avuku project
-
సొరంగాలు దాటిన 'కృష్ణా తరంగం'
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సొరంగాలు దాటుతూ.. సుడులు తిరుగుతూ పరవళ్లతో కృష్ణమ్మ ‘సీమ’ను ముద్దాడిన సుందర ఘట్టం సాక్షాత్కారమైంది. పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను గురువారం రోజు ఘనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పాయలుగా చీలి రెండు టన్నెళ్ల ద్వారా దిగువకు వేగంగా ప్రవహిస్తున్న దృశ్యాన్ని సీఎం సంతోషంతో కొద్దిసేపు అలాగే చూస్తుండిపోయారు. ఈ నీటితో రాయలసీమ సస్యశ్యామలం కానుందనే ఆనందం ముఖ్యమంత్రి ముఖంలో స్పష్టంగా కనిపించింది. చిరునవ్వుతో నీటిపారుదల శాఖ అధికారులను అభినందించిన సీఎం జగన్ ప్రజాప్రతినిధులను ఆత్మీయంగా పలకరించారు. ఈ టన్నెల్ ద్వారా గోరుకల్లు నుంచి అవుకు రిజర్వాయర్‌కు 20 వేల క్యూసెక్కుల జలాలు పరవళ్లు తొక్కనున్నాయి. టన్నెల్‌ను ప్రారంభించేందుకు విజయవాడ నుంచి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి చేరుకున్న సీఎం జగన్ తొలుత ఎగ్జిబిషన్‌ను తిలకించారు. నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇతర అధికారులు టన్నెల్ ముఖ్యాంశాలను వివరించారు. అనంతరం సీఎం జగన్ అక్కడి నుంచి వేదమంత్రాల మధ్య టన్నెల్ వద్దకు చేరుకుని నీటిని దిగువకు విడుదల చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. టన్నెల్ ప్రారంభించిన తర్వాత వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలను కలిసి ఆత్మీయంగా పలకరించారు. అవుకు టన్నెల్2 శిలాఫలకం వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులు వన్నె తెచ్చిన టన్నెల్! గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా అవుకు సొరంగాల పనులకు శ్రీకారం చుట్టిన దివంగత వైఎస్సార్ రూ.340.53 కోట్లు వెచ్చించి ఆయన హయాంలోనే సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. మేర పనులను పూర్తి చేయడం గమనార్హం. మూడు టన్నెళ్లతో పాటు ఇతర అనుబంధ పనులకు కలిపి ఇప్పటి వరకు మొత్తం రూ.1,501.94 కోట్లు వ్యయం చేశారు. ఎస్ఆర్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ) కింద 1.5 లక్షల ఎకరాలకు సాగు నీటి సరఫరాతోపాటు గాలేరు నగరి సుజల స్రవంతి పథకం కింద గండికోట, వామికొండ, సర్వరాయసాగర్, మైలవరం, పైడిపాలెం తదితర రిజర్వాయర్లకు రోజుకు ఒక టీఎంసీ చొప్పున అదనంగా నీరు అందించే వెసులుబాటు ఉంది. అవుకు రెండో టన్నెల్ ముఖ్యాంశాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేగంగా ఒడిసిపట్టేలా.. గోరుకల్లు నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 60 కి.మీ. పొడవున వరద కాలువతో పాటు టన్నెళ్ల పనులు అన్ని అవాంతరాలను అధిగమించి విజయవంతంగా పూర్తయ్యాయి. ఫాల్ట్ జోన్లో 180 మీటర్ల సొరంగం నిర్మాణంతో పాటు లైనింగ్ పనులు కూడా పూర్తి చేశారు. కుడి, ఎడమ టన్నెల్లో సిమెంట్, కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. తద్వారా దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ తాగు, సాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటిని వినియోగించవచ్చు. శ్రీశైలంలో 875 అడుగులు మించితే గానీ మనకు కేటాయించిన పూర్తి నీటిని తీసుకోలేని పరిస్థితి నెలకొంది. సీఎం జగన్ దీన్ని చక్కదిద్దుతూ ఓవైపు కాలువల సామర్థ్యం పెంచుతూనే మరోవైపు 797 అడుగుల నుంచే నీటిని తీసుకునేలా, ప్రాజెక్టులు వేగంగా నిండేలా రోజుకు 3 టీఎంసీల జలాలను కరువు ప్రాంతాలకు తరలించి దుర్భిక్ష ప్రాంతాలకు న్యాయం చేసేందుకు చురుగ్గా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తలపెట్టారు. తుది దశలో అవుకు టన్నెల్–3 కృష్ణాలో వరద ప్రవాహం రోజులు తగ్గిపోతున్నాయి. దీంతో శ్రీశైలానికి వరద నీరు వచ్చినప్పుడే ఒడిసి పట్టుకుని నిల్వ చేసుకోవాలి. రోజూ 20 వేల క్యూసెక్కులను తరలిస్తే రిజర్వాయర్లను నింపే వీలుంటుంది. గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 15 రోజుల్లోనే గండికోట రిజర్వాయర్‌ను నింపవచ్చు. సీమను సస్యశ్యామలం చేయవచ్చు. ఈ క్రమంలో 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో చేపట్టిన అవుకు మూడో టన్నెల్, డిస్ట్రిబ్యూటరీ పనులు కూడా పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. రూ.1,297.78 కోట్ల వ్యయంతో చేపట్టిన మూడో టన్నెల్ పనుల్లో ఇప్పటికే రూ.934 కోట్ల విలువైనవి విజయవంతంగా పూర్తయ్యాయి. వచ్చే ఏడాది రెండో త్రైమాసికానికి ఇవి కూడా పూర్తి కానున్నాయి. దీంతో మొత్తం 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించవచ్చు. హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు అవుకు టన్నెల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఇసాక్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. కరువు సీమ దాహార్తి తీర్చేలా ► రూ.253 కోట్లతో లక్కసాగరం వద్ద హెచ్ఎన్ఎస్ఎస్ పంప్ హౌస్‌ను ఇప్పటికే పూర్తి చేసిన సీఎం జగన్ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చెరువులకు సాగునీటిని అందించి 10వేల ఎకరాలకు పైగా సస్యశ్యామలం చేశారు. ► గత సర్కారు నిర్లక్ష్యం చేసిన బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ లీకేజి సమస్యను ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ద్వారా అరికట్టడంతో పూర్తి సామర్థ్యం మేరకు 17 టీఎంసీల నీరు నింపుతున్నారు. ► ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్ కలిపి సామర్థ్యం 30 వేల క్యూసెక్కులకు పెంచేలా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ► కుందూ నది, నిప్పులవాగు సామర్థ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచి సోమశిలకు నీటిని సరఫరా చేయనున్నారు. ► పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు కాలువల వెడల్పు, లైనింగ్ పనులు, టన్నెళ్లు వేగంగా నిర్మించడం ద్వారా గోరుకల్లు, అవుకు రిజర్వాయర్ల ద్వారా తక్కువ సమయంలో సరిపడా నీటిని తీసుకునేలా చర్యలు చేపట్టారు. రూ.600 కోట్ల వ్యయంతో తెలుగు గంగ లింక్ కెనాల్ ప్రవాహ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు విస్తరించారు. -
సీమ ప్రజలకు వరం అవుకు రెండో టన్నెల్ రెడీ
-
అవుకు రిజర్వాయర్ వద్ద రెండో టన్నెల్ రెడీ
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం వరద కాలువలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం(టన్నెల్)లో మిగిలిన పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. దాంతో ప్రస్తుత డిజైన్ మేరకు వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి లైన్ క్లియర్ అయ్యింది. శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గాలేరు–నగరి వరద కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్‌ను నింపడానికి మార్గం సుగమమైంది. ఇది దుర్భిక్ష రాయలసీమలో సాగునీటి సౌకర్యాలను మరింత మెరుగు పరచడానికి దోహదం చేస్తుందని నీటి పారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి.. ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగు నీరు, 640 గ్రామాల్లోని 20 లక్షల మందికి తాగు నీరు అందించాలనే లక్ష్యంతో 2005లో నాటి సీఎం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీల పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా 5.7 కి.మీల పొడవున సొరంగం (అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో ఒక్కొక్కటి 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు సొరంగాలు) తవ్వకం పనులు చేపట్టారు. మహానేత హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో అధిక శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేయలేని టీడీపీ సర్కార్ అవుకు సొరంగాలలో ఒక్కో సొరంగంలో 165 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు పెలుసుగా ఉండటం వల్ల కూలిపోవడం)లో పనులు చేయాలి. వాటిని చేయలేని టీడీపీ సర్కార్.. ఒక సొరంగంలో 165 మీటర్ల పొడవున సొరంగానికి ప్రత్యామ్నాయంగా కాలువ తవ్వి.. దాన్ని వరద కాలువతో అనుసంధానం చేసింది. దీని వల్ల పది వేల క్యూసెక్కులను మాత్రమే తరలించవచ్చు. గండికోట రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించక పోవడం వల్ల 26.85 టీఎంసీలకుగాను నాలుగైదు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కార్ నిల్వ చేయగలిగింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోనూ నిర్వాసితులకు పునరవాసం కల్పించపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ 4 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగింది. పైడిపాలెం రిజర్వాయర్‌లో 6 టీఎంసీలకుగానూ ఒక టీఎంసీ నిల్వ చేసింది. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు ఏర్పడిన లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేసేవారు. పూర్తయిన అవుకు సొరంగాన్ని అధికారులతో కలిసి పరిశీలిస్తున్న ఈఎన్సీ సి.నారాయణరెడ్డి రాయలసీమ సస్యశ్యామలమే లక్ష్యంగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్లో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడాన్ని, బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేసే పనులను ప్రాధాన్యతగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సుమారు రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా గండికోట రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వ చేశారు. రూ.250 కోట్లు వ్యయం చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పది టీఎంసీలకుగాను పది టీఎంసీలు, పైడిపాలెం రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 6 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ఆయకట్టుకు పూర్తి స్తాయిలో నీటిని అందిస్తున్నారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీలు ఉన్న ప్రాంతంలో రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ వేసి.. వాటికి అడ్డుకట్ట వేశారు. తద్వారా 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. మరో అడుగు ముందుకు.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో రెండో సొరంగం(టన్నెల్)లో ఫాల్ట్ జోన్(కూలిన ప్రాంతం)లో 160 మీటర్ల తవ్వకం పనులను అధికారులు అత్యంత ప్రాధాన్యతగా చేపట్టారు. అత్యాధునిక పోలింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో పాలీయురిథేన్ యురెథేన్ ఫోమ్ గ్రౌటింగ్ చేస్తూ ఫాల్ట్ జోన్లో సొరంగం తవ్వకం పనులను రెండ్రోజుల క్రితం పూర్తి చేశారు. ఫాల్ట్ జోన్లో సొరంగానికి 165 మీటర్ల మేర సిమెంట్ కాంక్రీట్‌తో లైనింగ్ చేయాల్సి ఉండగా ఇప్పటికే 134 మీటర్లు పూర్తి చేశారు. నెలాఖరుకు మిగతా 131 మీటర్ల లైనింగ్ పనులు పూర్తవుతాయి. ఇప్పటికే పూర్తయిన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులకు తోడుగా ప్రస్తుతం పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి సుజల స్రవంతి వరద కాలువ ద్వారా తరలించడానికి మార్గం సుగమం చేశారు. ఇది ఆయకట్టుకు మరింత మెరుగ్గా నీళ్లందించడానికి దోహదం చేస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సుసాధ్యం చేశాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అవుకు రెండో సొరంగంలో ఫాల్ట్ జోన్లో 160 మీటర్ల తవ్వకం పనులు పూర్తి చేయడాన్ని సవాల్‌గా తీసుకున్నాం. హిమాలయాల్లో సొరంగాలు తవ్వే నిపుణులను రప్పించి.. అత్యాధునిక సాంకేతిక పరి/ê్ఞనంతో సొరంగాన్ని పూర్తి చేయించాం. దాంతో ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి కాలువ ద్వారా తరలించవచ్చు. ఆయకట్టుకు నీళ్లందించవచ్చు. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి జలవనరుల శాఖ సామర్థ్యం పెంచే పనుల్లో వేగం పెంచాం అసాధ్యమనుకున్న అవుకు రెండో టన్నెల్ తవ్వకం పనులు పూర్తి చేశాం. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గాలేరు–నగరి కాలువ సామర్థ్యం 30 వేల క్యూసెక్కులకు పెంచడంలో భాగంగా అవుకు వద్ద మూడో టన్నెల్ తవ్వకం పనులు చేపట్టాం. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తాం. అప్పుడు గాలేరు–నగరి ద్వారా 30 వేల క్యూసెక్కులు తరలించవచ్చు. శ్రీశైలానికి వరద వచ్చే పది రోజుల్లోనే గండికోట రిజర్వాయర్‌ను నింపి, ఆయకట్టుకు నీళ్లందివచ్చు. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్, జల వనరుల శాఖ -
అవుకు సొరంగం పనులు కొలిక్కి..
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి మరో తార్కాణమిది. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్ (బలహీనమైన మట్టి పొరలు) వల్ల తవ్వలేకపోతున్నామని గత ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇప్పుడు ఆ సొరంగాన్ని హిమాలయ పర్వతాల్లో సొరంగాల తవ్వకానికి వినియోగిస్తున్న అత్యాధునిక పోర్ ఫిల్లింగ్ టెక్నాలజీతో ప్రభుత్వం తవ్వుతోంది. ఈ పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. ఆగస్టు నాటికి 1,038 మీటర్ల పొడవున్న సొరంగాన్ని లైనింగ్‌తో సహా పూర్తి చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించి.. 2.60 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే దిశగా జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీలను తరలించి వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, ఐదు లక్షల మంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్సార్ గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు చేపట్టారు. చేతులెత్తేసిన గత టీడీపీ సర్కార్ శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్ఎంసీ) నుంచి రోజుకు 20 వేల క్యూసెక్కులు తరలించేలా కాలువ తవ్వే క్రమంలో అవుకు వద్ద 6 కి.మీ. పొడవున జంట సొరంగాల(ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యం)ను తవ్వాలి. ఇందులో ఒకటో సొరంగాన్ని 5.835 కి.మీ. పొడవున.. రెండో సొరంగాన్ని 4.962 కి.మీ. మేర తవ్వకం పనులు 2009 నాటికే పూర్తయ్యాయి. మొదటి సొరంగంలో 165 మీటర్ల మేర మాత్రమే పనులు మిగిలాయి. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ఒకటో సొరంగంలో మిగిలిన 165 మీటర్ల పనులను ఫాల్ట్ జోన్ సాకు చూపి పూర్తి చేయలేక చేతులెత్తేసింది. చివరకు ఫాల్ట్ జోన్లో సొరంగం తవ్వకుండా.. పక్క నుంచి కాలువ(లూప్) తవ్వి చేతులు దులుపుకుంది. అవుకు రెండో సొరంగం పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో సొరంగం తవ్వకం పనులు వేగవంతమయ్యాయి. రెండో సొరంగంలో మిగిలిన 1,038 మీటర్లలో ఇప్పటికే 615 మీటర్ల మేర పనులు పూర్తి చేశారు. ఫాల్ట్ జోన్లో 165 మీటర్ల పనులు చేసేందుకు ‘పోర్ ఫిల్లింగ్’ను ఉపయోగిస్తున్నారు. ఇందుకు హిమాచల్ నుంచి నిపుణులను రప్పించారు. -
పెదబాబు డైరెక్షన్లో చినబాబు యాక్షన్
సాగునీటిలో అవినీతి సునామీ! అధికారులపై కీలకమంత్రి వత్తిళ్లు అదనపు చెల్లింపులు.. అందులో వాటాలు.. నాలుగు ప్రాజెక్టుల్లో రూ. 748 కోట్ల లూటీ ఏవో కుంటిసాకులు చూపించడం.. జరుగుతున్న పనులను ఆపేయడం.. కాంట్రాక్టులు రద్దు చేయడం.. ఆ తర్వాత అవే కాంట్రాక్టు పనుల అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేయడం.. ఆ కాంట్రాక్టులను సొంత మనుషులకు కట్టబెట్టడం.. యథేచ్ఛగా ప్రజా ధనాన్ని లూటీ చేయడం... ఇదీ సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి. పెదబాబు డైరెక్షన్లో, చినబాబు నాయకత్వంలో... కాంట్రాక్టర్ల ముసుగులో ఉన్న అధికార పార్టీ ఎంపీలు, బినామీ కాంట్రాక్టర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. వాటాలు పంచుకు తింటున్నారు. ఇరిగేషన్లో అవినీతిని ఏరులుగా పారిస్తున్నారు. పెదబాబు, చినబాబు, వీరికి తోడైన మంత్రి అవినీతి లీలలకు సాగునీటి శాఖ అధికారులు నివ్వెరపోతున్నారు. అవినీతి కోసం వేసిన సరికొత్త బాటలు చూసి అవాక్కవుతున్నారు. ఇరిగేషన్లో ‘బాబు’ల అవినీతి వ్యవహారాలకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. రూ. 748 కోట్లు లూటీ చేసిన ఓ నాలుగు ప్రాజెక్టులను పరిశీలిద్దాం.. ‘ఘోర’కల్లులో రూ.350 కోట్లు ఓ ప్రాజెక్టు పనులు 92 శాతం పూర్తయ్యాయి. బిల్లులూ చెల్లించేశారు. మిగిలిన 8 శాతం పనులకు ఎంత ఖర్చవుతుంది? ఖర్చులు పెరిగాయనుకున్నా ఎంత ఉండవచ్చు. మహా అయితే మిగిలిన బిల్లు రెట్టింపు.. కానీ 92 శాతం పనులకు ఎంత చెల్లించారో మిగిలిన 8 శాతం పనులకు అంత చెల్లించబోతున్నారు. ఆ మేరకు అంచనా వ్యయం పెంచేసి పంచుకోబోతున్నారు. ఆ కథేమిటో చూద్దామా... ప్రాజెక్టు వివరాలివీ: గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా శ్రీశైలం కుడి ప్రధాన కాలువ(ఎస్ఆర్బీసీ) 56.77 కి.మీల వద్ద 12.44 టీఎంసీల సామర్థ్యంతో కర్నూల్ జిల్లాలోని గోరకల్లులో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. శ్రీశైలం జలాశయానికి వరద వచ్చినప్పుడు ఎస్ఆర్బీసీ ద్వారా తరలించి, గోరకల్లు రిజర్వాయర్‌లో నిల్వ చేసి గాలేరు-నగరి సుజల స్రవంతి ఆయకట్టుకు నీళ్లందించడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించింది. ఈ రిజర్వాయర్ పనులకు 2005లో టెండర్ పిలిచారు. సాబీర్-షూ-ప్రసాద్(జాయింట్ వెంచర్) సంస్థ 14.33 శాతం తక్కువ ధరకు కోట్ చేసి.. రూ.448.20 కోట్లకు పనులను చేజిక్కించుకుంది. ఈ జాయింట్ వెంచర్లో సింహభాగం వాటా టీడీపీ మాజీ మంత్రికి చెందిన సాబీర్ సంస్థదే కావడం గమనార్హం. ఇప్పటికే 92 శాతం పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ రూ.428 కోట్లను బిల్లుల రూపంలో పొందారు. మరో రూ.20.20 కోట్ల విలువైన 8 శాతం పనులు మాత్రమే చేయాల్సి ఉంది. అవినీతి స్కెచ్ ఇలా గోరకల్లు ప్రాజెక్టులో తట్టెడు మట్టెత్తకుండానే రూ.350 కోట్లు కొట్టేసేందుకు ‘మాస్టర్’ప్లాన్ వేశారు. పెదబాబు డెరైక్షన్‌లో కీలక మంత్రి చక్రం తిప్పారు. అధికారపార్టీకి చెందిన మాజీ మంత్రి అయిన కాంట్రాక్టర్‌తో కలసి మాస్టర్‌ప్లాన్ అమలుకు పూనుకున్నారు. జలాశయంలోకి నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడాన్ని సాకుగా చూపి అంచనా వ్యయాన్ని రూ.448.20 కోట్ల నుంచి రూ.840.34 కోట్లకు పెంచేశారు. అదనపు పని విలువ రూ.42.17 కోట్లకు మించదని జలవనరుల శాఖ అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. తక్కిన రూ.350 కోట్లను కాంట్రాక్టర్‌తో కలసి పెదబాబు దోచుకోవడానికి రంగం సిద్ధం చేశారు. పులిచింతలలో రూ. 300 కోట్లు ప్రాజెక్టు పూర్తి చేయకుండా కాంట్రాక్టరే జాప్యం చేశాడు. ధరలు పెరిగాయి కాబట్టి అదనంగా చెల్లించాలన్నాడు. జిల్లా కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కోర్టు చెప్పినదానికన్నా ఇంకా అదనంగా తనకు డబ్బురావాల్సి ఉందని కాంట్రాక్టరు వాదిస్తున్నాడు. పై న్యాయస్థానానికి వెళ్లి ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రయత్నించాల్సిన రాష్ర్టప్రభుత్వం కాంట్రాక్టరుకు అదనంగా చెల్లించడానికి సిద్ధమౌతోంది. ఇదీ ప్రాజెక్టు కృష్ణా డెల్టాలో 12.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించాలన్న లక్ష్యంతో కృష్ణా నదిపై నాగార్జునసాగర్‌కు 121 కి.మీల దిగువన.. ప్రకాశం బ్యారేజీకి 83 కి.మీల ఎగువన పులిచింతల ప్రాజెక్టుకు అక్టోబర్ 15, 2004న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.268.87 కోట్లతో చేపట్టిన పులిచింతల హెడ్ వర్క్స్ పనులను టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ సంస్థ చేజిక్కించుకుంది. టెండర్ ఒప్పందం ప్రకారం పనులను మార్చి 31, 2007 నాటికే పూర్తి చేయాలి. అప్పట్లో ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినా పనులను పూర్తిచేయడంలో కాంట్రాక్టు సంస్థ తీవ్ర జాప్యం చేసింది. ఒకానొక దశలో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవడంతో పనుల్లో కొంత కదలిక వచ్చింది. భారీ దోపిడీకి స్కెచ్ ఇలా పెదబాబు వ్యూహం మేరకు .. 2014 నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.300 కోట్లు చెల్లించాలంటూ పులిచింతల కాంట్రాక్టర్ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌కు లేఖ రాశారు. అదనంగా రూ.300 కోట్లు ఇవ్వాలంటూ కాంట్రాక్టర్ అలా లేఖ రాశారో లేదో పెదబాబు సూచనల మేరకు మంత్రి ఇలా స్పందించారు. కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం తరఫున హైకోర్టును ఆశ్రయించాల్సిన మంత్రి తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. యాసిడ్ దాడి బాధితురాలికి అదనపు పరిహారం చెల్లించకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిన చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టరుకు మాత్రం అదనంగా చెల్లించడానికి ఉత్సాహపడుతోంది. పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు తక్షణమే రూ.300 కోట్లు చెల్లించాలంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారు. పులిచింతల కాంట్రాక్టర్‌తో ఆది నుంచి ఉన్న సంబంధాలు.. పెదబాబు డెరైక్షన్‌లో వాటాలు పంచుకోవడానికి ఒప్పందం కుదరడం వల్లే మంత్రి ఒత్తిడి తెస్తున్నారంటూ జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు ‘సాక్షి’తో ధృవీకరించడం గమనార్హం. హంద్రీ-నీవాలో రూ. 54 కోట్లు నచ్చినవారి కోసం ‘జరుగుతున్న పనులు’ రద్దు చేశారు. అంచనా వ్యయం పెంచి నిబంధనలకు విరుద్ధంగా అప్పగించారు. మూడొంతుల పనులకు బిల్లులూ చెల్లించేశారు. ఈ దశలో ఆ కాంట్రాక్టరును తప్పించి మరో బినామీ కాంట్రాక్టరును తెరపైకి తెచ్చారు. ఒక వంతు పనికి గాను ప్రాజెక్టు వ్యయానికన్నా రెట్టింపునకు పెంచేశారు. పెంచిన మొత్తాన్ని పంచుకోవడానికి పథకమేశారు. అదేమిటో మీరే చూడండి... ప్రాజెక్టు వివరాలివీ హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి రాయలసీమలో 4.04 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హంద్రీ-నీవా ప్రధాన కాలువ సమీపంలో చిత్తూరు జిల్లా కేవీ పల్లె మండలం అడవిపల్లె వద్ద 1.089 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ రిజర్వాయర్‌కు నీళ్లందాలంటే చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలోని గొల్లపల్లె నుంచి వైఎస్సార్ కడపజిల్లా చిన్నమండ్యం మండలంలో కోటగడ్డకాలనీ వరకు 4.54 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాలి. 4.54 కిమీల సొరంగం పనులతోపాటూ 1.1 కిమీల ప్రధాన కాలువ తవ్వకం పనులను 20వ ప్యాకేజీ కింద రూ.45.57 కోట్లకు ఏకేఆర్ కోస్టల్ అనే సంస్థ తొలుత చేజిక్కించుకుంది. ప్రధాన కాలువ 1.1 కిమీల తవ్వకం పనులను పూర్తి చేసిన ఆ సంస్థ.. 800 మీటర్ల మేర సొరంగం పనులనూ పూర్తి చేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.18.97 కోట్లను బిల్లుల రూపంలో చెల్లించారు. దోపిడీకి స్కెచ్ ఇలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సొంత పార్టీ నేతలకు పనులు కట్టబెట్టి.. నిధులు దోచిపెట్టడానికి పెదబాబు ఎత్తులు వేశారు. ఆ క్రమంలోనే పనులు చేయడం లేదనే సాకు చూపి సొరంగం పనులను రద్దు చేసి, ఏకేఆర్ కోస్టల్ సంస్థ చేయగా మిగిలిన పనులను అంటే 3.74 కిమీల సొరంగం పనులను రూ.28.6 కోట్లకు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే కన్స్ట్రక్షన్స్ సంస్థకు ఏకంగా ‘నామినేషన్’పై అప్పగించేశారు.రూ.పది లక్షల విలువైన పనులను మాత్రమే నామినేషన్‌పై అప్పగించవచ్చు. అంటే.. సొంత పార్టీ నేతకు పనులు కట్టబెట్టడానికి నిబంధనలు తుంగలో తొక్కారన్నమాట. ఆర్కే కన్స్ట్రక్షన్స్ సంస్థ 300 మీటర్ల పనులను మాత్రమే చేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.11.88 కోట్లు బిల్లులు చెల్లించారు. తక్కిన రూ.16.77 కోట్ల విలువైన పనులను రద్దు చేసి.. అంచనాలు పెంచేసి మరో బినామీ కాంట్రాక్టర్‌కు అప్పగించి..దోపిడీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆమేరకు అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.70.82 కోట్లకు పెంచేసి టెండర్లు పిలిచారు. అంటే రూ. 54 కోట్ల మేర కాజేయడానికి రంగం సిద్ధం చేశారన్నమాట. అవుకులో రూ.44 కోట్ల లూటీ వాటాల వ్యవహారంలో తేడాలు రావడంతో రెండు ప్రాజెక్టులలో అదనపు దోపిడీ గురించి బైటపడింది. ఓ ఎంపీ, మంత్రి ఒకరి విషయం మరొకరు బైటపెట్టుకున్న ఉదంతమిది. ధరలేవీ పెరగకపోయినా కుంటిసాకులు చెప్పి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. ఇద్దరికీ పెదబాబు రాజీ కుదర్చడంతో ఆ అదనపు బిల్లులను ప్రభుత్వం చెల్లించేసింది. ఈ వివరాలేమిటో చూద్దామా..? ప్రాజెక్టు వివరాలివీ గాలేరు - నగరి సుజల స్రవంతి పథకం (జీఎన్ఎస్ఎస్)లో భాగంగా అవుకు సొరంగం పనులు చేపట్టారు. జీఎన్ఎస్ఎస్ వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్‌కు తరలించడానికి వీలుగా అవుకు టన్నెల్ -2 తవ్వకం పనుల (30వ ప్యాకేజీ) ని రూ. 401 కోట్లకు ఎన్సీసీ - మేటాస్ (జాయింట్‌వెంచర్) సంస్థ చేజిక్కించుకుంది. దోపిడీ పథకమిదీ టన్నెల్ తవ్వకంలో బండరాళ్లు అడ్డురావడం, మట్టిపెళ్లలు విరిగిపడడం వల్ల అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందనే కుంటిసాకులు చూపుతూ 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల పని అదనంగా చేయాల్సి వచ్చిందంటూ 2015 అక్టోబర్‌లో ఎన్సీసీ - మేటాస్ సంస్థ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాసింది. అదనంగా చేసిన పనికి రూ. 44 కోట్లు చెల్లించాలని కోరింది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్రక్షన్ (ఈపీసీ) నిబంధనల ప్రకారం అదనంగా చేసిన పనికి ఎలాంటి బిల్లులు చెల్లించనక్కరలేదు. అందులోనూ డీజిల్, పెట్రోలు, ఇనుము ధరలు తగ్గాయి. సిమెంట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ పెదబాబు, చినబాబుల డెరైక్షన్‌లో కాంట్రాక్టర్‌కు రూ. 44 కోట్లు అదనంగా చెల్లించాలంటూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులపై తీవ్రఒత్తిడి తీసుకొచ్చారు. ఇదే ప్రాజెక్టులో 29 వ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.12 కోట్ల విలువైన పనులను రద్దు చేసి రూ. 110 కోట్లకు పెంచి తెలుగుదేశం ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు కట్టబెట్టారు. అందులో రూ. 35 కోట్లను చెల్లించేశారు. అది తనకు తెలియకుండానే జరిగిందని జలవనరులశాఖ మంత్రి దేవినేని వ్యాఖ్యానించడంతో కినుక వహించిన సీఎం రమేశ్ 30వ ప్యాకేజీలో అదనంగా చెల్లించబోతున్న రూ. 44 కోట్ల సంగతిని బయటపెట్టారు. అయితే ఇద్దరి మధ్య పెదబాబు రాజీ కుదర్చడంతో ఆ తర్వాత వివాదాలన్నీ సమసిపోయాయి. 30వ ప్యాకేజీలో రూ.44 కోట్ల బిల్లును ప్రభుత్వం చెల్లించేసింది.