రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు, నగదు అపహరణ
తెలిసినవారే దొంగతనానికి పాల్పడినట్లు అనుమానం
మూసాపేట: కూకట్‌పల్లిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..టంగుటూరుకు చెందిన మధుసూదన్‌రావు, సంధ్యారాణి దంపతులు కూకట్‌పల్లి జయానగర్‌లోని శ్రీ సీతా ప్యాలెస్ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు.
కొద్దిరోజులుగా వీరు అవసరాల నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నారు. గురువారం సాయంత్రం మధుసూదన్‌రావు ఇంటికి వచ్చి దుస్తులు తీసుకొని వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం డ్రైవర్ ఫోన్‌చేసి ఇంటి తలుపు తీసి ఉందని ఫోన్ చేసి చెప్పగా వెంటనే ఇంటికి వచ్చి చూసిన మధుసూదన్‌రావు దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గురువారం రాత్రి సుమారు 11.47 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మెట్ల మార్గంలో ఫ్లాట్‌లోకి వెళ్లినట్లు సీసీకెమెరాలో నమోదైంది. దొంగలు బెడ్‌రూమ్‌లోని డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక ఉన్న బీరువా తాళాలు తీసుకొని..బీరువాలో ఉన్న సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 82 తులాల బంగారు నగలు, రూ.10 లక్షల విలువ చేసి డైమండ్ నెక్లెస్, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
శుక్రవారం ఉదయం 7.30 ప్రాంతంలో వాచ్‌మెన్ మొక్కలకు నీరు పోసేందుకు వెళ్లగా..ఫ్లాట్ డోర్ తెరిచి ఉందని గమనించి డ్రైవర్‌కు తెలియజేశాడు. వెంటనే డ్రైవర్ యజమానికి తెలపటంతో వారు వచ్చి చూసుకోగా బంగారు నగలు దొంగతనం అయినట్లు గమనించారు. కాగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక ఉన్న తాళాన్ని తీసుకొని దొంగతనం చేయటంతో తెలిసిన వారి పనై ఉండవచ్చని బాధితులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment