శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను శాలువాతో సత్కరిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ : చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కురిసిన వర్షాలతో హైదరాబాద్ తీవ్రంగా అతలాకుతలమైందని, ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు నిధి నుంచి సాయం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఢిల్లీ వచ్చిన కేసీఆర్.. షాతో సమావేశమయ్యారు. భారీ వర్షాలు, మునుపెన్నడూ లేని వరదలతో హైదరాబాద్ అతలాకుతలమైన తీరు, జరిగిన నష్టాన్ని సుదీర్ఘంగా ఆయనకు వివరించారు. వందలాది కాలనీలు నీట మునిగి హైదరాబాద్ వాసులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారని, బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సాయం అందించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల వల్ల దాదాపు రూ.5వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని.. తక్షణ సాయం కింద రూ.1,350 కోట్లు సాయం అందించాలని ప్రధాని మోదీకి అక్టోబర్ 15న లేఖ రాసినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో వరద బాధితుల పునరావాస చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కేసీఆర్ కోరారు.
రాజకీయ అంశాలూ చర్చకు..?
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం కేసీఆర్ దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. వరదసాయం, తెలంగాణలోని ఇతరత్రా అంశాలతోపాటు రాజకీయపరమైన విషయాలూ ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. కేంద్రంలో బీజేపీకి అంశాలవారీగా మద్దతిస్తూ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్న టీఆర్‌ఎస్‌కు.. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వైఖరి కొంత ఇబ్బందిగా మారింది. గతంలోనూ పలుమార్లు టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య కొంత దూరం పెరిగినా తిరిగి ఎన్నికల అనంతరం సర్దుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు పార్టీల మధ్య సామరస్య వాతావరణం నెలకొల్పడం ద్వారా తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రప్పించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని.. అందుకే కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ట్రిబ్యునల్ మళ్లీ ఏర్పాటు చేయండి..
శుక్రవారం ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్.. తొలుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అభ్యర్థించారు. కృష్ణా నదీ జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య తిరిగి పంచేందుకు వీలుగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956 పరిధిలోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ను మళ్లీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు లేఖ కూడా సమర్పించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఉందని, 3 టీఎంసీల సామర్థ్యానికి అనుమతి రావాల్సి ఉందని వివరించారు. పర్యావరణ అనుమతులు రాకముందే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణం ప్రారంభించిందని, దీనిపై ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి, నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశాలపై కూడా షెకావత్‌తో కేసీఆర్ చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలు సహా ఇటీవలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తరపున లేవనెత్తిన అంశాల్లో కొన్నింటిని మరోసారి మంత్రి వద్ద ప్రస్తావించినట్టు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment