![Who is Delhi New CM: BJP Plan Surprise Feat Again](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/BJP_Delhi_CM_Pick.jpg.webp?itok=f_h5gROn)
దేశ రాజధాని రీజియన్‌లో దాదాపు.. మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో తొందరపాటు పనికి రాదని భావిస్తోంది. ఇందుకు గత అనుభవాలతో పాటు ప్రస్తుత సామాజిక పరిస్థితులు కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్యాకేజీల సర్‌ప్రైజ్‌లను ఇవ్వబోతుందని సంకేతాలు అందుతున్నాయి.
ఢిల్లీకి 1991లో పాక్షిక రాష్ట్ర హోదా దక్కింది. 1993లో జరిగిన ఢిల్లీ తొలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే.. ఐదేళ్ల కాలంలో రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల అసంతృప్తి నడుమ ముగ్గురు ముఖ్యమంత్రులను(మదన్ లాల్ ఖురానా, షాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్) మార్చాల్సి వచ్చింది. ఆపై అధికారం కోసం మళ్లీ ఇన్నేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ తరుణంలో.. సుదీర్ఘ కాలం తర్వాత దక్కిన అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకుంటోంది.
సర్‌ప్రైజ్ తప్పదా?
ఈ మధ్య గెలిచిన రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయాలు రాజకీయ వర్గాల అంచనాలను సైతం బోల్తా కొట్టించాయి. మధ్యప్రదేశ్‌కు మోహన్ యాదవ్, రాజస్థాన్‌కు భజన్ లాల్ శర్మ, ఛత్తీస్‌గఢ్‌కు విష్ణుదేవ్ సాయ్‌లను ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. ఇందులో.. రాజస్థాన్ విషయంలో ఏకంగా తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన భజన్ లాల్‌కు సీఎం పగ్గాలు ఇవ్వడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఢిల్లీ విషయంలోనూ ఇలాంటి సర్‌ప్రైజ్ నిర్ణయం వెలువడే అవకాశం లేకపోలేదు.
అదే ఫార్ములా!
ఢిల్లీ కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను బీజేపీ తెరపైకి తెస్తోంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇదే పద్ధతిని అవలంభిస్తోంది. అలాగే.. ఢిల్లీని బీజేపీ మినీ ఇండియాగా భావిస్తోంది. బీజేపీ విజయంలో పంజాబీలు, సిక్కులు, పూర్వాంచలీస్, ఉత్తరాఖండీస్, వైశ్యాస్, జాట్.. ఇలా అన్ని వర్గాల ప్రజలు భాగమయ్యారని బీజేపీ భావిస్తోంది. కాబట్టి డిప్యూటీ సీఎంల ఎంపికలోనూ సామాజిక సమీకరణను ప్రముఖంగా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది.
రేసులో ఎవరంటే..
ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ మాజీ ఛీప్‌లు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయలతో పాటు సీనియర్ నేతలు మంజిదర్ సింగ్ సిర్సా, పవన్ శర్మ, అశిష్ సూద్ మహిళా నేతలు రేఖా గుప్తా, శిఖా రాయ్ పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక.. కొత్తగా ఎమ్మెల్యేలుగా నెగ్గిన కర్ణెయిల్ సింగ్, రాజ్‌కుమార్ భాటియా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. హ్యాట్రిక్ ఎంపీ మనోజ్ కుమార్ తివారీ(సింగర్), కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా పేరును సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో జాతీయ నాయకత్వం ఇప్పటికే ఢిల్లీ బీజేపీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. సీఎం రేసుతో పాటు కేబినెట్ కోసం పలువురి పేర్లతో కూడిన జాబితాను పరిశీలిస్తోంది. అవినీతి ప్రభుత్వంగా పేర్కొంటూ ఆప్‌ను బీజేపీ గద్దె దించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి విషయంలో కుల సమీకరణాలతో పాటు ‘క్లీన్ ఇమేజ్’ను పరిగణనలోకి తీసుకుంటోందని సమాచారం. ప్రస్తుతం బీజేపీ అగ్రనేత, ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. అలాగే.. సోమ, లేదంటే మంగళవారాల్లో బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఆ భేటీ తర్వాత సీఎం ఎవరనేదానిపై స్పష్టమైన ప్రకటన వెలుడే అవకాశం ఉంది. ఈ నెల 19 లేదంటే 20వ తేదీ ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది తాజా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment