ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ భవనం: కేసీఆర్‌ | Telangana CM KCR Sppech After Cabinet Meeting | Sakshi
Sakshi News home page

ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ భవనం: కేసీఆర్‌

Published Tue, Jun 18 2019 8:52 PM | Last Updated on Tue, Jun 18 2019 11:53 PM

Telangana CM KCR Sppech After Cabinet Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌తో గతంలో చాలా వివాదాలు ఉండేవని.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సమస్యల పరిష్కారం దిశగా చర్చలు జరిగాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 21 ప్రారంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌, ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించినట్లు తెలిపారు. పక్క రాష్ట్రమైన ఏపీతో గోదావరి, కృష్ణా జలాల్లో వివాదాలు ఉన్నాయని, వాటన్నింటినీ త్వరలోనే పరిష్కరించుకుంటామన్నారు. ప్రజలకు సాగునీరు అందించాలనే ధృడ సంకల్పంతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని ప్రశంసించారు.

హైదరాబాద్‌లోని ఏపీ భవనాలను తెలంగాణకు ఇవ్వడానికి ఆ రాష్ట్రం ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. కాళేశ్వరంతో 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి కరకట్టల నిర్మాణాలు పూర్తయ్యాయని సీఎం వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వ సహాకారంతోనే కాళేశ్వరం పనులు వేగంగా జరిగాయన్నారు. పక్క రాష్ట్రాలైన  మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకతో స్నేహపూర్వక వాతావరణం కొనసాగిస్తామని సమావేశం అనంతరం సీఎం వెల్లడించారు. ఈనెల 28న ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ అధికారుల సమావేశం నిర్వహిస్తామన్నారు.



ఎర్రమంజిల్‌లో నూతన శాసనసభ భవనం..
అంతకుముందు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినేట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు  తీసుకున్నారు. తెలంగాణ నూతన అసెంబ్లీ భవనాన్నిఎర్రమంజిల్‌లో నిర్మిస్తామని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని వారసత్వ సంపదగా కాపాడుతామన్నారు. అలాగే కొత్త సచివాలయానికి ఈనెల 27న భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ నిర్మాణం కొరకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని.. దసరా తరువాత పనులను ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణలోని 22 జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించియింది. కొత్త మున్సిపల్‌ చట్టానికి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్త పోస్టుల నియామకానికి కేబినేట్‌ ఆమోదం తెలిపింది. అలాగే కోకపేటలో శారదా పీఠానికి రెండు ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించింది. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement