Minister Harish
-
కాళేశ్వరంపై సందేహాలన్నీ తీర్చండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం, మనుగడ, సుస్థిరతలపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేననెత్తిన సందేహాల్లో కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని, వాటికి కూడా బదులిస్తే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీని పరిశీలిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్లు తెలిసింది. జీఎస్టీ సమావేశంలో పాల్గొనేందుకు గత జూలైలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అక్కడ జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తాజాగా షెకావత్ స్పందించారు. మంత్రి హరీశ్‌రావు స్వయంగా లేఖ రాశారు. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలు అసంపూర్ణంగా ఉన్నాయని, అన్ని అంశాలపై సమగ్ర సమాధానాలను ఇవ్వాలని లేఖలో కోరినట్టు తెలిసింది. ఆ వెంటనే ప్రాజెక్టుకు అనుమతుల జారీ ప్రక్రియను పునరుద్ధరిస్తామని కూడా తెలియజేసినట్టు సమాచారం. ఇబ్బందికర ప్రశ్నలు..క్లుప్తంగా వివరాలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు చేసిన వ్యయం, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు యూనిట్‌కు రూ.3 చొప్పున విద్యుత్ సరఫరాకు తెలంగాణ ఈఆర్సీ అనుమతి ఇచ్చిందా? ప్రస్తుత విద్యుత్ చార్జీలు ఎంత? విద్యుత్ చార్జీల భారం దృష్ట్యా భవిష్యత్తులో ప్రాజెక్టు ఆర్థికంగా మనుగడ సాధిస్తుందా? ప్రాజెక్టు సుస్థిర మనుగడకు ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి ? ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎంత? రుణాలు, వడ్డీల రేట్లు ఎంత? తదితర వివరాలను అందజేయాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. గతేడాది జూలైలో గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లు ఎందుకు మునిగాయి? పంప్‌హౌస్‌లు, సర్విస్ బే ఎత్తుఎంత? జలాశయాల ఎఫ్ఆర్ఎల్ ఎంత? లాంటి సాంకేతిక అంశాలపై కూడా ఆరా తీసింది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన అన్ని కాంపోనెంట్ల డిజైన్లను సమర్పించాలని సూచించింది. దూర ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణాలు, ప్రాజె క్టు కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలనూ అడిగింది. సీడబ్ల్యూసీ అడిగిన సమాచారం చాలావరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండడంతో వివరాలు క్లుప్తంగా అందజేసినట్టు తెలిసింది. కాగా ఈ సమాచారంపై సంతృప్తి చెందకపోవడంతోనే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీ ప్రక్రియ ను సీడబ్ల్యూసీ నిలుపుదల చేసినట్టు సమాచారం. -
శ్రీగిరిపల్లి పిల్లలకు చేయూత
గజ్వేల్: ‘సాక్షి’ప్రయత్నం ఫలించింది. తల్లిదండ్రుల మృతితో అనాథలైన పిల్లలకు ప్రభుత్వ ఆసరా లభించింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు దృష్టికి ఈ పిల్లల దైన్యస్థితిని తీసుకెళ్లడంతో చలించిన ఆయన, వారిని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సోమవారం ఐదుగురు పిల్లలకు మొత్తం రూ.2.5 లక్షల చెక్కులను అందజేశారు. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో చిన్ననర్సని యాదయ్య, లక్ష్మి దంపతుల మృతితో వారి కుమారుడు సతీశ్‌తో పాటు నలుగురు కూతుళ్లు అనూష, అశ్విని, మేనక, స్పందనలు అనాథలైన విషయాన్ని జూన్ 7న ‘సాక్షి’మెయిన్ సంచిక వెలుగులోకి తెచ్చింది. ఏడాది క్రితం అనారోగ్యంతో తండ్రి చనిపోగా.. తల్లి కరోనా కారణంగా జూన్ 6న మృత్యువాత పడడంతో ఈ పిల్లలంతా అనాథలైన సంగతి తెలిసిందే. ఎలాంటి ఆస్తిపాస్తులు లేని ఈ కుటుంబానికి రెక్కల కష్టమే జీవనాధారం. ఇలాంటి తరుణంలో పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. కుటుంబ పరిస్థితుల కారణంగా సతీశ్ కొద్ది రోజుల నుంచి బైక్ మెకానిక్ పని నేర్చుకుంటున్నాడు. అనూష టెన్త్ పూర్తి చేసింది. ఆశ్విని 10వ తరగతి, స్పందన ఏడో తరగతి, మేనక అయిదో తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకువెళ్లింది. వెంటనే స్పందించిన ఆయన పిల్లల పరిస్థితిపై విచారణ చేపట్టి నివేదిక అందించాలని గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డికి ఆదేశాలిచ్చారు. విచారణ అనంతరం ముత్యంరెడ్డి కొన్ని రోజుల క్రితం నివేదికను అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు పిల్లలకు ఒక్కొక్కరి పేరిట రూ.50 వేల చొప్పున మొత్తంగా రూ. 2.5 లక్షల సాయాన్ని కలెక్టర్ ప్రకటించారు. సోమవారం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ‘గడా’ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి బాధిత పిల్లలకు చెక్కులను అందజేశారు. -
జర్నలిస్టుల హత్యలు పెరిగిపోతున్నాయి
హైదరాబాద్: జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయిందని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ప్రముఖ జర్నలిస్ట్ అరుణ్‌సాగర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో సాయినాథ్ మాట్లాడారు. అవినీతికి, కుంభకోణాలకు వ్యతిరేకంగా కథనాలు రాసే జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారని.. ఈ హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్ట్రింగర్లు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులే హత్యకు గురైన వారిలో ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. 1992–2016 మధ్యకాలంలో 50 మంది జర్నలిస్టులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. అనంతరం మీడియా సంక్షోభం గురించి మాట్లాడారు. విద్య సంస్కారాన్ని, సామాజిక బాధ్యతను నేర్పుతుందని.. ఈ రెండు అంశాలకు అరుణ్ సాగర్ జీవితం నిలువుటద్దమని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధి వంటి వారన్నారు. పెరిగిపోయిన పోటీతత్వంతో జర్నలిస్టులు ఒత్తిడికి గురై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా వారికి హెల్త్‌కార్డులు ఇచ్చామన్నారు. అరుణ్‌సాగర్ మరణం జర్నలిజానికి తీరని లోటని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉత్తమ జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం ఉత్తమ జర్నలిస్టులకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్నకు అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రథమ బహుమతి ‘సాక్షి’టీవి అసోసియేట్ ఔట్ పుట్ ఎడిటర్ యాజులు (ఖాకీలు చింపిన బస్తర్)కు, ప్రింట్ మీడియాలో తృతీయ బహుమతి ‘సాక్షి’పెద్దపల్లి ఆర్సీ ఇన్చార్జి కట్ట నరేంద్రచారి (వారికి ఒక రోజు వెలుగులు)కి లభించాయి. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ద్వితీయ బహుమతి హెచ్ఎంటీవీ మహబూబ్‌నగర్ స్టాఫ్ రిపోర్టర్ నరేంద్రచారి (ఆ నలుగురు పిల్లల కథనం)కు, తృతీయ బహుమతి ఈటీవీ ఆదిలాబాద్ విలేకరి మాణికేశ్వర రావు (అరణ్యవాసం)కు లభించాయి. ప్రింట్ మీడియాలో ప్రథమ బహుమతి ‘నమస్తే తెలంగాణ’అంబర్పేట్ జోన్ విలేకరి వర్కాల కిష్టయ్య (మరణము శాపమేనా)కు, ద్వితీయ బహుమతి ‘నవ తెలంగాణ’మహబూబ్‌నగర్ విలేకరి శివరామ కృష్ణ (తెలంగాణ ఎడారి బతుకు చిత్రం)కు, మరో తృతీయ బహుమతి ‘ఆంధ్రజ్యోతి’హుజూరాబాద్ విలేకరి కోల నాగేశ్వరరావు (గిరిజన కన్నీటి సాగరం)ను వరించాయి. వీరందరినీ హరీశ్‌రావు అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్, నమస్తే తెలంగాణ సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి, టీవీ–5 ప్రతినిధి వసంత్, కవి కె.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పనిచేసే చోటే ప్రసవం
గజ్వేల్: ప్రభుత్వాస్పత్రిలోనే కాన్పులు జరపాలన్న సర్కార్ లక్ష్యానికి ఓ మహిళా డాక్టర్ ఆదర్శంగా నిలిచారు. విధులు నిర్వహిస్తున్న చోటే సాధారణ మహిళల మాదిరిగా కాన్పు చేయించుకొని పాపకు జన్మనిచ్చారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న త్రివేణి.. ఏడాదిగా డిప్యుటేషన్‌పై గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో హైరిస్క్ మానిటరింగ్ సెంటర్ (ప్రసూతి కేంద్రం)లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గర్భిణిగా ఉన్న ఆమె తాను పనిచేస్తున్న ఆస్పత్రిలోనే కాన్పు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె ఆలోచనను భర్త డాక్టర్ రాము సైతం ఏకీభవించారు. రాము ములుగు మండలం సింగన్నగూడ పీహెచ్సీలో చిన్న పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నారు. భార్య కాన్పు కోసం సోమవారం గజ్వేల్ ప్రసూతి కేంద్రానికి తీసుకొచ్చారు. సాయంత్రం త్రివేణి ఆపరేషన్ ద్వారా పాపకు జన్మనిచ్చారు. ఆమెతో పాటు సోమవారం మొత్తం 17 డెలివరీలు జరగ్గా.. అందులో 10 మందికి ఆపరేషన్లు, మిగిలిన వారికి నార్మల్ డెలివరీలు చేశారు. త్రివేణి, పాప ప్రస్తుతం ఆస్పత్రిలోనే వైద్యం పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు డాక్టర్ రాముకు ఫోన్లో అభినందనలు తెలిపారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మ కాన్ని పెంచేందుకు తాము చేస్తున్న ప్రయత్నానికి అండగా నిలిచారంటూ ప్రశంసించారు. అధికారులు, నేతలు త్రివేణికి అభినందనలు తెలపడమే కాకుండా కేసీఆర్ కిట్‌ను అందించారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ సైతం అభినందించారు. -
గ్రీన్ ట్రిబ్యునల్ స్టే తాత్కాలికమే
సాక్షి, యాదాద్రి/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్టే తాత్కాలిక అడ్డంకి మాత్రమేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం సాధిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం ఆయన నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్జీటీ స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ పైశాచిక ఆనందం అనుభవిస్తోందని విమర్శించారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేస్తున్న దశలో కాంగ్రెస్ కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీళ్లు ఇవ్వాలని మిషన్ భగీరథ చేపట్టామని, ఇందులో కాళేశ్వరం అత్యంత ప్రాధాన్యత కలిగిందన్నారు. కుళ్లు రాజకీయాలతో కాంగ్రెస్ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని చెప్పారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని ప్రభుత్వం చేపట్టిన డిండి ప్రాజెక్టునూ కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నేరుగా నష్టపరిహారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తూ.. రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జనవరిలో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులోకి నీళ్లు వదులుతామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో మార్కెట్ నిర్మాణం నల్లగొండ జిల్లాలో చేపట్టిన బత్తాయి మార్కెట్ నిర్మాణాన్ని నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. అలాగే దొండ, నిమ్మ మార్కెట్ల నిర్మాణాన్ని రెండు, మూడు మాసాల్లో పూర్తి చేస్తామన్నారు. నాడు తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎం... ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటోందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో తెలంగాణలో సీపీఎంకు స్థానం లేదన్నారు. రాష్ట్రంలో సీపీఎంకు ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు ఉందని, అది కూడా త్వరలోనే ఖాళీ అవుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ, భువనగిరి ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, జడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 24 గంటలు వద్దు.. 12 గంటలు ముద్దు నల్లగొండలో 24 గంటల విద్యుత్‌పై హరీశ్‌రావు ప్రసంగిస్తున్న సమయంలో కట్టంగూరు మండలం ఈదులూరుకు చెందిన రాములు అనే రైతు లేచి 24 గంటల విద్యుత్ వద్దని 9 గంటలు చాలని అన్నాడు. దీంతో మంత్రి జోక్యం చేసుకుని 24 గంటల విద్యుత్ ఎందుకు వద్దుంటున్నావ్..? అని అడిగారు. నీళ్లు సరిపోవడం లేదని, బోర్లులో నీళ్లు ఉండటం లేదని 9 గంటలు ఇస్తే చాలని రాములు చెప్పాడు. రాములు వ్యక్తం చేసిన అభిప్రాయం పైన మంత్రి అభిప్రాయ సేకరణ చేశారు. రాములుకు మద్ధతుగా చేతులు ఎత్తాలని మంత్రి కోరారు. దీంతో సభకు హాజరైన వారిలో కొందరు 9 గంటలు కావాలని, మరికొందరు 12 గంటలు ఇవ్వాలని కోరారు. మీ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. -
తొలుత ఒడిశాను ఒప్పించండి
- మహానది–గోదావరి అనుసంధానంపై కేంద్రానికి రాష్ట్రం సూచన - ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో మంత్రి హరీశ్ న్యూఢిల్లీ: మహానది–గోదావరి నదుల అను సంధానంపై తొలుత ఒడిశాను ఒప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన జాతీయ నీటి అభివృద్ధి ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహానది–గోదావరి నదుల అనుసంధానం తర్వాతే గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం సముచితమన్నారు. 2, 3 నదుల అనుసంధానంతో రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడవచ్చన్నారు. నదుల ఇంట్రాలింకింగ్‌ను ప్రోత్సహించాలి.. ప్రతి రాష్ట్రంలో అంతర్గతంగా నదుల అను సంధానాన్ని (ఇంట్రాలింక్) ప్రోత్సహించాలని కేంద్రాన్ని మంత్రి కోరారు. కృష్ణా నదిలో నీరు లేని సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటిస్థాయి తగ్గిపోతోందన్నారు. గోదావరిలో నీటి లభ్యత ఉన్నా కృష్ణా పరీవాహక ప్రాంతాలకు తరలించలేని పరిస్థి తులు ఉన్నాయన్నారు. ఈ సమస్యను పరిష్క రించేందుకు రాష్ట్రాల్లో ఇంట్రాలింకింగ్‌ను కేంద్రం ప్రోత్సహించాలన్నారు. దీనిపై గడ్కరీ స్పందిస్తూ ఇంట్రాలింకింగ్కు సంబంధించి త్వరలో భారీ ప్రణాళికను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. పెండింగ్ నిధులు విడుదల చేయండి... ఏఐపీబీ స్కీం కింద రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రావాల్సిన రూ. 107.49 కోట్లు, శ్రీరాంసాగర్ స్టేజ్–2 ప్రాజెక్టుకు రూ. 30.34 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని గడ్కరీని హరీశ్‌రావు కోరారు. గోదావరి వృథా జలాలను కృష్ణాబేసిన్‌కు తరలించేందుకు ఇచ్చంపల్లి– నాగార్జునసాగర్, ఇచ్చంపల్లి– పులిచింతల ప్రాజెక్టుల అనుసంధానానికి ప్రతిపాదించిన కేంద్రం.. అవే వృథా జలాలను వాడుకునేందుకు చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఎందుకు మంజూరు చేయడం లేదన్నారు. -
సిద్దిపేట.. ఆకుపచ్చ తోట
రాష్ట్రానికి ఆదర్శంగా మున్సిపాలిటీ.. - మంత్రి హరీశ్ సంకల్పం, ప్రజల సహకారంతోనే.. - పట్టణంలోని రహదారుల వెంబడి 2 లక్షల మొక్కలు - ‘మూడో విడత’లో మొక్కలు సంరక్షించే వారిపేరిట సైన్ బోర్డులు సాక్షి, హైదరాబాద్: కాలుష్య రహిత పట్టణంగా, 100 శాతం మరుగుదొడ్లు ఉన్న నియోజకవర్గంగా రాష్ట్ర స్థాయిలో ప్రశంసలందుకున్న సిద్దిపేట మున్సిపాలిటీ.. హరితహారంలోనూ అదే తరహాలో ముందుకు సాగుతోంది. మంత్రి హరీశ్ ప్రత్యేక చొరవ, అధికారుల పనితీరు, ప్రజల సహకారంతో ఆకుపచ్చని తోటలా మారింది. పట్టణంలో 5 ప్రధాన చౌరస్తాలు కలిపి 14.8 కిలో మీటర్ల పొడవుండగా దాదాపు 2 లక్షలకు పైగా మొక్కలు ఈ రహదారుల వెంట కనిపిస్తాయి. ఆత్మీయులకు చిహ్నంగా.. చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పట్టణంలో మొదలుపెట్టారు. గతించిన వారి జ్ఞాపకార్థం శ్మశాన వాటిక స్థలంలో మొక్క నాటుకోవచ్చు. నామమాత్రపు రుసుంతో ఏడాదిపాటు మొక్క సంరక్షణ బాధ్యతలను మున్సిపాలిటీ తీసుకుంటుంది. వర్ధంతి రోజున మొక్క వద్ద కాసేపు సేదతీరేలా పరిసరాల్లో వసతులను మున్సిపాలి టీనే ఏర్పాటు చేస్తుంది. భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఆలోచనల్లోంచి రూపుదిద్దు కున్న ఈ కార్యక్రమం సిద్దిపేటలో ఆచారంగా మారింది. సంరక్షించే వారి పేర్లతో సైన్ బోర్డులు ఈ ఏడాది పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించేలా కార్యాచ రణ రూపొందించారు. మొక్క నాటి సంరక్షించే వారి పేర్ల మీద సైన్ బోర్డులు పెడుతున్నారు. ఉద్యోగుల ముంగిట్లో కార్పొరేట్ వైద్యం సిద్దిపేటజోన్: దేశంలో ఎక్కడా లేని విధంగా వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వీటి ద్వారా ఉద్యోగులకు, జర్నలిస్టులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందనున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో జరిగిన పలు సభల్లో మాట్లాడారు. కులవృత్తులను పరిరక్షించే క్రమంలో ఎంబీసీ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీల అభివృద్దికి రూ. వెయ్యి కోట్లను కేటాయిం చిందని, మంత్రి వివరించారు. పెఱిక కులస్తులను ఎంబీసీలో చేర్చడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 26 వేల పోలీసు ఉద్యోగాల పోస్టులను ప్రకటించామని, ఈ యేడు పదివేలు, వచ్చే యేడు మరో పదివేలు తర్వాత ఆరువేల చొప్పున భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇప్పుడు వాట్సాప్ మంత్రిగా హరీశ్‌రావు హరీశ్‌రావుకు గతంలో కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే అని పేరుంది. ఇప్పుడు ఆయన్ను వాట్సాప్ మంత్రి అని పిలుస్తున్నారు. రోజుకు 18 గంటలు వాట్సప్‌లో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పుట్టిన రోజు, పర్వదినాల్లో ప్రజలు మొక్కలు నాటి ఫొటోలు వాట్సప్‌లో పెడితే ఆయన అభినందించడమే కాకుండా పుట్టిన రోజున చెట్లు నాటిన చిన్నారులకు స్వయంగా ఫోన్ చేసి ఆశీర్వదిస్తారు. సిద్దిపేటకు చెందిన సువర్ణ లక్ష్మి.. ఇటీవల హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డు పక్కన చెట్లు వంగిపోయి కనిపించాయి. వెంటనే ఆమె కారు ఆపి వంగిన మొక్కలన్నిటికీ నీళ్లు పోసి, సరిచేసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలను ఆ కారు డ్రైవర్ వాట్సప్ గ్రూప్‌లో పెట్టగా మంత్రి చూసి నేరుగా లక్ష్మికి ఫొన్ చేసి అభినందించారు. -
నల్లరేగడి నవ్వింది!
సింగూరు కింద తొలిసారి ధాన్యం సిరులు - 30 వేల ఎకరాల్లో పసిడి పంటలు - యాసంగిలో ఊహించని స్థాయిలో దిగుబడి - ఆనందం వ్యక్తం చేస్తున్న రైతన్నలు - పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి హరీశ్ - స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి సింగూరు కింద నీళ్లందినట్టు వెల్లడి - వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తామని స్పష్టీకరణ సింగూరు ప్రాంతం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆ భూములన్నీ ఇన్నాళ్లూ వట్టిపోయాయి.. నీళ్లు లేక నోళ్లెళ్లబెట్టాయి.. తుప్పలు, ముళ్ల పొదలతో నిండిపోయాయి.. మూడు దశాబ్దాలుగా చుక్కనీటికి నోచుకోలేక బీళ్లుగా పడి ఉన్నాయి.. కానీ ఇప్పుడు ఆ భూముల్లో పసిడి పంట పండింది.. రైతుల ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది! ఇన్నాళ్లూ కోటి జనాభా ఉన్న జంట నగరాల దాహార్తిని తీర్చిన సింగూరు.. చరిత్రలో తొలిసారి ప్రాజెక్టు కింది గ్రామాల పంటలకు ప్రాణం పోసింది. గతేడాది వర్షాలతో మంజీరా పరవళ్లు తొక్కడం, అప్పటికే సిద్ధం చేసిన సింగూరు కాల్వల ద్వారా నీటి విడుదల జరగడంతో తొలిసారి 30 వేల ఎకరాలకు నీటి పారుదల శాఖ నీళ్లందించింది. ఈ ప్రాజెక్టు పరిధిలో తొలిసారి సాగు చేసిన పంటలు కోతకు రావడంతో కాల్వల పరిధిలోని గ్రామాల్లో నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం పర్యటించారు. రైతులతో ముఖాముఖి భేటీలు నిర్వహించారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు..? ఉమ్మడి మెదక్ జిల్లాలో 1976లో నిర్మించిన సింగూరు ప్రాజెక్టు తొలి నుంచి తాగునీటి ప్రాజెక్టుగానే ఉంది. 30 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని చేపట్టగా 11.59 టీఎంసీలను పూడిక, ఆవిరి నష్టాలకు కేటాయించి, మిగిలిన 18.41 టీఎంసీల్లో 8.35 టీఎంసీలు నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు, 4 టీఎంసీలు జంట నగరాల తాగునీటికి, మరో 4.06 టీఎంసీలను ఘణపూర్ ఆయకట్టు స్థిరీకరణకు కేటాయించారు. సింగూరు ప్రాజెక్టు కోసం 32,892 ఎకరాల భూమిచ్చి,. 68 గ్రామాలు ముంపులో పోయినా, ఏనాడూ పరీవాహక ప్రాంతాల పొలాలకు నీళ్లందలేదు. ప్రాజెక్టు నుంచి సాగునీటి అవసరాల కోసం దశాబ్దాలుగా ఆందోళనలు జరగడంతో 2006లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 జూన్ 7న రూ.88.99 కోట్ల అంచనా వ్యయంతో కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆయన తదనంతరం ఆ నిర్మాణాలు ఆగిపోయాయి. మళ్లీ తెలంగాణ ఏర్పాటుతో ఆ నిర్మాణాలు మొదలయ్యాయి. కాల్వల నిర్మాణానికి రూ.88.99 కోట్లు, ఎత్తిపోతలకు రూ.32.68 కోట్లు.. మొత్తంగా 121.67 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. కాల్వలకు రూ.34.02 కోట్లు, లిఫ్ట్‌కు రూ.15.80 కోట్లు విడుదల చేశారు. దీంతో కాలువలకు సంబంధించి 80.6 శాతం, లిఫ్ట్ పనులు వంద శాతం పూర్తయ్యాయి. 2017–18 బడ్జెట్లో సింగూరు కాల్వల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.49.50 కోట్లు కేటాయించింది. నిధుల విడుదలతో పనుల్లో వేగం పెరిగి కాల్వల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. ఇకపై పూర్తి ఆయకట్టుకు నీళ్లు.. ప్రాజెక్టు కింద నాలుగు మండలాల్లోని 44 గ్రామాల పరిధిలో 40 వేల ఆయకట్టుకు నీరదించడం లక్ష్యం కాగా.. యాసంగిలో 30,116 ఎకరాలకు నీటిని విడుదల చేశారు. అలాగే 72 చెరువులను నింపి, 9,076 ఎకరాలను స్థిరీకరించారు. ఇకపై పూర్తి ఆయకట్టుకు నీరందించనున్నారు. బుధవారం కాల్వల పరిధిలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఆందోల్, ముదుమాణిక్యం, పోతిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో పంటల దిగుబడులు, ధాన్యం రాశులను పరిశీలించారు. రైతుల పొలాల వద్దే వారి అనుభవాలను తెలుసుకున్నారు. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పల వద్ద ఆగుతూ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యం దిగుబడులపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కోటి ఎకరాల కలలో భాగమే..: మంత్రి హరీశ్ రైతులతో ముఖాముఖీ సందర్భంగా మంత్రి వివిధ గ్రామాల్లో ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి మెదక్ జిల్లాలో సింగూరు కాల్వల కింది ఆయకట్టుకు నీరందించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి ఎకరాల కలలో భాగమే సింగూరు కింద కాల్వలకు నీళ్లని పేర్కొన్నారు. ‘‘పూర్వ మెదక్ జిల్లాలో నిజాం హయాం తర్వాత ఒక్క కొత్త ఎకరాకు నీళ్లు పారకపోగా.. ఉన్న ఘణపూర్ ఆయకట్టు కింద 12 వేల ఎకరాల ఆయకట్టు తగ్గింది. కానీ తెలంగాణ ప్రభుత్వం సింగూరు కాల్వలకు రూ.60 కోట్ల మేర ఖర్చు చేసి ఈ ఏడాది 30 వేల ఎకరాలకు నీళ్లిచ్చింది. మరో 10 వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో నీళ్లివ్వనుంది. మరో 121 చెరువులను నింపి మరో 10 వేల ఎకరాలను స్థిరీకరించనుంది. గతంలో సింగూరు గ్రామాల్లో ఉన్న ముళ్ల పొదలన్నీ ఇప్పుడు పంట పొలాలయ్యాయి..’’ అని హరీశ్ అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే బడ్జెట్లో 40 శాతానికి పైగా నిధులు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకి వెచ్చిస్తోందని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, కరెంట్ కోతలు లేవని, కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పోయాయని అన్నారు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా 60 లక్షల టన్నుల పంట దిగుబడి వచ్చిందని చెప్పారు. పత్తి మద్దతు ధర రూ.4,160 ఉంటే ప్రస్తుతం మార్కెట్లో రూ.5 వేలకు పైగా ఉందని, పల్లికాయ ధర సైతం రూ.4,220 నుంచి రూ.5 వేలు దాటిందని, మొక్కజొన్న, కందులకు అదే మాదిరి మద్దతు ధర లభిస్తోందన్నారు. వచ్చే ఏడాది మే నుంచి రైతులకు పట్నం, పరిశ్రమలకు ఇస్తున్న మాదిరే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ రానే రాదని, ఇప్పుడు మాత్రం పొమ్మన్నా పోదని అన్నారు. ఎకరాకు రూ.4 వేల చొప్పున రాష్ట్రంలోని రైతులందరికీS వచ్చే ఏడాది మే నుంచి రూ.6 వేల కోట్ల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఇంత పంట పుట్టినప్పట్నుంచీ చూడలేదు సింగూరు కింద ఇన్ని నీళ్లు ఎన్నడూ చూడలే. నేను పుట్టినప్పట్నుంచీ చూడనంత పంట పడింది. ఇంతకుముందు గొర్లు కాసేవాణ్ణి. ఇప్పుడు నాకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నా. మంత్రి చెప్పి నట్లు పెట్టుబడికి సాయపడితే ఇక పట్నం దిక్కు చూసే గోసుండదు.. – చెన్నయ్య, రైతు, ఆందోల్ మళ్లీ వస్తే గొర్రె కూర పెడతా నాకు రెండెకరాలుంది. నాలుగేళ్లు పట్నంల కూరగాయలమ్మిన. నీళ్లు వచ్చినయని వచ్చి పంటల సాగు చేసిన. మంచి పంట వచ్చింది. వానాకాలానికి తయారుగా ఉన్నా. మంత్రి ముందస్తడని తెలిస్తే గొర్రె కోసెటొళ్లం. మళ్లొస్తే కచ్చితంగా గొర్రె కూర పెడతం.. – కొత్తగొల్ల శ్రీనివాస్, రైతు, ఆందోల్ ఇంత పంట జిందగీల చూస్తమనుకోలే.. నాకు 63 ఏళ్లు. ఇంతవరకు యాసంగిల ఇంత పంట చూడలే. జిందగీల చూస్తమనుకోలే. సింగూరు కాల్వలతో బంగారం లాంటి పంట పడింది. పెట్టుబడికి సైతం సాయం చేస్తామంటే ఇంకా పంటలు పండిస్తం. – బాల్‌రెడ్డి, రైతు, ముదుమాణిక్యం -
ఖరీఫ్‌లోగా మధ్యతరహా ప్రాజెక్టులు
పూర్తి చేయాలని అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మధ్యతరహా నీటిపారుదల పథకాలన్నీ వచ్చే ఖరీఫ్‌లోగా పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు అధి కా రులను ఆదేశించారు. ఈ పథకాలు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ యుద్ధపాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ వేసవిలోగా కాలువల పూడిక తొలగింపు, ‘అటవీ’క్లియరెన్స్ తదితర కార్యక్రమాలు పూర్తిచేస్తేనే ఖరీఫ్‌లో రైతులకు సాగునీరం దించగలమని తెలిపారు. రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరు వాగు తదితర పథకా లను పూర్తిస్థాయి అంచనాలు రూపొందించి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింది నిధుల కోసం ప్రతిపాదనలు పంపాల న్నారు. జిల్లాల వారీగా పెండింగ్ మధ్య తరహా ప్రాజెక్టుల పురోగతిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షిం చారు. అలాగే జిల్లాల వారీగా మైనర్ ఇరిగే షన్ కింద ఖరీఫ్, రబీలో జరుగుతున్న ఆయ కట్టు వివరాలను సమీక్షించారు. ఒకటి, రెండో విడత మిషన్ కాకతీయ కింద పెరి గిన, అదనపు ఆయ కట్టును కచ్చితంగా నమోదు చేయాలని.. ఆ మేరకు తనకు నివే దికలు ఇవ్వాలన్నారు. ఇదివరకే పూర్తయిన ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద వాస్తవంగా జరగవలసిన ఆయకట్టులో ’గ్యాప్’ ఆయకట్టును పూర్తి చేయాలని ఆదేశించారు. ఇకపై పదిరోజులకోసారి మిషన్ కాకతీయ మీడియా కాన్ఫరెన్స్ జరుగుతుందని తెలి పారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలు వల పరిస్థితిపై రెండు, మూడు రోజులలో సమీక్షిస్తానని, సింగూరు కాల్వల వెంట క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ సెక్రటరీ వికాస్ రాజ్, ఈఎన్సీ విజయప్రకాశ్, సీఈలు సునీల్, అనిల్, లింగరాజు, నాగేందర్ రావు, సురేశ్ కుమార్, బంగారయ్య, శంకర్‌నాయక్, శంక ర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే పాల్గొన్నారు. -
నెలాఖరులోగా పంపండి
‘మిషన్ కాకతీయ’మూడో విడత ప్రతిపాదనలపై మంత్రి హరీశ్ • మూడో విడత పనులపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ మూడో విడత ప్రతిపాదనలను ఈ నెలాఖరులోగా పంపాలని, తర్వాత ఎలాంటి ప్రతిపాదనలకు మంజూరు ఉండదని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. మార్చిలో వచ్చే ప్రతిపాదనలను నాలుగో విడతకు మళ్లిస్తామని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో మిషన్ కాకతీయపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడో విడతలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు పంపడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యకమంలో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం తగదని సూచించారు. మూడో విడత పనుల ప్రతిపాదనల్లో పాత మెదక్ జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్పిన మంత్రి.. ఆ జిల్లా ఎస్ఈ పద్మారావు, ఇతర అధికారులను అభినందించారు. త్వరగా ముగించండి. మిషన్ కాకతీయ మొదటి, రెండో విడతల్లో చేపట్టిన పనులు, పురోగతి, కొన్ని చోట్ల పూర్తి కాకుండా ఇంకా మిగిలిపోవడానికి గల కారణాలు, ఇతర అంశాలను సైతం మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. మిషన్ కాకతీయ తొలి విడత కింద చేపట్టిన పనులన్నీ ఈ నెలాఖరులోగా ముగించాలని.. ఇప్పటికే రెండో విడతలో ప్రారంభించిన పనులను జూన్ చివరికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని సూచించారు. తెలంగాణ అంతటా ప్రతి సాగునీటి వనరు కింద వాస్తవ ఆయకట్టును నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఆయకట్టు రీ లోకలైజేషన్ కోసం వీలైనంత త్వరగా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని హరీశ్ ఆదేశించారు. ‘మిషన్ కాకతీయ’ అవార్డుల కమిటీ భేటీ మిషన్ కాకతీయ–2 మీడియా అవా ర్డుల న్యాయనిర్ణేతల కమిటీ తొలి సమా వేశం శుక్రవారం సచివాలయంలో జరిగిం ది. జ్యూరీ చైర్మన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సభ్యులు చింతల ప్రశాంత్‌రెడ్డి (రెసిడెంట్ ఎడిటర్, హిందూ), కట్టా శేఖర్‌రెడ్డి(ఎడిటర్, నమస్తే తెలంగాణ) తదితరులు సమావేశమై అవార్డుల ఎంట్రీల ను పరిశీలించారు. దీనిపై వచ్చే వారం మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. అనం తరం వారు మంత్రి హరీశ్‌రావుతో సమావే శమై.. అవార్డుల ఎంపిక విధివిధానాలపై చర్చించారు. అవార్డుల ఎంపికను త్వరగా పూర్తిచేస్తే.. మార్చిలో అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి వారికి తెలిపారు. ఇక మిషన్ కాకతీయతో వస్తున్న ఫలితాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న పెనుమార్పులపై సాగునీటి శాఖ రూపొం దించిన డాక్యుమెంటరీని అవార్డుల కమిటీ తిలకించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపే తానికి ‘మిషన్’ అద్భుతంగా పనిచేస్తున్న దని మంత్రి వివరించారు. పూర్వ మహబూ బ్‌నగర్ జిల్లాలో కూలీల వలసలు ఆగిపో తుండడం గొప్ప మార్పన్నారు. -
అసెంబ్లీలో ‘బెల్లు’ లొల్లి!
♦ ప్రసంగం ముగించాలంటూ బెల్ కొట్టిన డిప్యూటీ స్పీకర్ ♦ ‘అయితే ఇప్పుడే కూర్చుంటా..’ అన్న కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: ఫీజుల పథకంపై బుధవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి బెల్ కొట్టడంతో ఐదు నిమిషాల పాటు సభలో గందరగోళం నెలకొంది. మంత్రి ప్రకటన తర్వాత ప్రసంగాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి కొంతసేపు మాట్లాడారు. తర్వాత త్వరగా ముగించాలంటూ డిప్యూటీ స్పీకర్ బెల్ కొట్టారు. దీంతో ‘బెల్ కొడితే ఇప్పుడే కూర్చుంటా..’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ ‘అది మీ ఇష్టం..’ అంటూ కోమటిరెడ్డి మైక్ కట్ చేశారు. ఆయన ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా మైక్ ఇవ్వకపోవడంతో ఆవేశంతో తన చేతిలో ఉన్న కాగితాలను చించి విసిరివేశారు. ఈ సమయంలో మంత్రి హరీశ్ జోక్యం చేసుకున్నారు. సభాపతి స్థానంలో కూర్చున్న వ్యక్తిపై సీనియర్ సభ్యుడు కాగితాలు చించి విసిరేసి అగౌరవపర్చడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని, వెంటనే సభ్యుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాత డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ... ‘త్వరగా ముగించాలని బెల్ కొట్టడం ఛైర్ హక్కు. ఛైర్‌ను ప్రశ్నిస్తారా? మీరు కొట్టమన్నప్పుడు బెల్ కొట్టాలా?’ అని అన్నారు. ఈ సమయంలో సీఎల్పీ నేత జానారెడ్డి జోక్యం చేసుకుని బెల్ కొట్టడంలో అభ్యంతరం లేదని, కానీ తనను కూర్చోమని అంటున్నారని కోమటిరెడ్డి అనుకున్నారని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమ తరఫున మరో సభ్యుడు మాట్లాడాల్సి ఉందని, ఆయన సమయాన్ని తగ్గించయినా కోమటిరెడ్డికి మరో ఐదు నిమిషాలు సమయం ఇవ్వాలని సూచించారు. దీంతో డిప్యూటీ స్పీకర్ తొలుత నిరాకరించినా.. తర్వాత కోమటిరెడ్డికి అవకాశమిచ్చారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తాను స్పీకర్‌ను అగౌరవపర్చలేదని, అయినా స్పీకర్ అలా భావిస్తే క్షమాపణ చెపుతున్నానన్నారు. మహిళలంటే ఈ ప్రభుత్వానికి గౌరవం ఉంటే ఇద్దరు మహిళలకు కేబినెట్లో అవకాశమివ్వాలని వ్యాఖ్యానించారు. ఫీజుల పథకంపై ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే లక్షలాది మంది విద్యార్థులతో హైదరాబాద్ ముట్టడి నిర్వహిస్తామని చెప్పారు. -
సాగునీటి సవాళ్లు
- ప్రాజెక్టులకు సేకరించాల్సిన భూమి ఇంకా లక్ష ఎకరాలు - 14 వేల ఎకరాలకు రావాల్సిన అటవీ అనుమతులు - భారీగా విద్యుత్, ఇసుక అవసరాలు - నేడు ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ సమీక్ష - మైనింగ్, అటవీ, భగీరథ, భూసేకరణ, విద్యుత్ అధికారులతో భేటీ సాక్షి, హైదరాబాద్: ఇంకా లక్ష ఎకరాలకుపైగా భూసేకరణ.. 14 వేల ఎకరాలకు అటవీ అనుమతులు.. దాదాపు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక.. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టుల అవసరాలివీ! ఈ భారీ అవసరాలు తీర్చేదెలా? ఇప్పటిదాకా పెండిం గ్లో ఉన్న సమస్యలేంటి? ఈ అంశాలన్నింటిపై గురువారం నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. భూసేకరణ, పరిహారం, అటవీ అనుమతులు, విద్యుత్ చార్జీల చెల్లింపు అంశాలపై చర్చించనున్నారు. రెవెన్యూ, అటవీ, ట్రాన్స్‌కో, మిషన్ భగీరథ, మైనింగ్ అధికారులు ఇందులో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 వరకు శాఖల వారీగా సమీక్ష చేయనున్నారు. సమన్వయమే అసలు సమస్య రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ప్రాజెక్టులకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోంది. మొత్తం 32 భారీ, మధ్య తరహా ప్రాజెక్టు పనులకు రూ.95,717 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకోగా.. ఇందులో ఇప్పటివరకు రూ.35,416 కోట్లు ఖర్చయ్యాయి. అందులో 2004లో చేపట్టిన ప్రాజెక్టుల కింద 29.19 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం ఉంది. అందులో ఇప్పటివరకు 8 నుంచి 9 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ భీమా, కోయిల్‌సాగర్, నల్లగొండలోని ఏఎమ్మార్పీ, వరంగల్‌లోని దేవాదుల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండలకు సాగునీరు ఇచ్చే ఎస్సారెస్పీ-2, వరద కాలువ, కరీంనగర్‌లోని ఎల్లంపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలు 80 శాతం పూర్తయ్యాయి. అయితే భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యల కారణంగా పూర్తి ఆయకట్టుకు నీరివ్వలేకపోతున్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లేమితో ఈ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులను సైతం భూసేకరణ సమస్య వేధిస్తోంది. కాళేశ్వరం కింద వచ్చే ఏడాది డిసెంబర్ నాటికే నీళ్లివ్వాలంటే ఇంకా 45 వేల ఎకరాల భూమి సేకరించాలి. పాలమూరులో భూసేకరణ జాప్యంతో పనులు కదలడం లేదు. అటవీ అనుమతులేవి? రాష్ట్రంలో 8 ప్రాజెక్టుల పరిధిలో అటవీ భూముల సమస్య నెలకొంది. ఈ ప్రాజెక్టుల కింద 14,331 ఎకరాలకు అటవీ అనుమతులు పొందాల్సి ఉంది. ఇందులో దేవాదుల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ వంటి ప్రాజెక్టులు దాదాపు ఎనిమిదేళ్ల కిందటే మొదలుపెట్టినా.. ఇంతవరకు అనుమతులు లభించలేదు. చాలా ప్రాజెక్టుల పరిధిలో డీజీపీఎస్ సర్వే పూర్తి కాకపోవడం, అటవీ భూమికి సమానమైన భూమిని చూపకపోవడం, కొన్నిచోట్ల ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచే ప్రతిపాదనలు రాకపోవడం, మరికొన్ని చోట్ల ప్రత్యామ్నాయంగా చూపిన భూమి ఇదివరకే ప్రభుత్వం ఇతరులకు కట్టబెట్టి పట్టాలివ్వడం వంటి సమస్యలున్నాయి. దీంతో ఆ ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదు. ఇక ప్రాజెక్టుల నిర్మాణానికి ఇసుక అవసరాలు ఏకంగా 1.87 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర ఉన్నాయి. ఈ మేరకు ఇసుక అనుమతులు పొందడానికి తంటాలు పడాల్సి వస్తోంది. దీంతో ఇటీవలే మైనింగ్ శాఖ నేరుగా నీటి పారుదల శాఖే ఇసుకను తీసుకునే వెసులుబాటు ఇచ్చింది. -
అన్నదాతల ఉసురుపోసుకుంది కాంగ్రెస్ పార్టీయే
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తూప్రాన్: రైతుల ఉసురుపోసుకుంది కాంగ్రెస్ పార్టీయేనని, తమ ప్రభుత్వ హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన తూప్రాన్‌లో విలేకరులతో మాట్లాడుతూ రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలనలో రైతులకు ఒరగబెట్టిందేమిటని ప్రశ్నించారు. అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరాతో రైతు రోడ్డెక్కని రోజు లేదన్నారు. రైతులు నిత్యం మోటార్లు, స్ట్రార్టర్లు కాలిపోవడంతో అప్పుల పాలయ్యారన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నాణ్యమైన 12 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా పల్లెలకు, పట్టణాలకు, పరిశ్రమలకు అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఎరువులు, విత్తనాల కోసం కాంగ్రెస్ హయాంలో ఉదయం నుంచి రాత్రుళ్ల వరకు చెప్పులను లైన్లలో పెట్టి నిద్రహారాలు మాని రోడ్లపై నిద్రించేవారని విమర్శించారు. నేడు ఒక్క రైతు కూడా ఎరువులు, విత్తనాలు దొరకడంలేదని ఫిర్యాదు చేయడం లేదన్నారు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. రైతులకు మూడు విడతలుగా రుణామాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్‌లో రైతు గర్జన ఏమని నిర్వహిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి, జెడ్పీటీసీ సుమన, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీశైలంగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, సర్పంచ్‌లు మల్లేశ్ యాదవ్, శివ్వమ్మ తదితరులు పాల్గొన్నారు. మంత్రి చేతుల మీదుగా చెక్కు పంపిణీ మండలంలోని రావెల్లి గ్రామానికి చెందిన బాగన్నగారి శ్రీనివాస్‌రెడ్డి ఫిబ్రవరి 15న తన వ్యవసాయ క్షేతం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతు చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ట్రాన్స్‌కో అధికారులు మృతుని కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.ఘీ మొత్తాన్ని చెక్కు రూపంలో మంగళవారం మంత్రి హరీశ్‌రావు మృతుని భార్యకు అందజేశారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏడీఈ వీరారెడ్డి, ఎఈ వేంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు. -
చిన్న జిల్లాగా సిద్దిపేట!
సాక్షి, హైదరాబాద్: ‘కొత్త జిల్లాలను ప్రజల ఇష్టాయిష్టాల మేరకు ఏర్పాటు చేయాలి. సుపరిపాలన దిశగా ముందడుగు వేసేలా కొత్త జిల్లాల ప్రతిపాదనలుండాలి’’ అని కొత్త జిల్లాల ముసాయిదా తయారీకి ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఎదుట ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటల, తుమ్మలతో కూడిన ఉపసంఘం శుక్రవారం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమైంది. ప్రతిపాదిత జిల్లాల మ్యాపులతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీసీఎల్ఏ రేమండ్ పీటర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మెదక్ జిల్లా సమీక్షలో మంత్రి హరీశ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్ పాల్గొన్నారు. జనగామను జిల్లా చేయాలనే అభ్యర్థనలున్నాయని కడియం గుర్తు చేశారు. కాబట్టి వరంగల్ జిల్లాలోని జనగామ, చేర్యాల ప్రాంతాలను ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాలో కలిపే విషయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. జనగామ ప్రజలకు ఇష్టం లేకుంటే సిద్దిపేటలో కలపొద్దని హరీశ్ అన్నారు. ‘‘సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలతోనే సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసినా అభ్యంతరం లేదు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న సిద్దిపేట చిన్న జిల్లాగా ఏర్పడితే రాష్ట్రంలో నంబర్‌వన్‌గా ఎదుగుతుంది’’ అని ఆశాభావం వెలిబుచ్చారు. మెదక్ జిల్లా పటాన్చెరు, రామచంద్రాపురం మండలాలను ప్రతిపాదిత సికింద్రాబాద్ జిల్లాలో కలుపవద్దని, సంగారెడ్డి జిల్లాలో ఉంచాలని ప్రజాప్రతినిధులు కోరారు. అనంతరం నిజామాబాద్ జిల్లా సమీక్షకు మంత్రి పోచారం, ఎంపీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్ హాజరయ్యారు. ‘‘ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలపొద్దు. కామారెడ్డి జిల్లాలో ఉంచాలి. బాన్సువాడ సెగ్మెంట్లోని వర్లి, కోటగిరి మండలాలను నిజామాబాద్‌లో కాకుండా కామారెడ్డిలో చేర్చాల’’ని కోరారు. అందరికీ ఆమోదయోగ్యంగా జిల్లాలు ఏర్పాటవుతాయని అనంతరం కవిత మీడియాతో చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా సమీక్షలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్ పాల్గొన్నారు. జిల్లాలో కొత్తగా మంచిర్యాల (కొమురం భీమ్), నిర్మల్ జిల్లాల ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ఉపసంఘం శనివారం హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం; ఆదివారం మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రతినిధులతో భేటీ కానుంది. 16న అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశముంది. సీఎం నిర్ణయం మేరకు తేదీ ఖరారవుతుందని మహమూద్ అలీ తెలిపారు. -
‘పులిచింతల’పై నోరెందుకు పెగల్లేదు?
కాంగ్రెస్ ఆరోపణలపై మంత్రి హరీశ్ మండిపాటు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రాంతంలో మూడో పంటకు నీరిచ్చేందుకని పులిచింతల ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే నోరు మెదపని టీకాంగ్రెస్ నేతలు, తెలంగాణలో మొదటి పంటకు నీరందించేందుకు చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌కు అడ్డుపడుతుండటం విడ్డూరంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. జీవో 123 రద్దుపై హైకోర్టు డివిజన్ స్టే ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, భూసేకరణను త్వరగా చేయడంతో పాటు రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకే ప్రభుత్వం జీవో 123ను తీసుకువచ్చిందన్నారు. ఏదైనా గ్రామంలో 2013 చట్టం ప్రకారం ఎవరైనా పరిహారం కోరితే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ మేరకు రైతులకు ఏదైనా నష్టం జరిగితే కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాల్సి వస్తుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులు ఏవిధమైన పరిహారం కావాలంటే ఆ విధంగా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, ముంపు గ్రామాల బాధితుల బాధలు సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. రైతులతో పాటు రైతు కూలీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కూడా మెరుగైన నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌తో సంతృప్తి చెందినందునే హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా తీర్పునిచ్చిందన్నారు. -
18నెలల్లో ‘కాళేశ్వరం’ పూర్తి
అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలి: మంత్రి హరీశ్ సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనులను 18 నెలల్లో పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మూడు బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్మా ణ స్థలాన్ని మూడు రోజుల్లో ఖరారు చేయాలన్నారు. శనివారం ప్రాజెక్టు సైట్‌ను సందర్శించాలని ఈఎన్సీ మురళీధర్, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డిని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గురువారం మంత్రి జలజౌధ కార్యాలయంలో అధికారు లతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా, బ్యారేజీల అగ్రిమెంట్ల ప్రక్రియను వారంలోగా ముగించి,పనులను 15 రోజుల్లో ఆరంభించాలని సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీలను ఆదేశించారు. ఇందుకు ఏజెన్సీలు అంగీకరించాయి. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం వేగాన్ని అధికార యంత్రాంగం, సిబ్బంది అందుకోవాలని కోరారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల కోసం భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణ విషయమై కరీంనగర్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. భూసేకరణ ప్రక్రియను వేగిరం చేయాలని, ఈ మేరకు మంథని ఆర్డీఓకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. బ్యారేజీ, పంప్‌హౌజ్‌ల నిర్మాణం ఏకకాలంలో జరగాలని, జూలై 15న ముంబైలో తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య సమావేశం జరుగనున్న దృష్ట్యా ప్రాజెక్టు పనుల పురోగతిని నిరంతరం సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, సీఈ నల్లా వెంకటేశ్వర్లు, సీడీఓ సీఈ నరేందర్‌రెడ్డి, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు పాల్గొన్నారు. -
కారెక్కనున్న రమణ?
- త్వరలో గులాబీ కండువా కప్పుకోనున్న టీటీడీపీ అధ్యక్షుడు - ఇప్పటికే సీఎం, మంత్రి హరీశ్‌తో మంతనాలు - మరో ఎమ్మెల్యే సండ్ర కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం - పాలేరు ఉప ఎన్నిక లోపే జంప్! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీకి మరో పెద్ద షాక్ తగలనుందా..? పదిహేను మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పన్నెండు మంది గట్టు దాటడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ పార్టీలో మరో భారీ కుదుపు ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టీటీడీపీ విషయంలో పట్టింపే లేనట్టు ఉండటంతో తమ రాజకీయ భవిష్యత్ అంధకారమవుతుందని ఆందోళన చెందుతున్న ముఖ్య నాయకులు కొందరు పార్టీని వీడి గులాబీ గూటికి చేరడమే శ్రేయస్కరమన్న అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కొద్ది రోజుల్లోనే గులాబీ కండువా కప్పుకోవడానికి అన్ని లాంఛనాలు పూర్తయ్యాయని తెలుస్తోంది. టీడీపీకి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేరికకు కూడా ముహూర్తం కుదిరిందని అంటున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు నేతల తో పాటు పలువురు నాయకులు టీడీపీ గోడ దూకుతారని కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజా పరిణామాలు ఈ ప్రచారాన్ని మరింత బలపరిచేవిగా ఉన్నాయి. టీడీపీకి భవిష్యత్తు ఏదీ? గడిచిన రెండేళ్లుగా అధికార టీఆర్ఎస్తో సై అంటే సై అన్న నాయకులు కూడా కాలక్రమేణా జావగారి పోయారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ‘ఓటుకు కోట్లు’ కేసులో పార్టీ పీకల్లోతు కూరుకుపోవడం, ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు ఆడియో టేపులూ బహిరంగమవడంతో తెలంగాణ టీడీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. దీంతో తెలంగాణ పార్టీ వ్యవహారాల విషయంలో చంద్రబాబు అంటీముట్టనట్టుగానే ఉంటున్నారన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. రెండోసారి టీటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మాజీ మంత్రి ఎల్.రమణ నామమాత్రం అయ్యారన్న భావన వ్యక్తమవుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడైన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తుండడం, అధినేత పట్టించుకోకపోవడం వంటి పరిణామాలతో ఇక పార్టీలో కొనసాగడంలో అర్థం లేదన్న అభిప్రాయానికి రమణ వచ్చారని విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో పార్టీ నిలబడే అవకాశాలు కనుచూపు మేరలో లేవన్న నిశ్చితాభిప్రాయనికి వచ్చిన పలువురు టీటీడీపీ నేతలు ప్రత్యామ్నాయం వెదుక్కునే పనిలో ఉన్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎల్.రమణ టీఆర్ఎస్లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మంత్రి హరీశ్‌తో మంతనాలు? తన చేరికపై ఇప్పటికే ఒకటికి రెండుమార్లు సీఎం కేసీఆర్‌తో మాట్లాడిన ఎల్.రమణకు మంత్రి హరీశ్‌తో ‘లంచ్ మీటింగ్’ కూడా జరిగిందని విశ్వసనీయంగా తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎల్.రమణ ఓడిపోయారు. టీఆర్ఎస్ కూడా ఆ స్థానం లో ఓడిపోయింది. జగిత్యాలలో నాయకత్వ లేమి ఉందన్న ఆలోచనతోనే ఎల్.రమణను పార్టీలోకి ఆహ్వానిస్తూ మంతనాలు జరిపారని వినికిడి. ఇక్కడ్నుంచి కాంగ్రెస్‌కు చెందిన జీవన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1994 సార్వత్రిక ఎన్నికల నుంచి మొన్నటి 2014 సార్వత్రిక ఎన్నికల దాకా ప్రధాన పోటీ జీవన్‌రెడ్డి, ఎల్.రమణల మధ్యే కొనసాగుతోంది. మూడో వ్యక్తికి అవకాశం రాలేదు. దీంతో భవిష్యత్ రాజ కీయ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ సమాలోచనలు జరిపిందని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే కొద్ది రోజుల్లోనే రమణ గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేరికపైనా టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. పాలేరు ఉప ఎన్నికలు ముగిసేలోపే ఆయన టీఆర్ఎస్లో చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. -
జూరాలకు 3 టీఎంసీలివ్వండి
నారాయణపూర్ నుంచి విడుదల చేయండి * పాలమూరుకు తాగునీరిచ్చేందుకు సహకరించండి * కర్ణాటక మంత్రిని కోరిన మంత్రి హరీశ్ * సీఎంతో చర్చించి నిర్ణయిస్తామన్న పాటిల్ * 50 రోజుల్లో ఆర్డీఎస్ పనులు పూర్తి చేస్తామని హామీ సాక్షి, హైదరాబాద్/బెంగళూరు, జూరాల: మహబూబ్‌నగర్ జిల్లా తాగునీటి అవసరాల కోసం మానవతా దృక్పథంతో కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు కోరారు. కర్ణాటక భారీ, మధ్య తరహా నీటిపారుదల మంత్రి ఎంబీ పాటిల్ ఇందుకు సానుకూలత వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గురువారం బెంగళూరులోని విధానసౌధలో పాటిల్‌తో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలతో కలిసి హరీశ్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సం బంధాలు నెలకొనాల్సిన ఆవశ్యకత, జల పంపకాల విషయాలు, రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) ఆధునీకరణ తదితరాలపై చర్చించారు. సీఎం కోరిక మేరకు పాలమూరు ప్రజల దాహార్తిని తీర్చడంలో కర్ణాటక సహకారం కోరేందుకు వచ్చామని హరీశ్ అన్నారు. మహబూబ్‌నగర్ కరువుతో ఉన్నందున నారాయణపూర్ నుంచి 3 టీఎంసీలివ్వాలని కోరారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కృష్ణా జలనిగమ్ అధికారులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని పాటిల్ హామీ ఇచ్చారు. 50 రోజుల్లో ఆర్డీఎస్ పనులు పూర్తి ఆర్డీఎస్ గురించి కూడా భేటీలో హరీశ్ ప్రస్తావించారు. ‘‘కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 15.9 టీఎంసీల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు నీరందాల్సి ఉన్నా ఐదారు టీఎంసీలకు మించి రావడం లేదు. దాంతో ఏనాడూ నిర్దేశిత ఆయకట్టులో కనీసం 20 వేల ఎకరాలు కూడా సాగుకు నోచుకోవడం లేదు. కర్నూ లు జిల్లా రైతులు తరచూ తూములు పగులగొట్టడం, అక్రమంగా నీటిని తరలించుకుపోవడంతో ఆర్డీఎస్ ద్వారా తెలంగాణలో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. బ్యారేజీ ఎత్తును 15 సెంటీమీటర్ల మేర పెంచేందుకు, లైనింగ్ మరమ్మతులకు ఉమ్మడి రాష్టంలో రూ.72 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.58 కోట్లను కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసినా పనులు సాగడం లేదు’’ అని వివరించారు. పాటిల్ 50 రోజుల్లోనే ఆర్డీఎస్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఇదే సమయంలో బెంగళూరు నుంచే ఏపీ సాగునీటి మంత్రి దేవినేని ఉమతో ఫోన్లో మాట్లాడారు. ఆర్డీఎస్ పనుల సహకారంపై చర్చిద్దామని ప్రతిపాదించారు. మే 4 తర్వాత చర్పిద్దామని ఉమ హామీ ఇచ్చారు. -
కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్!
మంత్రి హరీశ్, బీజేఎల్పీ నేత లక్ష్మణ్ మధ్య ఆసక్తికరమైన చర్చ సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ), ఉస్మానియా యూనివర్సిటీలలో జరిగిన ఉదంతాలపై చర్చించడానికి కావాల్సినంత సమయం ఇస్తామన్నా కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేక పోయిందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం దీనిపై మంత్రి హరీశ్‌రావు, భారతీయ జనతా పార్టీ పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ మధ్య కొద్ది సేపు ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘ కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుంది. చర్చకు అవకాశం ఇచ్చినా ఆ పార్టీ ఏం మాట్లాడలేక పోయింది. ఏం మాట్లాడాలో కూడా తెలుసుకోలేక పోతున్నారు’ అని మంత్రి హరీశ్, లక్ష్మణ్‌తో అన్నారు. ఈ ఒక్క విషయమనే కాదు, సాగునీటి ప్రాజెక్టులపై జరిగే చర్చలో కూడా కాంగ్రెస్ ఇదే పరిస్థితి ఎదుర్కొంటోందని అన్నారు. సభలో చర్చ జరుపుదామంటే సభ వాయిదాను కోరుతున్నారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాగా, తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని, ఎస్సై రాత పరీక్షలో వెయిటేజీని తొలగించాలని కోరినట్లు లక్ష్మణ్ చెప్పారు. -
గులాబీ గూటిలో ‘మున్సిపల్’ ముసలం
ఓరుగల్లు టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి సెగలు * అసంతృప్తులను బుజ్జగించే పనిలో నాయకత్వం * వరంగల్‌లోనే మంత్రి హరీశ్ మకాం * పాత-కొత్త శ్రేణుల సమన్వయమే అసలు సమస్య సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో లొల్లి షురూ అయ్యింది. వివిధ రాజకీయ పక్షాల నుంచి గులాబీ గూటికి చేరిన నేతలు తమ వెంట తెచ్చిన అనుచురులకు అవకాశాలు ఇప్పించుకోవడంలో పోటీ పడుతున్నారు. దీంతో పాత-కొత్త శ్రేణుల సమన్వయమే సవాలుగా మారిందంటున్నారు. ముందు నుంచీ పార్టీలో కొనసాగిన వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయనే ఆందోళనా వ్యక్తమవుతోంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు వేదికగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్లు టీఆర్ఎస్లో చేరిన సందర్భంలోనే పాత-కొత్త శ్రేణుల మధ్య పంచాయితీలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి బలం చేకూరుస్తూ వరంగల్‌లో పాత-కొత్త నేతలు తమ వారికి కార్పొరేటర్ టికెట్లు ఇప్పించుకునే పనిలో పడ్డారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కన్వీనర్‌గా ఉన్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల సమన్వయ కమిటీ ఎదుట ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కొండా మురళీ, మరోవైపు ఇటీవలే గులాబీ తీర్థం పుచ్చుకున్న ఎర్రబెల్లి దయాకర్‌రావులు ఎవరి జాబితాలు వారు పెట్టారు. సహజంగానే ఇది ఆధిపత్య పోరుకు దారి తీసింది. పరిస్థితి చేయి దాటిపోకుండా, పార్టీ అధినాయకత్వం మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దించింది. అయితే, ఒక్క మంత్రి మాత్రమే ఉన్న ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ పంచాయితీ లేకపోవడం గమనార్హం. అసలేం జరుగుతోంది... వరంగల్ కార్పొరేషన్లో 58 డివిజన్లు ఉండగా, వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో 6, పరకాల నియోజకవర్గంలో 4 డివిజన్లు ఉన్నాయి. మిగిలిన 48 డివిజన్లు వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోనే ఉన్నా యి. వినయ్ భాస్కర్, ముందు నుంచే తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేశారు. వారందరికీ టికెట్లు ఇవ్వడం కుదరకపోవడంతో అలక బూనారని సమాచారం. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ మురళీ తమ అనుచరులకు ఎక్కువ టికెట్ల కోసం యత్నించారని, వీరిలో అత్యధికులు కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారే కావడంతో పేచీ మొదలైందంటున్నారు. పార్టీ బీ-ఫాం ఇస్తే చాలు తేలిగ్గా గెలిచే అవకాశాలు ఉన్నందున, ఉద్యమంలో పనిచేసిన పాత కేడర్‌కే అవకాశం ఇవ్వాలని, వారికి డబ్బున్నా, లేకున్నా పట్టించుకోవద్దని ముందు నుంచీ టీఆర్ఎస్లో ఉన్నవారు వాదిస్తున్నారు. దీనికితోడు తాజాగా టీఆర్ఎస్లో చేరిన ఎర్రబెల్లి అనుచరుడు, టీడీపీ నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళీకి టికెట్ ఇవ్వాలనడంతో తన నియోజకవర్గంలో ఎర్రబెల్లి వేలు పెడుతున్నారని వినయ్ భాస్కర్ పంచాయితీ మొదలుపెట్టారని అంటున్నారు. దీంతోపాటు మాజీ మంత్రి బస్వరాజు సారయ్య చేరిక తర్వాత ఆయన అనుచరుల్లోనూ ఇద్దరు ముగ్గురికి టికెట్ల హామీ ఇచ్చారని వినికిడి. మొత్తంగా కొత్తవారికి కూడా అవకాశం కల్పించాల్సిన పరిస్థితిలో అధిష్టానం ఉండగా, పాత వారి పరిస్థితి ఏమిటనే అసంతృప్తి పెరిగిపోయిందని చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హరీశ్‌రావు మంగళ, బుధవారాల్లో వరంగల్‌లోనే మకాం వేసి అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇచ్చారని, నాయకులనూ బుజ్జగించారని అంటున్నారు. అయినా, నామినేషన్లకు చివరి రోజైన బుధవారం టీఆర్ఎస్ నుంచి పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశారని, బీ-ఫారం ఇచ్చేటప్పటికీ (26వ తేదీ) ఈ వివాదం మరింత ముదిరి రెబెల్స్ బెడద తప్పక పోవచ్చని అంచనా వేస్తున్నారు. -
బాబోయ్ దొంగలు
తాళం వేస్తే ఇల్లు గుల్లే.. ⇒ వరుస చోరీలతో ప్రజలు బెంబేలు ⇒ దగా పడుతున్న ‘నిఘా’.. ⇒ కదలికలు పసిగట్టని సీసీ కెమెరాలు ⇒ నిద్రమత్తులో పోలీసు విభాగం ⇒ యంత్రాంగం తీరుపై మంత్రి హరీష్ ఫైర్ ⇒ బాధితులకు పరామర్శ సాక్షి, సంగారెడ్డి ప్రతినిధి: సుంకరి కిష్టయ్య.. మెదక్ పట్టణంలోని వెంకట్రావునగర్ కాలనీకి చెందిన ఈయన ఇంటికి తాళం వేసి తన బంధువుల ఇంటికి వెళ్లాడు. మర్నాడు వచ్చే సరికి తాళం పగులగొట్టి వుంది. ఆ ఇంట్లో బీభత్సం సృష్టించిన దొంగలు 4 తులాల బంగారం, 5 తులాల వెండి, 36 వేల నగదు మూటకట్టుకుపోయారు. రాజ్‌కుమార్, జిల్లా 8వ అదనపు జడ్జి.. ఈయనా మెదక్ పట్టణ వాసే. ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లిన ఆయన తిరిగి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడ్డారని తెలిసింది. అశోక్, టీచర్.. మెదక్‌కే చెందిన ఈయన ఇంట్లో దొంగలు పడి అందినకాడికి దోచుకుపోయారు. ఇవీ ఇటీవల జిల్లాలో పోలీసుల పనితీరుకు ‘మచ్చ’తునకలుగా నిలిచిన ఉదంతాలు. దొంగలు రాత్రీ పగలు తేడా లేకుండా ఇళ్లు గుల్ల చేస్తున్నారు. వీరి ఆగడాల ఫలితంగా ఇంటికి తాళం వేస్తే నగా నట్రాకు గ్యారంటీ లేకుండాపోతోంది. జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. 6 నెలల్లో వందల చోరీలు గడిచిన ఆరు నెలల్లో జిల్లాలో వందల సంఖ్యలో చోరీలు జరిగాయి. ఇళ్లనే కా దు.. బంగారం దుకాణాలు, ఏటీఎం కేంద్రాలు.. వేటినీ వదలడం లేదు. గ త ఏడాది పగలు దొంగతనాలు 92, రాత్రి దొంగతనాలు 384, సాధారణ దొంగతనాలు 912 జరిగాయి. గతేడా ది మొత్తం రూ.6,26,38,971 సొత్తు దొంగల పాలైంది. పోలీసులు రూ. 2, 97,79,266 మాత్రమే రికవరీ చేశారు. మచ్చుకు కొన్ని.. గత డిసెంబర్లో సంగారెడ్డి పాతబ స్టాండ్‌లో ఉన్న ఇండి క్యాష్ ఏటీఎం లో చోరీ జరిగింది. ఏటీఎంను గ్యాస్ క ట్టర్లతో కోసి అందులో ఉన్న రూ.3.21 లక్షలను అపహరించుకుపోయారు. అదేరోజు నర్సాపూర్ మీదుగా కౌడిపల్లికి చేరుకొని ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. అటుపై మెదక్ పట్టణంలోని ఆటోనగర్‌లో ఏటీఎంను కొల్లగొట్టారు. గ్యాస్ కట్టర్‌తో మిషన్‌ను ధ్వం సం చేసి డబ్బు అపహరణకు యత్నించారు. పోలీసులు అప్రమత్తం కావడం తో పారిపోయారు. చోరులు అత్యాధునిక పరికరాలు, వాహనాలను ఉపయోగిస్తున్నట్టు ఈ ఘటనల ద్వారా వెలుగులోకి వచ్చింది. మెదక్ పట్టణం లో వారం క్రితం దొంగలు ఆరు ఇళ్లలో బీభత్సం సృష్టించారు. జడ్జి ఇంటిని సైతం వదలలేదు. తాజాగా సంగారెడ్డి గణేష్‌నగర్‌లో తాళం వేసిన రెండు ఇళ్ల లో దొంగలుపడి 2 తులాల బంగారం, 40 వేల నగదు ఎత్తుకెళ్లారు. అయ్యప్పకాలనీలో సైతం ఇళ్లను గుల్ల చేశారు. నిద్రమత్తులో పోలీసులు దొంగలు పేట్రేగుతున్నా పోలీసులు నిద్రమత్తులో జోగుతున్నారు. దొంగతనాలు, నేరాల నివారణకు సీసీ కెమెరా లు అమర్చామని, ప్రత్యేకంగా నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నా.. దొంగల ఆగడాలను ఇవేమీ ఆపలేకపోతున్నాయి. నిఘా లేకే దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఫలి తంగా ప్రజలు ఇంటికి తాళం వేయాలంటేనే భయపడుతున్నారు. పోలీసు లు ఏ చర్యలూ తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ‘పోలీస్’పై మంత్రి హరీష్ సీరియస్ సంగారెడ్డి పట్టణంలో ఇటీవల వరుస చోరీలు జరుగుతుండటంతో మంత్రి హరీష్‌రావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని గణేష్‌నగర్, అయ్యప్పకాలనీలలో చోరీలు జరిగిన ఇళ్లకు వెళ్లి ఆయన బాధితులను పరామర్శించారు. దోపిడీకి గురైన బాధితులను ఓదార్చారు. ఘటనలు ఎలా జరిగాయో, ఎంత సొత్తు దొంగల పాలైందో ఆరా తీశారు. అనంతరం శాంతిభద్రతలపై పోలీసులతో సమీక్షించారు. సీసీ కె మెరాలు, నిఘా విభాగం ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. పోలీసులు సక్రమంగా పనిచేస్తే చోరీలు ఎం దుకు జరుగుతాయని ప్రశ్నించారు. గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశిం చారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ స్పీకర్ పద్మ, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, భూపాల్‌రెడ్డి, రామలింగారెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ఉన్నారు. -
కృష్ణాపై కర్ణాటక బ్యారేజీ నిజమే!
- పొడవు 1,170 మీటర్లు... గేట్ల సంఖ్య 194 - ప్రభుత్వానికి నిజనిర్ధారణ కమిటీ నివేదిక - కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని - అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశం - కేంద్రమంత్రి ఉమాభారతికి - వివరించాలంటూ ఎంపీ జితేందర్‌కు ఫోన్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై రాయచూర్ జిల్లాలో గిరిజాపూర్ గ్రామం వద్ద కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా బ్యారేజీ చేపట్టడం నిజమేనని పేర్కొంటూ నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక అందగానే శనివారం సాగునీటి శాఖ మంత్రి మంత్రి టి.హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై వెంటనే కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేయాలని ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషిని, ఇంటర్ స్టేట్ చీఫ్ ఇంజనీర్ నాగేందర్‌ను మంత్రి ఆదేశించారు. సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు, న్యాయ నిపుణులను సంప్రదించి ఫిర్యాదును తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఈ అంశాన్ని కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత జితేందర్‌రెడ్డికి ఫోన్లో సూచించారు. ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపేయడానికి చర్యలు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. జూరాలకు వరద కష్టమే! కృష్ణాపై కర్ణాటక బ్యారేజీ నిర్మాణానికి సమాయత్తమవుతుందన్న సమాచారంపై మంత్రి హరీశ్‌రావు నిజ నిర్ధారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారుల కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి ఫోటోలతో సహా నివేదికను సమర్పించింది. కమిటీ నివేదిక ప్రకారం బ్యారేజీని కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌పీటీఎస్) నిర్మిస్తోంది. ‘‘బ్యారేజీ పొడవు 1,170 మీటర్లు. గేట్ల సంఖ్య-194. 24 నెలల కాల పరిమితితో రఘు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఈ ఏడాది జూలై 28న ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బ్యారేజీలో సుమారు రెండు టీఎంసీల నీరు నిలువ చేసే అవకాశం ఉంది’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల జూరాల ప్రాజెక్టుకు వరద నీరు రావడం కష్టంగా మారుతుందని అభిప్రాయపడింది. దానికి తోడు నారాయణపూర్ నుంచి రావాల్సిన రీజనరేటెడ్ ఫ్లో కూడా రాకుండా పోతుందని తెలిపింది. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి దిగువ రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తెలుపలేదు. కేంద్ర జల సంఘానికి, కేంద్ర విద్యుత్ అథారిటీకి అయినా తెలిపిందా, వారి నుంచి సూత్రప్రాయమైన అనుమతులైనా ఉన్నాయా అన్న విషయం తెలియరాలేదని కమిటీ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో ప్రొక్లైన్లు, టిప్పర్లు కనిపించాయని, పనులు చురుగ్గా జరుగుతున్నట్లు తెలిపింది. -
కొత్తగా 33 వ్యవసాయ మార్కెట్లు
హైదరాబాద్: కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డుల ఏర్పాటుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతమున్న 150 మార్కెట్లల్లో కొన్నింటిని విభజించి నూతనంగా 33 మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో దళారీల కట్టడి, రైతులకు కనీస మద్దతు ధర లభించేందుకు ఈ యార్డులు దోహదపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 15 యార్డుల ఏర్పాటుకు సంబంధించి ప్రిలిమినరీ, ఫైనల్ నోటిఫికేషన్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 11 వ్యవసాయ మార్కెట్ యార్డుల ఏర్పాటుకు సంబంధించి విభజన ప్రక్రియ పూర్తయి ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. వరంగల్, నల్లగొండ జిల్లాలో కూడా కొత్త యార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రైతులకు మరింత చేరువ: హరీశ్‌రావు ‘మార్కెట్ యార్డుల లావాదేవీల కంప్యూటరీకరణ, ఖాళీల భర్తీ, రైతులు, వ్యాపారులకు అవసరమైన సౌకర్యాల కల్పన తదితరాలపై దృష్టి సారించాం. గ్రామ స్థాయిలో వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోలులో ఐకేపీ అనుబంధ స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరిన్ని మార్కెట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మార్కెటింగ్ సదుపాయాలను చేరువగా తీసుకెళ్తాం. దళారీ వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యం.’ అని మంత్రి హరీశ్ అన్నారు. జిల్లాల వారీగా ఏర్పాటయ్యే కొత్త యార్డులివే! ఆదిలాబాద్: జన్నారం, కరీంనగర్: ఆర్.బొప్పాపూర్, కోహెడ, ఇల్లంతకుంట, పెగడపల్లి, బెజ్జంకి, జూలపల్లి, రుద్రంగి, కమాన్‌పూర్, వెల్గటూరు, శ్రీరాంపూర్, గోపాలరావుపేట, రాయికల్, గంభీరావుపేట ఖమ్మం: కారేపల్లి, మహబూబ్‌నగర్: పెబ్బేరు, కొల్లాపూర్, రంగారెడ్డి: మహేశ్వరం, బషీరాబాద్, కుల్కచర్ల, కోట్‌పల్లి, హైదరాబాద్: గుడిమల్కాపూర్, మెదక్: కొండపాక, పాపన్నపేట, నంగునూరు, చిన్నకోడూరు, నిజామాబాద్: సదాశివనగర్, కోటగిరి, బిర్కూర్, బిచ్కుంద, దర్పల్లి, వేల్పూరు, అర్గుల్.