Gongidi Sunita
-
దయ ఉంటే ఓట్లు వేయండి.. లేదంటే లేదు..!
యాదగిరిగుట్ట రూరల్: ‘నేను ఓట్లు అడుక్కోవడానికి వచ్చాను.. మీ దయ ఉంటే ఓట్లు వేయండి.. లేదంటే లేదు’ అని ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్ట మండలంలోని రాళ్లజనగాం గ్రామంలో బుధవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిచారు. ఈ సందర్భంగా బస్వాపురం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన పలువురు భూ నిర్వాసితులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా తాము కోల్పోయిన భూములకు తక్కువ నష్టపరిహారం వచ్చిందని, సరైన న్యాయం జరగలేదని వాపోయారు. దీనిపై సునీత మాట్లాడుతూ.. తాను రాళ్లజనగాం గ్రామం రిజర్వాయర్‌లో పోకుండా సాధ్యమైన రీతిలో కృషిచేశానని, తాను ఓటును అభ్యర్థించడానికి వచ్చానని, ఇష్టముంటే ఓట్లు వేయండి, లేదంటే లేదు అని అసహనం వ్యక్తం చేస్తూ ప్రచార వాహనం దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
కేసీఆర్ హామీ.. ఆలేరు టికెట్‌పై సర్వత్రా ఆసక్తి
సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్.. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. అయితే గతంలో మాదిరిగా పైరవీలకు తావులేకుండా సర్వే రిపోర్ట్ ఆధారంగానే టికెట్ ఇవ్వనున్నట్లు పలు రాజకీయ పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఇప్పటికే ఇప్పటికే పలు దఫాలు సర్వేలు చేయించగా.. కాంగ్రెస్ సైతం సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తామని ఇటీవల ప్రకటించడంతో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో గుబులు నెలకొంది. పనితీరు మెరుగుపరుచుకునే యత్నం ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అధికార పార్టీ పలుసార్లు నిర్వహించిన సర్వేల్లో ప్రజలు ఏం చెప్పారోనన్న భయం వారిని వెంటాడుతోంది. నిఘా వర్గాలు, అధికార పార్టీ అనుబంధ పత్రిక, ఓ ప్రైవేట్ సంస్థ ఇటీవల సర్వే చేపట్టాయి. సర్వే తమకు అనుకూలంగా ఉందా.. ప్రతికూలంగా ఉందా ఎమ్మెల్యేలు తెలుసుకుంటున్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎమ్మెల్యేలు తమ తప్పులు దిద్దుకోవడం, పనితీరును మరింత మెరుగుపర్చుకునే యత్నంలో ఉన్నారు. సీఎంను కలిసిన గొంగిడి దంపతులు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి దంపతులు నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలువడం చర్చనీయాంశమైంది. సర్వే నివేదిక ఆధారంగా ఈసారి సునీతకు బదులు ఆమె భర్త మహేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ బరిలోకి దించే అవకాశం ఉందన్న ప్రచారం పలు మీడియాల్లో జరుగుతోంది. సిట్టింగ్‌లకే సీట్లు అంటూనే కొందరికి మార్పు ఖాయమని కేసీఆర్ ప్రకటించిన వెంటనే ఈ ప్రచారం మొదలైంది. కేడర్‌లోనూ వివిధ రకాలుగా చర్చ మొదలైంది. టికెట్ తమకే ఖాయమని పార్టీ శ్రేణులకు సంకేతాలివ్వడానికే సీఎంను కలిసి హామీ తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా గో హెడ్ అని మహేందర్‌రెడ్డి భుజంతట్టారని గొంగిడి సునీత ప్రకటించడంతో బీఆర్ఎస్ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మరోసారి ఆలేరు నుంచి పోటీచేయడం ఖాయమన్న ధీమాతో ఉన్నాయి. చిక్కిన పట్టు పోకుండా.. జిల్లాలో బీజేపీ చాపకింది నీరులా విస్తరిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర జోష్ నింపింది. దాంతో పాటు స్ట్రీట్ కార్నర్ సమావేశాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు మరింత చేరువయ్యారు. గతంలో కంటే తమ బలం పెరగడంతో చిక్కిన పట్టును వదులుకోవద్దన్న పట్టుదలతో నాయకత్వం ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికా రమే లక్ష్యంగా కార్యక్రమాలను విస్తృత పరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. టికెట్ ఆశిస్తున్న వారు తమ ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌లోనూ సర్వే.. పైరవీకారులకు కాదు సర్వేల ఆధారంగా టికెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సర్వే ప్రామాణికంగా నియోజకవర్గాల్లో నిత్యం ప్రజల మధ్య ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. -
ఎమ్మెల్యేపై టీఆర్ఎస్ కార్యకర్తల అనుచిత చర్య..!
సాక్షి, యాదాద్రి భువనగిరి : రాష్ట్రవ్యాప్తంగా ‘కారు’ దూసుకెళ్తుండగా.. యాదగిరిగుట్టలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ఐదు చోట్ల, టీఆర్ఎస్ మూడు, సీపీఐ ఒకటి, ఇండిపెండెంట్లు మూడు వార్డుల్లో విజయం సాధించారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కాంగ్రెస్‌కు ఉండటంతో యాదగిరి గుట్టలో ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకొనే అశకాశముంది. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, టీఆర్ఎస్ కార్యకర్తలు నెట్టేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్‌కు మెజారిటీ స్థానాలు వచ్చాయని, ఆ అక్కసుతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సునీత కాంగ్రెస్ కార్యకర్తలపై కావాలనే లాఠీచార్జి చేయించారని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నా. యాదగిరిగుట్టలో ఇప్పటికే మాకు క్లీయర్ మెజారిటీ వచ్చింది. ఆలేరులో మా ఓటమిని అంగీకరించి అటు వైపు కూడా వెళ్ళలేదు. కానీ, మీ ఎమ్మెల్యే ఇక్కడికొచ్చి పోలీసులు, రౌడీల చేత బెదిరింపులకు పాల్పడుతూ కౌన్సిలర్లని కొనడానికి చూస్తున్నారు. దీనిపై సీఎం కేసార్ సమాధానం చెప్పాలి. దేవుడి సాక్షిగా టీఆర్ఎస్ అనైతికంగా వ్యవహరిస్తోంది. కేసీఆర్‌కు పాపం తగులుతుంది. టీఆర్ఎస్ గుండాయిజాన్ని తట్టుకోలేకపోతున్నాం. ఎంతవరకైనా చూసుకుంటాం’అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఫలితాలు.. మొత్తం మున్సిపాలిటీలు : 18 టీఆర్ఎస్ గెలిచినవి : 6 ఆలేరు, పోచంపల్లి, మోత్కూరు, దేవరకొండ, హుజూర్నగర్, తిరుమలగిరి కాంగ్రెస్ గెలిచినవి : 3 యాదగిరిగుట్ట, నేరేడుచర్ల, చండూరు హంగ్ : 4 చౌటుప్పల్, భువనగిరి, చిట్యాల, హాలియా టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్న స్థానాలు : 5 నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, నందికొండ -
పల్లెల స్వచ్ఛతతోనే బంగారు తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ఆర్థికాభివృద్ధితో పాటు రాష్ట్రంలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. మంగళవారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో యూనిసెఫ్, మారి సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన‘స్వచ్ఛ తెలంగాణకు సర్పంచుల సదస్సు’ను ఆమె ప్రారంభించారు. సునీత మాట్లాడుతూ.. మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని సర్పంచులకు పిలుపునిచ్చారు. దశాబ్దాల కలగా ఉన్న ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిం చుకున్న ప్రజలకు తెలంగాణను బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా మార్చడం పెద్ద కష్టమైనదేమీ కాదన్నారు. సర్పంచ్ అంటే చిన్నస్థాయి అనుకోనక్కర్లేదని, పట్టుదలతో పనిచేస్తే ఢిల్లీదాకా వె ళ్లొచ్చని... అందుకు తానే ఓ ఉదాహరణ అని అన్నారు. మూడేళ్ల తర్వాత స్వచ్ఛ భారత్ ఫలితాలు స్వచ్ఛ భారత్ ఉద్యమ ఫలితాలు మూడేళ్ల తరువాత అందరికీ అనుభవంలోకి రానున్నాయని యునిసెఫ్ హైదరాబాద్ చీఫ్ రూత్ లాస్కానో లియానో అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఓడీఎఫ్‌గా మార్చితే ఎంతోమందిని భయంకరమైన వ్యాధుల నుంచి రక్షించగలుగుతామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ 27.5 లక్షల కుటుంబాల్లో మరుగుదొడ్లు లేవని, గ్రామాల వారీగా లక్ష్యాలను ఏర్పరచుకొని అన్ని కుటుంబాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ, సిద్దిపేట్ నియోజకవర్గాలను ఇప్పటికే ఓడీఎఫ్‌గా ప్రకటించగా, త్వరలో మరో ఐదు నియోజకవర్గాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ జాన్‌వెస్లీ, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాములు నాయక్, ఎస్బీఎం(గ్రామీణ)డెరైక్టర్ రామ్మోహన్, మారి సంస్థ కార్యదర్శి ఆర్.మురళి, వివిధ జిల్లాల నుంచి మండల పరిషత్ అధికారులు, 475గ్రామాల నుంచి సర్పంచులు పాల్గొన్నారు.