హైదరాబాద్: కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డుల ఏర్పాటుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతమున్న 150 మార్కెట్లల్లో కొన్నింటిని విభజించి నూతనంగా 33 మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో దళారీల కట్టడి, రైతులకు కనీస మద్దతు ధర లభించేందుకు ఈ యార్డులు దోహదపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 15 యార్డుల ఏర్పాటుకు సంబంధించి ప్రిలిమినరీ, ఫైనల్ నోటిఫికేషన్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 11 వ్యవసాయ మార్కెట్ యార్డుల ఏర్పాటుకు సంబంధించి విభజన ప్రక్రియ పూర్తయి ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. వరంగల్, నల్లగొండ జిల్లాలో కూడా కొత్త యార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
రైతులకు మరింత చేరువ: హరీశ్‌రావు
‘మార్కెట్ యార్డుల లావాదేవీల కంప్యూటరీకరణ, ఖాళీల భర్తీ, రైతులు, వ్యాపారులకు అవసరమైన సౌకర్యాల కల్పన తదితరాలపై దృష్టి సారించాం. గ్రామ స్థాయిలో వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోలులో ఐకేపీ అనుబంధ స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరిన్ని మార్కెట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మార్కెటింగ్ సదుపాయాలను చేరువగా తీసుకెళ్తాం. దళారీ వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యం.’ అని మంత్రి హరీశ్ అన్నారు.
జిల్లాల వారీగా ఏర్పాటయ్యే కొత్త యార్డులివే!
ఆదిలాబాద్: జన్నారం, కరీంనగర్: ఆర్.బొప్పాపూర్, కోహెడ, ఇల్లంతకుంట, పెగడపల్లి, బెజ్జంకి, జూలపల్లి, రుద్రంగి, కమాన్‌పూర్, వెల్గటూరు, శ్రీరాంపూర్, గోపాలరావుపేట, రాయికల్, గంభీరావుపేట ఖమ్మం: కారేపల్లి, మహబూబ్‌నగర్: పెబ్బేరు, కొల్లాపూర్, రంగారెడ్డి: మహేశ్వరం, బషీరాబాద్, కుల్కచర్ల, కోట్‌పల్లి, హైదరాబాద్: గుడిమల్కాపూర్, మెదక్: కొండపాక, పాపన్నపేట, నంగునూరు, చిన్నకోడూరు, నిజామాబాద్: సదాశివనగర్, కోటగిరి, బిర్కూర్, బిచ్కుంద, దర్పల్లి, వేల్పూరు, అర్గుల్.
కొత్తగా 33 వ్యవసాయ మార్కెట్లు
Published Tue, Jul 14 2015 1:43 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement