సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్‌ఎస్.. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. అయితే గతంలో మాదిరిగా పైరవీలకు తావులేకుండా సర్వే రిపోర్ట్ ఆధారంగానే టికెట్ ఇవ్వనున్నట్లు పలు రాజకీయ పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ ఇప్పటికే ఇప్పటికే పలు దఫాలు సర్వేలు చేయించగా.. కాంగ్రెస్ సైతం సర్వే ఆధారంగానే టికెట్‌లు ఇస్తామని ఇటీవల ప్రకటించడంతో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో గుబులు నెలకొంది.
పనితీరు మెరుగుపరుచుకునే యత్నం
ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అధికార పార్టీ పలుసార్లు నిర్వహించిన సర్వేల్లో ప్రజలు ఏం చెప్పారోనన్న భయం వారిని వెంటాడుతోంది. నిఘా వర్గాలు, అధికార పార్టీ అనుబంధ పత్రిక, ఓ ప్రైవేట్ సంస్థ ఇటీవల సర్వే చేపట్టాయి. సర్వే తమకు అనుకూలంగా ఉందా.. ప్రతికూలంగా ఉందా ఎమ్మెల్యేలు తెలుసుకుంటున్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎమ్మెల్యేలు తమ తప్పులు దిద్దుకోవడం, పనితీరును మరింత మెరుగుపర్చుకునే యత్నంలో ఉన్నారు.
సీఎంను కలిసిన గొంగిడి దంపతులు
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి దంపతులు నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలువడం చర్చనీయాంశమైంది. సర్వే నివేదిక ఆధారంగా ఈసారి సునీతకు బదులు ఆమె భర్త మహేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ బరిలోకి దించే అవకాశం ఉందన్న ప్రచారం పలు మీడియాల్లో జరుగుతోంది. సిట్టింగ్‌లకే సీట్లు అంటూనే కొందరికి మార్పు ఖాయమని కేసీఆర్ ప్రకటించిన వెంటనే ఈ ప్రచారం మొదలైంది. కేడర్‌లోనూ వివిధ రకాలుగా చర్చ మొదలైంది. టికెట్ తమకే ఖాయమని పార్టీ శ్రేణులకు సంకేతాలివ్వడానికే సీఎంను కలిసి హామీ తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా గో హెడ్ అని మహేందర్‌రెడ్డి భుజంతట్టారని గొంగిడి సునీత ప్రకటించడంతో బీఆర్‌ఎస్ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మరోసారి ఆలేరు నుంచి పోటీచేయడం ఖాయమన్న ధీమాతో ఉన్నాయి.
చిక్కిన పట్టు పోకుండా..
జిల్లాలో బీజేపీ చాపకింది నీరులా విస్తరిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర జోష్ నింపింది. దాంతో పాటు స్ట్రీట్ కార్నర్ సమావేశాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు మరింత చేరువయ్యారు. గతంలో కంటే తమ బలం పెరగడంతో చిక్కిన పట్టును వదులుకోవద్దన్న పట్టుదలతో నాయకత్వం ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికా రమే లక్ష్యంగా కార్యక్రమాలను విస్తృత పరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. టికెట్ ఆశిస్తున్న వారు తమ ప్రచారాన్ని ప్రారంభించారు.
కాంగ్రెస్‌లోనూ సర్వే..
పైరవీకారులకు కాదు సర్వేల ఆధారంగా టికెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సర్వే ప్రామాణికంగా నియోజకవర్గాల్లో నిత్యం ప్రజల మధ్య ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment