పక్కాగా పోలవరం లెక్కలు | Reimbursement of Rs 3791 crore dues paid to Polavaram works | Sakshi
Sakshi News home page

పక్కాగా పోలవరం లెక్కలు

Published Tue, Jun 30 2020 5:07 AM | Last Updated on Tue, Jun 30 2020 5:07 AM

Reimbursement of Rs 3791 crore dues paid to Polavaram works - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు పనులకు చేసిన వ్యయం రూ.5,177.62 కోట్లకు సంబంధించిన వోచర్ల (బిల్లులు)పై ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ మదింపు చేసి ఇచ్చిన నివేదిక (ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌)ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు పంపింది. పోలవరం పనులకు ఖర్చుచేసిన రూ.3,791 కోట్ల బకాయిలను రీయింబర్స్‌ చేయాలని కోరింది. ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌ పంపి న నేపథ్యంలో రీయింబర్స్‌కు మార్గం సుగమమైం దని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

గత సర్కారు కాలయాపన..
2014 ఏప్రిల్‌ 1కి ముందు పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.5,177.62 కోట్లకు సంబంధించి ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌ను పంపితేనే నిధులు విడుదల  చేస్తామని 2018 జూలై 26న కేంద్రం స్పష్టం చేసింది. అయితే అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్‌  ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌ పంపకుండా కాలయాపన చేసింది. 2019 నవంబర్‌ 26న అదే విషయాన్ని మరోమారు గుర్తు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌ పంపుతామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో జనవరి 9న రూ.1,850 కోట్లను కేంద్ర జల్‌ శక్తి శాఖ పోలవరానికి విడుదల చేసింది.

కాగ్‌తో ఆడిట్‌..
► 2014 ఏప్రిల్‌ 1కి ముందు పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5,177.62 కోట్లు ఖర్చు చేసింది. పనులకు రూ.3,777.44 కోట్లు వెచ్చించగా భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీకి రూ.1,400.18 కోట్లు వ్యయం అయింది. 
► కేంద్ర జల్‌శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు పనులకు చెల్లించిన మొత్తానికి సంబంధించిన 5,609 వోచర్లు, భూసేకరణ, సహాయ పునరా వాస ప్యాకేజీకి ఖర్చు చేసిన మొత్తానికి సంబం« దించిన 363 వోచర్లను ప్రిన్సిపల్‌ అకౌంటెట్‌ జనరల్‌కు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. 
► వీటిని మదింపు చేసిన ‘కాగ్‌’ ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ లెక్కలన్నీ పక్కాగా ఉన్నట్లు తేల్చి రాష్ట్ర జలవనరుల శాఖకు ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌ పంపారు.

తొలగిన అడ్డంకులు..
► పోలవరానికి ఖర్చు చేసిన రూ.2,300 కోట్లను రీయింబర్స్‌ చేయాలని మూడు నెలల క్రితం పీపీఏ ద్వారా రాష్ట్ర ప్రభు త్వం కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదన పంపింది. అయితే ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌ పంపితేనే రీయింబర్స్‌ చేస్తామని కేంద్ర జల్‌ శక్తి శాఖ స్పష్టం చేసింది. 
► ప్రస్తుతం కేంద్ర జల్‌ శక్తి శాఖకు ఆడిటెట్‌ స్టేట్‌మెంట్‌ను పంపిన నేపథ్యంలో రీయింబర్స్‌కు అడ్డంకులు తొలగిపోయిన ట్లేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.
► రూ.2,300 కోట్లతోపాటు మరో రూ.1,491 కోట్లను కూడా రీయింబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖను రాష్ట్ర జలవనరుల శాఖ కోరింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement