18నెలల్లో ‘కాళేశ్వరం’ పూర్తి
అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలి: మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనులను 18 నెలల్లో పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మూడు బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్మా ణ స్థలాన్ని మూడు రోజుల్లో ఖరారు చేయాలన్నారు. శనివారం ప్రాజెక్టు సైట్‌ను సందర్శించాలని ఈఎన్‌సీ మురళీధర్, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డిని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గురువారం మంత్రి జలజౌధ కార్యాలయంలో అధికారు లతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా, బ్యారేజీల అగ్రిమెంట్ల ప్రక్రియను వారంలోగా ముగించి,పనులను 15 రోజుల్లో ఆరంభించాలని సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీలను ఆదేశించారు.
ఇందుకు ఏజెన్సీలు అంగీకరించాయి. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం వేగాన్ని అధికార యంత్రాంగం, సిబ్బంది అందుకోవాలని కోరారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల కోసం భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణ విషయమై కరీంనగర్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భూసేకరణ ప్రక్రియను వేగిరం చేయాలని, ఈ మేరకు మంథని ఆర్డీఓకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. బ్యారేజీ, పంప్‌హౌజ్‌ల నిర్మాణం ఏకకాలంలో జరగాలని, జూలై 15న ముంబైలో తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య సమావేశం జరుగనున్న దృష్ట్యా ప్రాజెక్టు పనుల పురోగతిని నిరంతరం సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, సీఈ నల్లా వెంకటేశ్వర్లు, సీడీఓ సీఈ నరేందర్‌రెడ్డి, ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు పాల్గొన్నారు.