నల్లరేగడి నవ్వింది! | Huge golden crops in singuru | Sakshi
Sakshi News home page

నల్లరేగడి నవ్వింది!

Published Thu, May 4 2017 12:05 AM | Last Updated on Fri, Nov 9 2018 6:05 PM

నల్లరేగడి నవ్వింది! - Sakshi

నల్లరేగడి నవ్వింది!

సింగూరు కింద తొలిసారి ధాన్యం సిరులు
- 30 వేల ఎకరాల్లో పసిడి పంటలు
- యాసంగిలో ఊహించని స్థాయిలో దిగుబడి
- ఆనందం వ్యక్తం చేస్తున్న రైతన్నలు
- పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి హరీశ్‌
- స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి సింగూరు కింద నీళ్లందినట్టు వెల్లడి
- వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తామని స్పష్టీకరణ


సింగూరు ప్రాంతం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆ భూములన్నీ ఇన్నాళ్లూ వట్టిపోయాయి.. నీళ్లు లేక నోళ్లెళ్లబెట్టాయి.. తుప్పలు, ముళ్ల పొదలతో నిండిపోయాయి.. మూడు దశాబ్దాలుగా చుక్కనీటికి నోచుకోలేక బీళ్లుగా పడి ఉన్నాయి.. కానీ ఇప్పుడు ఆ భూముల్లో పసిడి పంట పండింది.. రైతుల ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది! ఇన్నాళ్లూ కోటి జనాభా ఉన్న జంట నగరాల దాహార్తిని తీర్చిన సింగూరు.. చరిత్రలో తొలిసారి ప్రాజెక్టు కింది గ్రామాల పంటలకు ప్రాణం పోసింది. గతేడాది వర్షాలతో మంజీరా పరవళ్లు తొక్కడం, అప్పటికే సిద్ధం చేసిన సింగూరు కాల్వల ద్వారా నీటి విడుదల జరగడంతో తొలిసారి 30 వేల ఎకరాలకు నీటి పారుదల శాఖ నీళ్లందించింది. ఈ ప్రాజెక్టు పరిధిలో తొలిసారి సాగు చేసిన పంటలు కోతకు రావడంతో కాల్వల పరిధిలోని గ్రామాల్లో నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం పర్యటించారు. రైతులతో ముఖాముఖి భేటీలు నిర్వహించారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు..?
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1976లో నిర్మించిన సింగూరు ప్రాజెక్టు తొలి నుంచి తాగునీటి ప్రాజెక్టుగానే ఉంది. 30 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని చేపట్టగా 11.59 టీఎంసీలను పూడిక, ఆవిరి నష్టాలకు కేటాయించి, మిగిలిన 18.41 టీఎంసీల్లో 8.35 టీఎంసీలు నిజాంసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు, 4 టీఎంసీలు జంట నగరాల తాగునీటికి, మరో 4.06 టీఎంసీలను ఘణపూర్‌ ఆయకట్టు స్థిరీకరణకు కేటాయించారు. సింగూరు ప్రాజెక్టు కోసం 32,892 ఎకరాల భూమిచ్చి,. 68 గ్రామాలు ముంపులో పోయినా, ఏనాడూ పరీవాహక ప్రాంతాల పొలాలకు నీళ్లందలేదు. ప్రాజెక్టు నుంచి సాగునీటి అవసరాల కోసం దశాబ్దాలుగా ఆందోళనలు జరగడంతో 2006లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2006 జూన్‌ 7న రూ.88.99 కోట్ల అంచనా వ్యయంతో కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆయన తదనంతరం ఆ నిర్మాణాలు ఆగిపోయాయి. మళ్లీ తెలంగాణ ఏర్పాటుతో ఆ నిర్మాణాలు మొదలయ్యాయి.

కాల్వల  నిర్మాణానికి రూ.88.99 కోట్లు, ఎత్తిపోతలకు రూ.32.68 కోట్లు.. మొత్తంగా 121.67 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. కాల్వలకు రూ.34.02 కోట్లు, లిఫ్ట్‌కు రూ.15.80 కోట్లు విడుదల చేశారు. దీంతో కాలువలకు సంబంధించి 80.6 శాతం, లిఫ్ట్‌ పనులు వంద శాతం పూర్తయ్యాయి. 2017–18 బడ్జెట్‌లో సింగూరు కాల్వల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.49.50 కోట్లు కేటాయించింది. నిధుల విడుదలతో పనుల్లో వేగం పెరిగి కాల్వల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది.

ఇకపై పూర్తి ఆయకట్టుకు నీళ్లు..
ప్రాజెక్టు కింద నాలుగు మండలాల్లోని 44 గ్రామాల పరిధిలో 40 వేల ఆయకట్టుకు నీరదించడం లక్ష్యం కాగా.. యాసంగిలో 30,116 ఎకరాలకు నీటిని విడుదల చేశారు. అలాగే 72 చెరువులను నింపి, 9,076 ఎకరాలను స్థిరీకరించారు. ఇకపై పూర్తి ఆయకట్టుకు నీరందించనున్నారు. బుధవారం కాల్వల పరిధిలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఆందోల్, ముదుమాణిక్యం, పోతిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో పంటల దిగుబడులు, ధాన్యం రాశులను పరిశీలించారు. రైతుల పొలాల వద్దే వారి అనుభవాలను తెలుసుకున్నారు. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పల వద్ద ఆగుతూ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యం దిగుబడులపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

కోటి ఎకరాల కలలో భాగమే..: మంత్రి హరీశ్‌
రైతులతో ముఖాముఖీ సందర్భంగా మంత్రి వివిధ గ్రామాల్లో ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి మెదక్‌ జిల్లాలో సింగూరు కాల్వల కింది ఆయకట్టుకు నీరందించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోటి ఎకరాల కలలో భాగమే సింగూరు కింద కాల్వలకు నీళ్లని పేర్కొన్నారు. ‘‘పూర్వ మెదక్‌ జిల్లాలో నిజాం హయాం తర్వాత ఒక్క కొత్త ఎకరాకు నీళ్లు పారకపోగా.. ఉన్న ఘణపూర్‌ ఆయకట్టు కింద 12 వేల ఎకరాల ఆయకట్టు తగ్గింది. కానీ తెలంగాణ ప్రభుత్వం సింగూరు కాల్వలకు రూ.60 కోట్ల మేర ఖర్చు చేసి ఈ ఏడాది 30 వేల ఎకరాలకు నీళ్లిచ్చింది. మరో 10 వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో నీళ్లివ్వనుంది. మరో 121 చెరువులను నింపి మరో 10 వేల ఎకరాలను స్థిరీకరించనుంది.

గతంలో సింగూరు గ్రామాల్లో ఉన్న ముళ్ల పొదలన్నీ ఇప్పుడు పంట పొలాలయ్యాయి..’’ అని హరీశ్‌ అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే బడ్జెట్‌లో 40 శాతానికి పైగా నిధులు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకి వెచ్చిస్తోందని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, కరెంట్‌ కోతలు లేవని, కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పోయాయని అన్నారు. ఈ  ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా 60 లక్షల టన్నుల పంట దిగుబడి వచ్చిందని చెప్పారు. పత్తి మద్దతు ధర రూ.4,160 ఉంటే ప్రస్తుతం మార్కెట్‌లో రూ.5 వేలకు పైగా ఉందని, పల్లికాయ ధర సైతం రూ.4,220 నుంచి రూ.5 వేలు దాటిందని, మొక్కజొన్న, కందులకు అదే మాదిరి మద్దతు ధర లభిస్తోందన్నారు. వచ్చే ఏడాది మే నుంచి రైతులకు పట్నం, పరిశ్రమలకు ఇస్తున్న మాదిరే వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్‌ రానే రాదని, ఇప్పుడు మాత్రం పొమ్మన్నా పోదని అన్నారు. ఎకరాకు రూ.4 వేల చొప్పున రాష్ట్రంలోని రైతులందరికీS వచ్చే ఏడాది మే నుంచి రూ.6 వేల కోట్ల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు.

ఇంత పంట పుట్టినప్పట్నుంచీ చూడలేదు
సింగూరు కింద ఇన్ని నీళ్లు ఎన్నడూ చూడలే. నేను పుట్టినప్పట్నుంచీ చూడనంత పంట పడింది. ఇంతకుముందు గొర్లు కాసేవాణ్ణి. ఇప్పుడు నాకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నా. మంత్రి చెప్పి నట్లు పెట్టుబడికి సాయపడితే ఇక పట్నం దిక్కు చూసే గోసుండదు..   
 – చెన్నయ్య, రైతు, ఆందోల్‌

మళ్లీ వస్తే గొర్రె కూర పెడతా
నాకు రెండెకరాలుంది. నాలుగేళ్లు పట్నంల కూరగాయలమ్మిన. నీళ్లు వచ్చినయని వచ్చి పంటల సాగు చేసిన. మంచి పంట వచ్చింది. వానాకాలానికి తయారుగా ఉన్నా. మంత్రి ముందస్తడని తెలిస్తే గొర్రె కోసెటొళ్లం. మళ్లొస్తే కచ్చితంగా గొర్రె కూర పెడతం..
– కొత్తగొల్ల శ్రీనివాస్, రైతు, ఆందోల్‌

ఇంత పంట జిందగీల చూస్తమనుకోలే..
నాకు 63 ఏళ్లు. ఇంతవరకు యాసంగిల ఇంత పంట చూడలే. జిందగీల చూస్తమనుకోలే. సింగూరు కాల్వలతో బంగారం లాంటి పంట పడింది. పెట్టుబడికి సైతం సాయం చేస్తామంటే ఇంకా పంటలు పండిస్తం.
– బాల్‌రెడ్డి, రైతు, ముదుమాణిక్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement