
సాక్షి, వైఎస్సార్ కడప : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) దేశ రక్షణ కోసమేనని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ పేర్కొన్నారు. జిల్లాలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ హాజరయ్యారు. ఆయన సమక్షంలో టీడీపీ మాజీ అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ బీజేపీలో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకే ఈ చట్టాలను తీసుకు వచ్చామని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు తీసుకు వచ్చామని, భారత భూభాగమైన కశ్మీర్‌లో 390 ఆర్టికల్ రద్దు ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని ప్రశంసించారు. ముస్లిం దేశాల్లో అమలు చేయని ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకు వచ్చామన్నారు. దేశంలో అశాంతి సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని విమర్శించారు. దేశ భద్రత కోసం తెచ్చిన చట్టాలను వ్యతిరేకించడం తగదని అన్నారు.
పాకిస్తాన్‌లో హిందువులను ఉండనివ్వడం లేదని, అక్కడ పది లక్షల మంది శరణార్థులుగా ఉన్నారన్నారు. పౌరసత్వం కోసం 11 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని, వారి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేక పిల్లలను చదివించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ వెంట రాహుల్ నడుస్తున్నారని, వీరికి ఓటు బ్యాంకు రాజకీయాలు తగవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల్లో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వాస్తవాలను తెలియజేసేందుకు ఇంటింటికి వెళ్తామన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి అందరూ మద్దతు పలకాలని, సీఏఏకు మద్దతు తెలిపేందుకు 8866288662కు మిస్డ్ ఇవ్వాలని సూచించారు. ప్రజల మద్దతు తమకు ఉంటే మమతా, రాహుల్, ఎంఐఎం పార్టీ ఏమి చేయలేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment