అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దు | Union Minister Shekhawat Attended for Southern States Conference At Hyderabad | Sakshi
Sakshi News home page

అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దు

Published Tue, Nov 12 2019 3:35 AM | Last Updated on Tue, Nov 12 2019 3:35 AM

Union Minister Shekhawat Attended for Southern States Conference At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలకోసం భారీ ప్రాజెక్టులు చేపట్టేకంటే ఉపరితల నీరు, భూగర్భ జలాల సమగ్ర వినియోగంపై దృష్టి పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ దక్షిణాది రాష్ట్రాలకు సూచించారు. ఎక్కడి నీటిని అక్కడే వినియోగించేలా ప్రభుత్వాల విధానాలు, కార్యాచరణలు ఉండాలని తెలిపారు. అంతేతప్ప భారీ ప్రాజెక్టులు చేపట్టి, వాటికి కేంద్రం నిధులు ఇవ్వాలని కోరితే మాత్రం తాము ఇవ్వలేమని తేల్చిచెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే భారీ ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దన్నారు. కేంద్రం తీసుకొచ్చిన జల్‌జీవన్‌ మిషన్‌ అంశంపై జలశక్తి శాఖ దక్షిణాది రాష్ట్రాలతో హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్‌ రాష్ట్రాల నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల అధికారులు హాజరయ్యారు.

తెలంగాణ తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఏపీ జలవనరుల మంత్రి అనిల్‌ కుమార్, కర్ణాటక మంత్రి ఈశ్వరప్పతో పాటు సీఎస్‌ ఎస్‌కే జోషి, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు మురళీధర్, హరిరామ్, కాడా కమిషనర్‌ మల్సూర్, సీఈలు బంగారయ్య, వీరయ్య, మోహన్‌కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట జలశక్తి శాఖ కార్యదర్శి పరమేశ్వరన్‌ అయ్యర్‌ జల్‌మిషన్‌ ప్రాథమ్యాలను వివరించారు. దేశంలోని 14.60 కోట్ల గ్రామీణ ప్రాంత గృహాలకు సురక్షిత నీటి సరఫరా చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని, దీనికోసం 2024 నాటికి ఏడాదికి రూ.40 వేల కోట్ల చొప్పున రూ.2 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుందని తెలిపారు. అనంతరం తెలంగాణసహా మిగతా రాష్ట్రాలు తాము చేపడు తున్న ప్రాజెక్టులు, వాటికి ఖర్చు చేస్తున్న నిధులు, వాటి ప్రయోజనాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రదర్శించాయి. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు తమ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించాలని గట్టిగా కోరాయి. దీనిపై చివరగా కేంద్ర మంత్రి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రోల్స్‌రాయిస్‌ మీరిచ్చుకోండి.. 
మీ రాష్ట్రాల ప్రజలకు రోల్స్‌ రాయిస్‌ కారివ్వాలని అనుకుంటే రాష్ట్రాల నిధుల్లోంచి యథేచ్ఛగా నిధులు ఇచ్చుకోవచ్చని, అయితే కేంద్రం మాత్రం మారుతి–800 కారు మాత్రమే ఇస్తుందని షెకావత్‌ స్పష్టం చేశారు. అద్భుతమైన ప్రాజెక్టులు కట్టి మేము ఎక్కువ నిధులు ఖర్చు చేశాం కాబట్టి, కేంద్రం నిధులు ఇవ్వాలంటే మాత్రం తాము ఇవ్వలేమన్నారు. ఏపీ, తెలంగాణకంటే ఎక్కువ నీటి ఎద్దడి ఉన్న రాష్ట్రాలున్నాయని, నీటి ఎద్దడి ఉందన్న కారణంగా ఎక్కువ నిధులు ఇవ్వలేమని తేల్చిచెప్పారు.

అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే భారీ ప్రాజెక్టులు కట్టాలని హితవు పలికారు. నీటి సద్వినియోగం కోసం అందరం కృషి చేయాలని, గ్రామం యూనిట్‌గా తాగునీటి సదుపాయాలు కల్పించాలన్నారు. నీటి పునర్వినియోగంలో రామకృష్ణా మిషన్‌ మోడల్‌ చాలా బాగుందని, దానిపై రాష్ట్రాలు దృష్టి సారించాలన్నారు. జలజీవన్‌ మిషన్‌ కింద మొదటి విడత నిధులు విడుదల చేశామని, రాష్ట్రాలు మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ ఇచ్చి పనులు చేపట్టాలన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ విజయవంతం కావడానికి తొలి ఆరు నెలల పనితీరే కీలకమని, సంబంధిత అధికారులంతా మిషన్‌ పనులను ప్రారంభించడంతో పాటు మెరుగైన పనితీరును కనబరచాలని షెకావత్‌ అన్నారు.

నదుల అనుసంధానానికి నిధులివ్వాలి 
ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ, పోలవరం నుంచి రాయలసీమ ప్రాంతాలకు తాగు, సాగు నీరిచ్చేలా గోదావరి–పెన్నా నదుల అనుసంధానం చేపడుతున్నామని తెలిపారు. దీన్ని 2021 నాటికి పూర్తి చేస్తామని, దీనికి కేంద్ర సహకారం అందించాలని కోరారు. ఏపీ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజ శంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, ఏపీలో ఎక్కువగా గిరిజన, కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాలున్నాయని, ఇక్కడి తాగునీటి అవసరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఎక్కువ నిధులివ్వాలని కోరారు. ఇదే సమయంలో కర్ణాటక ప్రతినిధులు మాట్లాడుతూ, మిషన్‌ భగీరథపై ప్రశంసలు కురిపించారు. 

‘భగీరథ’కి నిధులివ్వాలి సీఎస్‌ ఎస్‌కే జోషి 
తెలంగాణ తరఫున సీఎస్‌ ఎస్‌కే జోషి మాట్లాడుతూ, రక్షిత తాగునీటి సరఫరాలో అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణ ముందుందని అన్నారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇప్పటికే తాగునీటి సరఫరా చేస్తున్నామని, భారీగా అప్పులు తెచ్చి దీన్ని పూర్తి చేశామని, వాటి తిరిగి చెల్లింపులకు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్న రాష్ట్రాలకు మరిన్ని నిధులు పెంచాలన్నారు. అన్ని రాష్ట్రాలను ఒకే గాటన కట్టకుండా, పనిచేసే రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న షెకావత్‌. చిత్రంలో సీఎస్‌ జోషి, మంత్రి దయాకర్‌రావు, ఏపీ మంత్రి అనిల్‌ తదితరులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement