Golmaal
-
రమణ కేసు క్లోజ్..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మొత్తం మీద ఒంగోలులోని ఎలైట్ మాల్స్‌లో రూ.2.35 కోట్ల గోల్మాల్ చేసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రమణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వారం రోజులుగా సరికొత్త డ్రామాలు తెరపైకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అధికార టీడీపీకి చెందిన కీలక నేత రంగప్రవేశం చేసి రమణ ఎపిసోడ్‌కు ముగింపు పలికేందుకు తెరవెనుక మంత్రాంగం జరుపుతున్నట్టు సమాచారం. ఫలితంగా ఎక్సైజ్ శాఖలో రూ.2.35 కోట్ల ప్రభుత్వాదాయానికి కన్నం వేసిన దొంగలెవరో తేల్చకుండానే కేసు నీరుగారిపోనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... జిల్లా తెలుగు దేశం పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఒక నాయకుడి తరఫున టంగుటూరు నుంచి వచ్చిన పెద్ద మనిషి రెండు రోజులుగా ఇక్కడే తిష్టవేసి జిల్లాలోని పలువురు ఎక్సైజ్ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిసింది. పోయిన సొమ్మును రికవరీ చేయడం ద్వారా ఎవరి చేతులకు మట్టి అంటకుండా బయటపడేందుకు కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. కేసు నమోదైతే రమణ మాత్రమే కాకుండా అతడికి సహకరించిన ఉన్నతాధికారులకు, సహోద్యోగులకు, సేల్స్మెన్లకు కూడా శిక్ష పడడం ఖాయమని నచ్చ చెప్పారు. ఎవరికీ నష్టం, కష్టం కలగకుండా ఈ కేసు నుంచి బయటపడేందుకు తలా ఒక చేయి వేసేలా ఒప్పందం కుదిర్చారు. ఈ రాజీ ప్రకారం కేసులో ప్రధాన నిందితుడైన రమణ 60 శాతం డబ్బులు చెల్లించేలా, మిగతా సొమ్మును ఇంతకు ముందు ఇక్కడ పనిచేసివెళ్లిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న అధికారి, సేల్స్మెన్లు వేసుకొని చెల్లించేలా ఒప్పందం కుదిరినట్టు ఎక్సైజ్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలతో సదరు పెద్ద మనిషితో కలసి కొందరు మంగళవారం ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్‌ను కలిసేందుకు విజయవాడ వెళ్లినట్లు సమాచారం. అయితే అక్కడ ఆయనను కలిసేందుకు కుదరకపోవడంతో కమిషనర్ కార్యాలయంలో ఇతర అధికారులను కలిసి మాట్లాడి వచ్చినట్లు చెబుతున్నారు. రేపో మాపో కమిషనర్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసి రికవరీ చేసేందుకు మార్గం సుగమం చేస్తున్నట్లు తెలుస్తోంది.తలా పాపం తిలా పిడికెడు...ముందు నుంచి అనుకున్నట్లే భారీ మొత్తంలో ప్రభుత్వాదాయానికి కన్నం వేసిన వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న రమణ మీద పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కేసులో ప్రధాన పాత్రధారిగా చెప్పుకుంటున్న రమణ పరారైనా ఉలుకు లేదు పలుకు లేదు. అతను పరారీలో ఉన్నాడని చెబుతున్నారే కానీ పట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. ఈ కేసులో రమణతోపాటుగా మిగిలిన ఉద్యోగుల పాత్రపై విచారణ చేసినట్లు కూడా కనిపించలేదు. రమణ భాగోతంపై ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేసిన సేల్స్మెన్లు కలెక్టరేట్ వద్ద ధర్నా కూడా చేశారు. రమణను అరెస్టు చేయాలని వారు ఆందోళన చేసినా అధికారుల నుంచి పెద్దగా స్పందనలేదు.పెద్ద చేపల సంగతేంటి...ఈ కేసు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎక్సైజ్ శాఖలో చిరుద్యోగి అయిన కానిస్టేబుల్ రమణ ఒక్కడే ఈ అక్రమానికి పాల్పడడం అంత సులువుకాదని తెలుస్తోంది. పెద్ద చేపల ప్రోత్సాహంతోనే ఆయన కోట్ల రూపాయల స్కాంకి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఎస్ఐ, సీఐల గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. నిబంధనలకు మించి స్టాకు సరఫరా చేసిన డిపో మేనేజర్ గురించి కూడా అధికారులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కేసు నమోదైతే వారందరూ శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందన్న భయంతోనే ఎక్సైజ్ శాఖ ఉన్నతోద్యోగులంతా ఒక్కటయ్యారు. తలా కొంచెం వేసుకొని గట్టుమీద పడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. -
ధరణిలో గోల్మాల్.. మణికొండలో భారీ భూకబ్జా!
హైదరాబాద్, సాక్షి: మణికొండ పోకల్‌వాడలో భారీ భూదందా వెలుగు చూసింది. ధరణిలో గోల్మాల్ చేసి వెయ్యి కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారు. కలెక్టర్లంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. ధరణి నుంచి పాస్‌బుక్‌లు జారీ అయ్యాయి. ధరణి ఉద్యోగులు చేతి వాటం ప్రదర్శించి ఈ స్కామ్‌కు పాల్పడ్డారు. ఎమ్మార్వో ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది.ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఐదెకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ధరణి ఉద్యోగులతో రూ.3 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాతే రంగారెడ్డి ఇద్దరు కలెక్టర్ల సంతకాలతో పాస్‌బుక్‌లు జారీ చేశారు. అయితే.. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న ల్యాండ్‌కు పాస్ బుక్‌లు జారీ కావడంతో ఎమ్మార్వో ఖంగుతిన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు ధరణి ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకున్న ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపైనా సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
Ajay Devgn: సీక్వెల్ స్టార్
యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిస్తున్నారు అజయ్ దేవగన్. ఇప్పుడు ఈ హీరోకి ‘సీక్వెల్ స్టార్’ అని ట్యాగ్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు... రెండు మూడు కూడా కాదు... ఏకంగా ఎనిమిది చిత్రాల సీక్వెల్స్ అజయ్ దేవగన్ డైరీలో ఉన్నాయి. సీక్వెల్ చిత్రాల్లో నటించడం పెద్ద విషయం కాదు కానీ వరుసగా ఎనిమిది చిత్రాలంటే మాత్రం పెద్ద విషయమే. ఇక అజయ్ సైన్ చేసిన సీక్వెల్ చిత్రాల్లో ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా కొన్ని ఆరంభం కావాలి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. అజయ్ దేవగన్ కెరీర్లో ‘సింగమ్’ చిత్రానిది ప్రత్యేక స్థానం. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీసాఫీసర్ సింగమ్‌గా అజయ్ దేవగన్ విజృంభించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే ‘సింగమ్’కి సీక్వెల్‌గా ‘సింగమ్ రిటర్న్స్’ (2014) రూపొంది, సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైన దాదాపు పదేళ్లకు ఈ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగమ్ ఎగైన్’ పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. అజయ్ దేవగన్ హీరోగా ఈ చిత్రానికి కూడా రోహిత్ శెట్టియే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుందని సమాచారం. అదే విధంగా అజయ్ దేవగన్ హీరోగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ‘రైడ్’ (2018) మూవీ ఘనవిజయం సాధించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ హీరోగా డైరెక్టర్ రాజ్‌కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాణీ కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 15న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ‘సింగమ్’ వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ‘గోల్మాల్’ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే వచ్చిన ‘గోల్మాల్ రిటర్న్స్’ (2008) సూపర్ హిట్ అయింది. ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో ‘గోల్మాల్ 3’ (2010), ‘గోల్మాల్ 4’ (2017) కూడా వచ్చాయి. ‘గోల్మాల్ 5’ రానుంది. అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. ఇకపోతే అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్‌సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో రిలీజై సూపర్ హిట్ అయింది. దాదాపు ఐదేళ్లకి ‘దే దే ప్యార్ దే 2’ సినిమాని ప్రకటించారు మేకర్స్. ఇందులోనూ అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించనున్నారు. అయితే ‘దే దే ప్యార్ దే’కి అకివ్ అలీ దర్శకత్వం వహించగా.. ‘దే దే ప్యార్ దే 2’ మూవీని కొత్త దర్శకుడు అన్షుల్ శర్మ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని 2025 మే 1న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అలాగే అజయ్ దేవగన్ హీరోగా అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్’. 2012లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ (2010) చిత్రానికి ఇది రీమేక్. ఇక ‘సన్ ఆఫ్ సర్దార్’ వచ్చిన పుష్కరం తర్వాత సీక్వెల్‌గా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగానికి అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించగా, మలి భాగాన్ని డైరెక్టర్ విజయ్ కుమార్ అరోరా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే 2025లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా మలయాళ హిట్ మూవీ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ (2015) హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు ‘దృశ్యం 2’ రిలీజైంది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. ఇదే ఫ్రాంచైజీలో మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో కూడా అజయ్ దేవగన్ నటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సైతాన్’ చిత్రం గత నెల 8న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సైతాన్ 2’ రానుంది. ఇంకా ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఓ హీరోగా నటించిన ‘ధమాల్’ (2007)తో పాటు ‘డబుల్ ధమాల్’ (2011), ‘టోటల్ ధమాల్’ (2019) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘ధమాల్ 4’ కూడా రానుందని సమాచారం. ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే అజయ్ దేవగన్ ఓ హీరోగా ఈ నాలుగో భాగం ఉంటుందని టాక్. ఇలా వరుసగా సీక్వెల్స్‌కి సైన్ చేసిన అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మైదాన్’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆయన ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. -
ఫిబ్రవరి 18న రెండు సినిమాలు రిలీజ్
మిట్టకంటి రామ్, విజయ్ శంకర్, అక్షితా సోనవానె, మహి మల్హోత్రా, కిస్లే చౌదరి ప్రధాన పాత్రల్లో జాన్ జిక్కి దర్శకత్వం వహించిన చిత్రం ‘2020 గోల్మాల్’. కాగా గంగాధర వైకే అద్వైత దర్శకత్వంలో అనిల్ కుమార్, వినోద్ నాగులపాటి, ఉషాంజలి, అక్షిత, శ్లోక ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘సురభి 70 ఎమ్ ఎమ్’. కేకే చైతన్య నిర్మించిన ఈ రెండు చిత్రాలు ఈ నెల 18న విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త తరహా అనుభూతి ఇస్తుంది’’ అన్నారు గోల్మాల్ దర్శకుడు జాన్ జిక్కి. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు గంగాధర. ఈ వేడుకల్లో నటుడు మిట్టకంటి రామ్, దర్శకులు చంద్ర మహేశ్, వీఎన్ ఆదిత్య, ‘బైలంపూడి’ నిర్మాత బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. -
‘దేవుడి’ సొమ్ముకే టెండర్
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. టెండర్లు పిలువకుండానే, లక్షలాది రూపాయల మేర అభివృద్ధి పనులను కొందరు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా జరిపించేస్తున్నారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారనేది పక్కనబెడితే, దీని వల్ల లక్షలాది రూపాయల మేర దేవుడి సొమ్ము దుర్వినియోగమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సాధారణంగా రూ.30 వేలు పైబడి ఖర్చు చేసే ఏ పనికైనా దేవస్థానం మాన్యువల్ టెండర్‌ను పిలవాలి. అలాగే లక్ష రూపాయలు పైబడి జరిగే పనులకు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్‌ను పిలిచి, ఎవరు తక్కువకు టెండర్ వేస్తే.. వారికే పనులను అప్పగించాలి. ఇలా చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో, సకాలంలో పనులు పూర్తవడంతో పాటు, పనుల్లో నాణ్యత కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆ నిబంధనలేవీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. అత్యవసరం పేరుతో 90 శాతం అభివృద్ధి పనులను ఎటువంటి టెండర్లూ లేకుండానే చకచకా కానిచ్చేస్తున్నారు. తమకు కావాల్సిన వారికి అధికారులు పనులను అప్పగించి, వారికి సొమ్ములను ముట్టచెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే వ్యక్తికి పనులు అప్పగింత ద్వారకాతిరుమలలో దాదాపు ఐదు జేసీబీలు ఉండగా, ఎప్పుడూ ఒక జేసీబీ యజమానికే దేవస్థానం ఇంజినీరింగ్ విభాగ అధికారులు పనులను అప్పగిస్తున్నారు. ఈ విషయంలో గతేడాది సెప్టెంబర్ 7న ఇద్దరు జేసీబీ యజమానులకు, దేవస్థానం అధికారులకు మధ్య ఘర్షణ కూడా జరిగింది. చివరకు ఆ గొడవ రోడ్డుపైనే సెటిల్మెంట్ అయ్యింది. అయినా అధికారులు తమకు అనుకూలంగా ఉన్న ఆ జేసీబీ యజమానికే ఇప్పటికీ టెండర్లు లేకుండా పనులను అప్పగించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయలపైబడి జరిగిన పనులకు సైతం రూ.30 వేలు లోపు, పలు బిల్లులను పెడుతూ ఆ వ్యక్తికే లబ్ధి చేకూరుస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవారి శేషాచలకొండపై ఇటీవల జేసీబీతో జరుగుతున్న పనులు తక్కువ పని చేసినా.. జేసీబీ దాదాపు 4 గంటలు పనిచేస్తే, 10 గంటలు పనిచేసినట్లు బిల్లుల్లో చూపుతూ, గంటకు రూ.వెయ్యి వరకు అధికారులు ఆ వ్యక్తికి నగదు చెల్లింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జేసీబీ ఎంత సమయం పనిచేసిందనే దాన్ని రీడింగ్ రూపంలో సంబంధిత సిబ్బంది లాక్‌బుక్ రాయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే దేవస్థానం బిల్లులను చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పనులకు ఎటువంటి లాక్‌బుక్ లేనట్లు తెలుస్తోంది. తక్కువ పనిచేసినా.. ఎక్కువ పనిచేసినట్లు సిబ్బంది చేప్పే, ఒట్టి నోటి మాటల ద్వారానే, పెద్ద మొత్తంలో బిల్లులు ఒకే వ్యక్తికి ఇవ్వడం వల్ల చినవెంకన్న సొమ్ముకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మొక్కల పెంపకానికి, ఇతర పనులకు మట్టిని తోలే పనులను సైతం అదే వ్యక్తికి అప్పగించినట్లు స్పష్టమవుతోంది. ఇలా అన్ని పనులూ దాదాపుగా ఒకే వ్యక్తికి అధికారులు అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటో ఆ చినవెంకన్నకే తెలియాలి. ఇప్పటికైనా అధికారులు నిబంధనలను పాటించి, అభివృద్ధి పనులకు టెండర్లను పిలవాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. దీనిపై ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజును వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
ఫోర్జరీ సంతకంతో లక్ష గోల్మాల్
సంతమాగులూరు: ఫోర్జరీ సంతకంతో డ్వాక్రా మహిళలకు సంబంధించిన లక్ష రూపాయలు గోల్‌మాలైన సంఘటన మండలంలోని మిన్నెకల్లులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామంలోని లక్ష్మీ తిరుపతమ్మ గ్రూపునకు చెందిన తన్నీరు అంజమ్మ, రాణిలు గ్రూపు లీడర్లుగా పనిచేస్తున్నారు. గ్రూపులోని మిగిలిన ఎనిమిది మంది సభ్యులకు తెలియకుండా తంగేడుమల్లి సిండికేట్ బ్యాంకులో లక్ష రూపాయలు తమ సొంత ఖర్చులకు వాడుకున్న విషయం బయటపడింది. ఇటీవల మిగిలిన ఎనిమిది మంది సభ్యులు రుణం కోసం బ్యాంకుకు వెళ్లారు. ఇటీవల రుణం తీసుకున్నారని.. మళ్లీ రుణం కోసం ఎందుకు వచ్చారంటూ మేనేజర్ ప్రశ్నించారు. దీంతో లీడర్ల అక్రమం బయట పడింది. అంతా కలిసి అధికారులను ప్రశ్నించేందుకు వెలుగు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ధర్నా చేశారు. అనంతరం ఎంపీడీవో రాజశేఖర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులను లీడర్లు మోసం చేయడం అన్యాయమన్నారు. తమకు న్యాయం చేసేంత వరకూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే తమకు రుణం మంజూరు చేయాలని కోరారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వారికి హామీ ఇచ్చారు. -
జీహెచ్ఎంసీ టెండర్లలో గోల్మాల్
-
10వ తరగతి పరీక్షల్లో గోల్మాల్
-
సంక్రాంతి సరుకుల టెండర్లలో గోల్మాల్
-
గోల్ మాల్ సెట్లో అల్లు అర్జున్
దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో పాటు ఫిజికల్ గా కూడా వేరియేషన్ చూపించేందుకు కసరత్తులు చేస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా చేయనున్నాడు బన్నీ. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి మరికాస్త సమయం పట్టనుండటంతో ఓ యాడ్ షూటింగ్ కోసం ముంబై వెళ్లాడు బన్నీ. అక్కడ గోల్ మాల్ ఎగైన్ సెట్స్ ని విజిట్ చేశాడు. గోల్ మాల్ టీం సభ్యులతో కలిసి కాసేపు సరదాగా గడిపాడు. అల్లు అర్జున్ కి ప్రస్తుతం సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా, బన్నీ సినిమాలు హిందీలోకి డబ్ అయి మంచి విజయం సాధిస్తున్నాయి. పలువురు హిందీ దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. గోల్ మాల్ ఎగైన్ చిత్రం రోహిత్ శెట్టి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, పరిణితో చోప్రా హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా అర్షద్ వార్సీ, తుషార్ కపూర్, కునాల్ కేము, నీల్ నితిన్ ముకేశ్, టబు మరియు ప్రకాశ్ రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
ఆ హీరోయిన్ పాట వింటూ.. గురక పెట్టారు!
బాలీవుడ్ నటి పరిణీత చోప్రా తొలిసారి గొంతు సవరించుకుంది. 'మేరి ప్యారి బిందు' సినిమా కోసం ఆమె తొలిసారి పాట పాడింది. 'మానకే హమ్ యార్ నహి' అంటూ ఆమె మధురంగా ఆలపించిన పాటకు శ్రోతలు, బాలీవుడ్ ప్రముఖుల నుంచి జేజేలు లభిస్తున్నాయి. ఆమె సింగింగ్ టాలెంట్‌ను అందరూ వేనోళ్ల కొనియాడుతుండగా.. 'గోల్మాల్-4'లో ఆమె సరసన హీరోగా నటిస్తున్న అజయ్ దేవ్‌గణ్ మాత్రం ఒక విచిత్రమైన పోస్టు పెట్టారు. పరిణీత పాటను వింటూ తామంతా గురకపెట్టి నిద్రపోయామంటూ ఓ ఫొటోను ట్వీట్ చేశారు. 'మానకే హమ్ యార్ నహీని పాటను మాతో బలవంతంగా వినిపించడం ఇది పదోసారి. అయినా పాటను ఇష్టపడుతున్నాం. గ్రేట్ జాబ్ పరిణీత' అంటూ అజయ్ ఓ ఫొటో ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో పరిణీత మొబైల్ ఫోన్లో తన పాట వినిపిస్తుండగా అజయ్, దర్శకుడు రోహిత్ శెట్టీ సహా యావత్ చిత్ర బృందమంతా గాఢనిద్రలోకి జారుకున్నట్టు కనిపిస్తున్నారు. రోహిత్ శెట్టీ కామెడీ ధమాకా అయిన 'గోల్మాల్-4' కోసం అజయ్‌తో ఈసారి పరిణీత చోప్రా జత కట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తుషార్ కపూర్, అర్షద్ వార్సీతోపాటు టబూ కూడా నటిస్తున్నది. This is the 10th time today we are being forced to see #MaanaKeHumYaarNahin, but still loving it! Great job @ParineetiChopra! A post shared by Ajay Devgn (@ajaydevgn) on Mar 28, 2017 at 1:13am PDT -
‘మధ్య పెన్నార్’లో మహా మాయ
• దక్షిణ కాలువ ఆధునీకరణ టెండర్లలో గోల్మాల్ • రాజ్యసభ సభ్యుడి సంస్థకే పనులు దక్కేలా ‘ముఖ్య’నేత మంత్రాంగం • టెండర్ నోటిఫికేషన్ ఇచ్చాక బిడ్ కెపాసిటీ పెంచుతూ ఉత్తర్వులు • రూ.101.61 కోట్ల అంచనాలు రూ.421.87 కోట్లకు పెంపు • రూ.320.26 కోట్లు కొట్టేయడానికి రంగం సిద్ధం సాక్షి, అమరావతి అయినవారి కోసం ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి, ప్రజా ధనాన్ని పంచడంలో ఆ ముఖ్య నేతది పెద్ద చేయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాజెక్టుల పేరుతో ‘కోటరీ’కి పెద్ద ఎత్తున సంపాదించి పెట్టిన ఆయన ఇప్పుడు వంద కోట్ల ప్రాజెక్టును 400 కోట్లకు పైగా పెంచేసి, మరోసారి ప్రజాధనాన్ని ఓ రాజ్యసభ సభ్యుడి జేబులో వేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే అనంతపురం జిల్లాలోని మధ్య పెన్నార్ దక్షిణ కాలువ అభివృద్ధి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే కొంత వరకు పూర్తయ్యాయి. రూ. 101 కోట్ల విలువైన పనులు మిగిలాయి. కానీ, ఈ పనులను తన వారికి కట్టబెట్టడానికి పాత కాంట్రాక్టర్లను తొలగించి, నిబంధనలు కూడా మార్చేసి, అంచనాలను మూడున్నర రెట్లు పెంచి, టెండర్లు పిలిచారు. సోమవారం ఉదయం 11 గంటలకు టెండర్ల షెడ్యూళ్ల దాఖలు గడువు ముగిసింది. ఈ నెల 21న ఉదయం 11 గంటలకు టెక్నికల్ బిడ్, 25న సాయంత్రం ఐదు గంటలకు ప్రైస్ బిడ్ తెరవడం.. రాజ్యసభ సభ్యుడి సంస్థకు పనులు కట్టబెట్టడం.. కమీషన్లు పంచుకోవడమే ఇక తరువాయి. ఖర్చు పెరగకపోయినా, అంచనా పెరిగిపోయింది మధ్య పెన్నార్ దక్షణ కాలువ ఆధునీకరణ పనులు 2007లో ప్రారంభమయ్యాయి. 43వ ప్యాకేజీ పనులను రూ.66.43 కోట్లకు ఈసీఐ–బీజేసీఎల్(జేవీ), 44వ ప్యాకేజీ పనులను రూ.50.45 కోట్లకు జీహెచ్‌ఆర్‌ఏ–కేఆర్‌సీసీ(జేవీ) సంస్థలు దక్కించుకున్నాయి. 43వ ప్యాకేజీలో రూ.8.15 కోట్లు, 44వ ప్యాకేజీలో రూ.7.07 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. ఈ రెండిట్లో కలిపి రూ.101.61 కోట్ల విలువైన పనులు మిగిలాయి. ఇక్కడే ప్రభుత్వ పెద్దలు మంత్రాంగానికి తెర తీశారు. పాత కాంట్రాక్టర్లపై వేటు వేశారు. రూ.58.28 కోట్లతో పూర్తయ్యే 43వ ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.237.23 కోట్లకు, రూ.43.33 కోట్ల విలువైన 44వ ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.184.64 కోట్లకు పెంచేస్తూ మళ్లీ టెండర్లు పిలిచారు. ఈ రెండు ప్యాకేజీల అంచనా వ్యయం ఇప్పుడు 421.87 కోట్లకు పెరిగింది. అంటే అంచనా వ్యయం రూ. 320.26 కోట్లు పెరిగింది. పైగా, గతంతో పోలిస్తే ఇప్పుడు స్టీల్, సిమెంట్ ధరలు తగ్గాయి. డీజిల్, పెట్రోల్ ధరల్లోనూ పెద్దగా మార్పు లేదు. ఇప్పుడు ఇసుక ఉచితంగానే లభిస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకొంటే ఖర్చులో మార్పేమీ ఉండదు. అయినా అంచనా వ్యయాన్ని మూడున్నర రెట్లు పెంచారంటే దీని వెనుక ఉన్న కమీషన్ల బాగోతాన్ని అర్థం చేసుకోవచ్చు. కోటరీలోని ఎంపీ కోసమే..! అధికార పార్టీ కోటరీలోని ఓ రాజ్య సభ సభ్యునికి టెండర్ కట్టబెట్టడానికే ఈ తతంగమంతా నడిచినట్లు విశ్వసనీయ సమాచారం. ముందస్తు వ్యూహంలో భాగంగా తన కోటరీలోని రాజ్యసభ సభ్యుడికి చెందిన సంస్థకే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ) అధికారులను ఆ ముఖ్య నేత ఆదేశించారు. దీంతో అన్ని నిబంధనాలూ మారిపోయాయి. వాస్తవానికి కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేలా టెండర్ నియమావళిలో ప్రధానమైన బిడ్ కెపాసిటీని ఏఎన్2–బీ నుంచి ఏఎన్3–బీకి పెంచుతూ నెల కిత్రమే ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆ ఉత్తర్వులు జారీ చేస్తే మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ఆధునీకరణ పనులకు ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే పనులు ఎంపీకి చెందిన సంస్థకు దక్కకపోవచ్చు. దీంతో బిడ్ కెపాసిటీని పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వ పెద్దలు నిలిపివేయించారు. మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ఆధునీకరణ టెండర్ నోటిఫికేషన్‌ను ఈ నెల 6న జారీ చేశారు. ఆ తర్వాత అంటే.. ఈ నెల 10న బిడ్ కెపాసిటీని పెంచుతూ ఉత్తర్వులు (జీవో నం.13)ను జారీ చేశారు. దీనివల్ల దక్షిణ కాలువ పనులు ఎంపీకి చెందిన సంస్థకు దక్కేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టుల పనులను జాయింట్ వెంచర్ సంస్థలే చేస్తున్నాయి. కానీ, మధ్య పెన్నార్ కాలువ ఆధునీకరణ పనులకు వచ్చేసరికి జాయింట్ వెంచర్ సంస్థలకు అర్హత లేదని నిబంధన పెట్టారు. నిర్మాణ రంగం కుదేలవడం వల్ల పెద్ద పెద్ద కాంట్రాక్టు సంస్థలు కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ (సీడీఆర్), స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ (ఎస్డీఆర్)లను అమలు చేశాయి. కానీ, సీడీఆర్, ఎస్డీఆర్లను అమలు చేసిన సంస్థలకు ఈ టెండర్లలో పాల్గొనేందుకు అర్హత లేదని తిరకాసు పెట్టారు. దీని ద్వారా ప్రముఖ సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనే అర్హత కోల్పోయాయి. ఇదేమి మతలబు? దక్షిణ కాలువ ఆధునీకరణ పనుల టెండర్లలో ప్రభుత్వం విధించిన మరో నిబంధన అధికారులనే కంగు తినిపించింది. రూ.237.23 కోట్ల విలువైన 43వ ప్యాకేజీ పనులను 42 నెలల్లో పూర్తి చేయడానికి నిర్మాణ సంస్థకు బ్యాంకులో రూ.17 కోట్లు నగదు నిల్వ ఉంటే చాలట! రూ.184.64 కోట్ల విలువైన 44వ ప్యాకేజీ పనులను 42 నెలల్లో పూర్తి చేయడానికి మాత్రం బ్యాంకులో రూ.23.01 కోట్లు నగదు నిల్వ ఉండాలట! ఎక్కువ విలువైన పనులకు తక్కువ మొత్తంలో బ్యాంకు నిల్వలు, తక్కువ విలువైన పనులకు ఎక్కువ నగదు నిల్వలు ఉండాలన్న నిబంధన సర్కారు చిత్రమైన వైఖరికి నిదర్శనమని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
నిధుల గోల్మాల్!
♦ చేయని పనులకూ చెల్లింపులు ♦ సిద్టిపేట మున్సిపాలిటీలో అధికారుల ఇష్టారాజ్యం ♦ పాలక వర్గం లేని ఫలితం రూ. కోట్లలో మాయాజాలం సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాలక వర్గంలేకపోవడం.. అడిగే నాథుడే కరువవడంతో రూ. కోట్లలో గోల్మాల్ జరుగుతోంది. చేయని పనులకు చెల్లింపులు చేస్తున్నారు. నిధుల ఖర్చు విషయంలో అధికారులు ‘మాయ’లు చేస్తున్నారు. ఇటీవల నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆడిట్లో సైతం వెల్లడైన విషయం విదితమే. కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలిపారు. అయినా ఇప్పుడు మరో బాగోతం బయట పడింది. స.హ. చట్టం రక్షణ వేదిక సేకరించిన సమాచారంలో అధికారులు చేయని పనులకూ బిల్లులు చెల్లించినట్లు తేలింది. ఎక్కడ చేశారో కూడా తెలియని పనులకు రూ.35.77లక్షలు చెల్లించినట్లు అధికారులు ఇచ్చిన సమాచరంలోనే ఉండటం గమనార్హం. 2012-14 సంవత్సరాల్లో పట్టణంలో వివిధ పనులకు ఈ నిధులు ఖర్చు చేసినట్లు చూపారు. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే విస్మయం కలుగుతోంది. స్థానిక గాంధీచౌక్ నుంచి ఆర్డీఓ కార్యాలయం, సబ్ జైలు మీదుగా మహాత్మాగాంధీ పార్కు వరకు డ్రైనేజీ కాలువ నిర్మించినట్లు అందుకు రూ.6.98 లక్షలు చెల్లించినట్లు చూపారు. కాని వాస్తవానికి గాంధీచౌక్ నుంచి ప్రభుత్వ అతిథి గృహం వరకు మాత్రమే నిర్మించారు. మహాత్మాగాంధీ పార్కు వద్ద 15 సంవత్సరాల క్రితం నిర్మించి మురుగు కాలువనే ఉంది. మున్సిపల్ అధికారులు పట్టణం నడిబొడ్డునే చేయని పనులకు నిధులు ఖర్చు చేసినట్లు చూపితే సందులు గొందుల్లో ఇంకెంత మాయ జరుగుతుందోనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెయిన్ రోడ్డులో బచ్చురమేశ్ ఇంటి నుంచి ఇంటి నెం. 5-1-65 వరకు నిర్మించిన మురుగు కాలువకు రూ.5 లక్షలు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఖర్చు పట్టికలో ఎలాంటి వివరాలు నమోదు చేయలేదు. ఇలా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేయడం దారుణమని సహ చట్టం రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొర్తివాడ రాజేందర్ అన్నారు. మంత్రి హరీశ్‌రావు పట్టణ అభివృద్ధి కోసం నిధులు పెద్ద ఎత్తున తెస్తుంటే అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని డిమాండు చేశారు. విషయం తెలుసుకుంటా 2012-14లో తాను ఇక్కడ పనిచేయలేదు. అప్పుడు జరిగిన పనులు, చెల్లింపులపై సమగ్ర విచారణ చేసి వాస్తవ విషయం తెలుసుకుంటా. -రమణాచారి, మున్సిపల్ కమిషనర్ -
‘సూర్య’కాంతిలో ముడుపుల వేట
♦ నిజమని తేలిన సోలార్ స్కాం.. ముందే చెప్పిన సాక్షి ♦ అనంతపురం జిల్లా ఎన్‌పి కుంట ప్రాంతం. ఇక్కడ ఎన్టీపీసీ 750 ♦ మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఇపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, ♦ కన్స్ట్రక్షన్) కాంట్రాక్టుకు టెండర్లు పిలిచింది. తాజాగా జరిగిన రివర్స్ ఆక్షన్ ♦ తర్వాత మెగావాట్ రూ. 4.91 కోట్లుగా నిర్థారించారు. అదే జిల్లా... తలారి చెర్వు ప్రాంతం. ఎన్‌పి కుంటకు 60 కిలోమీటర్ల దూరం. ఇక్కడ ఏపీ జెన్కో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఇపీసీ కాంట్రాక్టుల టెండర్లును పిలిచింది. రివర్స్ ఆక్షన్ తర్వాత మెగావాట్ రూ. 6.26 కోట్లుగా తేల్చారు. ఎన్టీపీసీ టెండరు... మెగావాట్ రూ.కోట్లలో...4.91 ఏపీ జెన్కో నిర్ధారించింది మెగావాట్ రూ.కోట్లలో...6.26 సాక్షి, హైదరాబాద్ : అదే పని. అదే జిల్లా... కానీ ఎంత తేడా? ఏపీజెన్కో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల్లో గోల్మాల్ జరుగుతోందని, దాదాపు రూ. 755 కోట్ల మేర ప్రైవేటు సంస్థలు కైంకర్యం చేయబోతున్నాయని నెలన్నర క్రితమే సాక్షి చెప్పింది. ఇపుడు అదే నిజమయ్యింది. ఎన్టీపీసీ ఒక్కో ప్యాకేజీ 125 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది. జెన్కో మాత్రం 100 మెగావాట్ల సామర్థ్యంతో 5 ప్యాకేజీలకు ఇపీసీ కాంట్రాక్టు టెండర్లు పిలిచింది. ఎన్టీపీసీ కాంట్రాక్టు వ్యయం కన్నా ఏపీ జెన్కో కాంటాక్టు వ్యయం మెగావాట్‌కు రూ. 1.35 కోట్లు అధికం.అంటే 500 మెగావాట్లకు రూ. 675 కోట్లు ప్రైవేటు సంస్థల జేబుల్లోకి వెళ్లేలా ఏపీ జెన్కో పక్కా స్కెచ్ వేసింది. లోతుగా విశ్లేషిస్తే ఎన్టీపీసీ రివర్స్ ఆక్షన్ చేపట్టేనాటికి డాలర్ మారకం విలువలోనూ తేడా ఉంది. జెన్కో భూమితో పోలిస్తే, ఎన్టీపీసీకి ఇచ్చిన భూమిని చదును చేసేందుకు అదనపు ఖర్చు అవుతుంది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుంటే... ఏకంగా ఏపీ జెన్కో సోలార్ కాంట్రాక్టు వ్యవహారంలో రూ. 755 కోట్లు అధికంగా ఉంటుందనేది సుస్పష్టం. సోలార్ ఇపీసీ పనుల్లో పాల్గొనాలంటే, 25 మెగావాట్ల సోలార్ ప్లాంట్ చేసి ఉండాలనేది ఎన్టీపీసీ నిబంధన. దీన్ని జెన్కో 50 మెగావాట్లకు పెంచింది. వార్షిక టర్నోవర్ రూ. 300 కోట్లు ఉండాలని ఎన్టీపీసీ పేర్కొంటే, జెన్కో రూ.800 కోట్లు ఉండాలంది. ఈ అర్హతలు బీహెచ్ఈఎల్, స్టెర్లింగ్, టాటా, ఎల్ అండ్ టీతో పాటు మెగా సంస్థకు ఉండటంతో, అవే ఎల్-1గా నిలిచాయి. ్హఅన్ని సంస్థలు పోటీ పడేలా ఎన్టీపీసీ నిబంధనలు పెట్టడం వల్ల 750 మెగావాట్ల సోలార్ ఇపీసీ టెండర్ల కోసం 17 సంస్థలు పోటీ పడ్డాయి. వాటిల్లో పుంజ్ లాయడ్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ముంబై), టెక్నో ఎలక్రిక్, విక్రమ్ సోలార్ (కలకత్తా), ఇన్‌డ్యూర్, ఎల్ అండ్ టి (చెన్నై), మహీంద్ర (ముంబయి), బీహెచ్ఇఎల్, టాటా, స్టెర్లింగ్ అండ్ విల్సన్, ల్యాంకో ఇన్ఫ్రాటెక్, వెల్స్పన్, మెగా ఇంజనీరింగ్, ఐసోలక్స్ స్పెయిన్, ఉజాస్ ఎంపి, ఐసెక్, ఐసోలక్స్ ఇన్జెనీరియా (ఇండియా) మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఇందులో 14 అర్హత పొందాయి. రివర్స్ బిడ్డింగ్‌లో మెగావాట్ రూ. 4.91 కోట్లుగా నిర్థారించారు. ఆరు కంపెనీలకు టెండర్లను ఖరారు చేయాల్సి ఉంది. ఏపీ జెన్కో మాత్రం రివర్స్ బిడ్డింగ్ వ్యవహారంలో బీహెచ్ఇఎల్ను ముందు పెట్టారు. ఈ సంస్థ మెగావాట్‌కు రూ. 6.33 కోట్లు కోట్ చేసింది. మిగతా నాలుగు కంపెనీలు అంతక న్నా ఎక్కువగా (సుమారు రూ. 7 కోట్ల వరకూ) కోట్ చేశాయి. రివర్స్ బిడ్డింగ్‌లో బీహెచ్‌ఇల్ మెగావాట్‌కు 6.26 కోట్లకు దిగిరావడం, అదే ధరకు మిగిలిన సంస్థలకూ కట్టబెట్టారు. ఈ కథ వెనుక బీహెచ్ఇఎల్ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయనే విమర్శలు ఉన్నాయి. నిజానికి ఎన్టీపీసీ రివర్స్ ఆక్షన్ చేసిన నాటికి (24.2.16) డాలర్‌తో పోలిస్తే రూపా యి మారకం విలువ 5 శాతం క్షీణించింది. దీనివల్ల ఇక్కడ సోలార్ ప్యానల్స్ దిగుమతి ఖర్చు పెరిగే వీలుంది. అదీగాక ఎన్టీపీసీకి కేటాయించిన భూములను చదును చేయాల్సి ఉండటం వల్ల ఎక్కువ వ్యయం చేయాల్సి ఉంటుంది. ఏపీ జెన్కోకు ఇచ్చిన భూముల్లో ఇలాంటి పనుల కోసం పెద్దగా వెచ్చించాల్సిన అవసరమే లేదు. ‘సాక్షి’ కథనంతో కథ రివర్స్ సోలార్ టెండర్ల కుంభకోణాన్ని ఁసాక్షి* ముందే వెల్లడించింది. ఁఏపీ సోలార్.. రూ. 755 కోట్లు గోల్మాల్* అనే శీర్షికతో జనవరి 25న కథనాన్ని ప్రచురించింది. ఇతర రాష్ట్రాల్లో సోలార్ ప్లాంట్ల నిర్మాణం మెగావాట్‌కు 4.75 కోట్లు మాత్రమే ఉందని చెప్పింది. ఏపీలో మెగావాట్‌కు రూ. 6.26 కోట్లకు ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు అందాయని వెల్లడించింది. ఈ కథనంతో ఏపీ జెన్కో డెరైక్టర్లు రివర్స్ అయ్యి.. ఈ కుంభకోణంలో పాపం పంచుకోలేమన్నారు. దీంతో జెన్కో వెనక్కి తగ్గింది. ఎన్టీపీసీ ఇపీసీ పనుల్లో మెగావాట్‌కు రూ. 4.91 కోట్లకే ఖరారు కావడంతో జెన్కో అధికారులు కంగుతిన్నారు. ఈ విషయమై మాట్లాడేందుకు వారు ఇష్టపడటంలేదు. ఏపీ పవర్ సోలార్ కార్పొరేషన్ ఎండీ ఆదిశేషును వివరణ కోరగా... ఎన్టీపీసీ రివర్స్ ఆక్షన్ వివరాలు తమకు అందనే లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. -
మహానంది టోల్గేట్ వద్ద గోల్మాల్
కర్నూలు(మహానంది): మహానంది దేవస్థానంలోని టోల్గేట్ వద్ద అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు ఏజెన్సీ ఉద్యోగులను అధికారులను పట్టుకున్నారు. టోల్‌గేటు వద్ద టిక్కెట్లు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తూ వారు పట్టుబడ్డారు. శ్రీనివాసులు, విజయ్ కుమార్ రెడ్డి అనే ఇద్దరు ఏజెన్సీ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతుండగా పట్టుబడ్డారు. వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. -
బెరైటీస్ మైనింగ్టెండర్లలో మాయాజాలం
-
మెప్మా..ఇదేంటి చెప్మా?
బినామీ గ్రూపులతో రూ.కోట్లు స్వాహా క్షేత్ర స్థాయిలో కనిపించని గ్రూపులు మెప్మా, బ్యాంకు సిబ్బంది నిర్వాకం రహస్యంగా విచారణ చేయిస్తున్న అధికారులు సాక్షి, ఖమ్మం: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో రూ.కోట్లలో గోల్మాల్ జరిగింది. బినామీ గ్రూపుల పేరుతో బ్యాంకు లింకేజి తీసుకొని అందినకాడికి స్వాహా చేశారు. లింకేజి తీసుకున్న గ్రూపులు ఎంతకూ చెల్లించకపోవడంతో బ్యాంకు ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఓ పది గ్రూపుల లింకేజీపై విచారణ చేయగా.. తీగ లాగితే డొంక కదిలినట్లు అవినీతి బండారం బయటపడింది. ఇందులో ప్రధానంగా మెప్మా అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు బ్యాంకు సిబ్బంది కూడా తోడు కావడం స్వాహా పర్వం కొనసాగింది. మెప్మా పరిధిలో ఖమ్మం నగరంలో మొత్తం 5,007 గ్రూపులున్నాయి. ఇందులో 39,043 మంది సభ్యులుగా ఉన్నారు. గతంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 2,266 గ్రూపులకు రూ.45.32 కోట్లు ఇప్పటి వరకు బ్యాంకు లింకేజి మంజూరైంది. తీసుకున్న లింకేజిని సభ్యులు నెలనెలా తమ వాటాగా బ్యాంకులో జమ చేయాలి. అయితే తొలి నాలుగు నెలలు ఎలాంటి అనుమానం రాకుండా చెల్లించారు. ఇందులో కీలకంగా ఉన్న మెప్మా రీసోర్స్ పర్సన్లే ఈ వాటాను చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇలా మెప్మా సిబ్బంది బ్యాంకు అధికారులతో కుమ్మక్కై సుమారు 30కి పైగా బినామీ గ్రూపులు ఏర్పాటు చేసి కోట్లలోనే స్వాహా చేసినట్లు తెలిసింది. డొంక కదిలిందిలా.. బ్యాంకుల్లో ఎంతకూ సొమ్ము జమ కాకపోవడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చింది. రుణం తీసుకున్న గ్రూపులు గత కొన్నేళ్లుగా సొమ్మును ఎందుకు జమచేయడం లేదనే దానిపై విచారణ చేపట్టారు. నగరంలో సుమారు 30 గ్రూపులకు సంబంధించి కోట్లలో బకాయిలు ఉన్నట్లు సమాచారం. దీనిపై బ్యాంకు అధికారులతోపాటు మెప్మా సిబ్బంది సైతం గత మూడు రోజులుగా నగరంలోని రమణగుట్ట, గాంధీనగర్, రామన్నపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి నగదు చెల్లించాల్సిన గ్రూపుల వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు చెల్లించని గ్రూపుల వివరాలను ఆయా బ్యాంకుల మేనేజర్లు మెప్మా కార్యాలయంలో అందజేశారు. దీనిపై విచారణ చేసి గ్రూపు సభ్యుల వివరాలతోపాటు ఆయా వ్యక్తుల ఆర్థిక స్థోమత, అసలు వారు ఉన్నారా..? రుణం తీసుకున్నారా..? లేక బినామీలా..? అనే వివరాలను సేకరిస్తున్నారు. రిసోర్సు పర్సన్లే కీలక పాత్ర.. మెప్మాలో గ్రూపులకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలంటే రీసోర్స్ పర్సన్లదే కీలక పాత్ర. వారు సంతకం చేసిన తర్వాత కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఆ తర్వాత జూనియర్ మైక్రో ఫైనాన్స్ అధికారి సంతకం చేయాలి. దీనిని అవకాశంగా తీసుకున్న రీసోర్స్ పర్సన్లు బ్యాంకులోని క్షేత్రస్థాయి సిబ్బందితో కుమ్మక్కై బినామీ పేర్లతో గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు పొందారు. రుణం మంజూరు సమయంలో మెప్మాలో రీసోర్స్ పర్సన్ల నుంచి జూనియర్ మైక్రో ఫైనాన్స్ అధికారి వరకు మామూళ్లు అందుతాయి. ఏదైనా కొత్త గ్రూపు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అందులో 10 మందిని సభ్యులుగా చేర్చాలి. వారు ఆరునెలలు పొదుపు చేసిన తర్వాత మొదటి బ్యాంకు లింకేజీగా రూ.75 వేలు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. అయితే ఇక్కడ అలా జరగడం లేదు. మెప్మాలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది బ్యాంకులోని క్షేత్రస్థాయి సిబ్బందితో కుమ్మక్కై సంఘంలో ఉన్న సభ్యులతోనే మళ్లీ బినామీ పేర్లతో మరో బ్యాంకులో రుణాలు పొందుతున్నారు. నిబంధనలు బేఖాతరు.. లింకేజి కింద రుణం ఇవ్వాలంటే బ్యాంకు అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో గ్రూపు సభ్యులను, వారి వివరాలను తనిఖీ చేసి అన్నీ సక్రమంగా ఉంటేనే రుణం మంజూరు చేయాలి. అయితే ఇక్కడ అవేమీ పాటించకుండానే కొత్తగా ఏర్పాటు చేసిన గ్రూపులకు రూ.లక్షల్లో రుణాలు ఇచ్చారు. ఏళ్లు గడవడంతో బ్యాంకు అధికారులు సైతం బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. రుణాలు మంజూరు చేసి ఇంతకాలం అయినా తిరిగి చెల్లించకపోవడంతో కొత్తగా వచ్చిన బ్యాంకు అధికారులు రికవరీపై ఉన్నతాధికారులకు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అసలు ఏం జరిగిందనే దానిపై వారు దృష్టి సారించారు. రుణాలు మంజూరు చేసినప్పుడు ఉన్న రీసోర్స్ పర్సన్ల ద్వారా ఈ వివరాలను సేకరించి ఆయా గ్రూపులకు సంబంధించిన సభ్యులను చూపించాలని అడిగారు. వారు గ్రూపుకు ఒకరిద్దరు సభ్యులను మాత్రమే చూపి.. మిగితా వారు లేరని, ఇతర ప్రాంతాలకు వెళ్లారని సమాధానం చెప్పడంతో బ్యాంకు అధికారులకు అనుమానం కలిగింది. నగరంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఇలాంటి గ్రూపులు పది ఉన్నట్లు గుర్తించి వాటిపై విచారణ నిర్వహించాలని మెప్మా అధికారులకు ఆ గ్రూపుల లిస్టును అందించారు. దీంతో మూడురోజులుగా నగరంలో విచారణ చేస్తున్న మెప్మా సిబ్బందికి ఆయా గ్రూపుల వ్యక్తులు అసలు లేరనే విషయం తెలిసింది. దీంతో నగరంలో మరిన్ని బినామీ గ్రూపులు ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నోటీసులు జారీ చేసిన బ్యాంకు అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చెల్లింపులు చేయని గ్రూపుల సభ్యులకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఒక గ్రూపులో సభ్యులుగా ఉన్న వారు రుణం పొందిన మేరకు నెలవారీగా చెల్లిస్తున్నారు. అయితే వారిపేరుతోనే మరో లోను ఉందని, దానిని చెల్లించాలనే నోటీసు రావడంతో ఈ బినామీ గ్రూపుల వ్యవహారం బయటకు వచ్చింది. నోటీసులు అందుకున్న సభ్యులు బ్యాంకుల వద్దకు వచ్చి తాము తీసుకున్న రుణాన్ని చెల్లిస్తున్నామని, మళ్లీ బకాయిలు ఉండటమేంటని లబోదిబోమంటున్నారు. విచారణ చేయిస్తున్నాం.. వేణుమనోహర్, పీడీ, మెప్మా నగరంలో బినామీ గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు పొందిన విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టాం. వివరాలు వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. -
బిగుస్తున్న ఉచ్చు
టవర్‌సర్కిల్: కరీంనగర్ కార్పొరేషన్లో శానిటేషన్ టెండర్లలో గోల్‌మాల్‌పై ‘‘ఐఏ‘ఎస్’ అంటే నిబంధనలు తూచ్’’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనం బల్దియాను కుదిపేస్తోంది. శ్రీరాజరాజేశ్వర సంస్థకు అర్హతలు లేకున్నా రూ.10 కోట్ల విలువైన పారిశుధ్య టెండర్లు కట్టబెట్టారని, కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు నిబంధనలు ఉల్లంఘించారనే విషయాన్ని వెల్లడిస్తూ ‘సాక్షి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో అధికారుల్లో వణుకు మొదలైంది. ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ఏకంగా హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. అక్రమాలపై లోకాయుక్తకు ఫిర్యాదు వెళ్లడం, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సీరియస్ అయ్యి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. తాజాగా మేయర్ రవీందర్‌సింగ్ వ్యాఖ్యలు కూడా అక్రమాలు జరిగినట్లు తేల్చడం... బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో అక్రమాలతో సంబంధమున్న అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. నగరపాలక సంస్థ అభాసుపాలు కాకుండా ఉండేందుకు పాలకవర్గం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించడంతో బాధ్యులుగా తేలిన వారికి సరెండర్ తప్పదనే సంకేతాలు కనబడుతున్నాయి. మూడు రోజులుగా టెండర్ల వ్యవహారం రచ్చరచ్చ అవుతుండడంతో ఈ అంశం నుంచి బయటపడేందుకు అడ్డంగా ఇరు క్కున్న అధికారులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. టెండర్లను రద్దు చేస్తే సమస్య సమసి పోతుందని మొదట భావించినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో రాజీయత్నాలు దిగారు. ఈ వ్యవహారంతా గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేద్దామని ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడం, బయటపడేందుకు దారులన్నీ మూసుకుపోవడం తో అధికారులు పడరానిపాట్లు పడుతున్నట్లు తెలుస్తోం ది. టెండర్ల అంశం ఏకంగా కమిషన్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ)కి వెలుతుండడంతో చేసిన తప్పిదాలు బయటపడడం ఖాయంగా కనిపిస్తోంది. డీఎంఏ, ఈఎన్సీ నుంచి కూడా వివరణ అడుగుతుం డడంతో తప్పించుకునే మార్గాలు అన్ని వైపులా మూసుకుపోయాయి. దీంతో బాధ్యులైన అధి కారులపై వేటు పడడం ఖాయమనే సంకేతాలు కనబడుతున్నాయి. -
రూ.100 కోట్ల క్లబ్ లో సింగమ్ రిటర్న్స్!
ముంబై: అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటించిన 'సింగమ్ రిటర్న్స్' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం వసూళ్లలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. తొలి రోజే రూ.30 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సింగమ్ రిటర్న్స్ రూ.100 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం రూ. 92 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 2014లో విడుదలై అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన జాబితాలో చోటు సంపాదించింది. తమిళ నటుడు సూర్య చేసిన సింగం 2 కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లతో డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంటపండిస్తోంది. ఒక స్టార్ హీరో, ఒక స్టార్ హీరోయిన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంపై ఆది నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. -
కన్నీళ్లు పెట్టుకున్నహీరో!
ముంబై:ప్రతీ ఒక్కరి జీవితంలో కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు రావంటే అది అతిశయోక్తే అవుతుంది. కన్నీళ్లు పెట్టుకోవడానికి రియల్ హీరో-రీల్ హీరో అనే తారతమ్యం కూడా ఏమీ ఉండదు. అటువంటి సందర్భమే ఒకటి బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ జీవితంలో కూడా తాజాగా చోటు చేసుకుంది. సింగమ్ రిటర్న్స్ విజయాన్ని ఆకాంక్షిస్తూ తన స్నేహితుడు, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాసిన లెటర్ చూసి అజయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడట. ప్రస్తుతం పుణేలోని యర్రవాడ సెంట్రల్ జైల్లో ఉంటున్న సంజయ్ దత్ రాసిన ఉత్తరం అజయ్ ను మనసును కదిలించిందట. ఒక తెల్లటి రూల్ పేపర్ మీద బ్లూ -ఇంక్ తో సంజయ్ రాసిన లెటర్ లో సింగమ్ రిటర్న్స్ సందర్భంగా అజయ్ దేవగన్ కు అభినందనలు తెలియజేస్తూ తన పాత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నాడు. ఇదే సందర్భంలో 2008లో వీరిద్దరూ కలిసి నటించిన 'మెహ్ బూబా' సినిమా సందర్భంలో వారు కలిసి డ్యాన్స్ చేసిన సన్నివేశాలను నెమరవేసుకున్నాడు. 'రాజు(అజయ్ ను సంజయ్ పిలుచుకునే పేరు) మనం తిరిగి కలిసినప్పుడు మన చేతి రాతతో రాసుకున్న పుస్తకాలను మార్చుకుందాం. ముందుగా ఈ లెటర్ రాస్తున్నాను. నువ్వు హీరోగా చేసిన సింగమ్ రిటర్న్స్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని లెటర్ లో తెలిపాడు. ఇక్కడ నువ్వు సంతోషించాల్సిన విషయం ఒకటి ఉంది. నేను 11 కిలోల బరువు తగ్గాను. జైల్లో క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తున్నాను.నేను చొక్కా వేసుకోకుండా ఉన్నప్పుడు 8 ప్యాక్స్ కనిపిస్తుందని' సంజయ్ తెలిపాడు. ఈ లెటర్ చూసిన అనంతరం తనకు కన్నీళ్లు ఆగలేదని స్వయంగా అజయ్ దేవగన్ పేర్కొన్నాడు. అంతకుముందు ఆ హీరోల తండ్రులు సునీల్ దత్, వీరూ దేవగన్ లు మధ్య ఉండే సాన్నిహిత్యాన్నే ఈ ఇద్దరూ కంటిన్యూ చేస్తుండటం నిజంగా గర్వించదగ్గ విషయమే. తమిళ హీరో సూర్య నటించిన సింగం-2 రీమేక్ గా వస్తున్న సింగమ్ రిటర్న్స్ లో అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
రోహిత్ శెట్టి మన్మోహన్ అంతటివాడు..
ముంబై: రోహిత్ శెట్టి తాజా సినిమా సింగమ్ రిటర్న్స్‌లో నటిస్తున్న కరీనా కపూర్ అతడిపై ప్రశంసలు జల్లు కురిపించింది. ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన నిన్నటితరం దర్శకుడు మన్మోహన్ దేశాయ్‌తో రోహిత్ పోటీపడగలడని కితాబిచ్చింది. ‘రోహిత్.. నేటితరం మన్మోహన్ దేశాయ్ వంటివాడు. అతణ్ని నేను ఇదే పేరుతో పిలుస్తాను. ప్రతి ఒక్క హీరోయిన్ ఇతని దగ్గర పనిచేయాలని కోరుకుంటుంది. నాకు గతంలోనూ మంచి అవకాశాలు ఇచ్చాడు’ అని వివరించింది. సింగమ్‌లో కాజల్ హీరోయిన్గా నటించినా, దీని సీక్వెల్లో మాత్రం బెబోకు అవకాశం వచ్చింది. రోహిత్‌కు తాను పెద్ద అభిమానిని కాబట్టే ఈ రెండో భాగంలో నటించేందుకు సంతోషంగా ఒప్పుకున్నానని వివరించింది. ‘ఇంతకుముందు కూడా అజయ్ దేవ్‌గణ్‌తోపాటు నటించాను కాబట్టి షూటింగ్ సెట్లు మా ఇల్లులాగే అనిపించాయి. ఇందులో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది’ అని కరీనా వివరించింది. సింగమ్ రిటర్న్స్ వచ్చే నెల 15న విడుదలవుతోంది. -
కోడిగుడ్ల టెండర్లలో గోల్మాల్
తక్కువ రేటుకు ఇస్తామన్న వారికి మొండిచేయి అధిక రేటుకు టెండర్ ఖరారు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి చిత్తూరు(టౌన్): స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) పరిధిలోని అంగన్వాడీ కేం ద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు ఖరారు చేసిన టెండర్లలో గోల్మాల్ చోటుచేసుకుంది. తక్కువ ధరకు గుడ్లు సరఫరా చేస్తామని ముందుకొచ్చిన వారికి కాదని అధిక ధర వసూలు చేసే వారికే కాంట్రాక్ట్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అధికారుల నిర్ణ యంతో ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్ల లో నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమ లు చేస్తోంది. జిల్లాలోని21 సీడీపీవో (చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీస్)ల పరిధిలోని 4,768 అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు ఐసీడీఎస్ అధికారులు మంగళవారం టెం డర్లు పిలిచారు. అదేరోజు రాత్రి పది గంటల తర్వాత వాటిని ఖరారు చేశారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో అధికారులు సీల్డ్ కవర్లలో టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్ర స్థాయి లో ఎవరైనా టెండర్లలో పాల్గొనవచ్చని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లా నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు నెక్ (నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ) రేటుపై అదనంగా 20 పైసలకు గుడ్లు సరఫరా చేస్తామని తెలిపారు. వైఎస్సార్ జిల్లా నుంచి వచ్చి న వారు 24 పైసలు అదనంగా సరఫరా చేస్తామన్నారు. స్థానిక కాంట్రాక్టర్లు వారిని అడ్డుకోవడంతో తిరుగుముఖం పట్టారు. అనంతరం స్థానిక కాంట్రాక్టర్లు సిండికేట్ అయి నెక్ రేటుకున్నా అదనంగా 55 పైసలు కోడ్ చేసినా వారికే టెండర్లను ఖరారు చేస్తూ నిర్ణ యం తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు గండి.. జిల్లాలోని ఐసీడీఎస్ పరిధిలో వివిధ పథకాల కింద లబ్ధిపొందుతున్న వారు 4,44,057 మంది ఉన్నారు. వీరిలో 0- 6 ఏళ్లలోపు పిల్లలు 2,87,500 మంది, కిశోర బాలికలు 87,757 మంది, సూపర్ వైజరీ ఫీడింగ్ కింద 6 వేల మంది, గర్భిణులు 62,800 మంది ఉన్నారు. వీరికి నెలకు 59,30,712 కోడిగుడ్లు అందివ్వా ల్సి ఉంది. గుడ్డు ధరకన్నా అదనంగా 37 పైసల చొప్పున మదనపల్లె డివిజ న్కు, 55 పైసల చొప్పున తిరుపతి, చిత్తూరు డివిజన్ల పరిధిలోని అంగన్వాడీలకు సరఫరా చేసేందుకు టెండర్లను ఖరారు చేశారు. అనంతపురం వారు ఇస్తామన్న 20పైసలకు తీసుకోకపోవడం వల్ల నెలకు రూ.20.76 లక్షలు, ఏడాదికి రూ.2.50 కోట్ల వరకు ప్రభుత్వం నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. నాణ్యతపైనా అనుమానాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండరుదారులు సరఫరా చేయాల్సిన కోడిగుడ్డు బరువు 45 నుంచి 50 గ్రాముల వరకు ఉండాలి. ఇప్పటివరకు ఏ కాంట్రాక్టరూ అలా సరఫరా చేయలేదు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మూడు నాలుగు మండలాలకు నిర్దేశించిన కాలవ్యవధిలో గుడ్లను సరఫరా చేయలేని కాంట్రాక్టర్లు నేడు ఏడేసి సీడీపీవోల పరిధిలోని అంగన్వాడీలకు ఎలా సరఫరా చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ కాంట్రాక్టరు సరఫరా చేయకపోతే మన పరిస్థితేంటనే ఆందోళన సీడీపీవోలను వెంటాడుతోంది. గత ఏడాదికంటే తక్కువ రేటుకే టెండర్లు ఖరారు చేశాం గత ఏడాది టెండర్లతో పోల్చుకుంటే ఈసారి తక్కువ ధరకే ఖరారు చేశాం. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల నుంచి కాంట్రాక్టర్లు వచ్చిన విషయం నాకు తెలియదు. టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు. నాణ్యత విషయం లో రాజీలేకుండా చర్యలు తీసుకుంటాం. - ఉషాఫణికర్, ఐసీడీఎస్ పీడీ -
ఔషధాల టెండర్లలో గోల్మాల్!
నిబంధనలను తుంగలో తొక్కిన ఆరోగ్య శాఖ అధికారులు అర్హతలేని కంపెనీలకు అడ్డగోలు అనుమతులు రూ.10లక్షలు టర్నోవర్ లేని కంపెనీలకు రూ.50 కోట్ల పనులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల కోసం కొనుగోలు చేయాల్సిన ఔషధాల టెండర్లలో భారీగా గోల్మాల్ జరిగింది. నిబంధనలను గాలికొదిలిన ఔషధ నియంత్రణ అధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు కలిసి ఊరూపేరూ లేని కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారు. నకిలీ ధ్రువపత్రాల సాయంతో అర్హతలేని కంపెనీలు రూ.కోట్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకున్నాయి. మొత్తం 315 ఔషధాల కోసం టెండర్లు పిలిస్తే.. 120 కంపెనీలు పాల్గొన్నాయి. 3, 4 మినహా మిగతావన్నీ పరాయి రాష్ట్రాలకు చెందినవే కావడం గమనార్హం. చిరునామాలు కూడా సరిగ్గా లేని ఆ కంపెనీలను అధికారులు వంతపాడడం విమర్శలకు తావిస్తోంది. మంత్రిగారి అండదండలతో కొందరు కాంట్రాక్టులను దక్కించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవీ ఉల్లంఘనలు... ఏడాదికి రూ.2.5కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీనే టెండర్లలో పాల్గొనాలి. కానీ, రూ.10లక్షలు కూడా చేయని కంపెనీ రూ.50కోట్ల కాంట్రాక్టులను దక్కించుకుంది. జీవో నెంబర్ 1357 ప్రకారం.. కాంట్రాక్టు పొందగోరుతున్న ఉత్పత్తిపై సంబంధిత కంపెనీకి మార్కెట్ స్టాండింగ్ సర్టిఫికెట్ ఉండాలి. ఇప్పుడు టెండర్లలో పాల్గొన్న చాలా కంపెనీలు అలాంటి మందులను ఉత్పత్తి చేసిన పాపాన కూడా పోలేదు. పంజాబ్‌కు చెందిన జాక్సన్ కంపెనీ 130 మందులను టెండర్లో దక్కించుకుంది. ఈ కంపెనీ 20 మందులను కూడా ఉత్పత్తి చేయని పరిస్థితి ఉంది. అమృతసర్‌లో ఉన్న ఈ కంపెనీపై గత ఏడాది టెండర్లలో పాల్గొనకుండా అనర్హత వేటు వేశారు. కానీ ఈ ఏడాది ఆ కంపెనీకి అనుమతి లభించడంపై విమర్శలు తలెత్తాయి. ఆర్ఓసీ (రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్) నుంచి సమాచారం సేకరిస్తే ఆయా కంపెనీల్లో చాలా వరకూ రూ. 50 లక్షలు కూడా టర్నోవర్ చేసినట్టు లేదు. బిడ్ ఫైనలైజేషన్‌కు ఫైలు: ఈ ఫైలు మంగళవారం బిడ్ ఫైనలైజేషన్ కోసం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి వద్దకు వచ్చింది. కానీ ఇన్ని అవకతవకలు, గోల్మాల్ల మధ్య ముఖ్య కార్యదర్శి ఎలా స్పందిస్తారనేది అసలు ప్రశ్న. ఇప్పటికే ఆయా కంపెనీల తీరుపై కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులొచ్చాయి. తర్వాతైనా పరిశీలిస్తాం టెండర్లు దక్కించుకున్నాకైనా కంపెనీలను పరిశీలిస్తాం. ఆ తర్వాతైనా వాటిని రద్దు చేయవచ్చు. ప్రస్తుతం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. జాక్సన్ కంపెనీని గతేడాది అనర్హత చేసింది నిజమే. కానీ ఈ ఏడాది కూడా అలాంటి కంపెనీలను పరిశీలిస్తాం. - డా. మధుసూదన్‌రావు, జీఎం, రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ -
పనికిమాలిన ఫర్నిచర్‌కు రూ.5 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో:. కంచే చేను మేస్తే ఎలా ఉంటుందో జలమండలి ప్రధాన కార్యాలయంలో ఫర్నీచర్ కొనుగోళ్లు నిరూపించాయి. మూడేళ్ల క్రితమే ఫర్నిచర్, ఇంటీరియర్స్, అల్మారాలు కొనుగోలుచేసినా.. ఇప్పుడవి ఎందుకూ పనికిరాకుండా పోయా యి. నాసిరకం ఫర్నిచర్ కావడంతో... ప్రస్తుతం వాటి స్థానంలో కొత్తఫర్నీచర్ కొనాల్సిన దుస్థితి నెలకొంది. ఓ ప్రముఖ ఫర్నిచర్ కంపెనీవని నమ్మిస్తూ ఆ కంపెనీ లేబుల్ అతికించిన నాసిరకం స్థానిక ఫర్నిచర్ (లోకల్‌మేడ్)ను ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం అవసరాల కోసం కొనుగోలు చేసినట్లు తాజాగా బయటపడడం సంచలనం రేపింది. ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లో మూడేళ్ల క్రితం రూ.5 కోట్లు వెచ్చించి నాణ్యత లేని ఈ ఫర్నిచర్ కొనుగోలుచేశారు. ఈ విషయంపై బోర్డు అధికారులు ఆరా తీస్తే... డొంక కదులుతోంది. ఈ ఫర్నిచర్‌ను బషీర్‌బాగ్‌లోని ఓ ఏజెన్సీ (స్థానిక కంపెనీ) తయారు చేసినవని తేలింది. తెలివిగా సదరు కంపెనీ ఓ ప్రముఖ కంపెనీ లేబుల్‌ను అతికించి జలమండలికి... కోట్ల విలువైన ఫర్నిచర్‌ను అంటగట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో అధికారులు ఖంగుతిన్నారు. నాసిరకమే... ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మొత్తం ఐదంతస్తులున్నాయి. మేనేజింగ్ డెరైక్టర్ చాంబర్, పేషీతో పాటు టెక్నికల్, ఫైనాన్స్,ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కార్యాలయాలు, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్ల చాంబర్లు, పేషీలు, యాంటీ, వెయిటింగ్ రూమ్‌లకు అవసరమైన టేబుళ్లు, కంప్యూటర్, కాన్ఫరెన్స్‌హాల్ ఫర్నిచర్, విలాసవంతమైన కుర్చీలు, సోఫాలు, టీపాయ్, అల్మారాలు, గాజుతో తయారు చేసిన అలంకరణ సామాగ్రిని మూడేళ్ల క్రితం పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు. వీటిలో ఇపుడు సగానికి పైగా చెడిపోవడంతో వాటిని మార్చాల్సిన పరిస్థితి ఉందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈ బాగోతంలో కొందరు అధికారుల పాత్ర ఉందని అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. సదరు కంపెనీ నుంచి వారికి భారీగానే కమీషన్లు ముట్టాయని, జలమండలి ప్రధాన కార్యాలయం నిర్మాణంలోనూ సదరు అధికారి చేతివాటం ప్రదర్శించారని కార్మికసంఘాలు ఆరోపిస్తుండడం గమనార్హం. దీనిపై దర్యాప్తు జరపాలని కోరుతున్నాయి. -
తవ్వితే.. అవినీతి
తవ్విన కొద్దీ... బోరుబావులు, పంపుసెట్ల సబ్సిడీలో అవినీతి లోతు విస్మయం కలిగిస్తోంది. ప్రధానంగా కోరుట్లలో ఉన్న తాండ్య్రాల ఎస్బీహెచ్ బ్రాంచి కేంద్రంగా ఈ దుర్వినియోగం జరిగినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. జిల్లా మొత్తంలో ఎస్సీ కార్పొరేషన్ 190 యూనిట్లు గ్రౌండింగ్ చేస్తే... ఈ ఒక్క బ్రాంచి నుంచే 120 యూనిట్లకు రుణం మంజూరు కావ డం గమనార్హం. ఇవన్నీ కథలాపూర్ మండలంలోనే పంపిణీ కావడం... పది రోజుల్లోనే ఈ బోర్లన్నీ తవ్వి... పంపుసెట్లు బిగించినట్లు రికార్డుల్లో ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో బయటపడింది. దీంతో భారీ మొత్తంలో సబ్సిడీ సొమ్ము స్వాహా అయిందని తెలిసిపోతోంది. - సాక్షిప్రతినిధి, కరీంనగర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్:జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి గత ఏడాది ఈ యూనిట్ల పేరుతో సబ్సిడీలను స్వాహా చేసినట్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈ గోల్‌మాల్‌పై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడంతో.. రాష్ట్ర కార్యాలయం నుంచి అయిదుగురు ఎగ్జిక్యూటివ్ అధికారుల బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది. భారీ మొత్తంలో సబ్సిడీ సొమ్ము దుర్వినియోగమైనట్లు అభియోగాలున్న కథలాపూర్ మండలంలో పర్యటించింది. ముందుగా కోరుట్లలో ఉన్న తాండ్య్రాల ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజర్ ప్రభుసింగ్ను కలిసి.. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు పొందిన లబ్ధిదారుల వివరాలను బృందం సభ్యులు తీసుకున్నారు. కథలాపూర్ మండలంలో పది రోజుల్లోనే 120 బోర్లు వేసినట్లు రికార్డులో ఉన్న విషయాన్ని తనిఖీకి వచ్చిన అధికారులు బ్యాంకు మేనేజర్‌తో చర్చించారు. ఆయన చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో విచారణ బృందం పలు అనుమానాలను వ్యక్తం చేసింది. తనిఖీల్లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన బి.ఆనంద్‌కుమార్, డి.సర్వయ్య, కె.ఆర్.నరేశ్, పీవీ.రమేష్, వై.బాబన్న ఈ బృందంలో ఉన్నారు. బ్యాంకులో రికార్డుల పరిశీలన అనంతరం కథలాపూర్ మండలంలోని భూషణ్రావుపేట గ్రామానికి వెళ్లారు. లబ్ధిదారుల వివరాలు సేకరించి వారి ఇళ్ల వద్ద పరిస్థితి, బోర్లు ఎక్కడ వేశారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. నిరుపేద కుటుంబానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి జరగాల్సి ఉంటుందని, జాబితాలో ఉన్న లబ్ధిదారులకున్న భవనాలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ బృందం వెనుకాలే.. పంపుసెట్ల గోల్‌మాల్‌లో కీలక పాత్ర పోషించిన డీలర్ సైతం అదే గ్రామానికి వెళ్లడం గమనార్హం. మరోవైపు కథలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు సంబంధించిన ఫైళ్లు మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ ఫైళ్లు కనిపించడం లేదని కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల గుర్తింపు మొదలు మంజూరీ, లబ్ధిపొందిన వారి వివరాలన్నీ మండల పరిషత్ కార్యాలయంలోనే భద్రపరచాలి. గతంలో ఈ సెక్షన్‌కు బాధ్యత వహించిన సూపరింటెండెంట్ కె.ప్రభు గత నెలలో కోరుట్ల ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన రికార్డులను కథలాపూర్ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్‌కు అప్పగించినట్లు చెప్పారు. అదే విషయంపై ‘సాక్షి’ వివరణ కోరితే.. ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన ఫైళ్లు ఆ బీరువాల్లో వెతికినా కనిపించడం లేదన్నారు. ఓవైపు సబ్సిడీల గోల్మాల్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, ఆ ఫైళ్లు లేవని కార్యాలయ సిబ్బంది బదులివ్వడం గమనార్హం. మరోవైపు పది రోజుల్లో లెక్కకు మించి బోర్లు, పంపుసెట్లకు అడ్డగోలుగా రుణాలు పంపిణీ చేసిన ఎస్బీహెచ్ బ్యాంకు తాండ్య్రాల బ్రాంచి మేనేజర్ తీరు చర్చనీయాంశంగా మారింది. -
మొక్కల కొను‘గోల్మాల్’
=టీటీడీ అటవీశాఖ అవినీతి బాగోతం =రూ.200కు లభించే మొక్కకు రెండు వేల బిల్లు =అడుగడుగునా అక్రమాలు =దేవస్థానం ఖజానాకు భారీ కన్నం సాక్షి ప్రతినిధి, తిరుపతి: కంచే చేను మేసిన చందంగా ఉంది టీటీడీ అటవీ శాఖ అధికారుల తీరు. మొక్క ల కొనుగోలు పేరిట దేవస్థానం ఖజానాకు అటవీ విభాగం అధికారులు కన్నం పెడుతున్నారు. గతంలో కోట్ల రూపాయల్లో అక్రమాలకు పాల్పడి విజిలెన్స్ విచారణను ఎ దుర్కొన్న అటవీ విభాగం తాజాగా తిరుపతిలో డివైడర్లపై వేసిన మొక్కల పేరిట లక్షల్లో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుచానూరు నుంచి అలిపిరి వరకు ఉన్న రహదారి డివైడర్‌పై అటవీ విభాగం అధికారులు రెండు రకాల మొక్కలను నాటారు. బయట మార్కెట్లో వంద నుంచి రెండు వందల రూపాయలకు లభ్యమయ్యే ఈ మొక్కలకు రెండు వేల రూపాయల వరకూ బిల్లు పెట్టడం వివాదాస్పదంగా మారింది. విజయభాస్కరరెడ్డి అనే ఫారెస్ట్ మజ్దూర్ ద్వారా ఈ వ్యవహారం నడిపినట్లు తెలిసింది. లక్షల రూపాయలతో మొక్కలు కొనుగోలు చేసేప్పుడు టెండర్ పిలవకుండా ఇష్టానుసారం వ్యవహరించడంపై ఇ ప్పుడు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వక్క చెట్టును పోలివుండే ఫాక్స్‌టైల్ ఫామ్ చెట్టును రూ.2000కు, చిన్న గుబురుగా ఉండే పైటస్ మొక్కను రూ.350 రూపాయలకు కొనుగోలు చేసినట్లు దేవస్థానం డీఎఫ్‌వో కే. వెంకటస్వామి ‘సాక్షి’తో చెప్పారు. లేబర్ యూనియన్లకు ప నులు అప్పగించడం వల్ల మంచి ఫలితాలు ఉం టాయన్న భావనతో లక్షల రూపాయలతో మొ క్కలు కొనుగోలు చేసినా టెండర్ పిలవలేదని స్పష్టం చేశారు. 2012 నాటి తుడా ధరల ప్రకారం కొనుగోలు చేసినట్లు ఆయన వివరిం చారు. మొక్కల కొనుగోలులో తుడా భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. రా ష్ట్ర అటవీ, హార్టికల్చర్ శాఖలు నిర్ణయించిన ధరలను పక్కనపెట్టి దేవస్థానం ఆటవీ శాఖాధికారులు తుడా ధరలను అమలు చేయడంతోనే అ వినీతికి తలుపులు తెరుచుకున్నాయి. తిరుపతిలోని నర్సరీల్లో ఫాక్స్‌టైల్ ఫామ్ రూ.200 రూపాయలకు, పైటస్ రూ.50 నుంచి రూ.75 మధ్య లభ్యమౌతున్నాయి. టీటీడీ కోసం అయి తే ఇంతకంటే తక్కువ ధరలకు ఈ మొక్కలను సరఫరా చేసేందుకు నర్సరీల యజమానులు సిద్ధంగా ఉన్నారు. అయినా రెండో కంటికి తెలియకుండా, టెండర్ పిలవకుండా ఈ వ్యవహారం నడపడం వెనుక ఉన్న ఉద్దేశం లక్షల రూపాయలు వెనుకేసుకోవడమే అని తెలిసింది. తిరుచానూరు నుంచి అలిపిరి వరకూ 14 కిలోమీటర్ల దూరంలో మొక్కలు నాటే భారీ ప్రాజెక్టును ప్రారంభించే ముందు టెండర్ ప్రక్రియకు వెళ్లకపోవడం వెనుక దేవస్థానం పరిపాలనా విభాగంలోని ఉన్నతస్థాయి అధికారుల హస్తముందున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవస్థానం అటవీ శాఖకు ఇప్పటికే కోట్ల రూపాయల ప్రాజెక్టులు మంజూరయ్యాయి. మొక్కల కొనుగోలులోనే నిబంధనలకు పాతరేసిన అధికారులు ఈ ప్రాజెక్టుల విషయంలో ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
కాంట్రాక్టర్ల రింగ్
= ధాన్యం రవాణా టెండర్లలో గోల్మాల్ = అధికారులకు చిక్కకుండా అడ్డదారులు = అన్నింటికీ సింగిల్ టెండర్లే = మహిళా సంఘాల వాటికీ గాలం వరంగల్, న్యూస్‌లైన్ : ధాన్యం రవాణా టెండర్లలో కాంట్రాక్టర్లు రింగయ్యారు. కొత్తవారిని రానీయకుం డా అడ్డుకుని... బేరసారాలు నడిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు తగ్గకుండా... హెచ్చు ధరలకే దక్కించుకునేందు కు సఫలీకృతులయ్యారు. 10 డివిజన్లకు పిలిచినా అన్నింటికీ ఒక్కటీ, రెండు టెండర్లు మా త్రమే దాఖలయ్యాయి. జిల్లాలో త్వరలో ప్రా రంభమయ్యే ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా చేసేందుకు ఈనెల 1న టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. జేసీ కార్యాలయంలో ఈనెల 2 నుంచే సీల్డ్ టెండ ర్లు స్వీకరించారు. ఎనిమిది రోజుల నుంచి ఒక్క టెండరూ దాఖలు కాలేదు. గురువారం ఆఖరి రోజు కావడంతో టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. దీంతో టెండరు దాఖలు చేసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లు రిం గయ్యారు. గురువారం సాయంత్రం వరకు టెండర్ల స్వీకరణ ముగిసింది. మొత్తం దాఖ లైన టెండర్లను ఈనెల 17న తెరువనున్నారు. 0.2 కిలోమీటరు నుంచి 16 కిలోమీటర్ల వర కు ఒక్క టన్నుకు రూ.185, ఈ తర్వాత ప్రతీ పది కిలోమీటర్లకు ఒక్క టన్నుకు రూ.365 చెల్లిం చేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. దీనికోసం టెండర్లను పిలిచారు. 65 టన్నుల లారీలున్న ట్రాన్స్‌ఫోర్ట్ కంపెనీలకు అర్హతగా ప్రకటించారు. సీల్డ్ టెండరు వేయాలని, టెండరు సమయంలో రూ.5వేలు డీడీ చెల్లించాలని నిబంధనలు విధించారు. టెండ రు దక్కితే రూ.4 లక్షలు ప్రభుత్వానికి డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అంతా కలిసిపోయారు.. టెండర్లను దక్కించుకునేందుకు గతంలో పని చేసిన కాంట్రాక్టర్లు ఒక్కటయ్యారు. దీని లో కూడా రాజకీయ ప్రోద్భలం చోటు చేసుకోం ది. అధికార పార్టీ నేతలతో పైరవీ చేయిం చారు. కొత్తగా టెండర్ వేసేందుకు వచ్చిన వారిని ముందుగా బెదింరించి... ఆ తర్వాత ప్రలోభాలకు గురిచేశారు. టెండర్లు పట్టుకుని వచ్చిన వారికి తలా కొంత మొత్తం చేతిలో పెట్టి... సింగిల్ టెండర్లకు రింగయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రూపాయి తగ్గకుండా టెండర్లు దాఖలు చేశారు. ములు గు ప్రాంతం నుంచి వచ్చిన ఓ కాంట్రాక్టర్‌ను టెండరు దాఖలు చేసే కార్యాలయం వద్దే బహిరంగంగా బెదిరింపులకు గురిచేశారు. వారి బెదిరింపులకు భయపడి టెండరు వేయకుండానే వెనుదిరిగారు. దీంతో పది డివిజ న్లకు ఒక్కటి... రెండు టెండర్లే దాఖలయ్యా యి. మొత్తం పది డివిజన్లలో రెండు డివిజన్లలకు మహిళా సంఘాలకు కేటాయించారు. వాటిలో కూడా కాంట్రాక్టర్ల ఆధిపత్యమే నడిచింది. సంఘాలను వేయనీయకుండా కాం ట్రాక్టర్లే ఒక్కరితోనే టెండరు వేయించారు. ములుగు-1 డివిజన్, జనగామ-2 డివిజ న్లను మహిళా సంఘాలకు కేటాయించగా వాటికి ఒక్కొక్క టెండరు మాత్రమే దాఖలైం ది. అదే విధంగా మహబూబాబాద్-1 డివిజ న్కు 2 టెండర్లు, మహబూబాబాద్-2కు 2 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. ములుగు-1కు సింగిల్ టెండరు వేశారు. ములుగు-2కు 2 టెండర్లు, ములుగు-3లో 2, వరంగల్-1కు సింగిల్ టెండరు, వరంగల్-2 డివిజన్‌కు 2 టెండర్లు దాఖలయ్యాయి. అదే విధంగా జనగామ-1 డివిజన్‌కు 2, జనగామ-2కు సింగిల్ టెండరు వేశారు. నర్సంపేట డివిజన్‌కు 2 టెండర్లు దాఖలు చేశారు. రెండు టెండర్లు దాఖలైన డివిజన్లలో ఒక్క కాంట్రాక్టరే రెండేసి టెండర్లు వేశారు. మొత్తానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రూపాయి తగ్గకుండా పూర్తిస్థాయిలో దక్కించుకునేందు కు వేసుకున్న ఎత్తులన్నీ ఫలించాయి. -
బినామీలకు దసరా ‘పండగ’
ఇంద్రకీలాద్రి, న్యూస్‌లైన్ : దుర్గగుడిలో నిర్వహించే దసరా ఉత్సవాలు కొందరు కాంట్రాక్టర్లకు వరంగా మారుతున్నాయి. నియమ నిబంధనలను తుంగలో తొక్కి బినామీలు, అర్హత లేని వారికి పనులు కట్టబెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు కేసుల్లో ఉన్న వ్యక్తులతో పాటు దేవస్థానాలకు ఎన్నడూ భోజన ప్యాకెట్లు సరఫరా చేసిన అనుభవం లేనివారికి కాంట్రాక్టు కేటాయించడం వివాదాస్పదమైంది. ఈ ఉత్సవాల సందర్భంగా విధులు నిర్వహించే పోలీసులు, హోంగార్డులు, దేవాదాయ శాఖ డెప్యూటేషన్ సిబ్బందితో పాటు ఇతర విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందికి పంపిణీ చేసే భోజన ప్యాకెట్ల కాంట్రాక్టు వ్యవహారం ఆదివారం కొత్త మలుపు తిరిగింది. దేవస్థానం ఈ నెల12న టెండర్లు పిలిచింది. కాంట్రాక్టర్లకు అర్హతల్లేవనే సాకుతో ఆ టెండర్లను ఆలయ అధికారులు రద్దు చేశారు. మళ్లీ శనివారం నాటికి షార్టు టెండర్లు పిలవగా మొత్తం 10 మంది కాంట్రాక్టర్లు దాఖలు చేశారు. శనివారం తెరవాల్సిన టెండర్లను ఆలయ అధికారులు పలు కారణాలను సాకుగా చూపించి ఆదివారానికి వాయిదా వేశారు. ఆదివారం టెండరు బాక్స్‌ను తెరిచిన అధికారులు నిబంధనలను తోసిరాజని అనర్హులకు కాంట్రాక్టు అప్పగించారు. గతంలో ఏ కారణాలతో టెండరును రద్దు చేశారో.. ఇప్పుడు వాటినే విస్మరించారు. అంతేకాదు, తాజాగా మార్పు చేసిన నిబంధనలను గాలికి వదిలేశారు. టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు తమతమ స్థాయిల్లో ఈవోపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే దీనికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ టెండర్లను మూడు సెక్టార్లుగా పిలిచారు. ఓ హోటల్ పేరుతో బినామీ వ్యక్తికి, పోలీసు కేసు ఉన్న ఆలయ కాంట్రాక్టర్‌కు టెండరు కట్టబెట్టారు. సెక్టార్-1లో పోలీసు అధికారులు, హోంగార్డులకు భోజన ప్యాకెట్లు సరఫరా చేసేందుకు నగరంలోని ఓ హోటల్ పేరుతో టెండరు దాఖలు చేసిన వ్యక్తి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి కాంట్రాక్టు దక్కించుకున్నట్లు తెలిసింది. ఇందుకు ఆలయ అధికారులపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఉన్నతాధికారి ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆలయంలో పలు కాంట్రాక్టులు నిర్వహిస్తున్న వ్యక్తికే మరో సెక్టార్లో టెండర్ మంజూరు చేశారు. ఇటీవలే ఆయనపై వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదయింది. అయితే ఆ స్టేషన్ అధికారులే ఆ కాంట్రాక్టర్‌కు మద్దతుగా నిలవడం విశేషం. టెండర్ల పక్రియ అంతా నీకిది... నాకిదీ అనే పద్ధతిలో కొనసాగినట్లు తెలుస్తుంది. మొదటి సెక్టార్‌కు గ్రీన్ పార్కు హోటల్, రామిశెట్టి ప్రసాద్, వంశీధర్‌లు టెండర్లు దాఖలు చేశారు. సెక్టార్-2కు కె. లక్ష్మణరావు, సాయిదుర్గ టెండర్లు దాఖలు చేశారు. మూడో సెక్టార్‌కు రవికుమార్, రామిశెట్టి ప్రసాద్, వంశీధర్‌లు టెండర్లు వేశారు. మొదటి సెక్టార్‌కు గ్రీన్ పార్కు హోటల్ పేరుతో టెండరు దాఖలు చేసిన కాంట్రాక్టర్ షెడ్యూల్ ఫారమ్‌పై సంతకాలు చేయనప్పటికీ..టెండర్లు తెరిచిన సమయంలో ఆలయ అధికారుల సమక్షంలోనే పోలీసాఫీసరు సంతకాలు చేయించడం విశేషం. ఇక సెక్టార్-2 కె. లక్ష్మణరావుకు, సెక్టార్-3ని రవికుమార్‌కు కేటాయించారు. భోజన ప్యాకెట్‌కు రూ. 111.90కు టెండరు దాఖలు చేయగా, దానిని తగ్గించాలని ఆలయ అధికారులు కోరడంతో రూ. 111.50లకు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు అంగీకరించారు. నాణ్యత ప్రమాణాల పై అనుమానం దసరా ఉత్సవాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఆహార ప్యాకెట్లు అందించడ ంలో దేవస్థానం పలుమార్లు అపహస్యం పాలైంది. తక్కువ రేటుకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టులు భోజనాన్ని సరిగా పంపిణీ చేయలేదు. దీంతో నాసిరకం టిఫెన్లు, భోజనం పంపిణీ చేస్తున్నారంటూ సిబ్బంది ఆహారం మొత్తాన్ని పారవేసిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. చివరకు ఆలయ ఈవో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. టెండర్లు జారీ చేసేటప్పుడే అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఉత్సవాల్లో సిబ్బంది పస్తులు ఉండాల్సిన అవసరం తలెత్తకపోచ్చు! -
వత్సవాయి సొసైటీలో గోల్మాల్ !
వత్సవాయి, న్యూస్‌లైన్ : పిల్లల ఉన్నత చదువులు, పెళ్ళిళ్లు, వ్యవసాయ పనులు తదితర అవసరాల కోసం స్థానిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఖాతాదారులు దాచుకున్న సొమ్మును సిబ్బంది గోల్మాల్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఖాతాదారుల్లో కొందరు సొసైటీ కార్యాలయానికి వచ్చి తాము దాచుకున్న డబ్బు తమ ఖాతాలలో లేదని తెలుసుకుని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం ఒక్కరోజు వచ్చి న సొసైటీకి వచ్చిన బాధితులకు సంబంధించిన ఖాతాల్లో రూ.10 లక్షలకు పైగా మాయం అయినట్లు తేలింది. ఇంకా ఈ విషయం తెలియని వారు ఎక్కువమంది ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సొసైటీలో రెండువేల మందికి పైగా సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలోనే నగదు మాయం అయినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. సొసైటీలో రూ.2.20 కోట్లకు పైగా డిపాజిట్లు ఉండగా, రూ.2 కోట్లకు పైగా బంగారు వస్తువులపై రుణాలు మంజూరు చేసినట్లు తెలి సింది. ఖాతాదారులు సొసైటీలో నగదు జమ చేసినప్పుడు వారి పాసు పుస్తకాలలో సిబ్బంది నమో దు చేశారు. సొసైటీ క్యాష్ రికార్డులలో మాత్రం ఎంట్రీలు లేవని, ఖాతాదారుల సొమ్మును సిబ్బంది సొంతానికి వాడుకున్నట్లు తెలిసింది. సొసైటీ క్యాషియర్ నాగేశ్వరరావు నాలుగు రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నాగేశ్వరరావు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న ఖాతాదారులు కొందరు కార్యాలయానికి వచ్చి తమ ఖాతాల వివరాలు తెలుసుకోగా, నగదు మాయం అయిన విషయం వెలుగులోకి వచ్చింది. సొసైటీలో సొమ్ము దాచుకున్న షేక్ జాన్మియా, కుక్కల ప్రసా ద్, కంచేటి రామారావు, షేక్ జాన్‌వలీ, ఎం.వెంకటేశ్వర్లు, మౌలాబీ, కొలుసు గంగిరాజు, పట్టాభి, ఆదాం సాహెబ్, వైకుంఠపు రామారావు, కంచం శ్రీను, ఎన్ వెంకటేశ్వర్లు, కొలికపోగు వెంకటనర్సమ్మ, గజ్జా జాలయ్య ఖాతాల నుంచి నగదు మాయమైనట్లు తేలింది. ఈ విషయం తెలుసుకున్న ఖాతాదారులు కొందరు కార్యాలయానికి వచ్చారు. అక్కడ సమాధానం చెప్పే వారు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై సొసైటీ కార్యదర్శి చిట్టూరి శ్రీనివాసరావు, క్యాషియర్ రాయల నాగేశ్వరరావును వివరణ కోరగా, ఒకరిపై ఒకరు చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, సొమ్ము రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు. -
ఇరిగేషన్ టెండర్లలో గోల్మాల్!
పలమనేరు, న్యూస్‌లైన్: వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేదనే చందంగా తయారైంది పలమనేరు ఇరిగేషన్ అధికారులు తీరు. నిబంధనలను పక్కనబెట్టి టెండర్ల ప్రక్రియను గోప్యంగానే పూర్తి చేసి, తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు మాత్రం పనులు వచ్చేలా అధికారులే మేనేజ్ చేసేశారు. రూ.75 లక్షల పనులకు జరిగిన టెండర్ల ప్రక్రియ గోల్మాల్ అయ్యిందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తమను టెండర్లలో పాల్గొననీయకుండా ఇంత రాజకీయం చేయాల్సిన అవసరమేమిటంటూ కొందరు కాంట్రాక్టర్లు స్థానిక అధికారులను నిలదీయడంతో ఈ విషయం శుక్రవారం వెలుగుచూసింది. పలమనేరు ఇరిగేషన్ శాఖ పరిధిలోని వి.కోట మండలంలో రూ.75 లక్షల పనులకు ఆ శాఖ గత నెలలో టెండర్లు పిలిచింది. ఈ నిధులతో చెరువు కట్టల అభివ ృద్ధి, సప్లై చానెళ్లు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. అప్పట్లో ఎన్నికల కోడ్ ఉండడం, ఆపై సమైక్యాంధ్ర ఉద్యమం రావడంతో ఈ ప్రక్రియను సంబంధిత అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు. మూడు రోజుల క్రితం టెండర్లు వేయాల్సిందిగా ప్రకటన జారీ చేశారు. 10 పనులకు సంబంధించి 41 మంది టెండర్లు వేశారు. అంచనాలు తక్కువగా కోడ్ చేసిన పది మందికి టెండర్లు ఓపెన్‌చేసి ఈ పనులను రెండ్రోజుల క్రితం అప్పగించారు. ఈ పది మంది కాంట్రాక్టర్లు ఎవరో కూడా నోటీస్ బోర్డులో తెలుపనే లేదు. ఇదిలావుండగా వి.కోట మండలానికి చెందిన మరికొందరు కాంట్రాక్టర్లు తాము టెండర్లు వేస్తామంటూ స్థానిక ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ కాళ్లావేళ్లాపడ్డారు. ఆయన స్పందిస్తూ ఈ ప్రక్రియ ముగిసిందని తేల్చేశారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో టెండర్ల ప్రక్రియ ముగిసిందని ఆ శాఖ ఈఈ పేర్కొనడంతో వీరంతా ఆయనతో వాగ్వాదానికి దిగారు. ‘మీకు కావాల్సిన కాంట్రాక్టర్లకు మాత్రం మీరే దగ్గరుండి ఫిక్సింగ్‌లు జరిపించి, మాకు అన్యాయం చేస్తారా’ అంటూ వాగ్వాదానికి దిగారు. శుక్రవారం ఆ కాంట్రాక్టర్లు శ్రీని వాసులు, మునెప్ప, శీన తదితరులు కార్యాలయంలో జరుగుతున్న టెండర్ల అక్రమాలను విలేకరులకు వివరించారు. మరోవైపు రూ.లక్షకు పైన అంచనా విలువ గల ప్రభుత్వ పనులను ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆన్లైన్లో టెండర్లు పిలవాల్సి ఉంది. సీల్డ్ కవర్ టెండర్లు పిలవడం, రహస్యంగా ప్రకటన చేసి ప్రక్రియ ముగించడం చూస్తుంటే వ్యవహారం వెనుక అధికారుల హస్తం ఉందనే విషయం తెలుస్తోంది. దీనిపై ఆ శాఖ ఈఈ సత్యనారాయణప్పను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరింది. బంద్ కారణంగా ఈ పనులను త్వరగా చేపట్టాలనే ఉద్దేశంతో ముగించేశామన్నారు. ఇందులో గోల్మాల్ ఏమీ లేదని చెప్పారు.