తొలుత ఒడిశాను ఒప్పించండి
తొలుత ఒడిశాను ఒప్పించండి
Published Wed, Sep 13 2017 2:36 AM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM
- మహానది–గోదావరి అనుసంధానంపై కేంద్రానికి రాష్ట్రం సూచన
- ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో మంత్రి హరీశ్
న్యూఢిల్లీ: మహానది–గోదావరి నదుల అను సంధానంపై తొలుత ఒడిశాను ఒప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన జాతీయ నీటి అభివృద్ధి ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహానది–గోదావరి నదుల అనుసంధానం తర్వాతే గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం సముచితమన్నారు. 2, 3 నదుల అనుసంధానంతో రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడవచ్చన్నారు.
నదుల ఇంట్రాలింకింగ్‌ను ప్రోత్సహించాలి..
ప్రతి రాష్ట్రంలో అంతర్గతంగా నదుల అను సంధానాన్ని (ఇంట్రాలింక్) ప్రోత్సహించాలని కేంద్రాన్ని మంత్రి కోరారు. కృష్ణా నదిలో నీరు లేని సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటిస్థాయి తగ్గిపోతోందన్నారు. గోదావరిలో నీటి లభ్యత ఉన్నా కృష్ణా పరీవాహక ప్రాంతాలకు తరలించలేని పరిస్థి తులు ఉన్నాయన్నారు. ఈ సమస్యను పరిష్క రించేందుకు రాష్ట్రాల్లో ఇంట్రాలింకింగ్‌ను కేంద్రం ప్రోత్సహించాలన్నారు. దీనిపై గడ్కరీ స్పందిస్తూ ఇంట్రాలింకింగ్‌కు సంబంధించి త్వరలో భారీ ప్రణాళికను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు.
పెండింగ్ నిధులు విడుదల చేయండి...
ఏఐపీబీ స్కీం కింద రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రావాల్సిన రూ. 107.49 కోట్లు, శ్రీరాంసాగర్ స్టేజ్–2 ప్రాజెక్టుకు రూ. 30.34 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని గడ్కరీని హరీశ్‌రావు కోరారు. గోదావరి వృథా జలాలను కృష్ణాబేసిన్‌కు తరలించేందుకు ఇచ్చంపల్లి– నాగార్జునసాగర్, ఇచ్చంపల్లి– పులిచింతల ప్రాజెక్టుల అనుసంధానానికి ప్రతిపాదించిన కేంద్రం.. అవే వృథా జలాలను వాడుకునేందుకు చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఎందుకు మంజూరు చేయడం లేదన్నారు.
Advertisement
Advertisement