బాబోయ్ దొంగలు
తాళం వేస్తే ఇల్లు గుల్లే..
⇒ వరుస చోరీలతో ప్రజలు బెంబేలు
⇒ దగా పడుతున్న ‘నిఘా’..
⇒ కదలికలు పసిగట్టని సీసీ కెమెరాలు
⇒ నిద్రమత్తులో పోలీసు విభాగం
⇒ యంత్రాంగం తీరుపై మంత్రి హరీష్ ఫైర్
⇒ బాధితులకు పరామర్శ
సాక్షి, సంగారెడ్డి ప్రతినిధి: సుంకరి కిష్టయ్య.. మెదక్ పట్టణంలోని వెంకట్రావునగర్ కాలనీకి చెందిన ఈయన ఇంటికి తాళం వేసి తన బంధువుల ఇంటికి వెళ్లాడు. మర్నాడు వచ్చే సరికి తాళం పగులగొట్టి వుంది. ఆ ఇంట్లో బీభత్సం సృష్టించిన దొంగలు 4 తులాల బంగారం, 5 తులాల వెండి, 36 వేల నగదు మూటకట్టుకుపోయారు.
రాజ్‌కుమార్, జిల్లా 8వ అదనపు జడ్జి.. ఈయనా మెదక్ పట్టణ వాసే. ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లిన ఆయన తిరిగి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడ్డారని తెలిసింది. అశోక్, టీచర్.. మెదక్‌కే చెందిన ఈయన ఇంట్లో దొంగలు పడి అందినకాడికి దోచుకుపోయారు. ఇవీ ఇటీవల జిల్లాలో పోలీసుల పనితీరుకు ‘మచ్చ’తునకలుగా నిలిచిన ఉదంతాలు. దొంగలు రాత్రీ పగలు తేడా లేకుండా ఇళ్లు గుల్ల చేస్తున్నారు. వీరి ఆగడాల ఫలితంగా ఇంటికి తాళం వేస్తే నగా నట్రాకు గ్యారంటీ లేకుండాపోతోంది. జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
6 నెలల్లో వందల చోరీలు
గడిచిన ఆరు నెలల్లో జిల్లాలో వందల సంఖ్యలో చోరీలు జరిగాయి. ఇళ్లనే కా దు.. బంగారం దుకాణాలు, ఏటీఎం కేంద్రాలు.. వేటినీ వదలడం లేదు. గ త ఏడాది పగలు దొంగతనాలు 92, రాత్రి దొంగతనాలు 384, సాధారణ దొంగతనాలు 912 జరిగాయి. గతేడా ది మొత్తం రూ.6,26,38,971 సొత్తు దొంగల పాలైంది. పోలీసులు రూ. 2, 97,79,266 మాత్రమే రికవరీ చేశారు.
మచ్చుకు కొన్ని..
గత డిసెంబర్‌లో సంగారెడ్డి పాతబ స్టాండ్‌లో ఉన్న ఇండి క్యాష్ ఏటీఎం లో చోరీ జరిగింది. ఏటీఎంను గ్యాస్ క ట్టర్లతో కోసి అందులో ఉన్న రూ.3.21 లక్షలను అపహరించుకుపోయారు. అదేరోజు నర్సాపూర్ మీదుగా కౌడిపల్లికి చేరుకొని ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. అటుపై మెదక్ పట్టణంలోని ఆటోనగర్‌లో ఏటీఎంను కొల్లగొట్టారు. గ్యాస్ కట్టర్‌తో మిషన్‌ను ధ్వం సం చేసి డబ్బు అపహరణకు యత్నించారు. పోలీసులు అప్రమత్తం కావడం తో పారిపోయారు.
చోరులు అత్యాధునిక పరికరాలు, వాహనాలను ఉపయోగిస్తున్నట్టు ఈ ఘటనల ద్వారా వెలుగులోకి వచ్చింది. మెదక్ పట్టణం లో వారం క్రితం దొంగలు ఆరు ఇళ్లలో బీభత్సం సృష్టించారు. జడ్జి ఇంటిని సైతం వదలలేదు. తాజాగా సంగారెడ్డి గణేష్‌నగర్‌లో తాళం వేసిన రెండు ఇళ్ల లో దొంగలుపడి 2 తులాల బంగారం, 40 వేల నగదు ఎత్తుకెళ్లారు. అయ్యప్పకాలనీలో సైతం ఇళ్లను గుల్ల చేశారు.
నిద్రమత్తులో పోలీసులు
దొంగలు పేట్రేగుతున్నా పోలీసులు నిద్రమత్తులో జోగుతున్నారు. దొంగతనాలు, నేరాల నివారణకు సీసీ కెమెరా లు అమర్చామని, ప్రత్యేకంగా నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నా.. దొంగల ఆగడాలను ఇవేమీ ఆపలేకపోతున్నాయి. నిఘా లేకే దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఫలి తంగా ప్రజలు ఇంటికి తాళం వేయాలంటేనే భయపడుతున్నారు. పోలీసు లు ఏ చర్యలూ తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
‘పోలీస్’పై మంత్రి హరీష్ సీరియస్
సంగారెడ్డి పట్టణంలో ఇటీవల వరుస చోరీలు జరుగుతుండటంతో మంత్రి హరీష్‌రావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని గణేష్‌నగర్, అయ్యప్పకాలనీలలో చోరీలు జరిగిన ఇళ్లకు వెళ్లి ఆయన బాధితులను పరామర్శించారు. దోపిడీకి గురైన బాధితులను ఓదార్చారు. ఘటనలు ఎలా జరిగాయో, ఎంత సొత్తు దొంగల పాలైందో ఆరా తీశారు. అనంతరం శాంతిభద్రతలపై పోలీసులతో సమీక్షించారు. సీసీ కె మెరాలు, నిఘా విభాగం ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
పోలీసులు సక్రమంగా పనిచేస్తే చోరీలు ఎం దుకు జరుగుతాయని ప్రశ్నించారు. గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశిం చారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ స్పీకర్ పద్మ, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, భూపాల్‌రెడ్డి, రామలింగారెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ఉన్నారు.