సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం, మనుగడ, సుస్థిరతలపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేననెత్తిన సందేహాల్లో కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని, వాటికి కూడా బదులిస్తే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీని పరిశీలిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్లు తెలిసింది.
జీఎస్టీ సమావేశంలో పాల్గొనేందుకు గత జూలైలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అక్కడ జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తాజాగా షెకావత్ స్పందించారు. మంత్రి హరీశ్‌రావు స్వయంగా లేఖ రాశారు.
సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలు అసంపూర్ణంగా ఉన్నాయని, అన్ని అంశాలపై సమగ్ర సమాధానాలను ఇవ్వాలని లేఖలో కోరినట్టు తెలిసింది. ఆ వెంటనే ప్రాజెక్టుకు అనుమతుల జారీ ప్రక్రియను పునరుద్ధరిస్తామని కూడా తెలియజేసినట్టు సమాచారం.
ఇబ్బందికర ప్రశ్నలు..క్లుప్తంగా వివరాలు
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు చేసిన వ్యయం, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు యూనిట్‌కు రూ.3 చొప్పున విద్యుత్ సరఫరాకు తెలంగాణ ఈఆర్సీ అనుమతి ఇచ్చిందా? ప్రస్తుత విద్యుత్ చార్జీలు ఎంత? విద్యుత్ చార్జీల భారం దృష్ట్యా భవిష్యత్తులో ప్రాజెక్టు ఆర్థికంగా మనుగడ సాధిస్తుందా? ప్రాజెక్టు సుస్థిర మనుగడకు ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి ? ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎంత? రుణాలు, వడ్డీల రేట్లు ఎంత? తదితర వివరాలను అందజేయాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది.
గతేడాది జూలైలో గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లు ఎందుకు మునిగాయి? పంప్‌హౌస్‌లు, సర్విస్ బే ఎత్తుఎంత? జలాశయాల ఎఫ్‌ఆర్‌ఎల్ ఎంత? లాంటి సాంకేతిక అంశాలపై కూడా ఆరా తీసింది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన అన్ని కాంపోనెంట్ల డిజైన్లను సమర్పించాలని సూచించింది.
దూర ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణాలు, ప్రాజె క్టు కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలనూ అడిగింది. సీడబ్ల్యూసీ అడిగిన సమాచారం చాలావరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండడంతో వివరాలు క్లుప్తంగా అందజేసినట్టు తెలిసింది. కాగా ఈ సమాచారంపై సంతృప్తి చెందకపోవడంతోనే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీ ప్రక్రియ ను సీడబ్ల్యూసీ నిలుపుదల చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment