కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌పై కేటీఆర్ ధ్వజం
కులగణనలో ప్రశ్నలపై ప్రజలు నిలదీస్తున్నారు
ధాన్యానికి బోనస్ ఇచ్చినట్టు చూపిస్తే రాజీనామా చేస్తాం
హనుమకొండ/యాదగిరిగుట్ట రూరల్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన డ్రామా ఆడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధ్వజమెత్తారు. కులగణనలో ఆస్తులు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఆదాయం వంటి వివరాలు ఎందుకంటూ ప్రజలు అధికారులను నిలదీస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన హనుమకొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి ఏడాది అవుతున్నా దానిపై ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా దానిని అమలు చేయలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామని అబద్ధాలు ఆడుతున్నారని, ఏ ఒక్కరికైనా బోనస్ ఇచ్చినట్లు చూపిస్తే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్న సందర్భంగా వారోత్సవాలు నిర్వహించాలా..? విజయోత్సవాలు నిర్వహించాలా అనే ఆలోచన చేస్తున్నారని, వారు విజయోత్సవాలు నిర్వహిస్తే.. తాము కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యాలపై వారోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.
రేవంత్‌రెడ్డి రాగానే బీసీబంధు, రైతుబంధు, దళితబంధు.. ఇలా అన్నీ బందయ్యాయని కేటీఆర్ అన్నారు. కులగణన పూర్తయిన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ బాంబులు.., ఆ బాంబులు పేలుతాయంటున్న ఆ మంత్రి ఏ ఒక్క బాంబు పేల్చేది లేదని, ఆయన ఏ మంత్రి ఏమోకాని బాంబుల మంత్రి అని పేరు పెట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
అధైర్యపడొద్దు.. మళ్లీ వచ్చేది కేసీఆర్ సారే
రైతులు అధైర్యపడవద్దని, మళ్లీ కేసీఆర్ సారే వస్తారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు వెళ్తుండగా, భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామం వద్ద ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులతో కలసి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చొల్లేరు గ్రామానికి చెందిన తోటకూరి వెంకటమ్మ అనే వృద్ధురాలు కేటీఆర్ వద్దకు వెళ్లి.. ‘కేసీఆర్ సారు పాలననే బాగుండేది, మాకు రైతుబంధు క్రమం తప్పకుండా వేసేవాడు, ఆ డబ్బులతో వ్యవసాయం చేసుకుని సంతోషంగా ఉండేవాళ్లం, ఇప్పుడు రైతుబంధు రావడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం’అని అన్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. బాధపడవద్దని, రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని, కేసీఆర్ సారే మళ్లీ సీఎం అవుతారని భరోసా ఇచ్చారు.
పగ నామీదే అయితే పదవిని వదిలేస్తా: కేటీఆర్
సిరిసిల్లటౌన్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నామీద పగ ఉంటే.. సిరిసిల్ల ఎమ్మెల్యే పదవిని రేపే వదిలేస్తా’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 నెలల్లో 34 మంది చేనేత కార్మికులు చనిపోయారని, ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి కళ్లు తెరవాలని, చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో శనివారం ఆత్మహత్యకు పాల్పడిన నేత దంపతులు బైరి అమర్‌నాథ్, స్రవంతి పిల్లలు లహరి, శ్రీవల్లి, దీక్షిత్‌నాథ్‌లను ఆదివారం ఆయన పరామర్శించారు. పిల్లలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 34 మంది నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడినా ప్రభుత్వానికి సోయి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా సర్కారు సిగ్గు తెచ్చుకోవాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ, కేసీఆర్ కిట్ల ఆర్డర్లు రాక సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చేదాకా బీఆర్‌ఎస్ తరఫున ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు
Comments
Please login to add a commentAdd a comment