దేవుని మీద ఒట్టుపెట్టి మాట తప్పాడు
రుణమాఫీ పూర్తిగా జరిగే వరకు బీఆర్‌ఎస్ పోరాటం: హరీశ్
సాక్షి, యాదాద్రి: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి చేసిన ప్రమాణం ఏమైందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలతో పాటు పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని యాదగిరిగుట్ట దేవుడిపై ఒట్టు పెట్టి రేవంత్‌రెడ్డి దైవ ద్రోహానికి పాల్పడ్డారన్నారు. గురువారం ఆలేరులో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. ముందుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్టలో విలేకరులతో మాట్లాడారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులను పోలీస్‌యాక్ట్, లాఠీలతో ఆపలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పకుంటున్న ప్రజాపాలనలో ధర్నాలు నిషేధం అని రైతులకు పోలీసులు నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామంలో జర్నలిస్టులపై దాడి చేశారన్నారు. రైతు రుణమాఫీపై రేవంత్‌రెడ్డి, ఆయన కేబినెట్ మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
42 లక్షల్లో 20 లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగిందని మంత్రులే చెబుతున్నారన్నారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల ఇంకా రుణమాఫీ పూర్తిగా కాలేదని చెప్పిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి మాటతప్పి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం లక్ష్మినరసింహస్వామి దగ్గరికి వచ్చామని, ఇందుకోసం ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. డిసెంబర్ 9 నుంచి రుణాల వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒట్టు పెట్టి ప్రమాణం చేసిన అన్ని దేవాలయాలకు వెళ్లి పాప ప్రక్షాళనకు ఆలయాలను శుభ్రం చేస్తామని వెల్లడించారు.
రైతుల పక్షాన త్వరలో కేసీఆర్ పోరు
రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో రాష్ట్రంలో యాత్ర చేపడతారని హరీశ్‌రావు వెల్లడించారు. ఆలేరులో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కొందరికే రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఏ ఊరికైనా పోదాం..రుణమాఫీ పూర్తిగా అయ్యిందా అంటే కాలేదన్నారు.
రుణమాఫీ విషయంలో ప్రజలు మంత్రులను అడ్డుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. రైతుల కోసం అసెంబ్లీలో కొట్లాడినం. బయట కొట్లాడుతున్నామన్నారు. రైతుబంధు పథకంలో 11 విడతల్లో రూ.72 వేల కోట్లు కేసీఆర్ ఇచ్చారని, రైతు బాగుంటే రాజ్యం బాగుంటదని కేసీఆర్ ఆలోచన చేశారన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని చెప్పారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నాను విజయవంతం చేసిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, వివేకానంద, కాలేరు వెంకటేష్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, నాయకులు గొంగిడి మహేందర్‌రెడ్డి, క్యామ మల్లేశం, కల్లూరి రామచంద్రారెడ్డి, గడ్డమీది రవీందర్, కర్రె వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment