లక్ష్మీ బ్యారేజీ వద్ద గోదావరి జలాలకు నమస్కరిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టుల్లోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుని రిజర్వాయర్లను నింపుతూ.. గోదావరి నీళ్లు చుక్క కూడా వృథా పోకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లదే. ఎస్సారెస్పీ మొదలుకుని కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల పంపులు, కాల్వల ద్వారా చివరాఖరు ఆయకట్టు వరకు వ్యవసాయ భూములను తడిపేలా సునిశిత పర్యవేక్షణ చేయాలి’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా కేసీఆర్ గురువారం కరీంనగర్ నుంచి హెలికాప్టర్‌లో కాళేశ్వరం చేరుకున్నారు.
నాణేలు వదిలి.. పుష్పాంజలి ఘటించి..
కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం సన్నిధిలోని గోదా వరి ఘాట్‌కు చేరుకున్న కేసీఆర్.. గోదావరి, ప్రాణహిత సంగమ స్థలి, అంతర్వాహిని సరస్వతీ నదుల త్రివేణి సంగమ పుణ్య స్థలిని దర్శించుకున్నారు. ప్రాణహిత గోదారి గంగ పవిత్ర జలాలను తలపై చల్లుకుని నాణేలు వదిలి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత గోదావరి ఘాట్ నుంచి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం చేరుకుని పూజలు చేశారు. తర్వాత లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజ్ వద్ద నిండు కుండను తలపిస్తున్న ప్రాణహిత నదీ జలాలను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. బ్యారేజ్ వద్దకు చేరుకున్న సీఎం.. బ్యారేజ్ మీద నుంచి నదీ జలాల్లో నాణేలు వదిలి, ఉద్యమ కాలం నాటి మొక్కు చెల్లించుకున్నారు.
‘సాగునీటి’పై అధికారులకు క్లాస్
మేడిగడ్డ వ్యూ పాయింట్ వద్ద ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. రాబోయే వర్షాకాలం వరద నీరు ఉధృతంగా చేరుతుందని, ఈ నేపథ్యంలో లక్ష్మీ బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే సహా పలువురు ఇంజనీర్లు, ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. ‘ప్రాజెక్టుల నిర్మాణం, నీటి సరఫరా విషయంలో ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని పూర్తిస్థాయిలో ఇంజనీరింగ్ వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలి. అవసరమైతే పోలీసుల మాదిరి వైర్‌లెస్, వాకీటాకీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని పని చేయాలి. సమాచారాన్ని ప్రతి క్షణం చేరవేసుకుంటూ ఎప్పుడు ఏ మోటార్ నడుస్తోంది.. ఏ పంపు పోస్తోంది.. ఎంత నీరు ఎత్తిపోయాలి.. ఎప్పుడు ఆపాలే.. ఎప్పుడు నీటిని కిందికి వదలాలే వంటి పలు విధాలైన నీటి పంపిణీ సాంకేతిక అంశాలపై కాళేశ్వరం టీం మొత్తానికి అవగాహన ఉండాలి’అని కేసీఆర్ తెలిపారు. అలా సమన్వయంతో పనిచేస్తేనే గోదావరి జలాలను నూరు శాతం సద్వినియోగపర్చుకోవడం సాధ్యమవుతుందని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించి చర్యలు చేపట్టనున్నట్టు వివరించిన సీఎం.. మేడిగడ్డ వద్ద మధ్యాహ్నం భోజన అనంతరం కరీంనగర్ బయల్దేరారు.
ముక్తేశ్వర స్వామికి పూజలు..
లక్ష్మీ బ్యారేజీ సందర్శన కంటే ముందు.. కాళేశ్వర క్షేత్రాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. తొలుత ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకుముందు పుష్కరఘాట్‌లో గోదావరిమాతకు సీఎం కేసీఆర్ పూజలు చేశారు. గోదావరిలో నాణేలు వదిలిన కేసీఆర్.. చీర, సారె సమర్పించారు. సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐజీ నాగిరెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ మురళీధర్ రావు, కాళేశ్వరం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు గండ్ర జ్యోతి, అలుగు శ్రీవర్షిణి, పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment