అవుకు టన్నెళ్ల నుంచి ప్రవహిస్తున్న నీళ్లు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సొరంగాలు దాటుతూ.. సుడులు తిరుగుతూ పరవళ్లతో కృష్ణమ్మ ‘సీమ’ను ముద్దాడిన సుందర ఘట్టం సాక్షాత్కారమైంది. పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను గురువారం రోజు ఘనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పాయలుగా చీలి రెండు టన్నెళ్ల ద్వారా దిగువకు వేగంగా ప్రవహిస్తున్న దృశ్యాన్ని సీఎం సంతోషంతో కొద్దిసేపు అలాగే చూస్తుండిపోయారు.
ఈ నీటితో రాయలసీమ సస్యశ్యామలం కానుందనే ఆనందం ముఖ్యమంత్రి ముఖంలో స్పష్టంగా కనిపించింది. చిరునవ్వుతో నీటిపారుదల శాఖ అధికారులను అభినందించిన సీఎం జగన్ ప్రజాప్రతినిధులను ఆత్మీయంగా పలకరించారు. ఈ టన్నెల్ ద్వారా గోరుకల్లు నుంచి అవుకు రిజర్వాయర్‌కు 20 వేల క్యూసెక్కుల జలాలు పరవళ్లు తొక్కనున్నాయి. టన్నెల్‌ను ప్రారంభించేందుకు విజయవాడ నుంచి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి చేరుకున్న సీఎం జగన్ తొలుత ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇతర అధికారులు టన్నెల్ ముఖ్యాంశాలను వివరించారు. అనంతరం సీఎం జగన్ అక్కడి నుంచి వేదమంత్రాల మధ్య టన్నెల్ వద్దకు చేరుకుని నీటిని దిగువకు విడుదల చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. టన్నెల్ ప్రారంభించిన తర్వాత వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలను కలిసి ఆత్మీయంగా పలకరించారు.
అవుకు టన్నెల్2 శిలాఫలకం వద్ద సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు
వన్నె తెచ్చిన టన్నెల్!
గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా అవుకు సొరంగాల పనులకు శ్రీకారం చుట్టిన దివంగత వైఎస్సార్ రూ.340.53 కోట్లు వెచ్చించి ఆయన హయాంలోనే సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్‌లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు.
మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్‌లో ఇప్పటికే 4.526 కి.మీ. మేర పనులను పూర్తి చేయడం గమనార్హం. మూడు టన్నెళ్లతో పాటు ఇతర అనుబంధ పనులకు కలిపి ఇప్పటి వరకు మొత్తం రూ.1,501.94 కోట్లు వ్యయం చేశారు. ఎస్‌ఆర్‌బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ) కింద 1.5 లక్షల ఎకరాలకు సాగు నీటి సరఫరాతోపాటు గాలేరు నగరి సుజల స్రవంతి పథకం కింద గండికోట, వామికొండ, సర్వరాయసాగర్, మైలవరం, పైడిపాలెం తదితర రిజర్వాయర్లకు రోజుకు ఒక టీఎంసీ చొప్పున అదనంగా నీరు అందించే వెసులుబాటు ఉంది.
అవుకు రెండో టన్నెల్ ముఖ్యాంశాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
వేగంగా ఒడిసిపట్టేలా..
గోరుకల్లు నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 60 కి.మీ. పొడవున వరద కాలువతో పాటు టన్నెళ్ల పనులు అన్ని అవాంతరాలను అధిగమించి విజయవంతంగా పూర్తయ్యాయి. ఫాల్ట్ జోన్‌లో 180 మీటర్ల సొరంగం నిర్మాణంతో పాటు లైనింగ్ పనులు కూడా పూర్తి చేశారు. కుడి, ఎడమ టన్నెల్‌లో సిమెంట్, కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. తద్వారా దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ తాగు, సాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటిని వినియోగించవచ్చు.
శ్రీశైలంలో 875 అడుగులు మించితే గానీ మనకు కేటాయించిన పూర్తి నీటిని తీసుకోలేని పరిస్థితి నెలకొంది. సీఎం జగన్ దీన్ని చక్కదిద్దుతూ ఓవైపు కాలువల సామర్థ్యం పెంచుతూనే మరోవైపు 797 అడుగుల నుంచే నీటిని తీసుకునేలా, ప్రాజెక్టులు వేగంగా నిండేలా రోజుకు 3 టీఎంసీల జలాలను కరువు ప్రాంతాలకు తరలించి దుర్భిక్ష ప్రాంతాలకు న్యాయం చేసేందుకు చురుగ్గా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తలపెట్టారు.
తుది దశలో అవుకు టన్నెల్–3
కృష్ణాలో వరద ప్రవాహం రోజులు తగ్గిపోతున్నాయి. దీంతో శ్రీశైలానికి వరద నీరు వచ్చినప్పుడే ఒడిసి పట్టుకుని నిల్వ చేసుకోవాలి. రోజూ 20 వేల క్యూసెక్కులను తరలిస్తే రిజర్వాయర్లను నింపే వీలుంటుంది. గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 15 రోజుల్లోనే గండికోట రిజర్వాయర్‌ను నింపవచ్చు. సీమను సస్యశ్యామలం చేయవచ్చు.
ఈ క్రమంలో 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో చేపట్టిన అవుకు మూడో టన్నెల్, డిస్ట్రిబ్యూటరీ పనులు కూడా పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. రూ.1,297.78 కోట్ల వ్యయంతో చేపట్టిన మూడో టన్నెల్ పనుల్లో ఇప్పటికే రూ.934 కోట్ల విలువైనవి విజయవంతంగా పూర్తయ్యాయి. వచ్చే ఏడాది రెండో త్రైమాసికానికి ఇవి కూడా పూర్తి కానున్నాయి. దీంతో మొత్తం 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించవచ్చు.
హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు
అవుకు టన్నెల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఇసాక్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
కరువు సీమ దాహార్తి తీర్చేలా
► రూ.253 కోట్లతో లక్కసాగరం వద్ద హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పంప్ హౌస్‌ను ఇప్పటికే పూర్తి చేసిన సీఎం జగన్ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చెరువులకు సాగునీటిని అందించి 10వేల ఎకరాలకు పైగా సస్యశ్యామలం చేశారు.
► గత సర్కారు నిర్లక్ష్యం చేసిన బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ లీకేజి సమస్యను ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ద్వారా అరికట్టడంతో పూర్తి సామర్థ్యం మేరకు 17 టీఎంసీల నీరు నింపుతున్నారు.
► ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్ కలిపి సామర్థ్యం 30 వేల క్యూసెక్కులకు పెంచేలా పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
► కుందూ నది, నిప్పులవాగు సామర్థ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచి సోమశిలకు నీటిని సరఫరా చేయనున్నారు.
► పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు కాలువల వెడల్పు, లైనింగ్ పనులు, టన్నెళ్లు వేగంగా నిర్మించడం ద్వారా గోరుకల్లు, అవుకు రిజర్వాయర్ల ద్వారా తక్కువ సమయంలో సరిపడా నీటిని తీసుకునేలా చర్యలు చేపట్టారు. రూ.600 కోట్ల వ్యయంతో తెలుగు గంగ లింక్ కెనాల్ ప్రవాహ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు విస్తరించారు.
Comments
Please login to add a commentAdd a comment