నికలకు ముందు మరోసారి ఓట్ల కోసం వామికొండ వద్ద శంకుస్థాపన చేశారు. తొమ్మిదేళ్లలో రెండుసార్లు శంకుస్థాపన చేశారుగానీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు.
► వైఎస్ హయాంలో: ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచి.. అవుకు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కులను తరలించేలా గాలేరు–నగరి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్ సహా రిజర్వాయర్ల పనులు చేపట్టారు. సింహభాగం పూర్తి చేశారు. గండికోట–చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను అనుసంధానం చేస్తూ, అదనంగా ఆయకట్టుకు నీళ్లందించడం కోసం గండికోట ఎత్తిపోతలను చేపట్టి.. చాలా వరకు పూర్తి చేశారు.
► చంద్రబాబు హయాం(2014–19)లో: ధరల సర్దుబాటు(జీవో 22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు(జీవో 63)లను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. కమీషన్లు రావనే నెపంతో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా గండికోట రిజర్వాయర్‌లో ఐదారు టీఎంసీలను నిల్వ చేసి.. ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు ప్రకటించుకున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా రెండు మూడు టీఎంసీలను నిల్వ చేసి.. ఆయకట్టుకు అరకొరగా నీళ్లందించి రైతుల నోళ్లు కొట్టారు.
► వైఎస్ జగన్ హయాంలో: గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరా వాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా ఆ ప్రాజెక్టులో పూర్తి స్థాయి మేరకు అంటే 26.85 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. వామికొండ, సర్వారాయసాగర్లోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గండికోట–చిత్రావతి ఎత్తిపోతల్లో మిగిలిన పనులు పూర్తి చేశారు. రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా చిత్రావతి రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిçస్తున్నారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేదు. ఆ పనులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి.. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి మార్గం సుగమం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లో గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా.. వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టారు.
తెలుగుగంగ ప్రాజెక్టు
► ఎన్టీఆర్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 11,150 క్యూసెక్కులకు పెంచే పనులతోపాటు వెలిగోడు, బ్రహ్మం సాగర్, కండలేరు రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు.
► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులు చాలా వరకు పూర్తయ్యాయి.
► చంద్రబాబు హయాంలో: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిన మేరకు ఆ కాలువ ద్వారానే 1996లో మద్రాసుకు నీటిని సరఫరా చేశారు. 2004 నాటికి ప్రాజెక్టు పరిధిలో కేవలం 97 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లందించగలిగారు.
► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన నేపథ్యంలో.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టి, పూర్తి చేశారు. తద్వారా వెలిగోడు రిజర్వాయర్‌ను 15 రోజుల్లోనే నింపుతూ.. మిగతా రిజర్వాయర్లను నింపడానికి మార్గం సుగమం చేశారు. రిజర్వాయర్లలో మిగిలిన పనులను పూర్తి చేశారు. బ్రహ్మం
సాగర్‌లో 2004లో మొదటిసారిగా నీటిని నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. 2006లో గరిష్ఠంగా 12 టీఎంసీలను పెట్టారు. డిస్ట్రిబ్యూటరీలలో సింహభాగం పూర్తి చేసి.. ప్రాజెక్టు కింద ఏటా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించారు.
► చంద్రబాబు హయాం(2014–19)లో: ప్రధాన కాలువలు, బ్రహ్మంసాగర్ నిర్వహణను గాలికొదిలేశారు. దాంతో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్‌కు నీటిని తరలించే లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల నుంచి ఆరేడు వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. తెలుగుగంగ ప్రధాన కాలువ సామర్థ్యం 5 వేల నుంచి 2–2,500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకుండా ఏటా బ్రహ్మంసాగర్‌లో సగటున 4.69 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. ఫలితంగా వైఎస్ హయాంలో ఇచ్చిన నాలుగు లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించలేకపోయారు.
► వైఎస్ జగన్ హయాంలో: లింక్ కెనాల్తోపాటు తెలుగుగంగ ప్రధాన కాలువలకు రూ.600 కోట్లు వెచ్చించి, యుద్ధప్రాతిపదికన లైనింగ్ చేయించారు. తద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపడానికి మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.వంద కోట్లతో డయాఫ్రమ్‌వాల్ వేసి.. లీకేజీలకు అడ్డకట్ట వేసి.. పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడానికి లైన్ క్లియర్ చేశారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే.. ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ రిజర్వాయర్లను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఆ మేరకు ప్రవాహ సామర్థ్యం పెంచేలా ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు.
హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం
► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం.
► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: సర్వే పనులు పూర్తి.
► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1999 ఎన్నికల నేపథ్యంలో 1998లో అనంతపురం జిల్లాలోనే ఆత్మకూరు వద్ద 40 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాల్సిన సాగునీటి ప్రాజెక్టును 5.5 టీఎంసీలకు కుదించి, తాగునీటి పథకంగా చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ తొమ్మిదేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు.
► వైఎస్ హయాంలో: శ్రీశైలం ప్రాజెక్టులో సముద్రమట్టానికి 834 అడుగుల ఎత్తు నుంచి 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి.. తొలి దశలో 216 కి.మీ.ల ప్రధాన కాలువ పనులు.. ఎనిమిది దశల్లో ఎత్తిపోతల పనులు.. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ పనులను చేపట్టి, పూర్తి చేశారు. దాంతో 2012 నాటికే కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్‌ను నింపారు. రెండో దశలో ప్రధాన కాలువతోపాటు తొమ్మిది దశల్లో ఎత్తిపోతలు.. గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు చేపట్టి పనులను ఓ కొలిక్కి తెచ్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 800 మీటర్లకు తగ్గినా.. హంద్రీ–నీవాకు నీటి కొరత లేకుండా చేయాలనే లక్ష్యంతో ముచ్చుమర్రి ఎత్తిపోతలను చేపట్టి సింహభాగం పూర్తి చేశారు.
► చంద్రబాబు హయాంలో(2014–19): కాంట్రాక్టర్లకు జీవో 22, జీవో 63లను వర్తింపజేసి.. అదనంగా బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో అరకొరగా మిగిలిన పనులను చేసి.. ఆ రిజర్వాయర్‌కు నీటిని తీసుకెళ్లడం వల్లే పెనుకొండకు సమీపంలో కియా కార్ల పరిశ్రమ వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్ హయాంలో పూర్తయిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను జాతికి అంకితం చేసి.. దాన్ని తానే పూర్తి చేసినట్లు చంద్రబాబు కోటలు దాటేలా మాట్లాడారు.
ఐదేళ్లలో సగటున ఏడాదికి 26.62 టీఎంసీలను మాత్రమే తరలించి.. రైతులకు అన్యాయం చేశారు. చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమేష్‌కు కట్టబెట్టి.. మట్టి పనులను చేయించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారుగానీ కుప్పం నియోజకవర్గానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు.
► వైఎస్ జగన్ హయాంలో: అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో.. వరద రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు. రెండో దశలో మిగిలిన పనులు పూర్తి చేయడంతోపాటు.. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ఈ ఏడాదే పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గ ప్రజలకు కృష్ణా జలాలను అందించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏటా సగటున 39.50 టీఎంసీలు.. అంటే ప్రస్తుత డిజైన్ సామర్థ్యం మేరకు నీటిని తరలించి రైతులకు న్యాయం చేశారు.
వర్ధెల్లి మురళి