'ఆర్‌ఎస్‌ఎస్ కు అండగా టీఆర్‌ఎస్ పాలన'
హైదరాబాద్: విద్యను కాషాయీకరణ చేయాలనే ఆర్‌ఎస్‌ఎస్ రహస్య ఎజెండాను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తుందని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఆరోపించారు. అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌కు రిమోట్ కంట్రోల్‌గా మారిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లోనూ, ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లోనూ అవమానకరంగా వ్యవహరించిందని ఆరోపించారు.
వీసీ అప్పారావుపై కేసుల విషయం తేలకుండానే తిరిగి ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఓయూ విద్యార్థులపై ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తున్నారని షబ్బీర్ ఆరోపించారు. ఓయూలో జరిగిన చిన్నచిన్న సంఘటలపై పోలీసులు అతిగా స్పందిస్తున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని ఓయూలో పోలీసులు దాడికి దిగారన్నారు. దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన విద్యార్థులకు భోజనం, నీళ్లు లేకుండా హింసించారని చెప్పారు.
కరుడుగట్టిన నేరస్తులతో వ్యవహరించినట్టుగా విద్యార్థులతో పోలీసులు ప్రవర్తించడపై షబ్బీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన నేరారోపణ ఎదుర్కొంటూ, విచారణ పూర్తికాకుండానే వీసీగా అప్పారావును తిరిగి నియమించడంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ కుమ్మక్కై విద్యను కాషాయీకరణ చేయడం, మతోన్మాద రాజకీయాలకు పాల్పడటంపై ప్రజల్లో ఎండగడ్తామని హెచ్చరించారు. విద్యార్థులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థులపై అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై కఠినచర్యలు తీసుకోవాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. వీసీ అప్పారావును డిస్మిస్ చేసేదాకా, దాడులకు దిగిన పోలీసులపై చర్యలు తీసుకునేదాకా పోరాడుతామని హెచ్చరించారు.