Siddipet municipality
-
ఆడబిడ్డల ఆరోగ్యానికి ‘రుతు ప్రేమ’
సాక్షి, సిద్దిపేట: మహిళల ఆరోగ్యం కోసం సరికొత్త కార్యక్రమానికి సిద్దిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. రుతుస్రావం సమయంలో మహిళలు రసాయనిక శానిటరీ ప్యాడ్స్‌కు బదులు శానిటరీ కప్స్, క్లాత్ ప్యాడ్స్ వాడేలా అవగాహన కల్పించేందుకు ‘రుతు ప్రేమ’ పేరుతో కార్య క్రమాన్ని బుధవారం మొదలుపెట్టింది. కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలోని 5వ వార్డులో మహిళలు, బాలి కలకు రుతుస్రావ, రుతు ప్రేమ అవగాహన సదస్సు నిర్వ హించారు. శానిటరీ కప్స్, క్లాత్ ప్యాడ్లు, పిల్లలకు బట్ట డైప ర్లను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు హాజరై మాట్లాడుతూ.. ‘మహిళల ఆరోగ్యం, డబ్బు ఆదా, పర్యావరణ పరిరక్షణ కోసం సరికొత్త కార్యక్రమం చేపట్టిన సుదినం ఇది. సిద్దిపేటలో మొదలైన రుతు ప్రేమ ఇక్కడితో ఆగొద్దు. జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి. దేశానికి మనం ఆదర్శంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 35 కోట్ల మంది మహిళలు రసాయనిక శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నట్టు సర్వేలో తేలిందని మంత్రి చెప్పారు. వీటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారన్నారు. క్లాత్ ప్యాడ్స్ వాడకంలో దేశానికి, ప్రపంచానికి సిద్దిపేట మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు. ఎక్కువ సిజేరియన్లు తెలంగాణలోనే ‘దేశంలో సిజేరియన్ డెలివరీలు తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. కర్ణాటకలో 24 శాతం, మహారాష్ట్రలో 28 శాతం ఉండగా రాష్ట్రంలో 62 శాతం జరుగుతున్నాయి. సిజే రియన్ల సంఖ్య తగ్గేందుకు తల్లిదండ్రులు సహకరించాలి’ అని మంత్రి హరీశ్ కోరారు. సీ సెక్షన్లు చేయడం వల్ల పుట్టిన బిడ్డ మొదటి గంటలో ముర్రుపాలు తాగట్లేదన్నారు. రాష్ట్రం లో పుట్టిన బిడ్డల్లో 37% మందే తల్లి పాలు తాగుతు న్నారని చెప్పారు. ‘మొదటి గంటలో బిడ్డకు ఇచ్చే పాలు రూ. కోట్లు పెట్టినా ఇవ్వలేరు. అవి అమృతంతో సమానం. రోగని రోధ క శక్తి పెరుగుతుంది’ అని వివరించారు. కార్యక్రమంలో సీపీ శ్వేత, అడిషనల్ కలెక్టర్ మూజామిల్ ఖాన్ పాల్గొన్నారు. ఒక్కో శానిటరీ కప్‌ను పదేళ్లు వాడుకోవచ్చు రసాయనిక శానిటరీ ప్యాడ్లను మహిళలు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. సిలికాన్ శానిటరీ కప్స్, క్లాత్ ప్యాడ్లను వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. శానిటరీ కప్స్‌ను వాడితే ఆందోళన లేకుండా సాఫీగా తమ పనులు తాము చేసుకునే అవకాశం ఉంటుంది. వీటి ధర రూ.500 నుంచి రూ.1,500 వరకు ఉం టుంది. ప్రతిసారి వాష్ చేసుకుని ఒక్కో కప్పు పదేళ్ల వరకు వాడుకోవచ్చు. ఇటు డబ్బులు ఆదా.. పైగా ఆరోగ్యం. – డాక్టర్ తుమ్మల శాంతి, బెంగళూరు ప్రతినిధి శానిటరీ కప్స్ వాడండి రుతుక్రమం సమయంలో బయట లభించే టిష్యూ ప్యాడ్లను వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. శానిటరీ కప్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటిని వాడటం చాలా మంచిది. వీటి గురించి టీవీలు, యూట్యూబ్‌లో ప్రచారం చేయాలి. – డాక్టర్ రమాదేవి, ప్రముఖ గైనకాలజిస్ట్ -
చెత్త నుంచి సంపద
-
మున్సి‘పోరు’: టీఆర్ఎస్ సరికొత్త రాజకీయం
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి ఆదివారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా, సోమవారం పరిశీలన కూడా పూర్తయింది. అయితే సిద్దిపేట మున్సిపాలిటీ మినహా ఎన్నికలు జరుగుతున్న రెండు కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. కానీ డివిజన్లు, వార్డుల్లో టికెట్లు ఆశిస్తూ పెద్ద సంఖ్యలో ఆశావహులు పార్టీ పక్షాన నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్న టీఆర్ఎస్.. అభ్యర్థుల ప్రకటనలో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఈ నెల 22న ఉపసంహరణ ప్రక్రియ ముగియనుండగా.. డివిజన్లు, వార్డులవారీగా ఏకాభిప్రాయ సాధన తర్వాతే చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించి, బీ ఫామ్‌లు అందజేయాలని నిర్ణయించింది. కొన్నిచోట్ల అభ్యర్థులు ఎవరనే అంశంపై ఇప్పటికే స్పష్టత ఉన్నా, పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ నామినేషన్లు వేసిన ఇతరులు ఉపసంహరించుకున్న తర్వాతే బీ ఫామ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈలోపు అంతర్గత ప్రచారం నిర్వహించుకోవాల్సిందిగా సూచించింది. వలసలు నివారించేందుకే.. నామినేషన్ల దాఖలు గడువుకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తే అవకాశం దక్కని ఆశావహులు ఇతర పార్టీల్లో చేరి ప్రత్యర్థులుగా నిలిచే అవకాశముందని టీఆర్ఎస్ భావించింది. కొందరు రెబల్స్‌గా మారి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగినా నష్టం జరుగుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు మాత్రమే బలమైన అభ్యర్థులకు బీ ఫామ్‌లు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. వలసలకు, రెబల్స్‌కు తావులేకుండా అన్ని అస్త్రాలు ప్రయోగించడం ద్వారా ఏకాభిప్రాయ సాధన కోసం కసరత్తు జరుగుతోంది. ఒకవేళ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరైనా బరిలో ఉంటే వారిపై సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించింది. సిద్దిపేటలో కొందరు అభ్యర్థులు ఖరారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రాతినిథ్యం వహిçస్తున్న సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలో 43 వార్డులు ఉండగా, నామినేషన్ల దాఖలు గడువులోగా 18 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. సోమవారం మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. మిగతా వార్డుల్లోనూ ఏకాభిప్రాయం సాధించి విడతల వారీగా జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. ఖరారైన అభ్యర్థులకు గురువారం బీ ఫామ్‌లు జారీ చేస్తామని ప్రకటించారు. ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు ఖమ్మం కార్పొరేషన్లో మంత్రి పువ్వాడ అజయ్. సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీష్‌రావు, జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అయితే వరంగల్ కార్పొరేషన్‌తో పాటు అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరులో మాత్రం సంబంధిత జిల్లా మంత్రుల పర్యవేక్షణలో స్థానిక ఎమ్మెల్యేలు అభ్యర్థుల జాబితాను వడపోస్తున్నారు. ఒక్కో వార్డు నుంచి సగటున ముగ్గురు చొప్పున టీఆర్ఎస్ తరఫున నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించేందుకు సమయం పడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
స్వచ్ఛ సిద్దిపేటవైపు అడుగులు
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛ సిద్దిపేట.. అంటూ రాష్ట్రంతో పాటు దేశ స్థాయిలో మారుమోగుతున్న పేరు. పట్టణ ప్రజలకు మౌలిక వసతులు, సదుపాయాలను కల్పిస్తూ వినూత్న పథకాలతో రాష్ట్ర మున్సిపాలిటీలకు అధ్యయన పట్టణంగా మారింది. అలాంటి పట్టణంలో ప్రస్తుతం వైరల్ ఫీవర్ ప్రజలను పట్టిపీడిస్తోంది. మరోవైపు భారీ వర్షం వస్తే చాలు పలు ప్రాంతాల్లో వరదనీటితో రోడ్లు జలమయంగా మారుతున్నాయి. వీటికి తోడు జాప్యంగా సాగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణపనులు. వీటంన్నింటికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత బల్దియాపై ఉంది. ప్రధాన అంశాలపై ముందడుగు వేస్తే మరింత సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శనివారం సిద్దిపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు గౌరవ అతిథిగా రానున్న క్రమంలో ప్రత్యేక కథనం.. పల్లెల తరహాలో పట్టణంలో.. రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల ప్రణాళికకు అనుగుణంగా సిద్దిపేటలోనూ అమలు చేయాల్పిన అవసరం ఎంతైన ఉంది. పట్టణంలో పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. అదే విధంగా పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంత్రి హరీశ్‌రావు ఆలోచనకు అనుగుణంగా విద్యార్థులకు అల్ఫాహారం, సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణ ప్రక్రియపై పాలకవర్గ సమావేశంలో చర్చ కొనసాగనుందనే చెప్పాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ.. పట్టణంలోని 34వార్డుల్లో మూడు విడతల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ వ్యవస్థను చేపట్టారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా 14వార్డుల్లో 8వేల గృహాలకు సంబంధించి యూజీడీ ప్రక్రియ పూర్తి అయింది. ఇక మిగిలింది ఇళ్ల యజమానులు తమ నివాస గృహాలకు చెందిన మురికినీటిని యూజీడీకి అనుసంధానంచేసుకోవడమే. ఇప్పటి వరకు కేవలం 2500 నివాస గృçహాలు అనుసంధానాన్ని పూర్తి చేసుకున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యూజీడీని వినియోగించుకునేలా పాలకవర్గ, అధికారులు మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో యూజీడీ వ్యవస్థను మరింత వేగవంతం చేయాల్సిన కర్తవ్యం పబ్లిక్ హెల్త్‌శాఖపై ఉందనే చెప్పాలి. భారీ వర్షాలు కురిసినప్పుడు పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచి రోడ్లు జలమయంగా మారుతున్నాయి. ప్రతి యేట ఉత్పన్నమయ్యే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం, అవశ్యకత ఎంతైన ఉందనే చెప్పాలి. వైరల్ ఫీవర్ల కట్టడి ఇప్పటికే సిద్దిపేట పట్టణంలో అత్యధికంగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదవతున్న క్రమంలో మున్సిపల్, వైద్య శాఖలు సమన్వయంతో వైరల్ ఫీవర్ల కట్టడికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. వైద్య శాఖ ఆధ్వర్యంలో దోమ నివారణ స్ప్రే ప్రక్రియ కొనసాగుతోంది. సిద్దిపేట బల్దియాకు ఆదాయ వనరులను అందించే మార్గాలను మరింతగా అన్వేషించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తాగునీటి సరఫరా కోసం విద్యుత్ బిల్లుల రూపంలో ప్రతి నెల పెద్ద మొత్తంలో చెల్లించాల్సి రావడంతో పట్టణంలోని అన«ధికార నల్లాలను క్రమబద్ధీకరించడంతో పాటు నూతన నల్లా కనెక్షన్ల మంజూరుతో ఆదాయ వనరులను పెంచాల్సిన అవసరం ఉంది. -
సీఎం హామీతో సిద్దిపేట మున్సిపల్‌కు నిధుల వరద
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని ఏకైక స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ సిద్దిపేట పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రేమను నిధుల రూపంలో వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు అభివృద్ధి, ప్రయోగాత్మక ప్రక్రియలతో రాష్ట్ర, దేశ స్థాయిలో గుర్తింపు పొందిన సిద్దిపేట బల్దియాకు సీఎం కేసీఆర్ నిధుల వరదను పారించారు. చింతమడక సందర్శనలో ప్రకటన.. చింతమడక ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా సిద్దిపేట పట్టణానికి నిధులను కేటాయించాలన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించి రూ.25కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం పాఠకులకు విధితమే. సీఎం ప్రకటన పరోక్షంగా మున్సిపల్‌కు ఊరటగానే చెప్పాలి. ఇప్పటికే అనేక ప్రజాపయోగ కార్యక్రమాలను నిర్వహించడానికి బల్దియాకు నిధుల సమీకరణ కొంత ఇబ్బందిగా మారుతుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ. 25కోట్లను మంజూరి చేయడంతో నిధుల కోరతను తాత్కాలికంగా గట్టెక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతీ నెల విద్యుత్ బిల్లుల చెల్లింపు రూపంలో రూ. 25లక్షలు, జీత భత్యాల రూపంలో మరో రూ.55లక్షలు మొత్తంగా రూ. 70లక్షల వ్యయం మున్సిపల్‌కు భారంగా మారుతున్న క్రమంలో ప్రత్యేక నిధుల కేటాయింపు కొంత ఊరటగానే చెప్పాలి. విలీన వార్డుల్లో అభివృద్ధికి దోహదం.. జిల్లాలో స్పేషల్ గ్రేడ్ మున్సిపల్ సిద్దిపేట పరిధిలో 34 వార్డులు ఉన్నాయి. గత కొన్నేళ్ల క్రితం సిద్దిపేట మున్సిపల్లో సమీపంలోని రంగదాంపల్లి, గాడిచెర్లపల్లి, ఇమామ్‌బాద్, ప్రశాంత్‌నగర్, నర్సాపూర్, హనుమాన్నగర్లను వీలినం చేశారు. ఇదేసమయంలో ఇటీవల లింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీని కూడా కలిపారు. గతంలో ఉన్న 28వార్డుల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఉన్న కొద్దిపాటి మున్సిపల్ నిధులతో సమకూర్చారు. మరోవైపు విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన బల్దియాకు భారంగా మారింది. ముఖ్యంగా ఆరు విలీన గ్రామాల వార్డుల్లో మురికికాలువలు, రోడ్లు, భవనాల నిర్మాణం, నిధుల సమీకరణ అడ్డంగా మారింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉండడంతో వివిధ పథకాల కింద సిద్దిపేటకు ప్రత్యేకంగా నిధులను కేటాయింపజేసి దశల వారిగా విలీన వార్డుల్లో అభివృద్ధి పరుగులు జరిగేలా చొరవ చూపారు. ప్రతీ నెల రూ.కోటికి పైగా వ్యయం స్పెషల్ గ్రేడ్ మున్సిపల్లో ప్రతీ నెల సుమారు కోటిరూపాయల వివిధ పద్దుల కింద బల్దియా వెచ్చించాల్సి ఉంటుంది. ప్రధానంగా సిద్దిపేట పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా కోసం ఎల్ఎండీ నుంచి మానేరు నీటిని తరలించడంతో పాటు వివిధ పంప్‌హౌజుల్లో విద్యుత్ వినియోగం కోసం ప్రతీ నెల రూ. 25లక్షలను వెచ్చించడం మున్సిపల్‌కు గుదిబండగా మారుతుంది. అదే విధంగా జీతభత్యాల రూపంలో రూ. 55లక్షల వ్యయం మున్సిపల్‌కు భారంగా ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేక చోరవ చూపి బల్దియా విద్యుత్ బిల్లులను స్వతహాగా నియోజకవర్గ నిధుల నుంచి వెచ్చించి తాత్కాలికంగా మున్సిపల్‌ను విద్యుత్‌బిల్లుల భారం నుంచి గట్టెక్కించారు. మరికొతకాలం ప్రత్యేకంగా ప్రభుత్వంలో మాట్లాడి కొన్ని నెలల పాటు ప్రభుత్వమే విద్యుత్ బిల్లుల భారం భరించేలా చొరవ∙చూపారు. మరోవైపు గతంలో జీతభత్యాల చెల్లింపు సిద్దిపేట మున్సిపల్‌కు ప్రధాన సమస్యగా మారేది. కోన్ని నెలల పాటు కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో గతంలో సిద్దిపేట మున్సిపల్ ఉండేది ఇదే సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, అధికారంలోకి టీఆర్ఎస్ప్రభుత్వం రావడంతో పాటు మంత్రివర్గంలో కీలక శాఖలో ఉన్న ఎమ్మెల్యే హరీశ్‌రావు వివిధ పథకాల ద్వారా సిద్దిపేట మున్సిపల్ కోట్లాధి నిధులను సమీకరించి సిద్దిపేటను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడంలో కృషి చేశారు. మరోసారి సీఎం కేసీఆర్ చేయూత జిల్లా ఆవిర్భావం అనంతరం స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకు రూ. 100కోట్ల ప్రత్యేక నిధులను ప్రకటించారు. అప్పట్లోనే సీఎం మంజూరు చేసిన వందకోట్లలో సుమారు 20కోట్ల రూపాయలు ప్రత్యేకంగా సిద్దిపేట మున్సిపల్ అభివృద్ధి కోసం విడుదల చేశారు. ప్రధానంగా మున్సిపల్ పరిధిలో మురికికాలువల నిర్మాణం, రోడ్లు, వివిధ కమ్యూనిటీ భవనాల నిర్మాణం లాంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వాటిని వెచ్చించారు. దీనికి తోడు సిద్దిపేటలో ప్రత్యేకంగా వైకుంఠధామాల నిర్మాణం, కోమటిచెరువు సుందరీకరణ, వివిధ రకాల భవనాల నిర్మాణంతో పాటు రహదారుల మరమ్మతు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ, లాంటి అనేక అభివృద్ధి్ద పనుల కోసం పెద్ద ఎత్తున బల్దియాలో నిధుల వినియోగం చేయాల్సి వచ్చింది. జిల్లా కేంద్రం కావడంతో పట్టణీకరణ జోరుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మౌళిక వసతుల కల్పనతో పా టు వివిధ ప్రజా ఉపయోగ పనుల నిమిత్తం మరి న్ని నిధులు అవశ్యకతగా మారాయి.దీనిని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే హరీశ్‌రావు చింతమడకలో సీఎం దృష్టికి నిధులను మంజూరి చేయాల ని విజ్ఞప్తి చేయడం స్పందించిన సీఎం తక్షణం రూ. 25కోట్లను మంజూరుతో అభిృద్ధికి నిధుల సమీకరణకు కొంత ఊరటగానే భావించాలి. సిద్దిపేటపై సీఎంకు అమితమైన ప్రేమ తాను పెరిగిన సిద్దిపేట గడ్డపై సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరిక మేరకు వెంటనే రూ. 25కోట్లు మంజూరి చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. సిద్దిపేట పట్టణ అభివృద్ధి కోసం తాపత్రయ పడుతున్న హరీశ్‌రావు ఆశయానికి అనుగుణంగా సీఎం నిధులను కేటాయించారు. గతంలో కూడా 20కోట్లు మంజూరి చేశారు. ఇప్పుడు మరొక 25కోట్లు ప్రత్యేకంగా మంజూరు చేశారు. సిద్దిపేట ప్రజల, పాలకవర్గం పక్షాన నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, కృషి చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు కృతజ్ఞతలు. – రాజనర్సు, మున్సిపల్ చైర్మన్ -
సిద్దిపేట.. ఆకుపచ్చ తోట
రాష్ట్రానికి ఆదర్శంగా మున్సిపాలిటీ.. - మంత్రి హరీశ్ సంకల్పం, ప్రజల సహకారంతోనే.. - పట్టణంలోని రహదారుల వెంబడి 2 లక్షల మొక్కలు - ‘మూడో విడత’లో మొక్కలు సంరక్షించే వారిపేరిట సైన్ బోర్డులు సాక్షి, హైదరాబాద్: కాలుష్య రహిత పట్టణంగా, 100 శాతం మరుగుదొడ్లు ఉన్న నియోజకవర్గంగా రాష్ట్ర స్థాయిలో ప్రశంసలందుకున్న సిద్దిపేట మున్సిపాలిటీ.. హరితహారంలోనూ అదే తరహాలో ముందుకు సాగుతోంది. మంత్రి హరీశ్ ప్రత్యేక చొరవ, అధికారుల పనితీరు, ప్రజల సహకారంతో ఆకుపచ్చని తోటలా మారింది. పట్టణంలో 5 ప్రధాన చౌరస్తాలు కలిపి 14.8 కిలో మీటర్ల పొడవుండగా దాదాపు 2 లక్షలకు పైగా మొక్కలు ఈ రహదారుల వెంట కనిపిస్తాయి. ఆత్మీయులకు చిహ్నంగా.. చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పట్టణంలో మొదలుపెట్టారు. గతించిన వారి జ్ఞాపకార్థం శ్మశాన వాటిక స్థలంలో మొక్క నాటుకోవచ్చు. నామమాత్రపు రుసుంతో ఏడాదిపాటు మొక్క సంరక్షణ బాధ్యతలను మున్సిపాలిటీ తీసుకుంటుంది. వర్ధంతి రోజున మొక్క వద్ద కాసేపు సేదతీరేలా పరిసరాల్లో వసతులను మున్సిపాలి టీనే ఏర్పాటు చేస్తుంది. భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఆలోచనల్లోంచి రూపుదిద్దు కున్న ఈ కార్యక్రమం సిద్దిపేటలో ఆచారంగా మారింది. సంరక్షించే వారి పేర్లతో సైన్ బోర్డులు ఈ ఏడాది పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించేలా కార్యాచ రణ రూపొందించారు. మొక్క నాటి సంరక్షించే వారి పేర్ల మీద సైన్ బోర్డులు పెడుతున్నారు. ఉద్యోగుల ముంగిట్లో కార్పొరేట్ వైద్యం సిద్దిపేటజోన్: దేశంలో ఎక్కడా లేని విధంగా వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వీటి ద్వారా ఉద్యోగులకు, జర్నలిస్టులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందనున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో జరిగిన పలు సభల్లో మాట్లాడారు. కులవృత్తులను పరిరక్షించే క్రమంలో ఎంబీసీ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీల అభివృద్దికి రూ. వెయ్యి కోట్లను కేటాయిం చిందని, మంత్రి వివరించారు. పెఱిక కులస్తులను ఎంబీసీలో చేర్చడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 26 వేల పోలీసు ఉద్యోగాల పోస్టులను ప్రకటించామని, ఈ యేడు పదివేలు, వచ్చే యేడు మరో పదివేలు తర్వాత ఆరువేల చొప్పున భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇప్పుడు వాట్సాప్ మంత్రిగా హరీశ్‌రావు హరీశ్‌రావుకు గతంలో కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే అని పేరుంది. ఇప్పుడు ఆయన్ను వాట్సాప్ మంత్రి అని పిలుస్తున్నారు. రోజుకు 18 గంటలు వాట్సప్‌లో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పుట్టిన రోజు, పర్వదినాల్లో ప్రజలు మొక్కలు నాటి ఫొటోలు వాట్సప్‌లో పెడితే ఆయన అభినందించడమే కాకుండా పుట్టిన రోజున చెట్లు నాటిన చిన్నారులకు స్వయంగా ఫోన్ చేసి ఆశీర్వదిస్తారు. సిద్దిపేటకు చెందిన సువర్ణ లక్ష్మి.. ఇటీవల హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డు పక్కన చెట్లు వంగిపోయి కనిపించాయి. వెంటనే ఆమె కారు ఆపి వంగిన మొక్కలన్నిటికీ నీళ్లు పోసి, సరిచేసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలను ఆ కారు డ్రైవర్ వాట్సప్ గ్రూప్‌లో పెట్టగా మంత్రి చూసి నేరుగా లక్ష్మికి ఫొన్ చేసి అభినందించారు. -
'ఏ ఎన్నికైనా టీఆర్ఎస్దే విజయం'
హైదరాబాద్: ఏ ఎన్నికైనా టీఆర్ఎస్ పార్టీదే విజయమని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధిపేట మున్సిపాలిటీలో గెలుపొందిన అన్ని పార్టీల అభ్యర్థులకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ కు భారీ విజయాన్ని అందించిన సిద్ధిపేట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతైందన్నారు. గెలిచిన ఇండిపెండెంట్లను టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా సోమవారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22 స్ధానాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయం సాధించగా..ఏడు చోట్ల ఇండిపెండెంట్లు, రెండేసి చోట్ల బీజేపీ, కాంగ్రెస్ గెలవగా ఎంఐఎం ఒక స్థానంలో బోణి కొట్టింది. ఈ నెల 16 న చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్ధులను ప్రకటించనున్నారు. -
సిద్దిపేట చైర్మన్ పీఠం టీఆర్ఎస్ కైవసం
సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సోమవారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22 స్ధానాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయం సాధించగా..ఏడు చోట్ల ఇండిపెండెంట్లు, రెండేసి చోట్ల బీజేపీ, కాంగ్రెస్ గెలవగా ఎంఐఎం ఒక స్థానంలో బోణి కొట్టింది. మొత్తం 34 వార్డులకు ఆరు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. చైర్మన్ పీఠానికి 18 సీట్లు బలం అవసరం కాగా టీఆర్ఎస్ 22 సీట్లు గెలిచి చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్లు గెలిచిన ఏడు సీట్లలో ఆరు చోట్ల టీఆర్ఎస్ రెబెల్స్ గెలవగా ఒక చోట టీడీపీ రెబెల్ అభ్యర్ధి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీకు భంగపాటు తప్పలేదు. ఖాతా తెరవకుండానే చతికిలపడింది. సిద్దిపేట క్లీన్‌స్వీప్‌పై టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న ఆశలు ఆవిరైనట్లైంది. అనూహ్యంగా ఇండిపెండెంట్లు దూసుకుపోయారు. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ భారీ విజయాలు సాధించింది. కానీ ఈ సారి రెబెల్స్ తో అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. గెలిచిన అభ్యర్థుల వివరాలు వార్డు నెం. అభ్యర్థి పేరు పార్టీ 1 మల్లికార్జున్ టీఆర్ఎస్ 2 లలిత ఇండిపెండెంట్ 3 సంధ్య టీఆర్ఎస్ 4 దీప్తి ఇండిపెండెంట్ 5 స్వప్న ఇండిపెండెంట్ 6 బాల్ లక్ష్మీ కాంగ్రెస్ 7 ప్రశాంత్ టీఆర్ఎస్ 8 నర్సింహులు టీఆర్ఎస్ 9 ఉమారాణి టీఆర్ఎస్ 10 వేణుగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ 11 రవీందర్ టీఆర్ఎస్ 12 అత్తర్ పటేల్ టీఆర్ఎస్ 13 వెంకట్ టీఆర్ఎస్ ఏకగ్రీవం 14 శ్రీకాంత్ బీజేపీ 15 భవాని టీఆర్ఎస్ 16 రాజనర్సు టీఆర్ఎస్ ఏకగ్రీవం 17 వెంకట్ బీజేపీ 18 విజయలక్ష్మీ టీఆర్ఎస్ ఏకగ్రీవం 19 లత టీఆర్ఎస్ ఏకగ్రీవం 20 జావేద్ టీఆర్ఎస్ 21 జ్యోతి టీఆర్ఎస్ ఏకగ్రీవం 22 ప్రవీణ్ ఇండిపెండెంట్ 23 లక్ష్మీ టీఆర్ఎస్ 24 శ్రీనివాస్ టీఆర్ఎస్ ఏకగ్రీవం 25 ప్రమీల ఇండిపెండెంట్ 26 శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ 27 విజయరాణి ఇండిపెండెంట్ 28 లక్ష్మీ టీఆర్ఎస్ 29 శ్రీనివాస్ టీఆర్ఎస్ 30 వజీర్ కాంగ్రెస్ 31 కవిత టీఆర్ఎస్ 32 ప్రభాకర్ టీఆర్ఎస్ 33 మొయిన్ ఎంఐఎం 34 మంజుల ఇండిపెండెంట్ -
6న సిద్దిపేట పుర ఎన్నికలు
- షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. బుధవారం (23వ తేదీ) నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది. 24న నామినేషన్ల పరిశీలన, 25న నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ. ఏప్రిల్ 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఒకవేళ రీపోలింగ్ అవసరమైతే ఏప్రిల్ 9న నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఆరు శివారు గ్రామాలు విలీనమయ్యాక సిద్దిపేట పట్టణంలోని వార్డుల సంఖ్య 32 నుంచి 34కు పెరిగింది. మున్సిపాలిటీలో మొత్తం 88,982 ఓటర్లు ఉండగా ఇందులో 44,562 మంది పురుషులు, 44,412 మంది మహిళలు ఉన్నారు. -
నిధుల గోల్మాల్!
♦ చేయని పనులకూ చెల్లింపులు ♦ సిద్టిపేట మున్సిపాలిటీలో అధికారుల ఇష్టారాజ్యం ♦ పాలక వర్గం లేని ఫలితం రూ. కోట్లలో మాయాజాలం సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాలక వర్గంలేకపోవడం.. అడిగే నాథుడే కరువవడంతో రూ. కోట్లలో గోల్మాల్ జరుగుతోంది. చేయని పనులకు చెల్లింపులు చేస్తున్నారు. నిధుల ఖర్చు విషయంలో అధికారులు ‘మాయ’లు చేస్తున్నారు. ఇటీవల నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆడిట్లో సైతం వెల్లడైన విషయం విదితమే. కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలిపారు. అయినా ఇప్పుడు మరో బాగోతం బయట పడింది. స.హ. చట్టం రక్షణ వేదిక సేకరించిన సమాచారంలో అధికారులు చేయని పనులకూ బిల్లులు చెల్లించినట్లు తేలింది. ఎక్కడ చేశారో కూడా తెలియని పనులకు రూ.35.77లక్షలు చెల్లించినట్లు అధికారులు ఇచ్చిన సమాచరంలోనే ఉండటం గమనార్హం. 2012-14 సంవత్సరాల్లో పట్టణంలో వివిధ పనులకు ఈ నిధులు ఖర్చు చేసినట్లు చూపారు. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే విస్మయం కలుగుతోంది. స్థానిక గాంధీచౌక్ నుంచి ఆర్డీఓ కార్యాలయం, సబ్ జైలు మీదుగా మహాత్మాగాంధీ పార్కు వరకు డ్రైనేజీ కాలువ నిర్మించినట్లు అందుకు రూ.6.98 లక్షలు చెల్లించినట్లు చూపారు. కాని వాస్తవానికి గాంధీచౌక్ నుంచి ప్రభుత్వ అతిథి గృహం వరకు మాత్రమే నిర్మించారు. మహాత్మాగాంధీ పార్కు వద్ద 15 సంవత్సరాల క్రితం నిర్మించి మురుగు కాలువనే ఉంది. మున్సిపల్ అధికారులు పట్టణం నడిబొడ్డునే చేయని పనులకు నిధులు ఖర్చు చేసినట్లు చూపితే సందులు గొందుల్లో ఇంకెంత మాయ జరుగుతుందోనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెయిన్ రోడ్డులో బచ్చురమేశ్ ఇంటి నుంచి ఇంటి నెం. 5-1-65 వరకు నిర్మించిన మురుగు కాలువకు రూ.5 లక్షలు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఖర్చు పట్టికలో ఎలాంటి వివరాలు నమోదు చేయలేదు. ఇలా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేయడం దారుణమని సహ చట్టం రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొర్తివాడ రాజేందర్ అన్నారు. మంత్రి హరీశ్‌రావు పట్టణ అభివృద్ధి కోసం నిధులు పెద్ద ఎత్తున తెస్తుంటే అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని డిమాండు చేశారు. విషయం తెలుసుకుంటా 2012-14లో తాను ఇక్కడ పనిచేయలేదు. అప్పుడు జరిగిన పనులు, చెల్లింపులపై సమగ్ర విచారణ చేసి వాస్తవ విషయం తెలుసుకుంటా. -రమణాచారి, మున్సిపల్ కమిషనర్ -
సిద్దిపేట మున్సిపాలిటీకి అరుదైన గౌరవం
సిద్దిపేట జోన్(మెదక్): తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్న మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీకి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన ఆయా మునిసిపాలిటీల నుంచి క్లీన్ ఛాంపియన్షిప్ అవార్డు కోసం క్లీన్ ఇండియా సంస్థ మూడు మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి సిద్దిపేట మున్సిపాలిటీకి స్థానం దక్కింది. స్వచ్ఛ భారత్ ప్రక్రియలో భాగంగా స్వచ్ఛమైన పట్టణంగా తీర్చి దిద్దినందుకుగాను సిద్దిపేట మున్సిపాలిటీకి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, ప్రముఖ సినీ నటి అమల చేతుల మీదుగా హైదరాబాద్‌లో అవార్డును అందజేశారు. ఈ అవార్డును ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిధుల చేతుల మీదుగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమాణాచారి అవార్డును స్వీకరించారు. సిద్దిపేట పట్టణంలో రాష్ట్రంలోనే తొలి ప్రక్రియగా తడి, పొడి చెత్త సేకరణ, ప్లాస్టిక్ కవర్ల నిషేధం, హరిత హారంలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ, ‘వావ్’ ప్రక్రియలో భాగంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టిన నేపథ్యంలో మున్సిపాలిటీలకు అవార్డును అందజేశారు. -
క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా సిద్దిపేట
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దేందుకు తన శక్తి మేరకు కృషి చేస్తానని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలోని వివిధ కాలనీల్లో రూ. 65 లక్షల విలువైన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాల్టీలో విలీనమైన గ్రామాలతో పాటు పట్టణంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మించి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. పరిశుభ్రమైన పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో పచ్చదనం కోసం గతంలోనే విస్తృతంగా మొక్కలు నాటామన్నారు. మొక్కలు వృక్షాలుగా మారేవరకు స్థానికులు సంరక్షించాలన్నారు. నియోజకవర్గ ప్రజల అండదండలు, ఆధారాభిమానాలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఇందిరానగర్ నార్త్‌లో రూ. 15 లక్షలు, ఇందిరానగర్ సౌత్‌లో రూ.10 లక్షలతో నిర్మించే మురుగు కాల్వలకు, హనుమాన్‌నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 10 లక్షలు, రంగధాంపల్లిలో రూ. 10 లక్షలు, శంకర్‌నగర్‌లోని రెండు రోడ్లను పొడగించే పనులకు రూ. 10 లక్షలు, నాసర్‌పురాలో డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ నిర్మాణం కోసం రూ. 10 లక్షలతో చేపట్టే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీల్లో మంత్రి హరీష్‌రావుకు స్థానిక మహిళలు మంగళహారతులతో తిలకం దిద్ది స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, తహశీల్దార్ ఎన్‌వైగిరి, మున్సిపల్ డీఈ లక్ష్మణ్, ఏఈ ఇంతియాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, ఎంపీపీ ఎర్ర యాదయ్య, జాప శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు మచ్చవేణుగోపాల్‌రెడ్డి, చిప్ప ప్రభాకర్, నయ్యర్ పటేల్, జంగిటి కనకరాజు, గుండు శ్రీనివాస్‌గౌడ్, మోహన్‌లాల్, శేషుకుమార్, నల్ల నరేందర్‌రెడ్డి, జనార్దన్, నాయకం వెంకట్, దర్పల్లి శ్రీను, కొండం సంపత్‌రెడ్డి, సీఐలు సురేందర్‌రెడ్డి, సైదులు, ప్రసన్నకుమార్, ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికి పింఛన్ ఇస్తాం సిద్దిపేట రూరల్: అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ వస్తుందని, ఈ నెల 25న పంపిణీ చేస్తామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని బంజేరుపల్లిలో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నెల నుంచి బియ్యం కోటాను 4కిలోల నుంచి 6కిలోలకు పెంచుతున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఎంత మంది ఉన్నా అందరికీ ఆరు కిలోల చొప్పున ఇస్తామని తెలిపారు. అలాగే బంజేరుపల్లి గ్రామానికి దశలవారీగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో సీసీ రోడ్డు రూ.10లక్షలతో నిర్మాణం చేశామన్నారు. అదే విధంగా మరో రూ. 5లక్షలు సీసీ రోడ్డుకు, రూ. 6లక్షలు మహిళ భవనానికి మంజూరు చేయిస్తానన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 95 శాతం పోలింగ్ నమోదు కావడంతో ప్రభుత్వం గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి రూ. 2లక్షలు మంజూరు చేసిందన్నారు. వాటితో వాటర్ మిషన్ తెచ్చామని, అదే విధంగా స్తంభానికి తమ వంతు సాయంగా రూ. 1.50లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కమలాకర్‌రావు, గ్రామ సర్పంచ్ భూమయ్య, ఎంపీటీసీ రోమాల శాంత రాజయ్య, అర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్‌చారి, నాయకులు బాల్‌రంగం, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.