గులాబీ గూటిలో ‘మున్సిపల్’ ముసలం
ఓరుగల్లు టీఆర్‌ఎస్ నేతల్లో అసంతృప్తి సెగలు
* అసంతృప్తులను బుజ్జగించే పనిలో నాయకత్వం
* వరంగల్‌లోనే మంత్రి హరీశ్ మకాం
* పాత-కొత్త శ్రేణుల సమన్వయమే అసలు సమస్య
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో లొల్లి షురూ అయ్యింది. వివిధ రాజకీయ పక్షాల నుంచి గులాబీ గూటికి చేరిన నేతలు తమ వెంట తెచ్చిన అనుచురులకు అవకాశాలు ఇప్పించుకోవడంలో పోటీ పడుతున్నారు. దీంతో పాత-కొత్త శ్రేణుల సమన్వయమే సవాలుగా మారిందంటున్నారు. ముందు నుంచీ పార్టీలో కొనసాగిన వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయనే ఆందోళనా వ్యక్తమవుతోంది.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు వేదికగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్లు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంలోనే పాత-కొత్త శ్రేణుల మధ్య పంచాయితీలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి బలం చేకూరుస్తూ వరంగల్‌లో పాత-కొత్త నేతలు తమ వారికి కార్పొరేటర్ టికెట్లు ఇప్పించుకునే పనిలో పడ్డారు.
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కన్వీనర్‌గా ఉన్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల సమన్వయ కమిటీ ఎదుట ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కొండా మురళీ, మరోవైపు ఇటీవలే గులాబీ తీర్థం పుచ్చుకున్న ఎర్రబెల్లి దయాకర్‌రావులు ఎవరి జాబితాలు వారు పెట్టారు. సహజంగానే ఇది ఆధిపత్య పోరుకు దారి తీసింది. పరిస్థితి చేయి దాటిపోకుండా, పార్టీ అధినాయకత్వం మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దించింది. అయితే, ఒక్క మంత్రి మాత్రమే ఉన్న ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ పంచాయితీ లేకపోవడం గమనార్హం.
అసలేం జరుగుతోంది...
వరంగల్ కార్పొరేషన్‌లో 58 డివిజన్లు ఉండగా, వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో 6, పరకాల నియోజకవర్గంలో 4 డివిజన్లు ఉన్నాయి. మిగిలిన 48 డివిజన్లు వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోనే ఉన్నా యి. వినయ్ భాస్కర్, ముందు నుంచే తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేశారు. వారందరికీ టికెట్లు ఇవ్వడం కుదరకపోవడంతో అలక బూనారని సమాచారం.
కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ మురళీ తమ అనుచరులకు ఎక్కువ టికెట్ల కోసం యత్నించారని, వీరిలో అత్యధికులు కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారే కావడంతో పేచీ మొదలైందంటున్నారు. పార్టీ బీ-ఫాం ఇస్తే చాలు తేలిగ్గా గెలిచే అవకాశాలు ఉన్నందున, ఉద్యమంలో పనిచేసిన పాత కేడర్‌కే అవకాశం ఇవ్వాలని, వారికి డబ్బున్నా, లేకున్నా పట్టించుకోవద్దని ముందు నుంచీ టీఆర్‌ఎస్‌లో ఉన్నవారు వాదిస్తున్నారు.
దీనికితోడు తాజాగా టీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి అనుచరుడు, టీడీపీ నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళీకి టికెట్ ఇవ్వాలనడంతో తన నియోజకవర్గంలో ఎర్రబెల్లి వేలు పెడుతున్నారని వినయ్ భాస్కర్ పంచాయితీ మొదలుపెట్టారని అంటున్నారు. దీంతోపాటు మాజీ మంత్రి బస్వరాజు సారయ్య చేరిక తర్వాత ఆయన అనుచరుల్లోనూ ఇద్దరు ముగ్గురికి టికెట్ల హామీ ఇచ్చారని వినికిడి. మొత్తంగా కొత్తవారికి కూడా అవకాశం కల్పించాల్సిన పరిస్థితిలో అధిష్టానం ఉండగా, పాత వారి పరిస్థితి ఏమిటనే అసంతృప్తి పెరిగిపోయిందని చెబుతున్నారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు హరీశ్‌రావు మంగళ, బుధవారాల్లో వరంగల్‌లోనే మకాం వేసి అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇచ్చారని, నాయకులనూ బుజ్జగించారని అంటున్నారు. అయినా, నామినేషన్లకు చివరి రోజైన బుధవారం టీఆర్‌ఎస్ నుంచి పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశారని, బీ-ఫారం ఇచ్చేటప్పటికీ (26వ తేదీ) ఈ వివాదం మరింత ముదిరి రెబెల్స్ బెడద తప్పక పోవచ్చని అంచనా వేస్తున్నారు.