The minimum support price
-
కొత్తగా 33 వ్యవసాయ మార్కెట్లు
హైదరాబాద్: కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డుల ఏర్పాటుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతమున్న 150 మార్కెట్లల్లో కొన్నింటిని విభజించి నూతనంగా 33 మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో దళారీల కట్టడి, రైతులకు కనీస మద్దతు ధర లభించేందుకు ఈ యార్డులు దోహదపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 15 యార్డుల ఏర్పాటుకు సంబంధించి ప్రిలిమినరీ, ఫైనల్ నోటిఫికేషన్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 11 వ్యవసాయ మార్కెట్ యార్డుల ఏర్పాటుకు సంబంధించి విభజన ప్రక్రియ పూర్తయి ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. వరంగల్, నల్లగొండ జిల్లాలో కూడా కొత్త యార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రైతులకు మరింత చేరువ: హరీశ్‌రావు ‘మార్కెట్ యార్డుల లావాదేవీల కంప్యూటరీకరణ, ఖాళీల భర్తీ, రైతులు, వ్యాపారులకు అవసరమైన సౌకర్యాల కల్పన తదితరాలపై దృష్టి సారించాం. గ్రామ స్థాయిలో వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోలులో ఐకేపీ అనుబంధ స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరిన్ని మార్కెట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మార్కెటింగ్ సదుపాయాలను చేరువగా తీసుకెళ్తాం. దళారీ వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యం.’ అని మంత్రి హరీశ్ అన్నారు. జిల్లాల వారీగా ఏర్పాటయ్యే కొత్త యార్డులివే! ఆదిలాబాద్: జన్నారం, కరీంనగర్: ఆర్.బొప్పాపూర్, కోహెడ, ఇల్లంతకుంట, పెగడపల్లి, బెజ్జంకి, జూలపల్లి, రుద్రంగి, కమాన్‌పూర్, వెల్గటూరు, శ్రీరాంపూర్, గోపాలరావుపేట, రాయికల్, గంభీరావుపేట ఖమ్మం: కారేపల్లి, మహబూబ్‌నగర్: పెబ్బేరు, కొల్లాపూర్, రంగారెడ్డి: మహేశ్వరం, బషీరాబాద్, కుల్కచర్ల, కోట్‌పల్లి, హైదరాబాద్: గుడిమల్కాపూర్, మెదక్: కొండపాక, పాపన్నపేట, నంగునూరు, చిన్నకోడూరు, నిజామాబాద్: సదాశివనగర్, కోటగిరి, బిర్కూర్, బిచ్కుంద, దర్పల్లి, వేల్పూరు, అర్గుల్. -
రైతు ఆత్మహత్యలు సిగ్గుచేటు
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు డాక్టర్ ఎస్.ఎల్.గోస్వామికి స్వామినాథన్ అవార్డు అందజేత హైదరాబాద్: ‘‘రైతు ఆత్మహత్యలు జరగడం సిగ్గుచేటు. కేవలం కనీస మద్దతు ధర దక్కకపోవడం వల్లే కాదు. విద్య, వైద్యం ఖర్చు పెరగడం వల్ల కూడా ఈ ఆత్మహత్య సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి’’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వాచీలు, బట్టలను ఎక్కడైనా అమ్ముకోడానికి వీలుంది. కానీ రైతు పండించిన ధాన్యంపై అనేక ఆంక్షలున్నాయి. ఇలాంటి ఆంక్షలు ఉండకూడదు’’ అని అన్నారు. ఆదివారమిక్కడ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, నార్మ్ మాజీ డెరైక్టర్ డాక్టర్ సుందర్‌లాల్ గోస్వామికి ఎంఎస్ స్వామినాథన్ అవార్డును వెంకయ్యనాయుడు బహూకరించారు. ఈ అవార్డును రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్)లు సంయుక్తంగా అందించాయి. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ‘‘ఒక సినిమా నటుడు తన కొడుకును సినీ హీరో చేయాలనుకుంటాడు. ఒక టీచర్ తన కొడుకును టీచర్ చేయాలనుకుంటాడు. జర్నలిస్టు తన కొడుకును జర్నలిస్టు చేయాలనుకుంటాడు. ఒక డాక్టర్ తన కుమారుడిని డాక్టర్ చేయాలనుకుంటాడు. కానీ రైతు మాత్రం తన కొడుకు రైతు కాకూడదని కోరుకుంటాడు’’ అంటూ రైతు దుస్థితిని వివరించారు. వ్యవసాయం లాభదాయకంగా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ స్వామినాథన్ పేర్కొన్నట్లు పెట్టుబడి ఖర్చు, దానికి అదనంగా 50 శాతం కలిపి రైతు పంటకు ధర కల్పిస్తేనే గిట్టుబాటు అవుతుందని వివరించారు. గోస్వామికి అవార్డు కింద రూ.2 లక్షలు, బంగారు పతకం అందజేశారు. మోదీ పేరుతో ప్రజల్లోకెళ్దాం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమాలు చేపట్టే దిశగానే ఇప్పటివరకు ఆలోచించిన బీజేపీ.. ఇక ప్రధానమంత్రి మోదీ పేరుతో ముందుకు సాగాలని భావిస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై వారికి పూర్తి అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదివారమిక్కడ నిర్వహిం చిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు నిజమైన హీరోలు మానవాళి జీవితం సుఖమయం చేయడానికి నిరంతరం పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలు నిజమైన హీరోలని, అలాంటి కోవకు చెందిన వ్యక్తే అయ్యంగారి సాంబశివరావు (డాక్టర్ ఏఎస్ రావు) అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఆదివారమిక్కడ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన డాక్టర్ ఏఎస్రావు పోస్టల్ కవర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, ఈసీఐఎల్‌ను ఏర్పాటు చేసిన డాక్టర్ ఏఎస్‌రావును ఎలక్ట్రానిక్స్ పితామహుడుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.