♦ చేయని పనులకూ చెల్లింపులు
♦ సిద్టిపేట మున్సిపాలిటీలో అధికారుల ఇష్టారాజ్యం
♦ పాలక వర్గం లేని ఫలితం రూ. కోట్లలో మాయాజాలం
సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాలక వర్గంలేకపోవడం.. అడిగే నాథుడే కరువవడంతో రూ. కోట్లలో గోల్‌మాల్ జరుగుతోంది. చేయని పనులకు చెల్లింపులు చేస్తున్నారు. నిధుల ఖర్చు విషయంలో అధికారులు ‘మాయ’లు చేస్తున్నారు. ఇటీవల నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆడిట్‌లో సైతం వెల్లడైన విషయం విదితమే. కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలిపారు. అయినా ఇప్పుడు మరో బాగోతం బయట పడింది. స.హ. చట్టం రక్షణ వేదిక సేకరించిన సమాచారంలో అధికారులు చేయని పనులకూ బిల్లులు చెల్లించినట్లు తేలింది. ఎక్కడ చేశారో కూడా తెలియని పనులకు రూ.35.77లక్షలు చెల్లించినట్లు అధికారులు ఇచ్చిన సమాచరంలోనే ఉండటం గమనార్హం. 2012-14 సంవత్సరాల్లో పట్టణంలో వివిధ పనులకు ఈ నిధులు ఖర్చు చేసినట్లు చూపారు.
అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే విస్మయం కలుగుతోంది. స్థానిక గాంధీచౌక్ నుంచి ఆర్డీఓ కార్యాలయం, సబ్ జైలు మీదుగా మహాత్మాగాంధీ పార్కు వరకు డ్రైనేజీ కాలువ నిర్మించినట్లు అందుకు రూ.6.98 లక్షలు చెల్లించినట్లు చూపారు. కాని వాస్తవానికి గాంధీచౌక్ నుంచి ప్రభుత్వ అతిథి గృహం వరకు మాత్రమే నిర్మించారు. మహాత్మాగాంధీ పార్కు వద్ద 15 సంవత్సరాల క్రితం నిర్మించి మురుగు కాలువనే ఉంది. మున్సిపల్ అధికారులు పట్టణం నడిబొడ్డునే చేయని పనులకు నిధులు ఖర్చు చేసినట్లు చూపితే సందులు గొందుల్లో ఇంకెంత మాయ జరుగుతుందోనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెయిన్ రోడ్డులో బచ్చురమేశ్ ఇంటి నుంచి ఇంటి నెం. 5-1-65 వరకు నిర్మించిన మురుగు కాలువకు రూ.5 లక్షలు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఖర్చు పట్టికలో ఎలాంటి వివరాలు నమోదు చేయలేదు. ఇలా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేయడం దారుణమని సహ చట్టం రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొర్తివాడ రాజేందర్ అన్నారు. మంత్రి హరీశ్‌రావు పట్టణ అభివృద్ధి కోసం నిధులు పెద్ద ఎత్తున తెస్తుంటే అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని డిమాండు చేశారు.
విషయం తెలుసుకుంటా
2012-14లో తాను ఇక్కడ పనిచేయలేదు. అప్పుడు జరిగిన పనులు, చెల్లింపులపై సమగ్ర విచారణ చేసి వాస్తవ విషయం తెలుసుకుంటా. -రమణాచారి, మున్సిపల్ కమిషనర్