gajendra singh
-
‘ప్రధాని బహమతుల’ వేలం నేటి నుంచే
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ షూ, పారాలింపిక్ విజేతలకు చెందిన వస్తువులు, అయోధ్య రామాలయం ప్రతిరూపం, వెండి వీణ..ఇలా ప్రధాని మోదీ ఏడాది కాలంలో అందుకున్న బహమతుల వేలం ఈ నెల 17న మొదలై అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. సుమారు రూ.1.5 కోట్లకు పైగా విలువైన 600 జ్ఞాపికలను వేలంలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో ప్రదర్శనను సోమవారం మంత్రి తిలకించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వేలం రూ.600 నుంచి గరిష్టంగా రూ.8.26 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. -
రాజస్తాన్ రాజెవరో?
రాజస్తాన్ శాసనసభ ఎన్నికల్లో విపక్ష బీజేపీ ఘన విజయం సాధించింది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి పరాభవం ఎదురైంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై అందరి దృష్టి కేంద్రకృతమైంది. రాజస్తాన్ రాజు ఎవరవుతారో మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. ప్రధానంగా నలుగురు ముఖ్యనేతలు సీఎం రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరోసారి పదవి ఆశిస్తున్నారు. పార్లమెంట్ సభ్యురాలు దియా కుమారి(ఈ ఎన్నికల్లో విద్యాధర్‌నగర్ స్థానం నుంచి గెలిచారు), కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, మహంత్ బాలక్‌నాథ్ యోగి సైతం సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే.. వసుంధర రాజే వసుంధర రాజే గతంలో రెండుసార్లు రాజస్తాన్ సీఎం చేశారు. ఈ ఎన్నికల్లో జాల్రాపటాన్ స్థానం నుంచి భారీ మెజారీ్టతో గెలుపొందారు. ఆమె బీజేపీ అధిష్టానాన్ని విభేదిస్తున్న నేతగా పేరుగాంచారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పెద్దగా సత్సంబంధాలు లేవన్న సంగతి బహిరంగ రహస్యమే. బీజేపీలో పాతతరం నేత అయిన వసుంధర రాజేను మూడోసారి గద్దెనెక్కించడానికి పార్టీ అగ్రనేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం ఆశీస్సులు లేకపోవడంతో ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కుదించుకుపోయాయి. దియా కుమారి రాజ్‌సమంద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దియా కుమారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి నెగ్గారు. జైపూర్ దివంగత మహారాణి గాయత్రి దేవి మనవరాలైన దియా కుమారి బీజేపీలో వసుంధర రాజేకు ప్రత్యామ్నాయ నేతగా ఎదిగారు. రాచరిక నేపథ్యం, రాజ్‌పుత్ వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసివచ్చాయి. చాలాఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. గతంలో సవాయ్‌మాధోపూర్ ఎమ్మెల్యేగా ఆమె చేసిన అభివృద్ధి పనులు ప్రశంలందుకున్నాయి. రాజస్తాన్‌లో నూతన ముఖ్యమంత్రిని నియమించే విషయంలో పార్టీ అధిష్టానం దియా కుమారి వైపు మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మహంత్ బాలక్‌నాథ్ యోగి రాజస్తాన్‌లోనూ ఉత్తరప్రదేశ్ తరహా ప్రయోగం చేయాలనుకుంటే ముందుగా గుర్తొచ్చే పేరు మహంత్ బాలక్‌నాథ్ యోగి. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్ మఠాధిపతి అయిన ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యారు. బాలక్‌నాథ్ ప్రస్తుతం రాజస్తాన్‌లో అల్వార్ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. గతంలో సన్యాసం స్వీకరించారు. మహంత్ చాంద్‌నాథ్ మఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. రాష్ట్రంలో బలమైన అనుచరవర్గం ఉంది. నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం దృష్టిలో ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గజేంద్రసింగ్ షెకావత్ రాజస్తాన్ బీజేపీలో మరో సీనియర్ నేత గజేంద్రసింగ్ షెకావత్. ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అవినీతి వ్యవహారాలపై పలు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా పనిచేశారు. ముఖ్యమంత్రిపై పలు ఆరోపణలు గుప్పించారు. తదుపరి సీఎం రేసులో తాను ఉన్నానంటూ ఇప్పటికే సంకేతాలు పంపించారు. కొందరు బీజేపీ ముఖ్యనేతలు ఆయనకు మద్దతిస్తున్నారు. సీఎం పోస్టుపై గజేంద్రసింగ్ ఆశలు పెట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పోలవరం తొలిదశ పూర్తికి రూ.15,661 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.15,661 కోట్లు అవసరమని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తేల్చింది. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేస్తూ శుక్రవారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి నివేదిక పంపినట్లు సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్విందర్‌సింగ్ వోరా వెల్లడించారు. ఇప్పటికే పోలవరం తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. ఇందులో భాగంగా జూన్ 5న కేంద్ర ఆర్థికశాఖ మెమో కూడా జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి అదనంగా 36 గ్రామాలు వస్తాయని తేలింది. ఆ గ్రామాల ప్రజలకు తొలిదశ కిందే పునరావాసం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. ఆ మేరకు సవరించిన ప్రతిపాదనలను రూపొందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.17,148 కోట్లు అవసరమంటూ సవరించిన వ్యయ ప్రతిపాదనలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా సీడబ్ల్యూసీకి పంపింది. వాటిని పరిశీలించిన సీడబ్ల్యూసీ తొలిదశ పూర్తికి రూ.15,661 కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత నిధుల విడుదల.. సీఎం జగన్ చేసిన విజ్ఞప్తి.. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి సూత్రప్రాయంగా కూడా అంగీకరించింది. ఆ గ్రామాల ప్రజలకు పునరవాసం కల్పించడానికి అదనంగా రూ.2,749.85 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. మొత్తం రూ.15,661 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు శుక్రవారం సిఫార్సు చేసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆ మేరకు పోలవరానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేయనుంది. దీని ఆధారంగా కేంద్ర కేబినెట్‌కు జల్‌శక్తి, ఆర్థిక శాఖలు ప్రతిపాదన పంపనున్నాయి. దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే పోలవరం తొలిదశ పూర్తికి అవసరమైన నిధులు విడుదలకు మార్గం సుగమం అవుతుంది. దశల వారీగా పోలవరంలో నీటినిల్వ.. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాగా.. గరిష్ట నీటినిల్వ 194.6 టీఎంసీలు. కొత్తగా నిరి్మంచే ఏ ప్రాజెక్టులోనైనా సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది దాని పూర్తినిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు.. మరుసటి ఏడాది 2/3వ వంతు, తర్వాత పూర్తిస్థాయిలో నీటినిల్వ చేయాలి. లీకేజీలుంటే వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టుకు భద్రత చేకూర్చాలన్న ఉద్దేశంతోనే సీడబ్ల్యూసీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలిఏడాది 41.15 మీటర్లలో, తర్వాత దశల వారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గరిష్ట నీటి మట్టం 45.74 మీటర్లలో నీటినిల్వ చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కేంద్రాన్ని ఒప్పించిన సీఎం జగన్.. నిజానికి.. కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో 2013–14 ధరల ప్రకారమే పూర్తిచేస్తామని 2016, సెప్టెంబరు 7న నాటి సీఎం చంద్రబాబు అంగీకరించి పనులను దక్కించుకున్నారు. అప్పటి ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.20,398.61 కోట్లు ఇచ్చేందుకు అప్పట్లో కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ఇందులో 2014, ఏప్రిల్ 1 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు మినహాయించి మిగతా అంటే రూ.15,667.91 కోట్లు ఇస్తామని తేల్చింది. 2014, ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.14,969.37 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇక రూ.698.54 కోట్లు మాత్రమే మిగిలాయి. కానీ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లు అవసరం. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేస్తూ.. 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఖరారు చేసిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేసి, ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ప్రధాని మోదీని కోరారు. ఈ క్రమంలోనే తొలిదశ పూర్తికి అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లు ఇచ్చి.. ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా రైతులకు అందించేందుకు సహకరించాలని సీఎం జగన్ చేసిన వినతిపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక శాఖలను ఆదేశించారు. -
కాళేశ్వరంపై సందేహాలన్నీ తీర్చండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం, మనుగడ, సుస్థిరతలపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేననెత్తిన సందేహాల్లో కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని, వాటికి కూడా బదులిస్తే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీని పరిశీలిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్లు తెలిసింది. జీఎస్టీ సమావేశంలో పాల్గొనేందుకు గత జూలైలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అక్కడ జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తాజాగా షెకావత్ స్పందించారు. మంత్రి హరీశ్‌రావు స్వయంగా లేఖ రాశారు. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలు అసంపూర్ణంగా ఉన్నాయని, అన్ని అంశాలపై సమగ్ర సమాధానాలను ఇవ్వాలని లేఖలో కోరినట్టు తెలిసింది. ఆ వెంటనే ప్రాజెక్టుకు అనుమతుల జారీ ప్రక్రియను పునరుద్ధరిస్తామని కూడా తెలియజేసినట్టు సమాచారం. ఇబ్బందికర ప్రశ్నలు..క్లుప్తంగా వివరాలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు చేసిన వ్యయం, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు యూనిట్‌కు రూ.3 చొప్పున విద్యుత్ సరఫరాకు తెలంగాణ ఈఆర్సీ అనుమతి ఇచ్చిందా? ప్రస్తుత విద్యుత్ చార్జీలు ఎంత? విద్యుత్ చార్జీల భారం దృష్ట్యా భవిష్యత్తులో ప్రాజెక్టు ఆర్థికంగా మనుగడ సాధిస్తుందా? ప్రాజెక్టు సుస్థిర మనుగడకు ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి ? ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎంత? రుణాలు, వడ్డీల రేట్లు ఎంత? తదితర వివరాలను అందజేయాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. గతేడాది జూలైలో గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లు ఎందుకు మునిగాయి? పంప్‌హౌస్‌లు, సర్విస్ బే ఎత్తుఎంత? జలాశయాల ఎఫ్ఆర్ఎల్ ఎంత? లాంటి సాంకేతిక అంశాలపై కూడా ఆరా తీసింది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన అన్ని కాంపోనెంట్ల డిజైన్లను సమర్పించాలని సూచించింది. దూర ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణాలు, ప్రాజె క్టు కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలనూ అడిగింది. సీడబ్ల్యూసీ అడిగిన సమాచారం చాలావరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండడంతో వివరాలు క్లుప్తంగా అందజేసినట్టు తెలిసింది. కాగా ఈ సమాచారంపై సంతృప్తి చెందకపోవడంతోనే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీ ప్రక్రియ ను సీడబ్ల్యూసీ నిలుపుదల చేసినట్టు సమాచారం. -
ఇంకా 2 నెలలు కావాలి!
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్య పరిష్కారం విషయంలో సుప్రీం కోర్టు సూచన మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల సీఎంలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆ శాఖ తాజాగా సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇందుకు మరికొంత సమయం కావాలని, మంగళవారం సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణను రెండు నెలలకు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ అడ్వొకేట్ ఆన్ రికార్డ్ అరవింద్‌కుమార్ శర్మ ఇటీవల సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కి లేఖ రాశారు. ►పోలవరం ప్రాజెక్టుతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ముంపు ప్రభావం తీవ్రంగా ఉందని, నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఆయా రాష్ట్రాలు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పోలవరం ముంపు సాంకేతికపరమైన అంశం కావడంతో సంబంధిత రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖను ఆదేశిస్తూ గతేడాది నవంబర్ 6న సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఆయా రాష్ట్రాల సీఎంలతోఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి విభేదాలను సైతం పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే నాలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీలు మూడు విడతలుగా సమావేశాలు నిర్వహించి సాంకేతికపర అంశాలను ఓ కొలిక్కి తెచ్చాయి. సుప్రీంలో కేసు తదుపరి విచారణకు వచ్చే నాటికి సీఎంలతో కూడా సమావేశం నిర్వహించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రయత్నాలు చేస్తోంది. 15న సాధ్యం కాని సీఎంల సమావేశం... వాస్తవానికి ఈ నెల 15న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తామని, రాగలరో లేదో తెలిపాలని ..పేర్కొంటూ ఆశాఖ ఈ నెల 8న ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సీఎంలకు లేఖ పంపించింది. కొన్ని రాష్ట్రాల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో 15న సమావేశం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మరో కొత్త తేదీని ప్రతిపాదిస్తూ ఆయా రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ మళ్లీ లేఖ రాయనుంది. సంబంధిత రాష్ట్రాల సీఎంలు సానుకూలంగా స్పందిస్తేనే ఈ సమావేశం సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. కొలిక్కి వచ్చిన సాంకేతిక అంశాలు.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గతేడాది సెప్టెంబర్ 29న 4 రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ తొలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అక్టోబర్ 7న కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) మరో సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సాంకేతిక అంశాలపై సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సీడబ్ల్యూసీ సూచన మేరకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు తమ అభ్యంతరాలు, డిమాండ్లతో టెక్నికల్ నోట్స్‌ను సమర్పించగా, వీటిని పరిశీలించి సీడబ్ల్యూసీ వివరణలు పంపించింది. ఏపీ నుంచి సైతం వివరణలు తీసుకుంది. సీడబ్ల్యూసీ ఇచ్చిన వివరణలపై మళ్లీ మూడు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను పంపించాయి. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలపై పరిశీలన అనంతరం పోలవరం ముంపు ప్రభా వానికి సంబంధించిన సాంకేతిక అంశాలను కొలిక్కి తెచ్చి ఓ నివేదికను సీడబ్ల్యూసీ సిద్ధం చేసింది. సీఎంలతో సమా వేశం అనంతరం ఈ నివేదికకు తుది రూపు ఇచ్చి సుప్రీం కోర్టులో జరిగే తదుపరి విచారణలో సమర్పించనుంది. ఉమ్మడి సర్వేకి ముందుకు రావాలి.. పీపీఏ లేఖ గత నెల 25న నాలుగు రాష్ట్రాల అధికారులతో సీడబ్ల్యూసీ నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు తెలంగాణలో పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వేకి ముందుకు రావాలని సూచిస్తూ తాజాగా ఏపీకి పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ లేఖ రాసింది. వానకాలం ప్రారంభానికి ముందే సర్వే నిర్వహించాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఉమ్మడి సర్వేలో తేలిన అంశాల ఆధారంగా ముంపు నివారణకు పోల వరం ఆథారిటీ/ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమావేశం మినిట్స్‌లో సీడబ్ల్యూసీ పేర్కొంది. -
టోక్యో ఒలింపిక్స్.. వైకల్యాన్ని పరుగు పెట్టించింది
తొమ్మిది నెలలకు ముందే జన్మించిన శిశువు ఆమె! చెవులు కూడా పూర్తిగా ఎదగలేదు. ఏడు నెలలు ఇన్‌క్యుబేటర్‌లో ఉంచవలసి వచ్చింది. ఆ తర్వాతనైనా ఆమె బతుకుతుందని వైద్యులు నమ్మకంగా చెప్పలేకపోయారు. 22 రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆమె టోక్యో పారా ఒలింపిక్స్‌లో వంద మీటర్ల పరుగు పందెంలో పోటీ పడబోతోంది! ఆ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించేలా సిమ్రాన్ శక్తిమంతురాలు అవడానికి ఆమె వైకల్యాలు ఒక కారణం అయితే.. భర్త చేయూత మరొక కారణం. ఆర్మీ జవాను భార్య టోక్యో పారా ఒలింపిక్స్‌కి వెళుతోందని సిమ్రాన్ శర్మను ఇప్పుడు అంతా కీర్తిస్తూ ఉన్నా.. ఆమెలోని ‘సైనికురాలికీ’ ఈ తాజా విజయంలో తగిన భాగస్వామ్యమే ఉంది. ఈ నెల 23న టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం అవుతున్న సమయానికే మొదలవుతున్న పారా ఒలింపిక్స్‌లోని వంద మీటర్ల ట్రాక్ ఈవెంట్‌కు సిమ్రాన్ అర్హత సాధించారు! భారతదేశంలో ఇప్పటి వరకు ఏ క్రీడాకారిణీ సాధించని ఘనత ఇది. అవును. పారా ఒలింపిక్స్‌లోని వంద మీటర్ల పరుగు పందానికి బరిలో దిగబోతున్న తొలి భారత మహిళ సిమ్రాన్ శర్మ! ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో (జె.ఎన్.ఎస్.) జూన్ 30 న జరిగిన వంద మీటర్ల పరుగు పందెంలో విజయం సాధించి.. టోక్యో ఫ్లయిట్ ఎక్కేందుకు ఇప్పుడామె సిద్ధంగా ఉన్నారు. పన్నెండు సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఒలింపిక్స్ ఎంట్రీ సంపాదించారు సిమ్రాన్. టోక్యో వెళ్లే ముందు ఆఖరి నిముషం వరకు కూడా సాధన చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తానని చెబుతున్న సిమ్రాన్.. జీవితంలో అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొన్న ఒక ‘రన్నర్’. ∙∙ సిమ్రాన్, ఆమె సిపాయి భర్త ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. భర్తే తన కోచ్ కావడం, ఆర్మీలో అతడి ఉద్యోగం కూడా ఢిల్లీలోనే అవడం సిమ్రాన్‌కు కలిసొచ్చింది. భార్యను గెలిపించి తీరాలన్న గజేంద్ర సింగ్ (30) సంకల్పం కూడా ఆమెను దృఢ మనస్కురాలిని చేసింది. అతడు ఆమెకు ఇచ్చింది సాధారణ శిక్షణ కాదు. భార్య కోసం, భార్యతో కలిసి అతడూ జె.ఎన్.ఎస్.లో రోజుకు ఐదు గంటలు ప్రాక్టీస్ చేశాడు! అదే గ్రౌండ్లో ఆమెను ఒలింపిక్స్‌కి ప్రవేశం సాధించిన విజేతగా నిలబెట్టాడు. అయితే ఇదేమీ అంత తేలిగ్గా జరగలేదు. ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయం ఆమె పోషకాహారానికి, ఇతర అవసరాల వరకు మాత్రమే సరిపోయేది. అందుకే భార్య శిక్షణకు అవసరమైన డబ్బు కోసం తాముంటున్న ప్లాట్‌ను అతడు అమ్మేశాడు గజేంద్ర సింగ్. బ్యాంకుల నుంచీ, స్నేహితుల నుంచీ మరికొంత అప్పు తీసుకున్నాడు. వాటికి ఈ దంపతులు వడ్డీ కట్టవలసి ఉంటుంది. అయితే ఒలింపిక్స్‌కి అర్హత సాధించడంతో ‘అసలు’ కూడా తీరిన ఆనందంలో ఉన్నారు వారిప్పుడు. ∙∙ భర్త ఆమె వ్యక్తి గత కోచ్ అయితే, ఆంటోనియో బ్లోమ్ ఆమె అధికారిక శిక్షకుడు. అంతర్జాతీయ స్థాయి వరకు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 19 ఏళ్ల అనుభవం ఉన్న ఐ.ఎ.ఎ.ఎఫ్. కోచ్! అతడి శిక్షణలో ఆమె ప్రపంచ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించారు. 2019లో సిమ్రాన్ దుబాయ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కి చేరిన సమయానికి ఆమె తండ్రి మనోజ్ శర్మ ఇక్కడ ఇండియాలో వెంటిలేటర్ మీద ఉన్నారు. సిమ్రాన్ ఆ పోటీలను ముగించుకుని రాగానే కన్నుమూశారు. అంత దుఃఖంలోనూ అదే ఏడాది సిమ్రాన్ చైనా గ్రాండ్ ప్రిక్స్‌లో బంగారు పతకం సాధించారు. 2021 ఫిబ్రవరిలో దుబాయ్‌లోనే జరిగిన వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్‌లో బంగారు పతకం గెలుపొందారు. ఇంట్లో పెద్దమ్మాయి సిమ్రాన్. టోక్యో ఒలింపిక్స్‌తో ఇప్పుడు పుట్టింటికీ, మెట్టినింటికీ పెద్ద పేరే తేబోతున్నారు. సిమ్రాన్ శర్మ : పన్నెండు సెకన్లలో 100 మీటర్ల పరుగు లక్ష్యాన్ని ఛేదించి టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించారు. -
కేంద్రమంత్రులు షెకావత్, ప్రకాష్ జవదేకర్‌కు సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి: కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్, ప్రకాష్ జవదేకర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ మరోసారి సీఎం వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాకే.. రాయలసీమ లిఫ్ట్ సందర్శించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ని ఆదేశించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు సీఎం జగన్ లేఖ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తోందని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ‘‘శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోంది. ఈనెల 1 నుంచి ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. 796 అడుగుల నీటిమట్టం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తోందని’’ సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా రాయలసీమ లిఫ్ట్‌ను పరిశీలిస్తామని పదేపదే కేఆర్ఎంబీ కోరుతోంది. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాకే రాయలసీమ లిఫ్ట్ సందర్శించేలా కేఆర్ఎంబీని ఆదేశించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని, కేంద్ర జలశక్తి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అనేక ఫిర్యాదులు చేసినా సరైన చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఏపీ పట్ల కేఆర్ఎంబీ వివక్షతో వ్యవహరిస్తోందని, తెలంగాణ తప్పుడు ఫిర్యాదుల పట్ల మాత్రం కేఆర్ఎంబీ వేగంగా స్పందిస్తోందన్నారు. ఏపీ ఇచ్చిన ధర్మబద్ధమైన ఫిర్యాదులను కేఆర్ఎంబీ పట్టించుకోవడంలేదని సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. ‘‘శ్రీశైలంలో 854 అడుగుల నీరు లేకుంటే కరువు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించే అవకాశం లేదు. పాలమూరు రంగారెడ్డి, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 800 అడుగుల వద్ద పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ నిర్మిస్తోంది. ఈ అక్రమ ప్రాజెక్టు వల్ల శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉండే అవకాశాలు లేవని’’ సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌కు సీఎం వైఎస్ జగన్ లేఖ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌కు రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ‘‘జూన్ 1 నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా పరిధిలో ఇరిగేషన్ అవసరాలు లేకుండా తెలంగాణ నీటిని వినియోగిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసమే ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించింది. 854 అడుగులకు చేరితే గానీ పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకునే అవకాశం లేదని’’ లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలవనరుల కమిషనర్‌కు పూర్తి డీపీఆర్‌ను అందజేశామని.. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. -
నష్టపోయాం ఆదుకోండి: సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ : చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కురిసిన వర్షాలతో హైదరాబాద్ తీవ్రంగా అతలాకుతలమైందని, ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు నిధి నుంచి సాయం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఢిల్లీ వచ్చిన కేసీఆర్.. షాతో సమావేశమయ్యారు. భారీ వర్షాలు, మునుపెన్నడూ లేని వరదలతో హైదరాబాద్ అతలాకుతలమైన తీరు, జరిగిన నష్టాన్ని సుదీర్ఘంగా ఆయనకు వివరించారు. వందలాది కాలనీలు నీట మునిగి హైదరాబాద్ వాసులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారని, బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సాయం అందించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల వల్ల దాదాపు రూ.5వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని.. తక్షణ సాయం కింద రూ.1,350 కోట్లు సాయం అందించాలని ప్రధాని మోదీకి అక్టోబర్ 15న లేఖ రాసినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో వరద బాధితుల పునరావాస చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కేసీఆర్ కోరారు. రాజకీయ అంశాలూ చర్చకు..? కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం కేసీఆర్ దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. వరదసాయం, తెలంగాణలోని ఇతరత్రా అంశాలతోపాటు రాజకీయపరమైన విషయాలూ ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. కేంద్రంలో బీజేపీకి అంశాలవారీగా మద్దతిస్తూ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్న టీఆర్ఎస్కు.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వైఖరి కొంత ఇబ్బందిగా మారింది. గతంలోనూ పలుమార్లు టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొంత దూరం పెరిగినా తిరిగి ఎన్నికల అనంతరం సర్దుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు పార్టీల మధ్య సామరస్య వాతావరణం నెలకొల్పడం ద్వారా తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రప్పించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని.. అందుకే కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ట్రిబ్యునల్ మళ్లీ ఏర్పాటు చేయండి.. శుక్రవారం ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్.. తొలుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అభ్యర్థించారు. కృష్ణా నదీ జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య తిరిగి పంచేందుకు వీలుగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956 పరిధిలోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ను మళ్లీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు లేఖ కూడా సమర్పించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఉందని, 3 టీఎంసీల సామర్థ్యానికి అనుమతి రావాల్సి ఉందని వివరించారు. పర్యావరణ అనుమతులు రాకముందే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణం ప్రారంభించిందని, దీనిపై ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి, నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశాలపై కూడా షెకావత్‌తో కేసీఆర్ చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలు సహా ఇటీవలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తరపున లేవనెత్తిన అంశాల్లో కొన్నింటిని మరోసారి మంత్రి వద్ద ప్రస్తావించినట్టు పేర్కొన్నాయి. -
రాజస్తాన్: ఆడియో టేపుల కలకలం
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్ రాజకీయాల్లో ఆడియో టేపుల కలకలం రేగింది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ యత్నించారని పేర్కొంటూ కాంగెస్ పార్టీ రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ)నకు ఫిర్యాదు చేసింది. వారి కుట్రలకు సంబంధించిన మూడు ఆడియో టేపులు కూడా తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాల తెలిపారు. అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ నేతల కుట్రలను వెలికి తీయాలని ఆయన ఎస్ఓజీ పోలీస్ అధికారులను కోరారు. కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు గజేంద్ర సింగ్ షెకావత్, సంజయ్ జైన్, భన్వర్‌లాల్ శర్మపై ఎస్ఓజీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం. (చదవండి: రాజకీయ సంక్షోభం: వసుంధరపై సంచలన ఆరోపణలు) ఇక ఇప్పటికే తిరుగుబాటు నేత సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేల పదవులను ఊడబెరికిన కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది. బీజేపీ నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేశారన్న ఆరోపణల నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ల పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను కాంగ్రెస్ రద్దు చేసింది. వారికి షోకాజ్ నోటీసులను జారీ చేసింది. కాగా, కాంగ్రెస్ ఆరోపణనలన్నీ అవాస్తవాలేనని రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ తోసిపుచ్చారు. ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. తమకు 109 మంది ఎమ్మెల్యేల బలం ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ మహేష్ జోషి వెల్లడించారు. అవసరమైనప్పుడు బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. మరోవైపు రాజస్తాన్ స్పీకర్ జారీ చేసిన నోటీసులపై సచిన్ పైలట్ వేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు కాసేపట్లో విచారించనుంది. (19 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ నోటీసులు) -
రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
-
గజేంద్ర సింగ్ షేకావత్‌తో బుగ్గన భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జల శక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి నిధుల విడుదల విషయంలో జాప్యం లేకుండా చూడాలని కోరారు. కేంద్ర జల శక్తి శాఖ మంత్రితో భేటీ అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరాను. నిధుల విడుదలలో జాప్యం లేకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. రీయింబర్స్మెంట్ కోసం రివాల్వింగ్ ఫండ్ నుంచి నిధులు విడుదలయ్యేలా ఏర్పాటు చేయనున్నారు. నాబార్డు ద్వారా నిధుల సమీకరణ చేస్తున్నప్పటికీ, ఆ నిధుల విడుదలలో జాప్యం లేకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. -
పక్కాగా పోలవరం లెక్కలు
సాక్షి, అమరావతి: పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు పనులకు చేసిన వ్యయం రూ.5,177.62 కోట్లకు సంబంధించిన వోచర్ల (బిల్లులు)పై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మదింపు చేసి ఇచ్చిన నివేదిక (ఆడిటెడ్ స్టేట్మెంట్)ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు పంపింది. పోలవరం పనులకు ఖర్చుచేసిన రూ.3,791 కోట్ల బకాయిలను రీయింబర్స్ చేయాలని కోరింది. ఆడిటెడ్ స్టేట్మెంట్ పంపి న నేపథ్యంలో రీయింబర్స్‌కు మార్గం సుగమమైం దని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత సర్కారు కాలయాపన.. 2014 ఏప్రిల్ 1కి ముందు పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.5,177.62 కోట్లకు సంబంధించి ఆడిటెడ్ స్టేట్మెంట్ను పంపితేనే నిధులు విడుదల చేస్తామని 2018 జూలై 26న కేంద్రం స్పష్టం చేసింది. అయితే అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ఆడిటెడ్ స్టేట్మెంట్ పంపకుండా కాలయాపన చేసింది. 2019 నవంబర్ 26న అదే విషయాన్ని మరోమారు గుర్తు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆడిటెడ్ స్టేట్మెంట్ పంపుతామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో జనవరి 9న రూ.1,850 కోట్లను కేంద్ర జల్ శక్తి శాఖ పోలవరానికి విడుదల చేసింది. కాగ్‌తో ఆడిట్.. ► 2014 ఏప్రిల్ 1కి ముందు పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5,177.62 కోట్లు ఖర్చు చేసింది. పనులకు రూ.3,777.44 కోట్లు వెచ్చించగా భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీకి రూ.1,400.18 కోట్లు వ్యయం అయింది. ► కేంద్ర జల్‌శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు పనులకు చెల్లించిన మొత్తానికి సంబంధించిన 5,609 వోచర్లు, భూసేకరణ, సహాయ పునరా వాస ప్యాకేజీకి ఖర్చు చేసిన మొత్తానికి సంబం« దించిన 363 వోచర్లను ప్రిన్సిపల్ అకౌంటెట్ జనరల్‌కు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ► వీటిని మదింపు చేసిన ‘కాగ్’ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ లెక్కలన్నీ పక్కాగా ఉన్నట్లు తేల్చి రాష్ట్ర జలవనరుల శాఖకు ఆడిటెడ్ స్టేట్మెంట్ పంపారు. తొలగిన అడ్డంకులు.. ► పోలవరానికి ఖర్చు చేసిన రూ.2,300 కోట్లను రీయింబర్స్ చేయాలని మూడు నెలల క్రితం పీపీఏ ద్వారా రాష్ట్ర ప్రభు త్వం కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదన పంపింది. అయితే ఆడిటెడ్ స్టేట్మెంట్ పంపితేనే రీయింబర్స్ చేస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసింది. ► ప్రస్తుతం కేంద్ర జల్ శక్తి శాఖకు ఆడిటెట్ స్టేట్మెంట్ను పంపిన నేపథ్యంలో రీయింబర్స్‌కు అడ్డంకులు తొలగిపోయిన ట్లేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ► రూ.2,300 కోట్లతోపాటు మరో రూ.1,491 కోట్లను కూడా రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖను రాష్ట్ర జలవనరుల శాఖ కోరింది. -
నెలలోగా అపెక్స్ కౌన్సిల్ భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు నెలలోగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి.. అజెండాను సిద్ధంచేయాలని కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలతో అపెక్స్ కౌన్సిల్ భేటీని నిర్వహించి.. వివాదాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రెండు బోర్డుల చైర్మన్లు ఎ.పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్‌లతో మంత్రి షెకావత్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బోర్డుల వర్కింగ్ మాన్యువల్, కొత్త ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి అజెండాను పంపాలని ఇరు రాష్ట్రాలను కోరామని.. కానీ, ఇప్పటిదాకా అవి స్పందించలేదని మంత్రికి బోర్డుల చైర్మన్లు వివరించారు. దీనిపై షెకావత్ స్పందిస్తూ.. వారంలోగా అపెక్స్ కౌన్సిల్‌కు అజెండా పంపాలని కోరుతూ మరోసారి రెండు రాష్ట్రాలకు లేఖలు రాయాలని, అప్పటికీ స్పందించకపోతే ఇటీవల నిర్వహించిన బోర్డుల సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా అజెండా ఖరారుచేసి పంపాలని బోర్డుల చైర్మన్లను ఆదేశించారు. అలాగే, రెండు బోర్డుల పరిధి, వర్కింగ్ మాన్యువల్‌నూ ఖరారు చేస్తామన్నారు. అజెండాను పంపితే.. ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించి నెలలోగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి షెకావత్ చెప్పినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. -
ఎండిన గొంతులు తడిపేందుకే..
సాక్షి, అమరావతి: దుర్భిక్ష రాయలసీమలో ఎండిన గొంతులు తడిపేందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని వివరిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మా వాటా నీళ్లను వాడుకోవడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని.. ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని మాత్రమే వినియోగించుకుంటామని స్పష్టంచేయాలని దిశానిర్దేశం చేశారు. కృష్ణా, గోదావరిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల మీద రెండు రాష్ట్రాలు ఆయా బోర్డులకు ఇటీవల పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో ఈనెల 4న కృష్ణా బోర్డు.. 5న గోదావరి బోర్డు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాలను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాల్సిన ఆవశ్యకతను సమగ్రంగా వివరిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రికి లేఖ రాయాలని సీఎం వారిని ఆదేశించారు. లేఖలో పొందుపర్చాలంటూ ముఖ్యమంత్రి సూచించిన ముఖ్యాంశాలు ఇవీ.. ► ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు కర్ణాటక పెంచుతుండటంవల్ల అదనంగా దాదాపు 100 టీఎంసీల మేర నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత జాప్యం జరుగుతుంది. ► విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కృష్ణాపై చేపట్టిన కొత్త ప్రాజెక్టులు. ► కృష్ణాకు వరద రోజులు తగ్గాయి. అలాగే, ఒకేసారి భారీగా వరద వస్తున్న అంశం. ► శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 881 అడుగుల్లో ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్ ప్రకారం పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించే అవకాశం ఉంది. కానీ, ఆ స్థాయిలో నీటి మట్టం పది రోజులు కూడా ఉండదు. ► నీటి మట్టం 854 అడుగులు ఉంటే కేవలం ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా వాడుకునే అవకాశం ఉండదు. ► అందుకే 800 అడుగుల నుంచి నీటిని తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం. ► కానీ, శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తోంది. 796 అడుగుల నుంచి ఎడమగట్టు విద్యదుత్పత్తి కేంద్రం ద్వారా 42 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం తెలంగాణకు ఉంది. ► తెలంగాణ సర్కార్ శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి నీటిని తరలిస్తున్నప్పుడు.. అదే స్థాయి నీటి మట్టం నుంచి, రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన నీటిని తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల చేపడితే తప్పెలా అవుతుంది. ► ఈ ప్రాజెక్టువల్ల తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదు. ► అలాగే, రాయలసీమ ఎత్తిపోతలవల్ల పర్యావరణానికీ ఎలాంటి హాని కలగదు. మన వాటా నీటిని వినియోగించుకోవడానికే ఈ ప్రాజెక్టు చేపట్టాం. ► ఈ అంశాన్ని వివరిస్తూ ఎన్జీటీ (జాతీయ హరిత న్యాయస్థానం)లో పిటిషన్ దాఖలు చేయాలి. అంతేకాక.. కేంద్ర జల్‌శక్తి శాఖ, ఎన్జీటీలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని.. రాయలసీమ ఎత్తిపోతల పనులకు టెండర్లు పిలిచి శరవేగంగా రాయలసీమ ప్రజల తాగునీటి కష్టాలను కడతేర్చాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
తడారిన గొంతుక తడిపేందుకే ఎత్తిపోతల
సాక్షి, అమరావతి: దుర్భిక్షంతో తడారిన రాయలసీమ గొంతుక తడపడానికే.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని కృష్ణా బోర్డుకు మరోసారి స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి కేటాయించిన వాటా ప్రకారం నీటిని వాడుకోవడానికే ఎత్తిపోతల చేపట్టామని వివరించేందుకు సిద్ధమైంది. విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టులను నిలుపుదల చేశాకే రాయలసీమ ఎత్తిపోతలపై చర్చించాలని స్పష్టం చేయనుంది. కృష్ణా నదిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలు ఇటీవల పరస్పరం బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ అంశంపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలు నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా బోర్డుకు నిర్దేశం చేశారు. తక్షణమే బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ క్రమంలో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్త రామదాస, మిషన్ భగీరథ ప్రాజెక్టులతోపాటు సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ పనులను నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను బోర్డు ఆదేశించింది. అదే తరహాలో రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఇరు రాష్ట్రాలకు చైర్మన్ ఎ.పరమేశం లేఖ రాశారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లతోపాటు నీటి పంపిణీ, విద్యుత్ పంపిణీ, టెలీమెట్రీ రెండో దశ అమలు, బడ్జెట్ –సిబ్బంది కేటాయింపు అంశాలను అజెండాలో చేర్చారు. కృష్ణా బోర్డు సూచనల మేరకు సమావేశంలో చర్చించే అంశాల అజెండాను ఏపీ జలవనరుల శాఖ ఖరారు చేసింది. ఆ అజెండాలో ముఖ్యాంశాలు ఇవీ.. ► శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్(పీహెచ్‌పీ) ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు నీటిని తరలించవచ్చు. కానీ ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదిలో 10 – 15 రోజులు కూడా ఉండదు. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటే పీహెచ్‌పీ ద్వారా కేవలం ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. నీటి మట్టం అంతకంటే తగ్గితే రాయలసీమ ప్రాజెక్టులకు చుక్క నీరు కూడా చేరదు. కేటాయింపులున్నా నీటిని తీసుకునేందుకు అవకాశం ఉండదు. ► తెలంగాణ కొత్తగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్త రామదాస, మిషన్ భగరీథ, సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీల డీపీఆర్‌లను పరిశీలించిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ ఇస్తాం. ► కృష్ణా నదికి వరద వచ్చే సమయంలో ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి నీటిని విడుదల చేసే సమయంలో వినియోగించుకున్న నీటిని లెక్కలోకి తీసుకోకూడదు. సాంకేతిక కమిటీ నివేదికను తక్షణమే తెప్పించి మిగులు జలాల్లో వాటాలను తేల్చాలి. ► నాగార్జునసాగర్ ఎడమ కాలువలో 39.41 – 43.67 శాతం వరకు సరఫరా నష్టాలను తెలంగాణ సర్కార్ చూపిస్తోంది. దీంతో ఏపీ వాటా కింద రావాల్సిన జలాలు రావడం లేదు. సరఫరా నష్టాలను తేల్చడానికి రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేయాలి. ► కృష్ణా బోర్డు ఏర్పాటై 6 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ బోర్డు పరిధిని తేల్చలేదు. వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఆమోదించలేదు. తక్షణమే పరిధిని ఖరారు చేసి వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఆమోదించాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలి. ► విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పనిచేయాలి. బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించాలి. -
పోలవరానికి రూ.3,319.89 కోట్లు రీయింబర్స్ చేయండి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.3,319.89 కోట్లను రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) ద్వారా కాకుండా ‘నాబార్డు’ నుంచి నిధులను నేరుగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి(పీపీఏ) విడుదల చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ప్రతిపాదించారు. దీనిపై గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. పోలవరానికి రూ.2,156 కోట్లు రీయింబర్స్ చేయాలని పీపీఏ ప్రతిపాదనలు పంపిందని.. వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ.1,163.89 కోట్ల రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పీపీఏ నుంచి ప్రతిపాదనలు రాగానే, వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. - పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రచించారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేయడంతోపాటు సవరించిన అంచనాల మేరకు నిధులు ఇచ్చి సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించాలంటూ పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. - దాంతో గత నెలలో పోలవరానికి రూ.1,850 కోట్లను రీయింబర్స్ చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ ద్వారా పీపీఏకు నాబార్డు నిధులు విడుదల చేసింది. వాటిలో రూ.1,780 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ విడుదల చేసింది. దీంతో కేంద్రం రీయింబర్స్ చేయాల్సిన బకాయిలు రూ.5,099.89 కోట్ల నుంచి రూ.3,319.89 కోట్లకు తగ్గాయి. - రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బిల్లులపై ఆడిటింగ్ నిర్వహిస్తున్న పీపీఏ.. మార్చి మొదటి వారంలో రూ.2,156 కోట్లు రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు సిఫార్సు చేసింది. ఈ ఫైలుపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఆమోదముద్ర వేసి.. ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు పంపారు. రెండు రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ఫోన్లో మాట్లాడారు. పోలవరానికి రీయింబర్స్ చేయాల్సిన నిధులు విడుదల చేయడంతోపాటు 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. - సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమై.. పోలవరానికి రీయింబర్స్ చేయాల్సిన నిధులు విడుదల చేయాలని విన్నవించారు. అభివృద్ధి ఆగదు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అసలు జరగడం లేదు అనేది తప్పుడు ప్రచారమేనని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోయినప్పటికీ అభివృద్ధి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని పునరుద్ఘాటించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ రమేష్‌చంద్ర (వ్యవసాయం), డాక్టర్ రఘునాథ్ మిశ్రాతో(సాగునీటి శాఖ) సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. విజ్ఞాపన పత్రాలు అందజేశారు. అనంతరం ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఏపీలో గత ప్రభుత్వం తీసుకున్న అనవసరమైన నిర్ణయాలను వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సమీక్షిస్తోందని, అప్పట్లో జరిగిన అవినీతిని వెలికితీస్తోందని, దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ ఇంకా ఏం చెప్పారంటే.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన - ఇప్పటిదాకా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు తీర్పు దరిమిలా నిర్వహిస్తున్నామని, అందువల్ల పెండింగ్‌లో ఉన్న రూ.5,000 కోట్ల గ్రాంట్‌ను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరాం. - కేంద్రం గ్రాంట్ ఇవ్వకపోయినా ఇప్పటివరకూ గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో కనీస సదుపాయాలకు అయిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించిందనే విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశాం. - ఉత్తరాంధ్రలోని ఉద్ధానం, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లాలోని కొన్ని మండలాలు, వైఎస్సార్ జిల్లాలోని పులివెందులకు మంచి నీటి సదుపాయం కల్పించడం కోసం వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని ప్రతిపాదించామని, దానికి నిధులివ్వాలని గజేంద్రసింగ్ షెఖావత్‌కు విజ్ఞప్తి చేశాం. - గత టీడీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. టీడీపీ ప్రభుత్వం దిగిపోతూ రూ.60 వేల కోట్ల మేరకు చెల్లింపు బకాయిలు పెట్టి పోయింది. వీటిలో ఇప్పటికి అన్నీ కలిపి సుమారు రూ.23 వేల కోట్లు చెల్లించాం. - వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగించడం సరికాదు. పిల్లల చదువులపై వ్యయం చేయడం తప్పా? రైతు భరోసా అమలు చేసి అన్నదాతలను ఆదుకోవడం తప్పా? కేంద్రం ఇస్తున్న నిధులకు మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను జత చేసి రైతులకు సాయం అందిస్తోంది. బీమా పథకాన్ని రైతులకు అలవాటు చేయాలన్న ఉద్దేశంతో పంటలకు బీమా కట్టడం తప్పవుతుందా? -
వాటర్ గ్రిడ్‌కు అధిక నిధులివ్వండి
సాక్షి, అమరావతి: ప్రతి ఇంటిలో మంచి నీటి కొళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి 365 రోజుల పాటు నీటి సరఫరా చేయడానికి ఉద్దేశించిన వాటర్ గ్రిడ్ పథకం అమలుకు కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలసి వినతిపత్రం అందజేసేందుకు సోమవారం రాష్ట్రం నుంచి అధికారుల బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. లోక్‌సభలో వైఎస్సార్సీపీ పక్ష నాయకుడు మిథున్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, వాటర్ గ్రిడ్ ఇన్చార్జి ఎండీ గిరిజా శంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఈఎన్సీ కృష్ణారెడ్డిలు సోమవారం కేంద్రమంత్రిని కలుస్తారని అధికారవర్గాలు తెలిపాయి. 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయి ఏర్పాటు లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే కొత్తగా ‘జల జీవన్ మిషన్’ పేరుతో ఓ కొత్త కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అవసరమయ్యే నిధులను కేంద్రం– రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సమకూర్చుకోవాలన్నది ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేంద్రం ప్రారంభించిన జలజీవన్ మిషన్ కార్యక్రమం లాంటి లక్ష్యాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందే వాటర్ గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టిన అంశాన్ని అధికారుల బృందం కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. అందుకనుగుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాటర్ గ్రిడ్ పథకం అమలుకు జలజీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా కేంద్రం నుంచి అధికంగా నిధులను రాష్ట్రానికి కేటాయించాలని కోరనుంది. వచ్చే 30 ఏళ్లకు అనుగుణంగా ప్రణాళికలు.. వాటర్ గ్రిడ్ పథకం అమలుకు మొత్తం రూ. 49,938 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. ప్రతి వేసవిలోనూ నీటి సరఫరాకు ఆటంకం లేకుండా ఉండేందుకు సాగునీటి రిజర్వాయర్ల నుంచి నేరుగా పైపుల ద్వారా మంచినీటి పథకాలకు నీటి సరఫరా జరిగేలా ఈ వాటర్ గ్రిడ్‌ను డిజైన్ చేశారు. వచ్చే 30 ఏళ్లకు అనుగుణంగా పెరుగుతున్న అవసరాలకు తగ్గుట్టు గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికీ రోజుకి వంద లీటర్ల చొప్పున, మున్సిపాలిటీలో 135 లీటర్ల చొప్పున, నగరాల్లో 150 లీటర్ల చొప్పున సరఫరా చేయడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా నీటి సరఫరాకు వీలుగా మొత్తం వాటర్ గ్రిడ్ పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి 2020–21 సంవత్సరంలో రూ. 8,040 కోట్లు, 2021–22లో రూ. 11,166 కోట్లు, 2022–23లో రూ. 13,409 కోట్లు, 2023–24లో రూ. 17,323 కోట్ల చొప్పున ఈ పథకానికి ఖర్చు చేయనున్నారు. -
గోదావరి – కృష్ణా అనుసంధానంపై ముసాయిదా డీపీఆర్ సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నుంచి కృష్ణా, కృష్ణా నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్లింపు కోసం నేషనల్ వాటర్ డవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్లు్యడీఏ) ముసాయిదా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం రాజ్యసభలో వివరించారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఆదుకునేందుకు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు నీరు మళ్లించే అవకాశాలను పరిశీలించవలసిందిగా కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్æ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని వివరించారు. గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌కు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా సీఎం కోరినట్లు మంత్రి చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంపై ఎన్‌డబ్లు్యడీఏ సిద్ధం చేసిన ముసాయిదా డీపీఆర్‌పై తమ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతూ సంబంధిత రాష్ట్రాలకు పంపించినట్లు షెకావత్ చెప్పారు. గోదావరి–కావేరీ లింక్ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా మూడు లింక్‌లు ఉంటాయని, ఆయా ప్రాజెక్ట్‌ల ద్వారా నిరుపయోగంగా పోతున్న 247 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. గోదావరి–కృష్ణా లింక్ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 3.45 లక్షల నుంచి 5.04 లక్షల హెక్టార్ల భూములకు ఏటా సాగునీటి వసతి కల్పించవచ్చని చెప్పారు. నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌పై సంబంధిత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన అనంతరం తుది డీపీఆర్ రూపొందించి, చట్టపరమైన అనుమతులు పొందిన తరువాత పనులు మొదలవుతాయని ఆయన తెలిపారు. సాగరమాల కింద ఏపీలో 32 రోడ్డు, 21 రైల్ ప్రాజెక్ట్‌లు సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్‌ప్రాజెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు 32 రోడ్డు, 21 రైల్‌ప్రాజెక్ట్‌లు కేటాయించినట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు. ఏపీలోని 9 జిల్లాల్లో సంప్రదాయ పారిశ్రామిక క్లస్టర్లు సాంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రత్యేక నిధితో ఒక పథకాన్ని ప్రారంభించినట్లు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల మంత్రి నితిన్‌గడ్కరీ రాజ్యసభలో చెప్పారు. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఈ పథకంలో భాగంగా ఖాదీ, క్వాయర్, విలేజ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సంప్రదాయక పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసి తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీలోని చిత్తూరు (కలంకారీ), విజయనగరం (క్వాయర్ పరుపుల తయారీ), చిత్తూరు (క్వాయర్ ఉత్పాదనలు), కృష్ణా (కొండపల్లి బొమ్మలు), తూర్పుగోదావరి (జొన్నాడ ఫుడ్‌ప్రాసెసింగ్), చిత్తూరు (చింతపండు), గుంటూరు (మంగళగిరి బంగారు ఆభరణాలు), తూర్పు గోదావరి (కడియపులంక కొబ్బరిపీచు ఉత్పాదనలు) జిల్లాల్లో మొత్తం 9 సంప్రదాయ పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
2021 నాటికి ‘పోలవరం’ పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడానికి రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికను(యాక్షన్ ప్లాన్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసించింది. గోదావరికి వరదలు వచ్చేలోగా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, నిర్వాసితుల పునరావాసం పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడింది. ఆర్థిక వనరులు సమకూర్చితే ఆ యాక్షన్ ప్లాన్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తుందని స్పష్టం చేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు శనివారం నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హెచ్‌కే హల్దార్ నేతృత్వంలో నిపుణుల కమిటీ నివేదికలో ఏం పేర్కొన్నారంటే.. పకడ్బందీ ప్రణాళికతో పనులు - పోలవరం స్పిల్ వేలో 18.48 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకుగానూ, 15.81 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన 2.67 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను జూలై 2020 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు. నెలకు సగటున 33,375 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడం ద్వారా వాటిని పూర్తి చేయనున్నారు. - స్పిల్ ఛానల్లో 18.75 లక్షల క్యూబిక్ మీటర్లకుగానూ, 13.31 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 5.44 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను నెలకు 48,545.55 క్యూబిక్ మీటర్ల చొప్పున పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. - వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించి.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు చేయడానికి వీలుగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను జూన్ నాటికి పూర్తి చేయడానికి కసరత్తు సాగిస్తున్నారు. - 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించే పనులు చేపట్టారు. వాటిని మే నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. - కుడి కాలువ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఎడమ కాలువలో పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని.. కొత్త కాంట్రాక్టర్లకు రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు అప్పగించి.. 2021 నాటికి డిస్ట్రిబ్యూటరీలతో సహా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు. - వచ్చే సీజన్లో ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్.. కాలువలకు నీటిని సరఫరా కుడి, ఎడమ అనుసంధాలు, స్పిల్ వేకు గేట్లు బిగించే ప్రక్రియతోసహా 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించే దిశగా కసరత్తు చేస్తున్నారు. నిధులు సమకూర్చితే.. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి రూ.5,135.87 కోట్లు ఖర్చు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి సెప్టెంబరు 2019 వరకూ రూ.11,377.243 కోట్లు వెచ్చించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.6,764.16 కోట్లు(ఇందులో పీపీఏ కార్యాలయ నిర్వహణ వ్యయం రూ.15 కోట్లు) రీయింబర్స్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి 2018–19లో రూ.393.51 కోట్లు .. నవంబర్ 8, 2019న రూ.1,850 కోట్లను రీయింబర్స్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఆ నిధులను విడుదల చేయలేదు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లు. ఇందులో జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయంపోగా మిగతా.. అంటే రూ.50,987.96 కోట్లు నీటిపారుదల విభాగం వ్యయం. ఆ మేరకు నిధులను సమకూర్చితే సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందించవచ్చునని నిపుణుల కమిటీ పేర్కొంది. -
కడపలో బీజేపీ భారీ ర్యాలీ
-
‘సీఏఏకు మద్దతుగా మిస్డ్ కాల్ ఇవ్వండి’
సాక్షి, వైఎస్సార్ కడప : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) దేశ రక్షణ కోసమేనని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ పేర్కొన్నారు. జిల్లాలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ హాజరయ్యారు. ఆయన సమక్షంలో టీడీపీ మాజీ అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ బీజేపీలో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకే ఈ చట్టాలను తీసుకు వచ్చామని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు తీసుకు వచ్చామని, భారత భూభాగమైన కశ్మీర్లో 390 ఆర్టికల్ రద్దు ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని ప్రశంసించారు. ముస్లిం దేశాల్లో అమలు చేయని ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకు వచ్చామన్నారు. దేశంలో అశాంతి సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని విమర్శించారు. దేశ భద్రత కోసం తెచ్చిన చట్టాలను వ్యతిరేకించడం తగదని అన్నారు. పాకిస్తాన్లో హిందువులను ఉండనివ్వడం లేదని, అక్కడ పది లక్షల మంది శరణార్థులుగా ఉన్నారన్నారు. పౌరసత్వం కోసం 11 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని, వారి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేక పిల్లలను చదివించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ వెంట రాహుల్ నడుస్తున్నారని, వీరికి ఓటు బ్యాంకు రాజకీయాలు తగవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల్లో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వాస్తవాలను తెలియజేసేందుకు ఇంటింటికి వెళ్తామన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి అందరూ మద్దతు పలకాలని, సీఏఏకు మద్దతు తెలిపేందుకు 8866288662కు మిస్డ్ ఇవ్వాలని సూచించారు. ప్రజల మద్దతు తమకు ఉంటే మమతా, రాహుల్, ఎంఐఎం పార్టీ ఏమి చేయలేవన్నారు. -
పోలవరం పర్యటనకు కేంద్ర మంత్రి : అనిల్‌కుమార్
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి మంగళవారం ఆయన కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ‘రివర్స్ టెండరింగ్‌పై కేంద్ర మంత్రి సంతృప్తి చెందారు. పోలవరం ప్రాజెక్టులో కేంద్రానికి రూ.800 కోట్లు ఆదా చేశామని వివరించాను. పార్లమెంటు సమావేశాల తర్వాత పోలవరం సందర్శనకు వస్తానని షెకావత్ చెప్పారు. పోలవరానికి సంబంధించి రూ.1850 కోట్లు రెండు మూడు రోజుల్లో విడుదలౌతాయి. మిగిలిన నిధులకు సంబంధించి ఆడిటింగ్ కూడా పూర్తయింది . రూ. 55 వేల కోట్ల ప్రాజెక్టులో 11 వేల కోట్ల రూపాయలు పనులు మాత్రమే టీడీపీ పూర్తి చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే కుడి, ఎడమ కాలువల పనులు పూర్తయ్యాయి. పోలవరం పనులు 35 శాతం మాత్రమే ఇప్పటివరకు పూర్తయ్యాయి. 2021 కల్లా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’అని అనిల్‌కుమార్ అన్నారు. -
ఆడిట్ పూర్తయిన తర్వాతే పోలవరానికి నిధులు
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 3,222.75 కోట్లు విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితోపాటు.. సవరించిన నిర్మాణ వ్యయం అంచనాలను ఆమోదించే అంశాలను కేంద్రం పరిశీలిస్తోందా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను ప్రశ్నించారు. దీనికి మంత్రి బదులిస్తూ.. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు ఖర్చు చేసిన రూ. 5 వేల కోట్లకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ ఆడిట్ నిర్వహిస్తోందని మంత్రి గజేంద్ర షెకావత్ సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు రూ. 3 వేల కోట్ల మేరకు ఆడిట్ పూర్తయినందున అందులో కొంత మొత్తం విడుదల చేసే అంశాన్ని ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. -
డీపీఆర్ ఇస్తే నిధులు!
సాక్షి, అమరావతి: సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను ఒడిసి పట్టి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గోదావరి–కృష్ణా (బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్)– పెన్నా నదుల అనుసంధానానికి నిధులివ్వాలంటూ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చేసిన వి/æ్ఞప్తిపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పంపితే పరిశీలించి నిధులిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులతో జల్ శక్తి అభియాన్, సాగు, తాగునీటి ప్రాజెక్టులు, స్వచ్ఛ భారత్ తదితర పథకాలపై గజేంద్రసింగ్ షెకావత్ సమావేశం నిర్వహించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి తదితరులు దీనికి హాజరయ్యారు. మూడు రాష్ట్రాలకు ప్రయోజనం గోదావరి నుంచి ఏటా సగటున 2,500 టీఎంసీలకుపైగా సముద్రంలో కలుస్తున్నాయని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. నీటి లభ్యత నానాటికీ తగ్గుతుండటం, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానాన్ని చేపట్టాలని నిర్ణయించిందని చెప్పారు. డీపీఆర్ రూపకల్పన బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించామన్నారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానం వల్ల తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు ప్రయోజనం చేకూరుతుందని, ఈ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. వాటర్ గ్రిడ్‌కు సహకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ రోజూ పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు నీటిని అందచేసే వాటర్ గ్రిడ్ పథకానికి నిధులివ్వాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ కోరారు. అయితే 55 లీటర్ల నీటి సరఫరాకు అయ్యే వ్యయాన్ని మాత్రమే కేంద్రం ఇస్తుందని, అంతకంటే ఎక్కువ పరిమాణంలో నీటిని అందించడానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో శుద్ధి చేసి ఇళ్లకు సరఫరా చేయాలని వ్యయం తగ్గుతుందని సూచించారు. వాటర్ గ్రిడ్‌కు అవసరమైతే విదేశీ ఆరి్థక సంస్థల ద్వారా రుణం అందించేందుకు సహకరిస్తామని చెప్పారు. త్వరలో మిగతా నిధులు.. పోలవరానికి మిగతా రూ.3,222.75 కోట్లను కూడా రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి టి.రాజేశ్వరిని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఆదిత్యనాథ్ దాస్ కోరారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖకు పంపామని, త్వరలోనే నిధులు విడుదలయ్యేలా చూస్తామని టి.రాజేశ్వరి పేర్కొన్నారు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి రూ.రెండు వేల కోట్ల బిల్లులను మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. -
అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలకోసం భారీ ప్రాజెక్టులు చేపట్టేకంటే ఉపరితల నీరు, భూగర్భ జలాల సమగ్ర వినియోగంపై దృష్టి పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దక్షిణాది రాష్ట్రాలకు సూచించారు. ఎక్కడి నీటిని అక్కడే వినియోగించేలా ప్రభుత్వాల విధానాలు, కార్యాచరణలు ఉండాలని తెలిపారు. అంతేతప్ప భారీ ప్రాజెక్టులు చేపట్టి, వాటికి కేంద్రం నిధులు ఇవ్వాలని కోరితే మాత్రం తాము ఇవ్వలేమని తేల్చిచెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే భారీ ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దన్నారు. కేంద్రం తీసుకొచ్చిన జల్‌జీవన్ మిషన్ అంశంపై జలశక్తి శాఖ దక్షిణాది రాష్ట్రాలతో హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్లో సోమవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ రాష్ట్రాల నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు హాజరయ్యారు. తెలంగాణ తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్, కర్ణాటక మంత్రి ఈశ్వరప్పతో పాటు సీఎస్ ఎస్కే జోషి, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, కాడా కమిషనర్ మల్సూర్, సీఈలు బంగారయ్య, వీరయ్య, మోహన్‌కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట జలశక్తి శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ జల్‌మిషన్ ప్రాథమ్యాలను వివరించారు. దేశంలోని 14.60 కోట్ల గ్రామీణ ప్రాంత గృహాలకు సురక్షిత నీటి సరఫరా చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని, దీనికోసం 2024 నాటికి ఏడాదికి రూ.40 వేల కోట్ల చొప్పున రూ.2 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుందని తెలిపారు. అనంతరం తెలంగాణసహా మిగతా రాష్ట్రాలు తాము చేపడు తున్న ప్రాజెక్టులు, వాటికి ఖర్చు చేస్తున్న నిధులు, వాటి ప్రయోజనాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించాయి. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు తమ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించాలని గట్టిగా కోరాయి. దీనిపై చివరగా కేంద్ర మంత్రి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రోల్స్‌రాయిస్ మీరిచ్చుకోండి.. మీ రాష్ట్రాల ప్రజలకు రోల్స్ రాయిస్ కారివ్వాలని అనుకుంటే రాష్ట్రాల నిధుల్లోంచి యథేచ్ఛగా నిధులు ఇచ్చుకోవచ్చని, అయితే కేంద్రం మాత్రం మారుతి–800 కారు మాత్రమే ఇస్తుందని షెకావత్ స్పష్టం చేశారు. అద్భుతమైన ప్రాజెక్టులు కట్టి మేము ఎక్కువ నిధులు ఖర్చు చేశాం కాబట్టి, కేంద్రం నిధులు ఇవ్వాలంటే మాత్రం తాము ఇవ్వలేమన్నారు. ఏపీ, తెలంగాణకంటే ఎక్కువ నీటి ఎద్దడి ఉన్న రాష్ట్రాలున్నాయని, నీటి ఎద్దడి ఉందన్న కారణంగా ఎక్కువ నిధులు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే భారీ ప్రాజెక్టులు కట్టాలని హితవు పలికారు. నీటి సద్వినియోగం కోసం అందరం కృషి చేయాలని, గ్రామం యూనిట్‌గా తాగునీటి సదుపాయాలు కల్పించాలన్నారు. నీటి పునర్వినియోగంలో రామకృష్ణా మిషన్ మోడల్ చాలా బాగుందని, దానిపై రాష్ట్రాలు దృష్టి సారించాలన్నారు. జలజీవన్ మిషన్ కింద మొదటి విడత నిధులు విడుదల చేశామని, రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి పనులు చేపట్టాలన్నారు. జల్ జీవన్ మిషన్ విజయవంతం కావడానికి తొలి ఆరు నెలల పనితీరే కీలకమని, సంబంధిత అధికారులంతా మిషన్ పనులను ప్రారంభించడంతో పాటు మెరుగైన పనితీరును కనబరచాలని షెకావత్ అన్నారు. నదుల అనుసంధానానికి నిధులివ్వాలి ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ, పోలవరం నుంచి రాయలసీమ ప్రాంతాలకు తాగు, సాగు నీరిచ్చేలా గోదావరి–పెన్నా నదుల అనుసంధానం చేపడుతున్నామని తెలిపారు. దీన్ని 2021 నాటికి పూర్తి చేస్తామని, దీనికి కేంద్ర సహకారం అందించాలని కోరారు. ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజ శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఏపీలో ఎక్కువగా గిరిజన, కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాలున్నాయని, ఇక్కడి తాగునీటి అవసరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఎక్కువ నిధులివ్వాలని కోరారు. ఇదే సమయంలో కర్ణాటక ప్రతినిధులు మాట్లాడుతూ, మిషన్ భగీరథపై ప్రశంసలు కురిపించారు. ‘భగీరథ’కి నిధులివ్వాలి సీఎస్ ఎస్కే జోషి తెలంగాణ తరఫున సీఎస్ ఎస్కే జోషి మాట్లాడుతూ, రక్షిత తాగునీటి సరఫరాలో అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణ ముందుందని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇప్పటికే తాగునీటి సరఫరా చేస్తున్నామని, భారీగా అప్పులు తెచ్చి దీన్ని పూర్తి చేశామని, వాటి తిరిగి చెల్లింపులకు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్న రాష్ట్రాలకు మరిన్ని నిధులు పెంచాలన్నారు. అన్ని రాష్ట్రాలను ఒకే గాటన కట్టకుండా, పనిచేసే రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న షెకావత్. చిత్రంలో సీఎస్ జోషి, మంత్రి దయాకర్‌రావు, ఏపీ మంత్రి అనిల్ తదితరులు