సాక్షి, భువనగిరి: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. భువనగిరి బీఆర్‌ఎస్ కార్యాలయంపై ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీఎంపై బీఆర్‌ఎస్ నేత కంచర్ల వ్యాఖ్యలకు నిరసనగా దాడికి దిగారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల దాడిలో ఫర్నీచర్ ధ్వంసమైంది.
కాగా, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడి చేసి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు కార్యాలయం భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామంటున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళనకు దిగారు.
బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడిని ఖండించిన కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎన్నుకున్న ప్రజలతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈ రోజు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గుండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటుందన్నారు. మా పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. వెంటనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, వారి వెనుక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఎటు చూసినా సంక్రాంతి రద్దీ.. ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు చుక్కలే
Comments
Please login to add a commentAdd a comment