రెండో సొరంగాన్ని పరిశీలిస్తున్న జలవనరుల శాఖ అధికారులు
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం వరద కాలువలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం(టన్నెల్)లో మిగిలిన పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. దాంతో ప్రస్తుత డిజైన్ మేరకు వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి లైన్ క్లియర్ అయ్యింది. శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గాలేరు–నగరి వరద కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్‌ను నింపడానికి మార్గం సుగమమైంది.
ఇది దుర్భిక్ష రాయలసీమలో సాగునీటి సౌకర్యాలను మరింత మెరుగు పరచడానికి దోహదం చేస్తుందని నీటి పారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి.. ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగు నీరు, 640 గ్రామాల్లోని 20 లక్షల మందికి తాగు నీరు అందించాలనే లక్ష్యంతో 2005లో నాటి సీఎం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు.
గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీల పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా 5.7 కి.మీల పొడవున సొరంగం (అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో ఒక్కొక్కటి 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు సొరంగాలు) తవ్వకం పనులు చేపట్టారు. మహానేత హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో అధిక శాతం పనులు పూర్తయ్యాయి.
మిగిలిన పనులు పూర్తి చేయలేని టీడీపీ సర్కార్
అవుకు సొరంగాలలో ఒక్కో సొరంగంలో 165 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు పెలుసుగా ఉండటం వల్ల కూలిపోవడం)లో పనులు చేయాలి. వాటిని చేయలేని టీడీపీ సర్కార్.. ఒక సొరంగంలో 165 మీటర్ల పొడవున సొరంగానికి ప్రత్యామ్నాయంగా కాలువ తవ్వి.. దాన్ని వరద కాలువతో అనుసంధానం చేసింది. దీని వల్ల పది వేల క్యూసెక్కులను మాత్రమే తరలించవచ్చు.
గండికోట రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించక పోవడం వల్ల 26.85 టీఎంసీలకుగాను నాలుగైదు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కార్ నిల్వ చేయగలిగింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోనూ నిర్వాసితులకు పునరవాసం కల్పించపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ 4 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగింది.
పైడిపాలెం రిజర్వాయర్‌లో 6 టీఎంసీలకుగానూ ఒక టీఎంసీ నిల్వ చేసింది. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు ఏర్పడిన లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేసేవారు.
పూర్తయిన అవుకు సొరంగాన్ని అధికారులతో కలిసి పరిశీలిస్తున్న ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి
రాయలసీమ సస్యశ్యామలమే లక్ష్యంగా..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌లో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడాన్ని, బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేసే పనులను ప్రాధాన్యతగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సుమారు రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా గండికోట రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వ చేశారు. రూ.250 కోట్లు వ్యయం చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పది టీఎంసీలకుగాను పది టీఎంసీలు, పైడిపాలెం రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 6 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.
ఆయకట్టుకు పూర్తి స్తాయిలో నీటిని అందిస్తున్నారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీలు ఉన్న ప్రాంతంలో రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ వేసి.. వాటికి అడ్డుకట్ట వేశారు. తద్వారా 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు.
మరో అడుగు ముందుకు..
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో రెండో సొరంగం(టన్నెల్)లో ఫాల్ట్ జోన్(కూలిన ప్రాంతం)లో 160 మీటర్ల తవ్వకం పనులను అధికారులు అత్యంత ప్రాధాన్యతగా చేపట్టారు. అత్యాధునిక పోలింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో పాలీయురిథేన్ యురెథేన్ ఫోమ్ గ్రౌటింగ్ చేస్తూ ఫాల్ట్ జోన్‌లో సొరంగం తవ్వకం పనులను రెండ్రోజుల క్రితం పూర్తి చేశారు.
ఫాల్ట్ జోన్‌లో సొరంగానికి 165 మీటర్ల మేర సిమెంట్ కాంక్రీట్‌తో లైనింగ్ చేయాల్సి ఉండగా ఇప్పటికే 134 మీటర్లు పూర్తి చేశారు. నెలాఖరుకు మిగతా 131 మీటర్ల లైనింగ్ పనులు పూర్తవుతాయి.
ఇప్పటికే పూర్తయిన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులకు తోడుగా ప్రస్తుతం పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి సుజల స్రవంతి వరద కాలువ ద్వారా తరలించడానికి మార్గం సుగమం చేశారు. ఇది ఆయకట్టుకు మరింత మెరుగ్గా నీళ్లందించడానికి దోహదం చేస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
సుసాధ్యం చేశాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అవుకు రెండో సొరంగంలో ఫాల్ట్ జోన్‌లో 160 మీటర్ల తవ్వకం పనులు పూర్తి చేయడాన్ని సవాల్‌గా తీసుకున్నాం. హిమాలయాల్లో సొరంగాలు తవ్వే నిపుణులను రప్పించి.. అత్యాధునిక సాంకేతిక పరి/ê్ఞనంతో సొరంగాన్ని పూర్తి చేయించాం. దాంతో ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి కాలువ ద్వారా తరలించవచ్చు. ఆయకట్టుకు నీళ్లందించవచ్చు.
– శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి జలవనరుల శాఖ
సామర్థ్యం పెంచే పనుల్లో వేగం పెంచాం
అసాధ్యమనుకున్న అవుకు రెండో టన్నెల్ తవ్వకం పనులు పూర్తి చేశాం. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గాలేరు–నగరి కాలువ సామర్థ్యం 30 వేల క్యూసెక్కులకు పెంచడంలో భాగంగా అవుకు వద్ద మూడో టన్నెల్ తవ్వకం పనులు చేపట్టాం. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తాం. అప్పుడు గాలేరు–నగరి ద్వారా 30 వేల క్యూసెక్కులు తరలించవచ్చు. శ్రీశైలానికి వరద వచ్చే పది రోజుల్లోనే గండికోట రిజర్వాయర్‌ను నింపి, ఆయకట్టుకు నీళ్లందివచ్చు.
– సి.నారాయణరెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్, జల వనరుల శాఖ
Comments
Please login to add a commentAdd a comment