ఆదివారం సిద్దిపేట పట్టణంలో నాటిన మొక్కలను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట.. ఆకుపచ్చ తోట
Published Mon, Jul 3 2017 3:00 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
రాష్ట్రానికి ఆదర్శంగా మున్సిపాలిటీ..
- మంత్రి హరీశ్ సంకల్పం, ప్రజల సహకారంతోనే..
- పట్టణంలోని రహదారుల వెంబడి 2 లక్షల మొక్కలు
- ‘మూడో విడత’లో మొక్కలు సంరక్షించే వారిపేరిట సైన్ బోర్డులు
సాక్షి, హైదరాబాద్: కాలుష్య రహిత పట్టణంగా, 100 శాతం మరుగుదొడ్లు ఉన్న నియోజకవర్గంగా రాష్ట్ర స్థాయిలో ప్రశంసలందుకున్న సిద్దిపేట మున్సిపాలిటీ.. హరితహారంలోనూ అదే తరహాలో ముందుకు సాగుతోంది. మంత్రి హరీశ్ ప్రత్యేక చొరవ, అధికారుల పనితీరు, ప్రజల సహకారంతో ఆకుపచ్చని తోటలా మారింది. పట్టణంలో 5 ప్రధాన చౌరస్తాలు కలిపి 14.8 కిలో మీటర్ల పొడవుండగా దాదాపు 2 లక్షలకు పైగా మొక్కలు ఈ రహదారుల వెంట కనిపిస్తాయి.
ఆత్మీయులకు చిహ్నంగా..
చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పట్టణంలో మొదలుపెట్టారు. గతించిన వారి జ్ఞాపకార్థం శ్మశాన వాటిక స్థలంలో మొక్క నాటుకోవచ్చు. నామమాత్రపు రుసుంతో ఏడాదిపాటు మొక్క సంరక్షణ బాధ్యతలను మున్సిపాలిటీ తీసుకుంటుంది. వర్ధంతి రోజున మొక్క వద్ద కాసేపు సేదతీరేలా పరిసరాల్లో వసతులను మున్సిపాలి టీనే ఏర్పాటు చేస్తుంది. భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఆలోచనల్లోంచి రూపుదిద్దు కున్న ఈ కార్యక్రమం సిద్దిపేటలో ఆచారంగా మారింది.
సంరక్షించే వారి పేర్లతో సైన్ బోర్డులు
ఈ ఏడాది పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించేలా కార్యాచ రణ రూపొందించారు. మొక్క నాటి సంరక్షించే వారి పేర్ల మీద సైన్ బోర్డులు పెడుతున్నారు.
ఉద్యోగుల ముంగిట్లో కార్పొరేట్ వైద్యం
సిద్దిపేటజోన్: దేశంలో ఎక్కడా లేని విధంగా వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వీటి ద్వారా ఉద్యోగులకు, జర్నలిస్టులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందనున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో జరిగిన పలు సభల్లో మాట్లాడారు. కులవృత్తులను పరిరక్షించే క్రమంలో ఎంబీసీ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీల అభివృద్దికి రూ. వెయ్యి కోట్లను కేటాయిం చిందని, మంత్రి వివరించారు. పెఱిక కులస్తులను ఎంబీసీలో చేర్చడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 26 వేల పోలీసు ఉద్యోగాల పోస్టులను ప్రకటించామని, ఈ యేడు పదివేలు, వచ్చే యేడు మరో పదివేలు తర్వాత ఆరువేల చొప్పున భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
ఇప్పుడు వాట్సాప్ మంత్రిగా హరీశ్‌రావు
హరీశ్‌రావుకు గతంలో కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే అని పేరుంది. ఇప్పుడు ఆయన్ను వాట్సాప్ మంత్రి అని పిలుస్తున్నారు. రోజుకు 18 గంటలు వాట్సప్‌లో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పుట్టిన రోజు, పర్వదినాల్లో ప్రజలు మొక్కలు నాటి ఫొటోలు వాట్సప్‌లో పెడితే ఆయన అభినందించడమే కాకుండా పుట్టిన రోజున చెట్లు నాటిన చిన్నారులకు స్వయంగా ఫోన్ చేసి ఆశీర్వదిస్తారు. సిద్దిపేటకు చెందిన సువర్ణ లక్ష్మి.. ఇటీవల హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డు పక్కన చెట్లు వంగిపోయి కనిపించాయి. వెంటనే ఆమె కారు ఆపి వంగిన మొక్కలన్నిటికీ నీళ్లు పోసి, సరిచేసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలను ఆ కారు డ్రైవర్ వాట్సప్ గ్రూప్‌లో పెట్టగా మంత్రి చూసి నేరుగా లక్ష్మికి ఫొన్ చేసి అభినందించారు.
Advertisement
Advertisement