ఎక్స్‌గ్రేషియా చెక్కును అందజేస్తున్న మంత్రి హరీష్‌రావు
- రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
తూప్రాన్: రైతుల ఉసురుపోసుకుంది కాంగ్రెస్ పార్టీయేనని, తమ ప్రభుత్వ హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన తూప్రాన్‌లో విలేకరులతో మాట్లాడుతూ రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.
కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలనలో రైతులకు ఒరగబెట్టిందేమిటని ప్రశ్నించారు. అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరాతో రైతు రోడ్డెక్కని రోజు లేదన్నారు. రైతులు నిత్యం మోటార్లు, స్ట్రార్టర్లు కాలిపోవడంతో అప్పుల పాలయ్యారన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నాణ్యమైన 12 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా పల్లెలకు, పట్టణాలకు, పరిశ్రమలకు అందజేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఎరువులు, విత్తనాల కోసం కాంగ్రెస్ హయాంలో ఉదయం నుంచి రాత్రుళ్ల వరకు చెప్పులను లైన్లలో పెట్టి నిద్రహారాలు మాని రోడ్లపై నిద్రించేవారని విమర్శించారు.
నేడు ఒక్క రైతు కూడా ఎరువులు, విత్తనాలు దొరకడంలేదని ఫిర్యాదు చేయడం లేదన్నారు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. రైతులకు మూడు విడతలుగా రుణామాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్‌లో రైతు గర్జన ఏమని నిర్వహిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి, జెడ్పీటీసీ సుమన, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీశైలంగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, సర్పంచ్‌లు మల్లేశ్ యాదవ్, శివ్వమ్మ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి చేతుల మీదుగా చెక్కు పంపిణీ
మండలంలోని రావెల్లి గ్రామానికి చెందిన బాగన్నగారి శ్రీనివాస్‌రెడ్డి ఫిబ్రవరి 15న తన వ్యవసాయ క్షేతం వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతు చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ట్రాన్స్‌కో అధికారులు మృతుని కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.ఘీ మొత్తాన్ని చెక్కు రూపంలో మంగళవారం మంత్రి హరీశ్‌రావు మృతుని భార్యకు అందజేశారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏడీఈ వీరారెడ్డి, ఎఈ వేంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.