నల్లగొండ: సాధారణ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్‌కు సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్ అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించబోతున్నారు. వివిధ కార్యాలయాల ప్రారంభోత్సవాల అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జిల్లా పర్యటనకు వస్తున్నందున ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి తెర తీస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈసారి దక్షిణ తెలంగాణ నుంచే సీఎం తన ప్రచారాన్ని ప్రారంభిస్తారనే చర్చకు ఇది నాందికాబోతోందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయడంతోపాటు ప్రతిపక్షాలపై ఎలాంటి అస్త్రాలు సందిస్తారన్న చర్చ ప్రజల్లో సాగుతోంది.
కాగా, సూర్యాపేటలో సీఎం బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలకు మండలాల వారీగా బాధ్యతలను అప్పగించి జనసమీకరణ చేపట్టారు. ఒకరకంగా దీన్ని ఎన్నికల ప్రచార సభలాగే భావించి ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసినందున ఈ సభ ద్వారానే మళ్లీ ఎన్నికల వేడి పుట్టించేలా సీఎం ప్రసంగం ఉండబోతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో ఉత్కంఠ!
రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల కసరత్తు నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి ఏం మాట్లాడతారోనని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఆశావహుల్లోనూ టెన్షన్ నెలకొంది. పార్టీ అభ్యర్థులకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తారా? టికెట్లకు సంబంధించిన స్పష్టత ఇస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈసారి టికెట్లను ఎవరికి ఇవ్వాలన్న విషయంలో అధినేత ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.
ఈ సభలో ఆ ప్రకటన చేస్తారా? లేదంటే ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేసి, చేసిన సంక్షేమాభివృద్ధినే ప్రాధాన్యంగా తీసుకొని మాట్లాడతారా? అన్న చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ.. ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి.. ఒకొక్కటి వదులుతాం అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ముఖ్యమంత్రి టూర్ షెడ్యూల్ ఇలా..
ఉదయం 11 గంటలకు సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల హెలిపాడ్‌కు చేరుకుంటారు.
11.10కి మెడికల్ కళాశాలను ప్రారంభిస్తారు.
11.35కి ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను ప్రారంభిస్తారు.
12 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
12.30కి బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
1.15కు కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు.
1.45నుంచి 2.45 వరకు భోజన విరామం
2.45కి నూతన కలెక్టరేట్ నుంచి బయలుదేరి 3 గంటలకు ప్రగతి నివేదన సభకు హాజరవుతారు.
4.10కి సభాస్థలి నుంచి బయలుదేరి నేరుగా హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు.
4.25కు హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
సిట్టింగ్‌లకే టికెట్లని చెప్పినా..
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని సీఎం పలుమార్లు స్పష్టం చేశారు. అయినా సర్వేల ఆధారంగానే గెలుపునకు అవకాశాలు ఉన్న వారికే టికెట్లు కేటాయించే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే పలు నియోజకవార్గల్లో ఆశావహులు టికెట్ తమకు ఇస్తారేమోనన్న ఆశతో ఫౌండేషన్లను ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
జిల్లాలోని నాగార్జునసాగర్, దేవరకొండ తదితర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్‌లో నోముల భగత్‌పై ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గం వ్యతిరేకతతో ఉంది. బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్ యాదవ్, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారు. శనివారం పెద్దవూరలో కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ఆయన అల్లుడు, సినీ హీరో అల్లు అర్జున్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి సాగర్ నియోజకవర్గానికే చెందిన ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాజరు కావడం చర్చనీయంశంగా మారింది. దేవరకొండలో రవీంద్రకుమార్‌కు టికెట్ ఇస్తే తాము పనిచేయబోమని నియోజకవర్గ నేతలు ఆలంపల్లి నర్సింహ, దేవేందర్‌నాయక్ తదితరులు శనివారం హైదరాబాద్‌కు వెళ్లి మంత్రి హరీష్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసి చెప్పారు. వీటితోపాటు కోదాడ, నకిరేకల్ వంటి నియోజకవర్గాల్లోనూ నెలకొన్న సమస్యలపై సూర్యాపేట సభ ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని నేతలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment