హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ), ఉస్మానియా యూనివర్సిటీలలో జరిగిన ఉదంతాలపై చర్చించడానికి కావాల్సినంత సమయం ఇస్తామన్నా కాంగ్రెస్ పార్టీ
మంత్రి హరీశ్, బీజేఎల్పీ నేత లక్ష్మణ్ మధ్య ఆసక్తికరమైన చర్చ
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ), ఉస్మానియా యూనివర్సిటీలలో జరిగిన ఉదంతాలపై చర్చించడానికి కావాల్సినంత సమయం ఇస్తామన్నా కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేక పోయిందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం దీనిపై మంత్రి హరీశ్‌రావు, భారతీయ జనతా పార్టీ పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ మధ్య కొద్ది సేపు ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘ కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుంది.
చర్చకు అవకాశం ఇచ్చినా ఆ పార్టీ ఏం మాట్లాడలేక పోయింది. ఏం మాట్లాడాలో కూడా తెలుసుకోలేక పోతున్నారు’ అని మంత్రి హరీశ్, లక్ష్మణ్‌తో అన్నారు. ఈ ఒక్క విషయమనే కాదు, సాగునీటి ప్రాజెక్టులపై జరిగే చర్చలో కూడా కాంగ్రెస్ ఇదే పరిస్థితి ఎదుర్కొంటోందని అన్నారు. సభలో చర్చ జరుపుదామంటే సభ వాయిదాను కోరుతున్నారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాగా, తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని, ఎస్సై రాత పరీక్షలో వెయిటేజీని తొలగించాలని కోరినట్లు లక్ష్మణ్ చెప్పారు.