స్వచ్ఛ సిద్దిపేటవైపు అడుగులు | Harish Rao Attend Siddipet Municipal Meeting | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ సిద్దిపేటవైపు అడుగులు

Published Sat, Sep 28 2019 7:29 AM | Last Updated on Sat, Sep 28 2019 7:29 AM

Harish Rao Attend Siddipet Municipal Meeting - Sakshi

సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయం

సాక్షి, సిద్దిపేట:  స్వచ్ఛ సిద్దిపేట.. అంటూ రాష్ట్రంతో పాటు దేశ స్థాయిలో మారుమోగుతున్న పేరు. పట్టణ ప్రజలకు మౌలిక వసతులు, సదుపాయాలను కల్పిస్తూ  వినూత్న  పథకాలతో రాష్ట్ర మున్సిపాలిటీలకు అధ్యయన పట్టణంగా మారింది. అలాంటి  పట్టణంలో ప్రస్తుతం వైరల్‌ ఫీవర్‌  ప్రజలను పట్టిపీడిస్తోంది. మరోవైపు భారీ వర్షం వస్తే చాలు పలు ప్రాంతాల్లో వరదనీటితో రోడ్లు జలమయంగా మారుతున్నాయి.  వీటికి తోడు జాప్యంగా  సాగుతున్న అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణపనులు. వీటంన్నింటికి శాశ్వత  పరిష్కారం చూపాల్సిన బాధ్యత బల్దియాపై ఉంది. ప్రధాన అంశాలపై ముందడుగు వేస్తే  మరింత సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శనివారం  సిద్దిపేట మున్సిపల్‌  సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు గౌరవ అతిథిగా రానున్న క్రమంలో  ప్రత్యేక కథనం..

పల్లెల తరహాలో పట్టణంలో..
రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల ప్రణాళికకు అనుగుణంగా సిద్దిపేటలోనూ అమలు చేయాల్పిన అవసరం ఎంతైన ఉంది.   పట్టణంలో పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి.  అదే విధంగా  పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంత్రి హరీశ్‌రావు ఆలోచనకు అనుగుణంగా విద్యార్థులకు అల్ఫాహారం,  సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణ ప్రక్రియపై పాలకవర్గ సమావేశంలో  చర్చ కొనసాగనుందనే చెప్పాలి.

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ.. 
పట్టణంలోని 34వార్డుల్లో మూడు విడతల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ వ్యవస్థను చేపట్టారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా 14వార్డుల్లో  8వేల గృహాలకు సంబంధించి యూజీడీ ప్రక్రియ పూర్తి అయింది. ఇక మిగిలింది ఇళ్ల యజమానులు  తమ నివాస గృహాలకు చెందిన మురికినీటిని యూజీడీకి అనుసంధానంచేసుకోవడమే.   ఇప్పటి వరకు కేవలం 2500 నివాస గృçహాలు అనుసంధానాన్ని పూర్తి చేసుకున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యూజీడీని వినియోగించుకునేలా పాలకవర్గ, అధికారులు మరింత  చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో యూజీడీ వ్యవస్థను మరింత వేగవంతం చేయాల్సిన కర్తవ్యం పబ్లిక్‌ హెల్త్‌శాఖపై ఉందనే చెప్పాలి.    భారీ వర్షాలు కురిసినప్పుడు పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచి రోడ్లు జలమయంగా మారుతున్నాయి.  ప్రతి యేట ఉత్పన్నమయ్యే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం, అవశ్యకత ఎంతైన  ఉందనే చెప్పాలి.  

వైరల్‌ ఫీవర్‌ల కట్టడి
ఇప్పటికే సిద్దిపేట పట్టణంలో అత్యధికంగా డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదవతున్న క్రమంలో మున్సిపల్, వైద్య శాఖలు సమన్వయంతో వైరల్‌ ఫీవర్‌ల కట్టడికి మరింత  కృషి చేయాల్సిన అవసరం ఉంది.  వైద్య శాఖ ఆధ్వర్యంలో దోమ నివారణ స్ప్రే ప్రక్రియ కొనసాగుతోంది.  సిద్దిపేట బల్దియాకు ఆదాయ వనరులను అందించే  మార్గాలను మరింతగా అన్వేషించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తాగునీటి సరఫరా కోసం విద్యుత్‌ బిల్లుల రూపంలో ప్రతి  నెల పెద్ద మొత్తంలో చెల్లించాల్సి రావడంతో  పట్టణంలోని అన«ధికార నల్లాలను క్రమబద్ధీకరించడంతో పాటు నూతన నల్లా కనెక్షన్ల మంజూరుతో ఆదాయ వనరులను పెంచాల్సిన అవసరం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement